ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని థరడ్‌లో రూ. 8000 కోట్ల ప్రాజెక్టులకు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాపన! బనస్కాంఠ జిల్లాలో పలు పనులకు మోదీ భూమిపూజ..


”మోర్బి దుర్ఘటనలో జరిగిన ప్రాణనష్టంతో దేశం యావత్తూ ఆవేదన చెందుతోంది”

"అభివృద్ధి చరిత్రలో ఈ రోజు బనస్కాంఠ సొంత అధ్యాయాన్ని లిఖించుకొంటోంది"

"దేశ గౌరవాన్ని గుజరాత్ గౌరవాన్ని పెంపొందించే ప్రతిచర్యా ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిరూపం"

Posted On: 31 OCT 2022 5:47PM by PIB Hyderabad

    గుజ‌రాత్‌ రాష్ట్రం, బ‌న‌స్కాంఠ జిల్లాలోని థ‌ర‌డ్‌ ప్రాంతంలో రూ. 8,000 కోట్ల విలువైన పలు ప‌థ‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాప‌న చేశారు.

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోర్బిలో జరిగిన దుర్ఘటనలో జరిగిన ప్రాణనష్టంతో గుజరాత్ రాష్ట్రం, యావద్దేశం దుఃఖ సాగరంలో మునిగిపోయిందన్నారు. ఈ విషాద సమయంలో మనమందరం బాధిత కుటుంబాలకు అండగా ఉందామని అన్నారు. సహాయక చర్యల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి, ఆయన బృందం మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారని చెప్పారు. “నిన్న రాత్రి భూపేంద్రభాయ్ కేవడియా నుంచి నేరుగా మోర్బీకి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయనతోను, సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులతోను నేను నిరంతరం సంప్రదిస్తూ వస్తున్నాను. జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్.) బృందం, సాయుధ బలగాల దళాల సిబ్బంది కూడా సంఘటనా స్థలం చేరుకున్నారు. అంబాజీ దివ్యస్థలానికి చెందిన గుజరాత్ ప్రజలకు సహాయక చర్యల్లో అన్ని విధాల శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను” అని ఆయన అన్నారు.

   దుర్ఘటన, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేయాలా, వద్దా అని కొంతవరకూ సంశయంలో తాను చిక్కుకున్నానని, అయితే బనస్కాంఠలోని నీటి సరఫరా ప్రాజెక్టుల ప్రాముఖ్యతను, బనస్కాఠ ప్రజల ప్రేమను దృష్టిలో పెట్టుకుని, మనస్థైర్యాన్ని పెంచుకుని, అంతకంటే విలువైన ఈ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చానని ప్రధాని పేర్కొన్నారు. రూ. 8000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులు గుజరాత్‌లోని బనస్కాంఠ, పటాన్, మెహసానా సహా ఆరుకుపైగా జిల్లాలకు నీటిపారుదల సౌకర్యాలకు దోహదపడతాయన్నారు. గ‌తంలో రాష్ట్రం ఎదుర్కొన్న కష్టకాలాన్ని, కడగండ్లను ప్ర‌ధాన మంత్రి గుర్తు చేసుకుంటూ,.. గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌ మొక్కవోని స్పూర్తి,.. పరిమిత వనరులతో ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనే స్థైర్యాన్ని వారికి అందించిందన్నారు. "బనస్కాంఠ ప్రాంతం దీనికి సజీవమైన ఉదాహరణ" అని అన్నారు. బనస్కాంఠ జిల్లాను పూర్తిగా పరివర్తన చెందించిన  అభివృద్ధి పనులను మోదీ ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు.

    ఉత్తర గుజరాత్‌లోని వేలాది జిల్లాల్లో ఫ్లోరైడ్ నీటి కాలుష్యాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. నీటి కాలుష్య సమస్యలు ఈ ప్రాంతంలోని వ్యవసాయంపై తీవ్రంగా ప్రభావితం చూపుతాయని అన్నారు. రైతులు తమ భూమిని విక్రయించాలనుకున్నా కొనేవారు దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. "నేను ఈ భూమికి 'సేవక్'గా మారినప్పటి నుంచి, ఈ ప్రాంత సమస్యలను గుర్తించి, వాటిని అంకితభావంతో, చిత్తశుద్ధితో పరిష్కరించడానికి మా ప్రభుత్వం కృషి చేసింది" అని ప్రధాన మంత్రి అన్నారు. "నీటి సంరక్షణపై మేం దృష్టి సారించాం, చెక్ డ్యామ్‌లు,  చెరువులను, కుంటలను నిర్మించాం" అని ప్రధాని మోదీ చెప్పారు. తాము చేపట్టిన సుజలాం-సుఫలాం యోజన, వాస్మో యోజన, పానీ సమితులు వంటి కార్యక్రమాలను ప్రధాని ఈ సందర్భంగా ఉదహరించారు. కచ్‌ ప్రాంతంతో సహా ఉత్తర గుజరాత్ మొత్తం బిందు సేద్య పథకం,  'ప్రతి బిందువుకూ మరింత పంట (పర్ డ్రాప్ మోర్ క్రాప్)' అన్న నమూనాలతో అభివృద్ధిలో ముందుకు సాగుతునాయని అన్నారు.  ఈ ప్రాంతంలో వ్యవసాయం, ఉద్యానవన, పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని అందించడంలో మహిళలు పోషించిన పాత్ర ఎంతో కీలకమని ఆయన చెప్పారు. "మనకు ఒక వైపు బనస్ పాడిపరిశ్రమ ఉంది, మరోవైపు 100 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ ఉంది, ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించాలనే లక్ష్యాన్ని మేం సాధించాం" అని ప్రధాన మంత్రి తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ నీటిపారుదల వంటి ప్రక్రియలతో  దేశప్రజల దృష్టిని బనస్కాంఠ ఆకర్షించిందని, ఇది  ప్రపంచవ్యాప్త గుర్తింపుకు దారితీసిందని మోదీ చెప్పారు. “అభివృద్ధి చరిత్రలో బనస్కాంఠ ఈరోజు తనదైన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మనీటి పారుదల అమలుచేయడానికే బనస్కాంఠలో 4 లక్షల హెక్టార్ల భూమిని అంకితం చేశామని, ఫలితంగా ఈ ప్రాంతంలో నీటి మట్టం ఇక క్షీణించబోదని అన్నారు. "ఇది మీకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా భవిష్యత్తరాల వారి జీవితాలకు కూడా భద్రత కల్పిస్తుంది" అని ప్రధాని అన్నారు. సుజలాం-సుఫలాం యోజన పథకాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. తమ కృషితో అంకితభావంతో పనిచేసి, విమర్శకులందరి నోరు మూయించి, సుజలాం-సుఫలాం యోజనను ఘన విజయం సాధించేలా చేసిన ఈ  ప్రాంత ప్రజలు అభినందనీయులని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

 

     దాదాపుగా గత ఇరవై ఏళ్లలో జరిగిన పనులను ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ,  సుజలాం-సుఫలాం పథకం కింద వందల కిలోమీటర్ల పొడవైన రీఛార్జి కాలువలను నిర్మించినట్లు తెలిపారు. పైప్‌లైన్‌ వేయడంతో, భూగర్భ జలాలు పెరిగి గ్రామ చెరువులు కూడా పునరుజ్జీవం పొందాయన్నారు. త్వరలో నిర్మించబోతున్న రెండు పైప్‌లైన్‌లతో వేయికి పైగా గ్రామ చెరువులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని తెలియజేశారు. ముక్తేశ్వర్ డ్యామ్, కర్మవత్ తలాబ్ వరకు పైప్‌లైన్‌ను పొడిగిస్తున్నామని, ఎత్తైన ప్రదేశాలకు విద్యుత్ పంపుల సహాయంతో నీటిని ఎత్తిపోస్తున్నామని ప్రధాన మంత్రి వివరించారు. నర్మదా ప్రధాన కాలువ నుంచి థరడ్, వావ్, సుయిగావ్ తాలూకాలలోని డజన్ల కొద్దీ గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే డిస్ట్రిబ్యూషన్ కెనాల్‌ను నిర్మిస్తున్నట్లు  తెలిపారు. “పటాన్, బనస్కాంఠ జిల్లా, 6 తాలూకాల్లోని అనేక గ్రామాలు కూడా కస్రా-దంతివాడ పైప్‌లైన్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. రాబోయే కాలంలో ముక్తేశ్వర్‌ డ్యామ్‌, కర్మావత్‌ చెరువుల్లోకి నర్మదా నది నీరు చేరబోతోంది. బనస్కాంఠ జిల్లాలోని వడ్గామ్, పటాన్‌లోని సిద్ధాపూర్, మహేసనాలోని ఖేరలు తాలూకాకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

    “ఎవరికైనా నీటిని అందించడం అంటే, ఆ పనిని పుణ్యకార్యంగా పరిగణిస్తారు. నీరు సాధించిన వాడు అమృతాన్ని మోసేవాడితో సమానం. ఆ అమృతం ఎవరినైనా సరే అజేయుడిగా మారుస్తుంది. అలాంటి వ్యక్తికే ప్రజలు తమ ఆశీస్సులను అందజేస్తారు. మన జీవితాల్లో నీటికి ఉన్న ప్రాముఖ్యత అదే” అని ప్రధానమంత్రి అన్నారు. వ్యవసాయంలో, పశుపోషణలో అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలను ప్రధాని ప్రస్తావించారు. భూమి ఉత్పాదన శక్తి పెరిగినందున అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆహార-ప్రాసెసింగ్ పరిశ్రమను గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కొన్ని నెలల క్రితమే బంగాళదుంపల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ''ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పరిధి విస్తరణను గురించి ప్రభుత్వం వివరిస్తోంది. ఉత్పత్తిదారుల సంఘాలను, సఖి మండలాలను రైతులు ఈ రంగంతో అనుసంధానిస్తున్నారు” అని ప్రధాన మంత్రి తెలిపారు. శీతలీకరణ గిడ్డంగుల ప్లాంట్‌ లేదా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ కట్టడమంటే.. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఈ సంస్థలకు సాయం చేస్తున్నట్టేనని అన్నారు. పండ్లతోటల సాగు విషయంలో తాము మరింత దార్శనికదృష్టితో ముందుకు సాగుతున్నట్టు ప్రధాని చెప్పారు. దీనితో రైతు కేవలం దానిమ్మ చెట్టు యజమాని మాత్రమే కాకుండా, పండ్ల రసం తయారీ యూనిట్‌లో భాగస్వామిగా మారుతున్నాడని చెప్పారు. పండ్లు, కూరగాయల నుంచి రైతులు పచ్చళ్లు, మురబ్బాలనుంచి చట్నీల వరకు అనేక ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్న సఖీ మండలాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు సఖి మండలాలకు బ్యాంకు రుణాల పరిమితిని కూడా ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. గిరిజన మహిళల సఖీ మండలం అటవీ ఉత్పత్తుల నుంచి ఉత్తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు వీలుగా గిరిజన ప్రాంతాల్లో వన్ ధన్ కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.

    ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఎంతో మేలు చేస్తుందని రుజువైందన్నారు.  రైతుల కోసం ఎరువుల కోసం 'భారత్' పేరిట పాన్ ఇండియా కామన్ బ్రాండ్ నేమ్‌ను  ప్రారంభించినట్టు చెప్పారు. దీనితో ఎరువులపై రైతుల్లో గందరగోళం పూర్తిగా తొలగిపోయిందన్నారు. అంతర్జాతీయ ధర రూ. 2000 కంటే ఎక్కువ కాగా, ప్రభుత్వం రూ.260కి యూరియా బస్తాను రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.  అదే విధంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు బనాస్ డెయిరీ కార్యకలాపాలు విస్తరించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. గోబర్ధన్, జీవ ఇంధనం వంటి పథకాలతో దేశంలో పశువుల వల్ల ప్రయోజనాలు పెరుగుతున్నాయని అన్నారు. డెయిరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు.

     దేశ భద్రతలో బనస్కాంఠ వంటి ప్రాంతాల పెరుగుతున్న పాత్రను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీసాలోని వైమానికదళం విమానాశ్రయం, నాడబెట్‌లోని ‘సీమ-దర్శన్’ ఈ ప్రాంతంలో జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని అన్నారు. సరిహద్దు జిల్లాలో నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌.సి.సి.) విస్తరణను ఆయన ప్రస్తావించారు. చైతన్యవంతమైన సరిహద్దు గ్రామం అనే కార్యక్రమం కింద సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలియజేశారు.

   కచ్ భూకంప బాధితుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మృతి వ్యనం గురించి తెలియజేస్తూ, ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించేలా అందరినీ ప్రోత్సహించాలని ప్రజలకు, బనాస్ డెయిరీ యాజమాన్యానికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

  “జాతి గౌరవాన్ని, గుజరాత్ గౌరవాన్ని పెంపొందించేలా చేపట్టిన ఇలాంటి పనులే డబుల్ ఇంజిన్ ప్రభుత్వ నిబద్ధతను, చిత్తశుద్ధిని సూచిస్తాయి. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌తో ముందుకు సాగడంలోనే మన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి.” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ప్రభాత్‌భాయ్ పటేల్, భరత్‌సింగ్ ధాబి, గుజరాత్ రాష్ట్ర మంత్రి దినేష్‌భాయ్ అనవైద్య, రుషీకేశ్ పటేల్, జితూభాయ్ చౌదరి, కిరీట్ సిన్హ వఘేలా,  గజేంద్రసింగ్ పర్మార్ తదితరులు పాల్గొన్నారు.

 

  నేపథ్యం

    ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ‌న‌స్కాంఠ జిల్లాలోని థర‌డ్‌ ప్రాంతాన్ని సంద‌ర్శించి, రూ. 800కోట్ల పైగా విలువైన ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అనేక నీటి సరఫరా ప్రాజెక్టులలో,.. రూ. 1560 కోట్లతో నర్మదా ప్రధాన కాలువనుంచి కాసర-దంతివాడ చేపట్టిన పైప్‌లైన్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ నీటి సరఫరా వ్యవస్థను పెంపొందించడంతోపాటు, ఈ ప్రాంత రైతులకు  ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా, సుజలామ్ సుఫలామ్ కెనాల్ పటిష్టత, మోధేరా-మోతీ దౌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును ముక్తేశ్వర్ డ్యామ్-కర్మావత్ సరస్సు వరకు పొడిగించడం, సంతల్‌పూర్ తాలూకాలోని 11 గ్రామాలకు ఎత్తిపోతల ఇరిగేషన్ స్కీమ్‌తో సహా అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. 


(Release ID: 1872573) Visitor Counter : 155