ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని అడాలజ్‌లో ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ పథకం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి  ప్రసంగం పాఠం

Posted On: 19 OCT 2022 5:21PM by PIB Hyderabad

 

నమస్కారం, మీరు ఎలా ఉన్నారు?

 అవును ఇప్పుడు దేశంలో కొంత ఉత్కంఠ, ఉద్విగ్నత నెలకొన్న మాట నిజమే..

 గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ,  ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్,... గుజరాత్ మంత్రులు,.. విద్యా ప్రపంచంలోని ప్రముఖులందరికీ..., గుజరాత్ ప్రతిభావంతులైన విద్యార్థులకు.., ఇతర ప్రముఖులకు..,

సోదర, సోదరీమణులారా...!

  ఈ రోజు గుజరాత్‌లో 'అమృత్' తరం' నడుస్తోంది.. అమృత్ కాల్' సృష్టి దిశగా రాష్ట్రం భారీ ముందడుగు వేస్తోంది. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా, అభివృద్ధి చెందిన గుజరాత్‌ను నిర్మాణంలో ఇది ఒక మైలురాయిగా రుజువు కాబోతోంది. మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా గుజరాత్‌లోని ప్రజలందరికీ, ఉపాధ్యాయులకు, యువ సహచరులకు మరియు భవిష్యత్తు తరాలకు నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

  మిత్రులారా!

  ఇటీవల, దేశం 5వ తరంలోకి ప్రవేశించింది... అంటే 5జి. మొబైల్, ఇంటర్నెట్ యుగంలోకి దేశం చేరుకుంది.  1జి (వన్.జి) నుంచి 4జి వరకు మనం ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే ఉపయోగించాం. ఇప్పుడు 5జి దేశంలో భారీ మార్పును తీసుకురాబోతోంది. ఇప్పటివరకూ,.. ప్రతి తరంతో పాటు ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా, జీవితంలోని దాదాపు ప్రతి అంశానికి ప్రతి తరమూ ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తూ వచ్చింది.

  మిత్రులారా!

   అదేవిధంగా, దేశంలో వివిధ తరాల పాఠశాలలను కూడా మనం తిలకించాం. ఇప్పుడు స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ తరగతి గదులు, స్మార్ట్ బోధనా పద్థతులను దాటి మన విద్యా వ్యవస్థను తదుపరి స్థాయికి 5-జి ఇంటర్నెట్ తీసుకువెళుతుంది. అంటే,..ఇప్పుడు వర్చువల్ రియాలిటీని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి.) శక్తిని, ప్రయోజనాలను మన పాఠశాల విద్యార్థులు కూడా చాలా సులభంగా  వినియోగించకోగలుగుతారు. మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ రూపంలో దేశంలోనే చాలా ముఖ్యమైన, మొదటి అడుగు గుజరాత్‌లో పడినందుకు నేను సంతోషిస్తున్నాను.  భూపేంద్ర భాయ్‌కీ, ఆయన ప్రభుత్వానికి, భూపేంద్ర భాయ్ నేతృత్వంలోని యావత్ బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

   మిత్రులారా!

   గుజరాత్‌లో గత రెండు దశాబ్దాల్లో విద్యారంగంలో వచ్చిన మార్పు ఎంతో అపూర్వం. గుజరాత్ రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ప్రతి 100మందికీ 20 మంది పిల్లలు బడికి వెళ్లని పరిస్థితి... అంటే ఐదవ వంతు విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నమాట... అంతేకాదు,.. పాఠశాలకు వెళ్లే చాలా మంది విద్యార్థులు కూడా 8వ తరగతికే చదువు మానేసేవారు. ఆడపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండటం మరింత దురదృష్టకరం. చాలా గ్రామాల్లో తల్లిదండ్రులు తమ కూతుళ్లను పూర్తిగా బడికి పంపలేదు. విజ్ఞాన శాస్త్రాన్ని పాఠ్యాంశంగా బోధించేందుకు గిరిజన ప్రాంతాల్లోని ఏ విద్యా సంస్థల్లోనూ వనరులు లేవు. కానీ నేను ఇపుడు చాలా సంతోషంగా ఉన్నాను. జితూ భాయ్‌ని ఆయన సహచర బృందం దార్శనిక శక్తి అభినందనీయం. వేదికపై ఏమి జరుగుతుందో మీలో చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి, నేను ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

  నేను ఇపుడు కలుసుకున్న పిల్లలంతా 2003లో మొదటిసారిగా పాఠశాలలో చేరిన వారే. నేను అప్పుట్లో గిరిజన గ్రామానికి వెళ్లాను. అదీ,.. జూన్ నెల మధ్య కాలంలో... ఉష్ణోగ్రత 40-45 సెల్సియస్ డిగ్రీలకు చేరుకుంది. నేను ఒక గ్రామానికి వెళ్ళాను, అక్కడ పిల్లలు చాలా తక్కువగా చదువుతున్నారు. ఆడపిల్లల పరిస్థితి అయితే మరీ అద్వాన్నం. నేను ఏదైనా అడిగి తెలుసుకోవడానికి వచ్చానని గ్రామస్తులకు చెప్పాను. తమ కూతుళ్లను చదివిస్తామంటూ హామీ ఇవ్వాలని వారిని అడిగాను. నేను మొదటిసారిగా పాఠశాలకు తీసుకెళ్లిన పిల్లలను ఈ రోజు నేను కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా అభ్యర్థనను అంగీకరించినందుకు పిల్లల తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళని పాఠశాలకు మాత్రమే తీసుకెళ్లాను. చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుని వారు తమ పిల్లలకు చేతనైనంతగా నేర్పించడం వల్లనే నేడు ఆ పిల్లలు స్వతంత్రులుగా తయారయ్యారు. నా ద్వారా పాఠశాలల్లో అడ్మిషన్ పొందిన పిల్లలను కలిసే అవకాశం నాకు కల్పించినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని, జితూభాయ్‌ని అభినందిస్తున్నాను.

 

   మిత్రులారా!

  గత రెండు దశాబ్దాల్లో తమ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గుజరాత్ ప్రజలు పూర్తిగా మార్చేశారు. ఈ రెండు దశాబ్దాలలో గుజరాత్‌లో లక్షా పాతికవేలకుపైగా తరగతి గదులు కొత్తగా నిర్మితమయ్యాయి. 2లక్షల మందికి పైగా ఉపాధ్యాయుల నియామకం జరిగింది.  ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే లక్ష్యంతో చేపట్టిన ‘శాల ప్రవేశోత్సవ్’ కార్యక్రమం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అధికారిక విద్యను ప్రోత్సహించడానికి చేపట్టిన ‘కన్యా కెలవాణి మహోత్సవ్’ మొదలైన రోజు కూడా నాకు గుర్తుంది. కొడుకులు, కూతుళ్లు తొలిసారి స్కూలుకు వెళ్లిన సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలన్న ఆలోచనతోనే ఇదంతా జరిగింది. కుటుంబంలో, ప్రాంతంలో మొత్తం గ్రామంలో ఈ వేడుకలు జరగాలి.., ఎందుకంటే దేశంలోని ఒక కొత్త తరానికి విద్యను అందించడానికి ఒక ప్రారంభోత్సవంగా  దీన్ని చేపట్టాం. తమ ఆడబిడ్డలను బడికి పంపాలంటూ ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా గ్రామాలకు వెళ్లి ప్రజలందరినీ కోరాను. అందుకు తగిన ఫలితం ఈరోజు గుజరాత్‌లో కనిపిస్తోంది. దాదాపు ప్రతి కొడుకూ, కూతురూ పాఠశాలల, కళాశాలల బాటలో నడిచారు.

   

 

మిత్రులారా!

  విద్య నాణ్యతకు, ఫలితాలకు కూడా మేం గరిష్టస్థాయిలో ప్రాధాన్యం ఇచ్చాం. అందుకే ‘ప్రవేశోత్సవ్’తో పాటు  ‘గుణోత్సవ్’ పేరిట పిల్లల అభ్యసన ఫలితాలను అంచనా వేసే ప్రక్రియను ప్రారంభించాం. విద్యార్థి సామర్థ్యాలు, అభిరుచులు, అతని ఉదాసీనత ప్రాతిపదికగా ప్రతి విద్యార్థినీ అంచనా వేసినట్టు నాకు బాగా జ్ఞాపకం..వారితో పాటు ఉపాధ్యాయుల స్థాయిని కూడా అంచనా వేశారు. ఈ  కార్యక్రమంపై ప్రచారం చేపట్టడంలో భాగంగా పాఠశాల విద్యాశాఖలతో పాటు, మా అత్యున్నత స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, అటవీ అధికారులు కూడా మూడు రోజులు గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించేవారు. కొన్ని రోజుల క్రితం నేను గాంధీనగర్‌కు వచ్చినప్పుడు, 'గుణోత్సవ్' రూపంలో చేపట్టిన అధునాతనమైన, సాంకేతికత ఆధారిత సంస్కరణను చూసి ఎంతో సంతోషించాను. 'విద్యా సమీక్షా కేంద్రాల' రూపంలో నాకు ఆ సంస్కరణలు కనిపించాయి. ‘విద్యా సమీక్షా కేంద్రాల’ నూతనత్వం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. భారత ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇటీవల గాంధీనగర్‌లో వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల, విద్యా శాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. ‘విద్యా సమీక్షా కేంద్రాల’ భావనను అర్థం చేసుకునేందుకే తమ సమయములో గణనీయమైన భాగాన్ని వారు ఈ సమావేశంలో వెచ్చించారు. ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి ‘విద్యా సమీక్షా కేంద్రాలను’ అధ్యయనం చేస్తున్నారు. ఆ నమూనాను తమ రాష్ట్రాల్లో అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో గుజరాత్ కృషి అభినందనీయం.

  రాష్ట్రంలోని మొత్తం పాఠశాల విద్యకు సంబంధించిన నిమిష సమాచారం కూడా పొందేందుకు వీలుగా ఒక కేంద్ర వ్యవస్థను రూపొందించారు. ఇది ఒక రకమైన వినూత్న ప్రయోగం. గుజరాత్‌లోని వేలాది పాఠశాలలు, లక్షలాది మంది ఉపాధ్యాయులు, సుమారు కోటీ 25లక్షల మంది విద్యార్థులపై ఇక్కడ సమీక్షించి, సమీక్షలో తేలిన అభిప్రాయాలను వారికి అందించారు. బిగ్ డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేథో పరిజ్ఞానం, వీడియో వాల్స్ వంటి మెలకువలతో ఈ సమాచారాన్ని (డేటాను) విశ్లేషిస్తారు. దీని ప్రకారం, మెరుగైన పనితీరు కోసం పిల్లలకు అవసరమైన సూచనలు అందించారు.

   మిత్రులారా!

  విద్యారంగంలో ఏదైనా వినూత్నమైనది, ప్రత్యేకమైనది చేయడం, ప్రయోగాలు చేయడం గుజరాత్ డి.ఎన్.ఎ.లోనే ఉంది. అది గుజరాత్  స్వభావం కూడా... ఉపాధ్యాయుల శిక్షణ కోసం  ఉపాధ్యాయ విద్యాసంస్థను మొదటిసారిగా గుజరాత్‌లో స్థాపించారు. ఇక్కడి పిల్లల విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే ఏకైక విశ్వవిద్యాలయం. ‘ఖేల్ మహాకుంభ్’ అనుభవాన్ని పరిశీలించండి. ప్రభుత్వ యంత్రాంగంలోని క్రమశిక్షణతో కూడిన పని సంస్కృతి, క్రీడల పట్ల గుజరాత్ యువతకు ఆసక్తి,.. ఇదంతా ‘ఖేల్ మహాకుంభ్’ ప్రక్రియ ఫలితమే.. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల గుజరాత్‌లో జాతీయ క్రీడలు జరిగాయి. ఈ క్రీడలకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. క్రీడాకారులు, వారి కోచ్‌లతో నేను అందుబాటులో ఉన్నందున, ఈ క్రీడల నిర్వహణపై వారు  నన్ను అభినందించారు. అన్ని ప్రశంసలకు, అభినందనలకు గుజరాత్ ముఖ్యమంత్రికే, గుజరాత్ ప్రభుత్వానికే అర్హత ఉందని,  కాబట్టి నన్ను అభినందించవద్దని నేను వారికి చెప్పాను. వారి కృషితోనే దేశంలోనే ఇంత పెద్ద క్రీడోత్సవం గుజరాత్‌లో సాధ్యమైంది. అంతర్జాతీయ టోర్నమెంట్ల సమయంలో అందించే ఆతిథ్యం, నిర్వహణా ​​ఏర్పాట్లతో గుజరాత్ సరితూగుతుందని క్రీడాకారులంతా నాకు చెప్పారు. ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడం, క్రీడా ప్రపంచాన్ని ప్రోత్సహించడం, ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా గుజరాత్ నిజంగా దేశానికి గొప్ప సేవే అందించింది.  ఇందుకు గుజరాత్ ప్రభుత్వానికి, అధికారులందరికి, క్రీడా ప్రపంచంతో అనుబంధించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను.

   మిత్రులారా!

  గుజరాత్‌లోని 15,000 పాఠశాలలకు పదేళ్ల కిందటే టీవీ చేరువైంది. చాలా సంవత్సరాల క్రితం గుజరాత్‌లోని 20,000కు మించిన పాఠశాలల్లో కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ ల్యాబ్‌లు, తదితర వ్యవస్థలు అంతర్భాగంగా మారాయి. నేడు గుజరాత్‌లో కోటి మంది విద్యార్థులకు, 4లక్షల మంది ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ హాజరు సదుపాయం అందుబాటులో ఉంది. ఈ కొత్త ప్రయోగాల పరంపరలో భాగంగా నేడు గుజరాత్‌లోని 20,000 పాఠశాలలు 5జి విద్యా యుగంలోకి ప్రవేశించబోతున్నాయి. మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 50,000 కొత్త తరగతి గదులు, లక్షకు పైగా స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఈ పాఠశాలల్లో ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ పాఠశాలలన్నీ ఆధునిక డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి. అంతే కాకుండా, పిల్లల జీవితాల్లో, చదువులో భారీ మార్పునకు ఇవి దోహదం చేస్తాయి. పిల్లల సామర్థ్యాన్ని పెంపొందించే ప్రతి అంశంలోనూ ఇక్కడ కృషి జరగబోతోంది. అంటే, విద్యార్థి ప్రతిభ, వారి మెరుగుదలపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు.

 

మిత్రులారా!

  5జి టెక్నాలజీతో పిల్లల అధ్యయనా వ్యవస్థలు చాలా సులభతరం కాబోతున్నాయి.  2జి, 4జి,  5జి లను ఇలా సరళంగా వివరించవచ్చు., 4జి. ఒక చక్రం లాంటిది అయితే, 5జి. ఒక విమానం అవుతుంది.  అంతే,.. ఇదే తేడా. సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ భాషలో వివరించాలంటే నేను ఇలాగే వివరిస్తాను. 4జి అంటే సైకిల్, 5జి. అంటే మీకు చేతిలో విమానం ఉన్నట్టే అన్నమాట. 5జి.కి ఉన్న శక్తి అలాంటిది.

  5జి ఇంటర్నెట్ శక్తిని గ్రహించి, రాష్ట్రం దశను మార్చే ఆధునిక విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గుజరాత్‌ ప్రభుత్వానికి నా అభినందనలు. ప్రతి బిడ్డ తన అవసరాలకు అనుగుణంగా చదువు నేర్చుకునే అవకాశాన్ని ఇది అందిస్తుంది. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని పాఠశాలల విద్యకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ సేవల ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉత్తమ ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. ఉత్తమ ఉపాధ్యాయుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అతను తరగతి గదిలో ఉన్నట్లుగానే కనిపిస్తుంది.  ప్రతి పాఠ్యాంశంలోని అత్యుత్తమమైన విషయం అందరికీ అందుబాటులో ఉంటుంది. విభిన్న నైపుణ్యాలను బోధించే ఉత్తమ ఉపాధ్యాయులు వివిధ గ్రామాలు, నగరాల్లోని పిల్లలకు అప్పటికప్పుడు పాఠాలు చెప్పగలుగుతారు. విధ పాఠశాలల్లో అంతరాన్ని తొలగించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఈ అత్యాధునిక పాఠశాలలు అంగన్‌వాడీ, బాలవాటిక నుంచి మార్గదర్శకత్వం అందించి, పోటీ పరీక్షలకు సన్నాహంగా తయారు చేసేలా విద్యార్థుల ప్రతి అవసరాన్ని ఇది తీరుస్తుంది. కళలు, హస్తకళలు, వ్యాపారం నుంచి,  కోడింగ్, రోబోటిక్స్ వరకు, చిన్న వయస్సు నుంచే అన్ని రకాల విద్య ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అంటే, కొత్త జాతీయ విద్యా విధానంలోని ప్రతి అంశం ఇక్కడ అమలవుతుంది.

 

  సోదర, సోదరీమణులారా!

  దేశం అంతటా ఇలాంటి మార్పులనే నేడు కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా ప్రోత్సహిస్తోంది. అందువల్ల, దేశవ్యాప్తంగా 14,500 పి.ఎం.శ్రీ పాఠశాలలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టే పథకం. దాదాపు ఏడాది పాటు ఈ పథకాన్ని పర్యవేక్షించబోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవడం,  లేదా కొత్తదనం జోడించడం అవసరమైతే, అదికూడా చేస్తారు. భవిష్యత్తులో దీన్ని పరిపూర్ణమైన నమూనాగా మార్చడం ద్వారా దేశంలోని గరిష్ట సంఖ్యలో పాఠశాలలకు దీన్ని చేర్చేందుకు కృషి చేస్తాం. దేశవ్యాప్తంగా కొత్త జాతీయ విద్యా విధానానికి నమూనాలుగా  ఈ పాఠశాలలుగా నిలుస్తాయి.

  ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 27,000 కోట్లు ఖర్చు చేయబోతోంది. కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఈ పాఠశాలలు పూర్తిగా అమలు చేస్తాయి, విమర్శనాత్మక ఆలోచనా విధానంపై ఇవి దృష్టిని సారిస్థాయి. పిల్లలకు తమ సొంతభాషలో మెరుగైన విద్యను అందించడానికి వీలు కల్పిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన పాఠశాలలన్నింటికీ ఇవి మార్గదర్శకంగా నిలుస్తాయి.

 

 మిత్రులారా!

  బానిస మనస్తత్వాన్ని పారద్రోలాలని స్వాతంత్య్ర అమృత మహోత్సవంలో దేశం యావత్తూ ప్రతిజ్ఞ చేసింది. బానిస మనస్తత్వం నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి, ప్రతిభను, సృజనాత్మక ఆవిష్కరణలను మెరుగుపరిచేందుకు జరిగే కృషిలో భాగంగానే కొత్త జాతీయ విద్యా విధానం చేపట్టాం. దేశంలో పరిస్థితి ఎలా ఉండేదో చూడండి? తెలివితేటలకు ఆంగ్ల భాషా జ్ఞానాన్నే కొలమానంగా తీసుకొన్నారు. అయితే భాష కేవలం కమ్యూనికేషన్ మాధ్యమం మాత్రమే. కానీ చాలా దశాబ్దాలుగా భాష ఒక అవరోధంగా తయారైంది. గ్రామాలలోని, పేద కుటుంబాలలోని ప్రతిభా సంపద ప్రయోజనాన్ని దేశం ఇన్నిరోజులూ పొందలేకపోయింది. తమకు అర్థమయ్యే భాషలో చదువుకునే అవకాశం లేక చాలా మంది ప్రతిభావంతులైన పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎదగలేకపోయారు. ఈ పరిస్థితి ఇపుడు మారిపోతోంది. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక  పరిజ్ఞానం, వైద్యం మొదలైన పాఠ్యాంశాలను భారతీయ భాషలలో కూడా అభ్యసించే ఎంపిక అవకాశాన్ని పిల్లలు పొందగలుగుతున్నారు. తన బిడ్డను ఇంగ్లీషు పాఠశాలలో చదివించలేని నిరుపేద తల్లి కూడా,.. అతన్ని డాక్టర్‌గా చేయాలని కలలు కంటోంది. తన మాతృభాషలోనే చదివి పిల్లవాడు డాక్టర్ కావచ్చు. పేద కుటుంబంలోని వ్యక్తి కూడా డాక్టర్‌ అయ్యేలా చూసేందుకు ఆ దిశగా కృషి చేస్తున్నాం. అనేక భారతీయ భాషలతో పాటు గుజరాతీ భాషలో కోర్సులను రూపొందించడానికి కృషి జరుగుతోంది. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన తరుణం ఇది. ఏ కారణం చేతనైనా దేశంలో ఈ ప్రయత్నాన్ని ఎవరూ వదిలిపెట్టరాదు. కొత్త జాతీయ విద్యా విధానం స్ఫూర్తి కూడా ఇదే. ఈ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలి.

 

  మిత్రులారా!

  ప్రాచీన కాలం నుండి భారతదేశ అభివృద్ధికి విద్యే మూలకారణంగా ఉంటోంది. స్వతహాగా, స్వభావ సిద్ధంగా మనం జ్ఞానానికి మద్దతుదారులం. అందుకే, జ్ఞాన సముపార్జనలో, విజ్ఞాన శాస్త్రంలో మన పూర్వీకులు ఒక గట్టి ముద్ర వేశారు, ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను వారు వందల సంవత్సరాల క్రితమే నిర్మించారు. అతిపెద్ద గ్రంథాలయాలను స్థాపించారు. అయితే, భారతదేశానికి వారసత్వమైన ఈ సంపదను నాశనం చేయడానికి దేశంపై దాడి చేసిన దురాక్రణదారులు ఒకప్పుడు గట్టిగా ప్రయత్నించారు. కానీ..విద్యకు సంబంధించి తన బలమైన సంకల్పంపై భారతదేశం ఏమాత్రం పట్టువీడలేదు. ఎన్నో దారుణాలను చవిచూసినా దేశం విద్యాపథాన్ని మాత్రం వీడలేదు. అందుకే,.. జ్ఞాన సముపార్జన, వైజ్ఞానిక శాస్త్రం, ఆవిష్కరణల ప్రపంచంలో నేటికీ మనకు విభిన్నమైన గుర్తింపు ఉంది. ప్రాచీనమైన ఈ ప్రతిష్టను స్వాతంత్య్ర 'అమృత్ కాల్'లో పునరుద్ధరించడానికి మనకు అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి తగిన సామర్థ్యం భారతదేశానికి అపారంగా ఉంది. మనకోసం అవకాశాలు కూడా వేచి చూస్తున్నాయి. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతకు సంబంధించిన చాలా ఆవిష్కరణలు ఎన్నో 21వ శతాబ్దంలో భారతదేశంలోనే జరుగబోతున్నాయి. నా దేశ యువతపై నాకున్న నమ్మకం, నా దేశ యువత ప్రతిభ కారణంగా నేను ఈ విషయం ధీమాగా చెప్పగలుగుతున్నాను.

  గుజరాత్‌ రాష్ట్రానికి కూడా ఈ విషయంలో భారీ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు గుజరాత్‌కు వర్తకులు, వ్యాపారుల రాష్ట్రంగానే గుర్తింపు ఉంది. ఒక చోట సరుకులు కొని, మరో చోట అమ్ముకుని దళారీతనం ద్వారా జీవనోపాధి పొందుతూ వచ్చారు. ఈ పరిస్థితినుంచి  నుంచి క్రమంగా బయటపడిన గుజరాత్ మెల్లమెల్లగా తయారీ రంగంలో పేరు  సంపాదించుకుంటోంది.  ఇప్పుడు,.. ఈ 21వ శతాబ్దంలో విజ్ఞానానికి, సృజనాత్మకతకు దేశానికే కేంద్రంగా గుజరాత్ అభివృద్ధి చెందుతోంది. మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పథకాన్ని చేపట్టిన గుజరాత్ ప్రభుత్వం ఈ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.

 

  మిత్రులారా!

  ఈ రోజు చాలా ముఖ్యమైన ఈ కార్యక్రమానికి హాజరుకావడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఒక గంట కిందట నేను, దేశ సైనిక శక్తి కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నాను.  ఆ గంట తర్వాత గుజరాత్‌లో ఈ దేశ విజ్ఞానశక్తి కార్యక్రమంలో భాగస్వామినయ్యే అవకాశం నాకు లభించింది. ఈ కార్యక్రమం తర్వాత, నేను జునాగఢ్, రాజ్‌కోట్‌ వెళ్తున్నాను, అక్కడ ప్రజా శ్రేయస్సుకు, సమస్యలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

 

   మిత్రులారా!

   ఈ రోజున,  ముఖ్యమైన ఈ సందర్భంలో గుజరాత్ విద్యా ప్రపంచానికి, భావి తరాలకు, వారి తల్లిదండ్రులకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భూపేంద్ర భాయ్‌కి, ఆయన సహచర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు!

ధన్యవాదాలు.

గమనిక:  ప్రధాని ప్రసంగానికి ఇది దాదాపుగా అందించిన అనువాదం. ఆయన అసలు ప్రసంగం హిందీలో సాగింది.

***************

 

 

 

 

 


(Release ID: 1871060) Visitor Counter : 131