ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్‌లో 36వ జాతీయ క్రీడలకు ప్రధానమంత్రి శ్రీకారం దేసర్‌లో ప్రపంచ స్థాయి ‘స్వర్ణిమ్‌ గుజరాత్‌ క్రీడా విశ్వవిద్యాలయాన్ని’ ప్రారంభించిన ప్రధానమంత్రి;


“ఇదో అద్భుత.. ఘనమైన ఉత్సవం కాబట్టే దీని శక్తి అసాధారణం”;

“ఆటగాళ్ల విజయాలు.. క్రీడా రంగంలో వారి బలమైన ప్రతిభా ప్రదర్శన ఇతర
రంగాల్లోనూ దేశం సాధించాల్సిన విజయాలకు మార్గం సుగమం చేస్తుంది”;

“మృదువైన క్రీడాశక్తి భారతదేశ కీర్తిప్రతిష్టలను అనేక రెట్లు పెంచుతుంది”;

“ఆసియా సింహం ‘సవాజ్‌’ చిహ్నం భారత యువత
నిర్భయ భాగస్వామ్య మానసిక స్థితిని ప్రస్ఫుటం చేస్తుంది”;

“మౌలిక సౌకర్యాలు నాణ్యమైనవైతే ఆటగాళ్ల మనోబలం కూడా ఇనుమడిస్తుంది”;

“క్రీడల కోసం మేం క్రీడాస్ఫూర్తితో కృషి చేశాం.. ‘టాప్స్‌’ వంటి
పథకాలతో ఏళ్ల తరబడి ఉద్యమ తరహాలో సిద్ధమయ్యాం”;

“సుదృఢ భారతం.. క్రీడా భారతం వంటి పథకాలు ప్రజా ఉద్యమాలయ్యాయి”;

“గత ఎనిమిదేళ్లలో క్రీడలకు కేటాయింపులు దాదాపు 70 శాతం పెరిగాయి”;

“వేల ఏళ్లుగా భారత వారసత్వంలో.. ప్రగతి ప్రయాణంలో క్రీడలూ ఒక భాగమే”

Posted On: 29 SEP 2022 8:42PM by PIB Hyderabad

   హ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా దేసర్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌పంచ స్థాయి “స్వ‌ర్ణిమ్ గుజ‌రాత్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని” కూడా ప్రారంభించారు. అనంతరం దేశం నలుమూలల నుంచి ఈ జాతీయ క్రీడ‌ల్లో పాల్గొంటున్న క్రీడాకారుల‌ను ఉద్దేశించి ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగించారు. జాతీయ క్రీడ‌ల ప్రారంభం సందర్భంగా నెలకొన్న ఉత్కంఠభరిత వాతావ‌ర‌ణం మాట‌ల‌కు అందని అనుభవమని ఆయన అభివర్ణించారు. ఇంతటి మహత్తర క్రీడా వేడుకలోని అనుభూతి, శక్తిని వర్ణించేందుకు మాటలు చాలవన్నారు. దేశంలోని 35000కుపైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల నుంచి 7000 మందికిపైగా అథ్లెట్లు, 15000 మందికిపైగా ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ క్రీడలతో 50 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రత్యక్షంగా సంధానితమై ఉండటంకన్నా అద్భుత, అపూర్వ అనుభూతి మరేముంటుందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

   “ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మైదానంలో... ప్రపంచ స్థాయిలోని నవయువ భారతదేశంలో అతిపెద్ద క్రీడోత్సవమిది! మరి ఇలాంటి అద్భుత, ఘనమైన వేడుకల శక్తి కూడా అంతే అసాధారణంగా ఉంటుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. జాతీయ క్రీడాగీతంలోని ముఖ్యమైన “జుడేగా ఇండియా - జీతేగా ఇండియా” పదాలను ఆయన ఒక నినాదంలా పలుకగా, హాజరైన ప్రతి ఒక్కరూ గళం కలిపే మైదానాన్ని ఉర్రూతలూగించారు. క్రీడాకారుల వదనాల్లో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం భవిష్యత్‌ భారత క్రీడా స్వర్ణయుగానికి నాందిగా అభివర్ణించారు. అతి తక్కువ వ్యవధిలో అత్యంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడంపై గుజరాత్ ప్రజల సామర్థ్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.

   నిన్న అహ్మదాబాద్‌లో నిర్వహించిన భారీ డ్రోన్ ప్రదర్శనను ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. ఇలాంటి దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని, గర్వపడుతున్నారని అన్నారు. “డ్రోన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం గుజరాత్‌ను, భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది” అని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. జాతీయ క్రీడలు-2022 అధికార చిహ్నమైన ఆసియా సింహం ‘సవాజ్‌’ గురించి వ్యాఖ్యానిస్తూ- భారత యువత మానసిక దృఢత్వాన్ని, క్రీడా రంగంలోకి దూకడంలో వారి నిర్భీకతకు ఈ చిహ్నం నిదర్శనమన్నారు. అంతర్జాతీయ యవనికపై ఎదుగుతున్న నవ భారతావనికి ఇది ప్రతీకగా అభివర్ణించారు.

   స్టేడియం విశిష్టత గురించి ప్ర‌ధాని ప్ర‌స్తావిస్తూ- ఇత‌ర క్రీడా ప్రాంగణాలు కొన్ని క్రీడా స‌దుపాయాల‌కే ప‌రిమితమని, స‌ర్దార్ ప‌టేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ మాత్రం ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్ టెన్నిస్ సహా పలు క్రీడలకు సౌకర్యాలు కల్పించబడ్డాయని ఆయన అన్నారు. “ఒకవిధంగా ఇది దేశం మొత్తానికీ ఆదర్శప్రాయం. ఇంతటి నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉన్నపుడు క్రీడాకారుల మనోబలం కూడా ఇనుమడిస్తుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నవరాత్రి వేడుకలలో ఆనందాన్ని ఆస్వాదించాలని జాతీయ క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారులకు సూచించారు. దుర్గామాత ఆరాధనకు మించి గర్బా వంటి నృత్యకళా రీతులు ఈ ఉత్సవాల్లో అందర్నీ అలరిస్తాయన్నారు. “ఈ కళకు తనదైన గుర్తింపుంది” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

   జాతి జీవనంలో క్రీడల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. “మైదానంలో ఆటగాళ్ల విజయాలు.. క్రీడా రంగంలో వారి బలమైన ప్రతిభా ప్రదర్శన ఇతర రంగాల్లోనూ దేశం సాధించాల్సిన విజయాలకు మార్గం సుగమం చేస్తాయి. మృదువైన క్రీడాశక్తి భారతదేశ కీర్తిప్రతిష్టలను అనేక రెట్లు పెంచుతుంది” అన్నారు. అలాగే “క్రీడలకు సంబంధించి నేనెప్పుడూ  నా మిత్రులకు నేనిలా చెబుతుంటాను- కార్యాచరణతోనే విజయానికి పునాది పడుతుంది! అంటే- మీరు నాంది పలికిన క్షణమే విజయం కూడా మీతోపాటు అడుగు కలుపుతుంది. ముందడుగు వేయడంలో స్ఫూర్తిని మీరు వీడనంత కాలం విజయం మీ వెన్నంటే ఉంటుంది.”

   క్రీడా రంగంలో సాధించిన ప్రగతిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఎనిమిదేళ్ల కిందట భారత క్రీడాకారులు పాల్గొనే అంతర్జాతీయ క్రీడా పోటీల సంఖ్య వందకన్నా తక్కువగానే ఉండేదని గుర్తుచేశారు. అయితే, భారత ఆటగాళ్లు పాల్గొనే అంతర్జాతీయ క్రీడా పోటీల సంఖ్య నేడు 300కుపైగా పెరిగిందని తెలిపారు. ఈ మేరకు “ఎనిమిదేళ్ల కిందట భారత ఆటగాళ్లు కేవలం 20-25 రకాల క్రీడల్లో మాత్రమే పోటీపడేవారు. ఇప్పుడు మన దేశ క్రీడాకారులు దాదాపు 40 రకాల క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్నారు. ఇవాళ పతకాల సంఖ్యతోపాటు భారత కీర్తిప్రతిష్టలు కూడా దశదిశలా ప్రకాశిస్తున్నాయి” అని ప్రధాని తెలిపారు.

   రోనా సమయంలోనూ క్రీడాకారుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూశామని ప్రధానమంత్రి అన్నారు. “క్రీడల కోసం మేం క్రీడాస్ఫూర్తితో కృషి చేశాం... ‘టాప్స్‌’ వంటి పథకాలతో ఏళ్ల తరబడి ఉద్యమ తరహాలో సిద్ధమయ్యాం. ప్రముఖ క్రీడాకారుల విజయాల నుంచి భవిష్యత్‌ క్రీడాకారుల సృష్టిలో ‘టాప్స్‌’ కీలకపాత్ర పోషిస్తోంది” అని వివరించారు. ఒలింపిక్‌ క్రీడలకు సంబంధించి భారతదేశం 2021లో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌-2020లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిందని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా ఈ ఏడాది థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో విజయం సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. అలాగే వివిధ అంతర్జాతీయ పోటీల్లో దివ్యాంగ క్రీడాకారుల విజయాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ క్రీడా పునరుజ్జీవనంలో పురుష, మహిళా క్రీడాకారులు సమాన సంఖ్యలో బలమైన ప్రాతినిధ్యం వహించడంపై హర్షం వెలిబుచ్చారు.

   విజయాలు గతంలో అసాధ్యమైనవి కాకపోయినా క్రీడా నైపుణ్యానికి బదులు దేశంలో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలినందున సత్ఫలితాలు సాధ్యం కాలేదని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో “మేం ప్రక్షాళన చేపట్టి, యువతరం కలలుగనేలా వారిలో ఆత్మవిశ్వాసం నింపాం” అని ఆయన చెప్పారు. నేటి నవభారతం కేవ‌లం విధాన నిర్ణ‌యాలను మాత్రమే నమ్ముకోలేదని ప్రధాని గుర్తుచేస్తూ- దేశంలోని యువతరంతో క‌లిసి ముందడుగు వేశామని తెలిపారు. సుదృఢ భారతం, క్రీడా భారతం వంటి పథకాలు ప్రజా ఉద్యమాలై ఇందుకు ప్రతీకగా నిలిచాయని ప్ర‌ధానమంత్రి నొక్కిచెప్పారు. అంతేకాకుండా గత ఎనిమిదేళ్లలో క్రీడలకు బడ్జెట్ కేటాయింపు దాదాపు 70 శాతం పెరిగినట్లు ప్రధాని పేర్కొన్నారు. దీంతో ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు తోడ్పడే అదనపు వనరులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దేశంలో క్రీడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాకుండా ప్రతి మూలనా అత్యాధునిక క్రీడా మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రధాని వ్యాఖ్యానించారు. మరోవైపు రిటైర్డ్‌ ఆటగాళ్ల జీవిత సౌలభ్యానికీ కృషి చేస్తున్నామని శ్రీ మోదీ తెలిపారు. ఇందులో భాగంగా వారి అనుభవాలను నవతరం వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నామన్నారు.

   భారతదేశ నాగరికత, సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ- వేల ఏళ్లుగా భారత వారసత్వం, ప్రగతి ప్రయాణంలో క్రీడలు కూడా ఒక భాగంగా ఉంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. “స్వాతంత్ర్య అమృత కాలంలో దేశం తన వారసత్వంపై సగర్వంగా ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తోంది” అన్నారు. దేశంలో పెల్లుబికే ఉత్సాహం, కృషి కేవలం ఒక క్రీడకే పరిమితం కాలేదని ఆయన గుర్తుచేశారు. ‘కలరిపయట్టు’, యోగాసనాల వంటి భారతీయ క్రీడలు కూడా అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు “జాతీయ క్రీడల వంటి భారీ పోటీలలో ఈ క్రీడలకు స్థానం లభించడం నాకెంతో సంతోషంగా ఉంది” అన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులనుద్దేశించి-  “నేను ఒక విషయం ప్రత్యేకంగా ప్రస్తావించదలిచాను. మీరు ఒకవైపు వేల ఏళ్లనాటి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో క్రీడా ప్రపంచ భవిష్యత్తుకు నాయకత్వం వహిస్తున్నారు. భవిష్యత్తులో ఈ క్రీడలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినప్పుడు వీటి చరిత్రలో మీరు దిగ్గజాలుగా నిలిపోతారు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   చివరగా- నేరుగా ఆటగాళ్లతో ముచ్చటిస్తూ వారికి ఒక తారకమంత్రం ఉపదేశించారు. ఈ మేరకు “మీరు పోటీలో గెలవాలంటే ‘నిబద్ధత, నిరంతరత’లను మీ శైలిగా మలచుకోవాలి” అని ఉద్బోధించారు. క్రీడా స్ఫూర్తి గురించి ప్ర‌స్తావిస్తూ- క్రీడ‌ల్లో గెలుపోటములను ఎప్పటికీ అంతిమ ప‌రిణామాలుగా పరిగణించరాదని సూచించారు. క్రీడా స్ఫూర్తి మీ జీవితంలో భాగమైతే భారత్‌ వంటి యువ దేశం కలలు సాకారం కాగలవని శ్రీ మోదీ అన్నారు. “ఎక్కడ ఉద్యమం ఉంటుందో అక్కడ పురోగతి కూడా ఉంటుందని మీరు మరువరాదు” అన్నారు. అలాగే “మీరు మైదానం వెలుపల కూడా ఇదే వేగాన్ని కొనసాగించాలి... ఈ వేగం మీ జీవిత లక్ష్యంగా ఉండాలి.. జాతీయ క్రీడ‌ల్లో మీ గెలుపు దేశం సంబరాలు చేసుకునే అవ‌కాశాన్ని ఇస్తుంద‌ని, దాంతోపాటు భ‌విష్య‌త్తుపై కొత్త విశ్వాసాన్ని నింపుతుంద‌ని నేను కచ్చితంగా విశ్వసిస్తున్నాను” అంటూ ప్ర‌ధానమంత్రి తన ఉపన్యాసం ముగించారు.

   ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, పార్లమెంటు సభ్యుడు శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ హర్ష సంఘవి, అహ్మదాబాద్ మేయర్ శ్రీ కిరీట్ పర్మార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

   గుజరాత్‌ రాష్ట్ర తొలిసారిగా జాతీయ క్రీడోత్సవం నిర్వహిస్తోంది. ఈ క్రీడలు 2022 సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్ 12 వరకూ కొనసాగుతాయి. దేశం నలుమూలల నుంచి మొత్తం 36 క్రీడా విభాగాల్లో దాదాపు 15,000 మంది క్రీడాకారులు, శిక్షకులు, అధికారులు పాల్గొంటారు. దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద జాతీయ క్రీడోత్సవం ఇదే. ఈ మేరకు ఆరు నగరాలు... అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్‌లలో క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో బలమైన క్రీడా మౌలిక సదుపాయాల కల్పన పయనం ప్రారంభించిన గుజరాత్‌ అత్యంత తక్కువ వ్యవధిలో క్రీడల నిర్వహణకు సిద్ధం కాగలిగింది.

*****

DS/TS

 


(Release ID: 1863575) Visitor Counter : 232