మంత్రిమండలి

రబీ సీజన్ 2022-23కుగాను 2022 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 వరకూ ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ రేట్లకు మంత్రిమండలి ఆమోదం


ఆమోదించిన సబ్సిడీ మొత్తం రూ.51,875 కోట్లు

Posted On: 02 NOV 2022 3:09PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- ఎరువులపై సూక్ష్మ పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్‌) పరిమితికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు నత్రజని (ఎన్‌), భాస్వరం (పి), పొటాష్ (కె), గంధకం (ఎస్‌) సూక్ష్మ పోషక ఎరువులకుగాను కిలోగ్రాముకు వర్తించే సబ్సిడీపై కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన రేట్లకు ఆమోదముద్ర వేసింది. తదనుగుణంగా రబీ సీజన్-2022-23 (01.10.2022 నుంచి 31.03.2023 వరకు)లో ఫాస్పేట్‌, పొటాష్‌, సల్ఫర్ ఎరువులపై సబ్సిడీ రేట్లు కిందివిధంగా ఉంటాయి.

సంవత్సరం

కిలోగ్రాముకు రూపాయలలో

రబీ 2022-23

(01.10.2022 నుంచి 31.03.2023 వరకు)

ఎన్‌

పి

కె

ఎస్‌

98.02

66.93

23.65

6.12

ఆర్థిక భారం

   రబీ-2022 (01.10.2022 నుండి 31.03.2023 వరకు)కుగాను మంత్రిమండలి ఆమోదించిన ‘ఎన్‌బీఎస్‌’ సబ్సిడీ మొత్తం రూ. 51,875 కోట్లు. కాగా, దేశవాళీ ఎరువుల (ఎస్‌ఎస్‌పి) రవాణాపై ఇచ్చే సబ్సిడీ కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

ప్రయోజనాలు

   ఈ నిర్ణయంతో 2022-23 రబీలో రైతులకు ‘పి అండ్‌ కె’ ఎరువులన్నీ సబ్సిడీ/సరసమైన ధరలకు సజావుగా లభిస్తాయి. తద్వారా వ్యవసాయ రంగానికి చేయూత ఉంటుంది. ఆ మేరకు ఎరువులు, ముడి పదార్థాల అంతర్జాతీయ ధరలలో అస్థిరత్వ భారాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

నేపథ్యం

   దేశంలోని ఎరువుల తయారీ/దిగుమతిదారుల ద్వారా రైతులకు సబ్సిడీ ధరతో యూరియా సహా 25 గ్రేడ్‌ల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. వీటిలో ‘పి అండ్‌ కె’ ఎరువులపై సబ్సిడీని 01.04.2010 నుంచి ‘ఎన్‌బీఎస్‌’ పథకం కింద పర్యవేక్షిస్తోంది. ఆ విధంగా తన కర్షకహిత విధానాలకు అనుగుణంగా రైతుకు సరసమైన ధరలతో ‘పి అండ్‌ కె’ ఎరువులు లభించేలా చూసే బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఎరువులు, ఉత్పాదక సరంజామా.. అంటే- యూరియా, డిఎపి, ఎంఓపి, సల్ఫర్‌ల అంతర్జాతీయ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో రైతులపై భారం పడుతుంది. కాబట్టి ‘డిఎపి’ సహా ‘పి అండ్ కె’ ఎరువులపై సబ్సిడీ పెంపు ద్వారా ఆ భారాన్ని స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సరసమైన ధరతో రైతాంగానికి ఎరువులు లభ్యమయ్యేలా ఆమోదిత ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేస్తుంది.

 

 

  ******



(Release ID: 1873114) Visitor Counter : 233