ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లోని మియావాకీ అటవీ ప్రాంతంలో ‘చిక్కుల చిట్టడవి’ని జాతికి అంకితం చేసిన ప్ర‌ధానమంత్రి

Posted On: 30 OCT 2022 7:25PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో మియావాకీ అటవీ ప్రాంతాన్ని, అందులో తీర్చిదిద్దిన వినోదాత్మక ‘చిక్కుల చిట్టడవి’ (మేజ్ గార్డెన్)ని జాతికి అంకితం చేశారు. అనంతరం బుద్ధ విగ్రహం సందర్శన సహా ఈ అటవీ మార్గం గుండా నడిచి ‘చిక్కుల చిట్టడవి’లో కొద్దిసేపు తిరిగారు. అలాగే ఇక్కడి పాలన భవనం, అతిథి గృహం, ఓయో హౌస్‌బోట్‌లను ఆయన ప్రారంభించారు.

నేపథ్యం

   క్తానగర్‌లోని ‘ఐక్యతా ప్రతిమ’ సందర్శక ప్రదేశానికి అదనపు ఆకర్షణలుగా మియావాకీ అటవీ ప్రాంతం, చిక్కుల చిట్టడవి తీర్చిదిద్దబడ్డాయి. నాలుగేళ్ల కిందట ‘ఐక్యతా ప్రతిమ’ను ఆవిష్కరించిన సందర్భంగా అన్ని వయోవర్గాల వారికీ ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా ఈ ప్రదేశాన్ని తీర్చదిద్దాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. తదనుగుణంగా ఇప్పటివరకూ 80 లక్షల మందికిపైగా ప్రజలు ‘ఐక్యతా ప్రతిమ’ను సందర్శించారు.

   ప్రాంతంలోని సువిశాలమైన మూడెకరాల విస్తీర్ణంలో 2,100 మీటర్ల మేర తీర్చిదిద్దిన ఈ చిక్కుల చిట్టడవి దేశంలోనే అతిపెద్దది కాగా, దీన్ని కేవలం 8 నెలల స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశారు. కేవడియా వద్దగల ఈ చిక్కుల చిట్టడవిని సానుకూల శక్తి ప్రసార ‘బీజాక్షర చక్రం’ రూపంలో నిర్మించారు. సంక్లిష్ట మార్గాల సముదాయ నిర్మాణంపై దృష్టితో సమరూపత తేవడం లక్ష్యంగా ఈ ఆకృతిని ఎంచుకున్నారు. చిక్కుముడిలాంటి ఈ మార్గాల వెంట నడుస్తూ గమ్యాన్ని చేరుకోవడంపై పర్యాటకుల మానసిక, శారీరక, అలౌకిక శక్తికి ఈ చిట్టడవి పరీక్ష పెడుతుంది. అదే సమయంలో గమ్యం చేరిన తర్వాత సాహసోపేతంగా చిక్కుముడిని విడదీస్తూ విజయం సాధించిన అనుభూతినిస్తుంది. ఈ చిక్కుల చిట్టడవి సమీపాన ఆరెంజ్‌ జెమినీ, మధుకామిని, గ్లోరీ బోవార్‌, మెహందీ రకాల మొక్కలు దాదాపు 1,80,000 దాకా నాటారు. వాస్తవానికి ఈ చిక్కుల చిట్టడవి ప్రాంతం ఒకప్పుడు చెత్తాచెదారాలు నిల్వచేసే ప్రదేశం. అది కాస్తా ఇప్పుడు ప్రకృతి సహజ పచ్చదనంతో సుందర నందనంగా మారిపోయింది. ఈ బంజరు భూమి పునరుజ్జీవనంతో పరిసరాలు అందంగా రూపొందడమేగాక పక్షులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు వృద్ధిచెందే శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థకు ఆలవాలంగా మారింది.

   క్తానగర్‌ సందర్శకులకు మియావాకీ అటవీ ప్రాంతం మరో పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. వివిధ జాతుల మొక్కలను దగ్గరదగ్గరగా నాటడంద్వారా పట్టణ వనాలను సృష్టించేలా జపాన్‌ వృక్ష-పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ అకిరా మియావాకీ రూపొందించిన పద్ధతిలో ఈ దట్టమైన పట్టణ వనం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ అటవీ ప్రాంతానికి ‘మియావాకీ’ అని పేరు పెట్టారు. ఈ పద్ధతిలో నాటినపుడు మొక్కల పెరుగుదల 10 రెట్లు వేగంగా ఉంటుంది కాబట్టి అభివృద్ధి చెందే అటవీ ప్రాంతం సాధారణంకన్నా 30 రెట్లు దట్టంగా ఉంటుంది. సంప్రదాయ విధానంలో ఈ స్థాయి అటవీ అభివృద్ధికి 20-30 ఏళ్లు పడితే, మియావాకీ పద్ధతిలో కేవలం 2 నుంచి 3 సంవత్సరాల్లో ఆ ఫలితం సాధించవచ్చు. మియావాకీ అడవిలోని విభాగాల్లో ‘స్థానిక పూలమొక్కల తోట, ఒక కలప తోట, ఒక పండ్ల తోట, ఒక ఔషధ తోట, మియావాకీ మిశ్రమ జాతుల విభాగం, డిజిటల్ ఓరియంటేషన్ కేంద్రం అంతర్భాగంగా ఉంటాయి.

   ర్యాటకులకు సమగ్ర, సంపూర్ణ ఆహ్లాదంతో కూడిన అనుభూతినివ్వాలన్న ప్రధానమంత్రి దార్శనిక యోచన మేరకు అనేక ఆకర్షణలతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయబడింది. అలాగే ఈ అనుభూతి ఏకరూప అనుభవంగా కాకుండా ప్రకృతి సహజ ఆకర్షణలతో పర్యావరణ పరిరక్షణ దృష్టిని ప్రతిబింబిస్తూ సన్నిహిత అనుబంధం పెంచే అనుభవాల సమాహారంగా ఉండాలన్నది ప్రధాని యోచన. దీంతోపాటు మన సంస్కృతిలో ప్రకృతి పరిరక్షణకుగల ప్రాముఖ్యాన్ని చాటేదిగానూ ఉండాలని ఆయన సంకల్పించారు. ఈ మేరకు ‘చిక్కుల చిట్టడవి’ని ఇక్కడి ప్రత్యేక ఆకర్షణగా చెప్పాలి. మన సంస్కృతిలోకి తీసుకెళ్లే విధంగానే కాకుండా సానుకూల దృక్పథ కల్పనలో ప్రకృతి ఎంత శక్తిమంతమైన సాధనమో తెలిపేలా ఇది రూపొందించబడింది.

   ఐక్యతా ప్రతిమ వద్దగల ఇతర పర్యాటక ఆకర్షణలలో- టెంట్‌ సిటీ, ఆరోగ్య వనం (ఔషధ మొక్కల తోట, సీతాకోక చిలుకల తోట, ముళ్లజెముడు తోట, విశ్వవనం, పుష్పలోయ (భారత వనం) ఐక్యతా ప్రకాశవనం, బాలల పౌష్టికాహార వనం, అటవీ విహారం (జంగిల్ సఫారీ-అత్యాధునిక జూలాజికల్ పార్క్), ఇతివృత్త ఆధారిత పార్కులు వగైరాలు ప్రధానమైనవి.



(Release ID: 1872172) Visitor Counter : 174