ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అవాస్తవాలు - వాస్తవాలు


దేశంలో నిమోకోకల్ టీకాల కొరత ఉందంటూ వచ్చిన మీడియా కథనం తప్పు

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 70.18 లక్షల పీసీవీ మోతాదులు అందుబాటులో ఉన్నాయి

కేంద్ర ప్రభుత్వం అందించిన 3.27 కోట్లకు పైగా పీసీవీ మోతాదులను ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో రాష్ట్రాలు/యూటీలు ఉపయోగించాయి

Posted On: 08 OCT 2022 11:18AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా నిమోకోకల్‌ (పీసీవీ) టీకాల కొరత ఉందంటూ ఒక జాతీయ దినపత్రిక ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులను (ఎస్‌ఐవో, మహారాష్ట్ర సహా) ఉటంకిస్తూ, టెండర్‌ వేయడంలో జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా వేల మంది పిల్లలకు వేయాల్సిన టీకాలు ఒక నెల పాటు ఆలస్యం అవుతాయని ఆ కథనంలో పేర్కొంది.

ఆ వార్తా కథనం తప్పు. తప్పుడు సమాచారాన్ని ఆ దినపత్రిక ప్రచురించింది.

2022 అక్టోబర్ 7వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తగినన్ని పీసీవీ టీకాల మోతాదులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 70,18,817 (70.18 లక్షలు) పీసీవీ మోతాదులు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 3,01,794 (3.01 లక్షలు) పీసీవీ మోతాదులు అందుబాటులో ఉన్నాయి.

అంతేకాదు, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హెచ్‌ఎంఐఎస్‌ సమాచారం ప్రకారం, ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో, కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన 3,27,67,028 (3.27 కోట్లు) పీసీవీ మోతాదులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పిల్లలకు అందించారు. ఇందులో, మహారాష్ట్రలోనే 18,80,722 (18.80 లక్షలు) పీసీవీ మోతాదులను ఉపయోగించారు.

2022-23 సంవత్సరం కోసం సేకరించిన పీసీవీ టీకాల సరఫరా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే ప్రారంభమైంది.

చిన్న పిల్లల మరణాలకు ముఖ్యమైన కారణాలలో నిమోనియా లేదా నెమ్ము ఒకటి. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి భారత ప్రభుత్వం చురుకుగా చర్యలు చేపట్టింది.

నిమోకోకల్‌ కంజుగేట్ వ్యాక్సిన్‌ని (PCV) భారత ప్రభుత్వం 2017లో అందుబాటులోకి తెచ్చింది. దేశంలో అత్యంత ప్రభావిత రాష్ట్రాలైన బిహార్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లకు దశలవారీగా అందించింది. ఆ తర్వాత, 'సార్వత్రిక రోగనిరోధకత కార్యక్రమం' (యూఐపీ) కింద దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.

భారతదేశ 'సార్వత్రిక రోగనిరోధకత కార్యక్రమం'లో పీసీవీ అంతర్భాగంగా మారింది. మొత్తం 27.1 మిలియన్ల పిల్లలకు ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ టీకాను మూడు మోతాదులుగా (6 వారాలు, 14 వారాలు, 9-12 నెలల్లో బూస్టర్ డోసు) ఇస్తారు.

 

****



(Release ID: 1866065) Visitor Counter : 147