గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పట్టణ గృహనిర్మాణ సదస్సుకు ఈ ఏడాది రాజకోట్ ఆతిథ్యం
“భవిష్యత్తుకు సంసిద్ధమైన పట్టణభారతం”
ఈ కలను సాకారం చేయడమే సదస్సు లక్ష్యం..
ఇందుకు వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళిక,
రోడ్‌మ్యాప్‌లకు సదస్సులోనే రూపకల్పన
సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా
నిర్మాణ రంగంలో టెక్నాలజీ పరిధిని
విస్తరించేందుకు దోహదపడనున్న సదస్సు
Posted On:
18 OCT 2022 4:55PM by PIB Hyderabad
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.హెచ్.యు.ఎ.) ఆధ్వర్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 2022 అక్టోబరు 19నుంచి 21వరకూ 3 రోజులపాటు జరగనున్న ‘భారతీయ పట్టణ గృహనిర్మాణ సదస్సు-2022’ (ఐ.యు.హెచ్.సి.-2022)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 అక్టోబరు 19న ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ ఎస్. పూరి, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి కౌశల్ కిశోర్, కేంద్ర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ప్రముఖులు కూడా పాల్గొంటారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పి.ఎం.ఎ.వై.-యు.) పథకం ప్రతినిధులే కాకుండా, స్వచ్ఛ భారత్ మిషన్, అటల్ పునరుద్ధరణ, పట్టణ పరివర్తన పథకం (అమృత్), స్మార్ట్ నగరాల పథకం, పట్టణ రవాణా, దీనదయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (ఎన్.ఎల్.యు.ఎం.), స్వానిధి పథకం తదితర పథకాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.
అన్ని రకాల భాగస్వామ్య వర్గాలవారు తమ సాంకేతిక పరిజ్ఞాన రూపాలను ప్రదర్శించడానికి, సదరు పరిజ్ఞానాలపై చర్చించడానికి 'భారతీయ పట్టణ గృహనిర్మాణ సదస్సు' ఒక వేదికగా దోహదపడుతుంది. అలాగే వివిధ రకాల భౌగోళిక-వాతావరణ ప్రాంతాలకు అనువైన పలు రకాల గృహ నిర్మాణ పద్ధతులు, ప్రధాన స్రవంతిలో అమలుకోసం నిర్దేశించిన టెక్నాలజీలు, వివిధ ప్రక్రియల ఎంపికలపై చర్చించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ/ప్రైవేట్ ఏజెన్సీలు, పరిశోధన, అభివృద్ధి విభాగాలు, సాంకేతిక సంస్థలు, నిర్మాణ ఏజెన్సీలు, డెవలపర్లు, కాంట్రాక్టర్లు, స్టార్ట్-అప్ కంపెనీలు, ఇతర భాగస్వామ్య వర్గాలకు తగిన సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు కూడా ఈ సదస్సు ఎంతో దోహదపడుతుంది.
ఇంకా, వినూత్నమైన, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణ సాంకేతికతలపై లబ్ధిదారులకు, అంటే గృహ యజమానులకు అనుసంధానం కల్పించేందుకు సదస్సు దోహదపడుతుంది. “భవిష్యత్తుకు సంసిద్ధమైన అర్బన్ ఇండియా” అన్న దార్శనికతను,కలను సాకారం చేసేందుకు, ‘అమృత్ కాల్’ వ్యవధిలో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికను, రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో కూడా ఈ సదస్సు సహాయపడుతుంది. వెబ్‌కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్‌తో ఈ కార్యక్రమాన్ని భౌతిక పద్ధతిలోను, వర్చువల్ పద్ధతిలోను నిర్వహిస్తారు. ఈ సదస్సులో భాగంగా ఈ కింది అంశాలను పొందుపరిచారు.:
- గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో లైట్ హౌస్ ప్రాజెక్ట్ (ఎల్.హెచ్.పి.) ప్రారంభోత్సవం: చక్కని నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానంగా నిరూపితమైన సృజనాత్మక పద్ధతిని ఉపయోగించి దేశంలోని 6 రాష్ట్రాల్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.హెచ్.యు.ఎ.) నిర్మిస్తున్న 6 లైట్‌హౌస్ ప్రాజెక్టుల్లో రాజ్‌కోట్‌లోని ఎల్.హెచ్.పి. కూడా ఉంది. రాజ్‌కోట్ ప్రాజెక్టు ఇప్పటికే అన్ని విధాలుగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, 'టన్నెల్ ఫార్మ్‌వర్క్‌ను ఉపయోగించి మోనోలిథిక్ కాంక్రీట్ విధానం'తో, 1,144 గృహాలను నిర్మించేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇది వేగవంతమైన నిర్మాణం, మన్నిక ఎక్కువ, ఖర్చు తక్కువ, వనరుల-సమర్థవంతమైన నిర్వహణతో దీన్ని పూర్తి చేశారు. ఇది విపత్తులను సమర్థంగా తట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో రాజ్‌కోట్ ఎల్.హెచ్.పి.ని ప్రధాన మంత్రి లాంఛనంగా ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేస్తారు. అదనంగా, వివిధ ప్రచురణలు, సంకలనాలు, పుస్తకాలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు.
- వినూత్న, సృజనాత్మక నిర్మాణ పద్ధతులపై జాతీయ ప్రదర్శన: వినూత్నమైన, సృజనాత్మకమైన నిర్మాణ సామగ్రి, నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం- ప్రక్రియలను వివరిస్తూ ఒక ప్రదర్శనను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయనున్నారు. కొత్త తరహా, వినూత్న నిర్మాణ సాంకేతికతలు/సామగ్రిపై తమ నమూనా రూపాలను ప్రపంచ స్థాయి, జాతీయ స్థాయి ఎగ్జిబిటర్లు ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రొవైడర్లు, స్వదేశీ సాంకేతికతలు, దేశంలో భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న టెక్నాలజీల (స్టార్ట్-అప్ సంస్థలు) ప్రతినిధులను సరళమైన ఆన్‌లైన్ ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ ప్రదర్శనకు ఆహ్వానించారు. ప్రపంచ స్థాయి గృహనిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన చాలెంజ్ (జి.హెచ్.టి.సి.) కోసం ఏర్పాటైన సాంకేతిక పరిజ్ఞాన మధింపు కమిటీ (టి.ఇ.సి.) ఈ సందర్భంగా కీలకపాత్ర పోషిస్తుంది. ఆయా సంస్థల టెక్నాలజీలు భారతదేశ పరిస్థితులకు ఏ మాత్రం అనుకూలంగా ఉంటాయన్న అంశాన్ని ఈ కమిటీ మధింపు చేస్తుంది. ఈ ఎగ్జిబిషన్‌లో 200కు మించి టెక్నాలజీ ప్రొవైడర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు.
- పి.ఎం.ఎ.వై. పథకం కింద గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన ఉత్తమ పద్ధతులపై ప్రదర్శన: పి.ఎం.ఎ.వై. అర్బన్ పథకం సహకార సమాఖ్య పద్ధతిని ప్రోత్సహిస్తుంది. స్థానిక పరిస్థితులకు, వాతావరణానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్మాణాలను చేపట్టాయి. వినూత్న నిర్మాణ పద్ధతులను అవలంబించడం, ఇతర గృహ పథకాలతో పి.ఎం.ఎ.వై.-అర్బన్ సమ్మిళితం చేయడం, జీవనోపాధి కార్యక్రమాలు, గృహాలను ప్రత్యేక ప్రజా సమూహాలకు అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహించాయి. పట్టణాల్లో చేపట్టిన పథకాల విజయాలు, ఆర్థిక వృద్ధిని ముందుకు సాగించేందుకు, ప్రజల జీవితాల్లో పరివర్తన తేవడానికి 'సులభతర, సౌకర్యవంతమైన జీవనాన్ని' మెరుగుపరచడం ఈ ప్రదర్శన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
- అందుబాటు యోగ్యమైన గృహనిర్మాణ వ్యూహాలపై చర్చలు: 'సౌకర్యవంతమైన జీవనాన్ని' మరింత మెరుగుపరచడంలో భవిష్యత్తు పట్టణ అభివృద్ధికోసం సంకల్పం తీసుకోవడానికి, పట్టణ స్వభావ స్వరూపాన్ని మార్చే ప్రక్రియ పురోగతిని చర్చించడానికి, జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులతో కూడిన భాగస్వామ్య వర్గాలతో చర్చించడానికి వివిధ రకాల చర్చలు, సంవాదాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు/రాష్ట్రాల/కేంద్రపాలిత సంస్థల అధికారులు, విద్యాసంస్థల, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య వర్గాల వారు కూడా ఇందులో పాలుపంచుకుంటారు.
- 2021వ సంవత్సరపు పి.ఎం.ఎ.వై.-యు అవార్డుల ప్రదానం, సన్మానం: పి.ఎం.ఎ.వై.-యు పథకం అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు, ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణ పరిపాలనా సంస్థలు (యు.ఎల్.బి.లు) అందించిన అత్యుత్తమ సహకారాన్ని గుర్తించేందుకు, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.హెచ్.యు.ఎ.) వార్షిక అవార్డులను ప్రవేశపెట్టింది. 2021వ సంవత్సరానికి సంబంధించి పి.ఎం.ఎ.వై.-యు అవార్డుల విజేతలను కూడా గుర్తించారు. ఈ కార్యక్రమంలో అవార్డు విజేతలను ఘనంగా సత్కరిస్తారు.
పి.ఎం.ఎ.వై. అర్బన్ పథకాన్ని కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2015 జూన్ నెల నుండి అమలు చేస్తోంది, దేశంలోని పట్టణ ప్రాంతాలలో అర్హులైన కుటుంబాలు/లబ్దిదారులకు అందరికీ అన్ని మౌలిక సదుపాయాలతో, అన్ని వాతావరణాలను తట్టుకోలగలిగిన పక్కా గృహాలను అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద మొత్తం 122.69 లక్షల గృహాలు మంజూరయ్యాయి; వీటిలో దాదాపు కోటీ 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పనులను ప్రారంభించగా, 63 లక్షలకు పైగా ఇళ్ల పనులు పూర్తయపోయి, వాటిని లబ్ధిదారులకు అందించారు. 2022 మార్చి 31 వరకు మంజూరైన అన్ని గృహాలను పూర్తి చేయడానికి వీలుగా ఈ పథకం గడువును 2024 డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించారు. పి.ఎం.ఎ.వై. అర్బన్ పథకం విస్తృతి పరిధిలో, వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞాన రూపాలను స్వీకరించడానికి వీలుగా టెక్నాలజీ సబ్-మిషన్ (టి.ఎస్.ఎం.)ను ఏర్పాటు చేశారు. సుస్థిరమైన, పర్యావరణహితమైన, విపత్తు-తట్టుకునే సాంకేతికత, నిర్మాణ సామగ్రి, వేగవంతమైన, నాణ్యమైన గృహాల నిర్మాణం లక్ష్యంగా ఈ టెక్నాలజీ సబ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు.
వినూత్నమైన, సృజనాత్మకమైన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాలను, వ్యవస్థలను ప్రోత్సహించడం కోసం, ప్రపంచ స్థాయి గృహనిర్మాణ టెక్నాలజీ చాలెంజ్- ఇండియా (జి.హెచ్.టి.సి.-ఇండియా) కార్యక్రమానికి 2019 జనవరి నెలలో శ్రీకారం చుట్టారు. ఒక సవాలు ద్వారా సుస్థిరమైన, హరిత నిర్మాణాలను, విపత్తులను తట్టుకోగలిగిన ప్రపంచవ్యాప్తంగా ఉత్తమమైనవిగా రుజువైన నిర్మాణ సాంకేతికతలను గుర్తించి, వాటిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే లక్ష్యంతో జి.హెచ్.టి.సి.ని చేపట్టారు. నిర్మాణ రంగంలో సాంకేతిక పరివర్తన తీసుకురావడానికి దీని రూపకల్పన జరిగింది. జి.హెచ్.టి.సి.-ఇండియా ఆధ్వర్యంలో, 'కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా (సి.టి.ఐ.) - 2019: ఎక్స్‌పో-సమ్మేళనం' పేరిట ఒక కార్యక్రమాన్ని 2019 మార్చి 2వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాన మంత్రి ప్రారంభించారు.
జి.హెచ్.టి.సి.-ఇండియాలో పాల్గొన్న 54 ఎంపిక చేసిన ప్రపంచ స్థాయి అత్యుత్తమ సాంకేతికతలనుంచి ఆరు విభిన్న సాంకేతికతలను ఎంపిక చేశారు. ఇండోర్, రాజ్‌కోట్, చెన్నై, రాంచీ, అగర్తల, లక్నో నగరాల్లో ఆరు లైట్ హౌస్ ప్రాజెక్ట్‌లను (ఎల్.హెచ్.పి.లను) నిర్మించడానికి ఈ ఎంపిక జరిగింది. మొత్తం 6 ఎల్.హెచ్.పి.లకు 2021 జనవరి 1వ తేదీన ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఆరు ఎల్.హెచ్.పి.లలో, చెన్నై ఎల్.హెచ్.పి.ని 2022 మే నెల 26న ప్రధానమంత్రి ప్రారంభించారు. పనులు పూర్తయిన రాజ్‌కోట్ ఎల్.హెచ్.పి. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మిగిలిన నాలుగు ఎల్‌హెచ్‌పిలు వివిధ నిర్మాణ దశల్లో పురోగమిస్తూ ఉన్నాయి.
దీనికి తోడుగా, ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరంలో 2021అక్టోబర్ 5న 'భారతీయ గృహనిర్మాణ హౌసింగ్ టెక్నాలజీ మేళా' (ఐ.హెచ్.టి.ఎం.)ను నిర్వహించారు. తక్కువ స్థాయి, మధ్యతరహా-స్థాయి నిర్మాణాల కోసం ప్రత్యామ్నాయ/సుస్థిర నిర్మాణ సామగ్రిని వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఐ.హెచ్.టి.ఎం.ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐ.హెచ్.టి.ఎం. కింద, 84 స్వదేశీ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలను, ప్రక్రియలను ఎంపిక చేశారు.
సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా నిర్మాణ రంగంలో టెక్నాలజీ పరిధిని మరింత విస్తృతం చేయడానికి, సాంకేతికతలో పరివర్తనను తీసుకురావడానికి 'భారతీయ పట్టణ గృహనిర్మాణ సదస్సు' ఎంతగానో దోహదపడుతుంది. జి.హెచ్.టి.సి.-ఇండియా కింద ఎంపికైన అన్ని ప్రపంచస్థాయి సాంకేతికలు, స్వదేశీ వినూత్న సాంకేతికతలు, ప్రక్రియలను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది. అలాగే ఐ.హెచ్.టి.ఎం. కింద ప్రపంచవ్యాప్తంగా వివిధ భాగస్వామ్య వర్గాలు రూపొందించిన సాంకేతికతల ప్రదర్శనకు కూడా ఇది వేదికగా దోహదపడుతుంది.
****
(Release ID: 1869007)
Visitor Counter : 135