ప్రధాన మంత్రి కార్యాలయం

కుల్లు దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

Posted On: 05 OCT 2022 4:21PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాష్ట్రం కుల్లూలోని ధ‌ల్పూర్ మైదానంలో కుల్లూ ద‌స‌రా వేడుక‌లలో పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత భగవాన్‌ రఘునాథ్‌ రథయాత్ర ప్రారంభం కాగా, ప్రధాని ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ప్రధానికి స్వాగతం పలకడం కోసం ప్రజలు పెద్దసంఖ్యలో మైదానానికి చేరుకున్నారు. లక్షలాది భక్తుల నడుమ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ప్రధానమంత్రి నేరుగా వెళ్లి భగవాన్‌ రఘునాథ్‌కు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని ముకుళిత హస్తాలతో ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ చారిత్రక కుల్లూ దసరా వేడుకలలో ఇతర దేవతామూర్తులు సహా సాగిన పవిత్ర రథయాత్రను తిలకించారు. భారత ప్రధానమంత్రి కుల్లూ దసరా వేడుకలలో పాల్గొనడం ఇదే తొలిసారి కాగా, ఇదొక చారిత్రక సందర్భంగా నిలిచిపోనుంది.

   అంతర్జాతీయ కుల్లూ దసరా వేడుకలు ధల్పూర్‌ మైదానంలో 2022 అక్టోబరు 5న ప్రారంభమై 11వ తేదీన ముగుస్తాయి. ఈ లోయలో 300 మందికిపైగా దేవతలు కొలువైన నేపథ్యంలో దీన్ని దేవతా సమ్మేళనంతో  కూడిన ప్రత్యేక పండుగగా పరిగణిస్తారు. పండుగ తొలిరోజున దేవతలు అందంగా ముస్తాబుచేసిన పల్లకీలలో ప్రధాన దైవం భగవాన్ రఘునాథ్ ఆలయానికి వేంచేసి, ఆయన దర్శనానంతరం ధల్పూర్ మైదానానికి వెళతారు. ప్రధాన మంత్రితోపాటు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్, కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్‌ ఠాకూర్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ సురేష్ కుమార్ కశ్యప్ తదితరులు కూడా వేడుకలలో పాల్గొన్నారు.

   ప్రధానమంత్రి అంతకుముందు బిలాస్‌పూర్‌లో ‘ఎయిమ్స్‌’ను జాతికి అంకితం చేశారు. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌లోని లుహ్ను, బిలాస్‌పూర్‌లలో అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.



(Release ID: 1865514) Visitor Counter : 149