శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శాస్త్ర పరిజ్ఞానంతో నిన్న కన్న కలలు నేడు సాకారం అవుతున్నాయి... కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సంప్రదాయ పరిజ్ఞానంతో ఆధునిక పరిశోధనలను సమర్ధవంతంగా మిళితం చేస్తే ఊహకు అందని ఫలితాలు వస్తాయి ...డాక్టర్ జితేంద్ర సింగ్

మోడీ ప్రభుత్వంలో భారత అంతరిక్ష కార్యక్రమం ప్రపంచ స్థాయికి ఎదిగి గుర్తింపు సాధించింది .. డాక్టర్ జితేంద్ర సింగ్

డెహ్రాడూన్‌ ఉత్తరాంచల్ యూనివర్శిటీ లో ఆకాష్ తత్త్వ- “ఆకాష్ ఫర్ లైఫ్” అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో కీలక ఉపన్యాసం ఇచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్

2024 లో జరుగనున్న మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర' గగన్ యాన్' భారతదేశ అంతరిక్ష రంగం చరిత్రలో ఒక ఒక ప్రధాన మైలురాయి అవుతుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 05 NOV 2022 6:09PM by PIB Hyderabad

శాస్త్ర పరిజ్ఞానంతో  నిన్న కన్న కలలు నేడు   సాకారం అవుతున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది, ప్రజా  ఫిర్యాదులు, పెన్షన్లు, అంతరిక్ష అణుశక్తి శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత)   మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని   సంప్రదాయ పరిజ్ఞానంతో ఆధునిక పరిశోధనలను  సమర్ధవంతంగా మిళితం చేస్తే ఊహకు అందని ఫలితాలు సాధించడానికి అవకాశం కలుగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ తన చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకున్నారు.తన  చిన్నప్పుడు     కేవలం రేడియో మాత్రమే ఉండేదని.టెలివిజన్ గురించి ఎవరూ వినలేదని అన్నారు. అయితే, తన ఉపాధ్యాయులు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు రేడియో లో వార్తలు చదువుతున్న వ్యక్తి మన ముందు ప్రత్యక్షం అవుతారని చెబుతూ వచ్చేవారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అదేవిధంగా సారాభాయ్ మన అంతరిక్ష కార్యక్రమాలు ప్రారంభించిన సమయంలో భారతదేశంలో అనేక మంది చందమామ కథలు పాటలుగా పాడేవారని అన్నారు. ఆ సమయంలో భారతదేశం చేపట్టిన యాత్రలు చంద్రుడుపై దిగుతాయని ఎవరూ ఊహించలేదు అని  మంత్రి వ్యాఖ్యానించారు. 

  డెహ్రాడూన్‌ ఉత్తరాంచల్ యూనివర్శిటీ  లో ఆకాష్ తత్త్వ- “ఆకాష్ ఫర్ లైఫ్” అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈరోజు  డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ఉపన్యాసం ఇచ్చారు. నాలుగు రోజుల పాటు సదస్సు జరుగుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగంలో భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు సాధించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన అంకుర సంస్థలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. నానో ఉపగ్రహాల రూపకల్పనతో సహా ఉపగ్రహాల అభివృద్ధికి అనేక దేశాలకు భారతదేశం సహాయ సహకారాలు అందిస్తున్నదని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ మార్గదర్శకత్వం కోసం అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

ప్రజా జీవితంలో ప్రతి అంశం శాస్త్రీయ రంగంతో ముడిపడి ఉంటుందని గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత ఎనిమిది సంవత్సరాలుగా శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి వివరించారు. రానున్న 25 సంవత్సరాల కాలంలో శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాలు ప్రపంచ శాస్త్ర రంగంలో భారతదేశాన్ని అగ్ర స్థానంలో ఉండేలా చేస్తాయన్న  ధీమాను మంత్రి వ్యక్తం చేశారు. 

 సదస్సు  ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త భయ్యాజీ జోషి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఛాన్సలర్ జితేందర్ జోషి, కేంద్ర ప్రభుత్వ  ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, ఇస్రో చైర్మన్  ఎస్. సోమనాథ్, శాస్త్ర సాంకేతిక కార్యదర్శి డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ , బయోటెక్నాలజీ కార్యదర్శి  డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే, విశ్వవిద్యాలయ  ప్రొఫెసర్లు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రపంచ అగ్ర దేశాల మధ్య  అంతరిక్ష  పరిజ్ఞానం మాత్రమే భారతదేశాన్ని నిలబెడుతుంది డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. రైల్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, స్మార్ట్ నగరాలు లాంటి వివిధ రంగాలలో అమలు చేసిన శాస్త్రీయ పరిజ్ఞానం సామాన్య ప్రజల జీవం విధానాన్ని సులభతరం చేసిందని అన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి స్థానం కల్పిస్తూ 2020 జూన్ నెలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతరిక్ష రంగం రూపురేఖలను పూర్తిగా మార్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అంకుర సంస్థలు అంతరిక్ష రంగంలోకి ప్రవేశించి, అబ్దుత పరిజ్ఞానంతో రాకెట్లను, ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తున్నాయని మంత్రి వివరించారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో 102 కి పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.ప్రభుత్వం రూపొందించిన   జియోస్పేషియల్ మార్గదర్శకాలు స్వమిత్ర లాంటి పథకాల ద్వారా  6 లక్షలకు పైగా  గ్రామాలను సర్వే చేయడానికి సహకరించాయని మంత్రి తెలిపారు.

భారతదేశం యొక్క అంతరిక్ష ఆకాంక్షలు చంద్రుడు మరియు అంగారక గ్రహానికి నిర్వహించిన యాత్రల ద్వారా భారతదేశం తన అంతరిక్ష ఆకాంక్షలు వెల్లడించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  ' భారతదేశం  మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర అయిన గగన్‌యాన్ భారతదేశ అంతరిక్ష చరిత్రలో  ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది. మానవ రహిత గగన్‌యాన్ యాత్ర 2023 చివరినాటికి జరుగుతుంది. 2024 మధ్యలో రెండో  మానవ రహిత గగన్‌యాన్ యాత్ర చేపట్టాలని నిర్ణయించాము. 2024 లో మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం అయ్యింది' అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

ఆకాష్ తత్త్వ  ఇతివృత్తం ఆధారంగా ఒక సదస్సు జరగడం  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే తొలిసారని  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  పురాతన  పరిజ్ఞానం   ఆధునిక పరిశోధనల మధ్య సమతుల్యత సాధించి  వాంఛనీయ ఫలితాలను సాధించడం ముఖ్య లక్ష్యంగా సదస్సు జరుగుతుందని అన్నారు. పంచమహాభూతాలు అయిన  ఆకాశం, వాయువు, నీరు, భూమి, అగ్నిలను  సమ్మేళనం చేసి సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించిన   భయ్యాజీ జోషి ని మంత్రి ప్రశంసించారు.

ఈ ఏడాది ఆగస్టులో పేటెంట్ కార్యాలయాలతో పాటు సాంప్రదాయ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (TKDL) సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం భారతీయ సాంప్రదాయ విజ్ఞాన రంగంలో కొత్త శకాన్ని ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతీయ సాంప్రదాయ విజ్ఞానాన్ని  ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధానించి సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని అన్నారు.దీనివల్ల సామాన్య ప్రజలకు విలువైన సమాచారం అందుబాటులోకి వస్తుందని అన్నారు.  గతం లేదా పురాతన కాలం నాటి కల్పిత కథలు లేదా ప్రేమ కథలు  జోలికి పోకుండా సాంప్రదాయ విజ్ఞాన అంశాలను  ఆధునిక అవసరాలకు అనుగుణంగా  పంచమహాభూత ఆధారిత సదస్సు వివరిస్తుంది అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

 ఆకాష్ తత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై  డెహ్రాడూన్ సదస్సు  కొత్త ఆలోచనలను వెలుగులోకి తీసుకువస్తుందన్న ఆశాభావాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారు.   మూడు రోజుల సదస్సులో దాదాపు 35 మంది ప్రముఖ వ్యక్తులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఆధునిక వైజ్ఞానిక పురోభివృద్ధి తో పాటు ప్రాచీన విజ్ఞాన జ్ఞానాన్ని భారతదేశ యువతకు పరిచయం చేయడమే ఈ సదస్సు  ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు.

 విజ్ఞాన భారతితో కలిసి ఇస్రో, ప్రధాన శాస్త్రీయ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాయి.   విజ్ఞాన భారతి  స్వదేశీ స్ఫూర్తితో  సైన్స్ ఉద్యమం సాధన కోసం  విజ్ఞాన భారతి  కృషి చేస్తోంది.   ఒకవైపు సాంప్రదాయ మరియు ఆధునిక శాస్త్రాలను మరియు మరోవైపు సహజ మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి ఫలితాలు సాధించాలని  విజ్ఞాన భారతి నిర్ణయించింది. 

గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణం వంటి పర్యావరణ సమస్యలకు భారతీయ దృక్పథంతో పరిష్కారాలను కనుగొనడం లక్ష్యంగా  దేశవ్యాప్తంగా 'సుమంగళం' ప్రచారం నిర్వహించబడుతోంది. భారతీయ సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థల దృక్కోణంలో, పంచమహాభూతాలపై దేశవ్యాప్తంగా ఐదు జాతీయ సమావేశాలు నిర్వహించబడతాయి,  సమాజ అభివృద్ధి కోసం పర్యావరణ సమస్యలను  పరిష్కరించే అంశంలో ఐదు అంశాలు కీలకం గా ఉంటాయి.   ఆకాశం,వాయువు, నీరు, భూమి, అగ్ని పంచమహాభూతాలు అని అందరికీ తెలుసు. 

***

 



(Release ID: 1874042) Visitor Counter : 174