పర్యటక మంత్రిత్వ శాఖ

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో రాష్ట్ర పర్యాటక శాఖల మంత్రుల రెండవ రోజు కార్యక్రమాలను ప్రారంభించిన శ్రీ జై రామ్ ఠాకూర్, శ్రీ జి.కిషన్ రెడ్డి


హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా తెలియని ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం "నై రాహెన్ నై మంజిలీన్"పథకాన్ని ప్రారంభించింది.. శ్రీ జై రామ్ ఠాకూర్

ప్రజల భాగస్వామ్యంతో మొత్తం ప్రభుత్వ విధానం దేశంలో పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుంది.. శ్రీ జి.కిషన్ రెడ్డి
ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి తరహాలో అన్ని స్థాయిల్లో యువ పర్యాటక క్లబ్బుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరగాలి.. శ్రీ కిషన్ రెడ్డి

Posted On: 19 SEP 2022 2:02PM by PIB Hyderabad

రాష్ట్ర పర్యాటక శాఖల మంత్రుల జాతీయ సదస్సు రెండో రోజున హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో కొనసాగింది. రెండో రోజున సదస్సుకు హాజరైన 12 రాష్ట్రాలకు చెందిన పర్యాటక శాఖ మంత్రులను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ.జి.కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్ సన్మానించారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, హర్యానా, మిజోరాం, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ సహా 12 రాష్ట్రాల పర్యాటక మంత్రులు పాల్గొన్నారు. 

మూడు రోజుల పాటు జరగనున్న సదస్సును శ్రీ కిషన్ రెడ్డి నిన్నహిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ కిషన్ రెడ్డి పర్యాటక రంగం కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకుంటున్నదని అన్నారు. పర్యాటక గమ్యస్థానంగా గుర్తింపు పొందిన భారతదేశం పర్యాటకులకు అనేక ఉత్పత్తులు, అనుభవాలు అందిస్తుందని అన్నారు. ప్రపంచంలో అతి పురాతన నాగరికతల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశ నాగరికత,వారసత్వం అనేక పండుగలు, మతాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలను ప్రభావితం చేసిందని తెలిపారు. అంతర్జాతీయ పర్యటకులకు భారతదేశం కేవలం ఒక సందర్శనీయ ప్రాంతంగా మాత్రమే కాకుండా జీవిత అనుభవం పొంది, జీవన విధానంలో మార్పు తీసుకొచ్చే ఒక గమ్యస్థానంగా ఉంటుందని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. 

పరిపాలనలో రెండు అంశాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. ఎవరికి వారు విడివిడిగా అన్న విధానంలో కాకుండా మొత్తం ప్రభుత్వం అన్న విధానంతో పరిపాలన సాగాలని ప్రధానమంత్రి ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం టీం ఇండియా గా పనిచేయాలని ప్రధానమంత్రి కోరుకుంటున్నారని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్న సదస్సు వివిధ అంశాలను చర్చించి, పర్యాటక రంగం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు వేదికగా ఉపకరిస్తుందన్న ఆశాభావాన్ని శ్రీ కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి ఫలాలు క్షేత్ర స్థాయికి చేరేలా చూసేందుకు స్థానిక ప్రజలు, సమాజం సహకారం తీసుకోవాలని మంత్రి అన్నారు. మొత్తం ప్రభుత్వం విధానం, ప్రజలు భాగస్వామ్యంతో పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చునని అన్నారు. 

ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి తరహాలో అన్ని స్థాయిల్లో యువ పర్యాటక క్లబ్బుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులకు శ్రీ కిషన్ రెడ్డి సూచించారు. దేఖో అప్నా దేశ్ కార్యక్రమం పై యువతకు అవగాహన కల్పించి సాధ్యమైనంత త్వరగా యువ పర్యాటక క్లబ్బులను ఏర్పాటు చేయాలని కోరారు. పర్యాటక రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయం అవసరమని శ్రీ కెసిహన్ రెడ్డి పేర్కొన్నారు. 

దేశం అన్ని ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు హిమాచల్ ప్రదేశ్ లో సమావేశం కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ సదస్సును నిర్వహించేందుకు హిమాచల్ ప్రదేశ్ కు అవకాశం లభించిందని అన్నారు. సదస్సు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక శాఖను అభినందించిన శ్రీ ఠాకూర్ రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాలకు ప్రచారం లభిస్తుందని అన్నారు. 

కోవిడ్ మహమ్మారి ప్రభావం దేశ పర్యాటక రంగంతో పాటు హిమాచల్ ప్రదేశ్ పర్యాటక రంగం కూడా తీవ్రంగా పడిందని శ్రీ ఠాకూర్ అన్నారు. మహమ్మారి ప్రభావం నుంచి తేరుకుంటున్న పర్యాటక రంగం అభివృద్ధి సాదిస్తున్నదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో అంతగా గుర్తింపుకు నోచుకోని పర్యాటక గమ్య స్థానాలకు ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం "నై రాహెం నయీ మాంజిలీన్" పథకాన్ని ప్రారంభించిందని వివరించారు. వారాంతంలో మాత్రమే కాకుండా ఎక్కువ కాలం పర్యాటకులు బస చేయడానికి కూడా రాష్ట్రం అనేక కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. 

 పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ మరియు స్వదేశ్ దర్శన్ పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని కేంద్ర పర్యాటక, ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. గుర్తించబడిన పుణ్య క్షేత్రాలు, వారసత్వ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం 2014-15 సంవత్సరంలో ప్రసాద్ పథకాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది, చిట్టచివర ఉన్న ప్రాంతాలకు రవాణా సౌకర్యం అందించడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతున్నది. భారతదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ పర్యాటక విధానం ముసాయిదాను సిద్ధం చేసిందని మంత్రి చెప్పారు.

పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు నిగూఢ సాంస్కృతిక, ప్రకృతి అంశాలను మరింత ప్రచారం చేయాలని కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ సూచించారు. దేఖో అప్నా దేశ్ కార్యక్రమంతో కోవిడ్-19 రూపంలో ఎదురైన అడ్డంకులను అధిగమించామని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వం, సూచనలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయమైన భారతదేశాన్ని ప్రపంచ పర్యాటకుల్లో కేవలం 2% పర్యాటకులు మాత్రమే సందర్శిస్తున్నారని మంత్రి తెలిపారు. మరింత అభివృద్ధి సాధించేందుకు ఇది ఒక అవకాశంగా ఉంటుందని శ్రీ భట్ పేర్కొన్నారు. 

లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చునని ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ సంబిత్ పాత్ర అన్నారు. భారతదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, వాటి ప్రాధాన్యతపై సరైన ప్రచారంతో పర్యాటకులను మానసికంగా భారతదేశంలో పర్యటించేందుకు సిద్ధం, చేయాలని అన్నారు.భారతదేశం ఘనమైన వారసత్వ సంపద, వైవిధ్యమైన సంస్కృతిని కలిగి ఉందని అన్నారు. 'కంకర్ కంకర్ మే హై శంకర్' నినాదాన్ని పర్యాటకులను ఆకర్షించేందుకు ఉపయోగించాలని సూచించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో స్వదేశ్ దర్శన్ పథకం కింద రామాయణ్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, హిమాలయ సర్క్యూట్ మొదలైన వాటితో పర్యాటక రంగంలో భారతదేశం పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లలో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిందని పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ తెలిపారు రెండేళ్ల విరామం తర్వాత మొదటిసారి భౌతికంగా ఇక్కడ జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చలు జరిగాయని అన్నారు. పర్యాటక రంగం పునరుద్ధరణకు సదస్సు ఒక సంకేతమని అన్నారు. . G-20 ప్రెసిడెన్సీ భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.పర్యాటక రంగం పునరుద్ధరణ భారతదేశంలో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని శ్రీ అరవింద్ సింగ్ అన్నారు. 

ఫెయిత్ ఛైర్మన్ శ్రీ నకుల్ ఆనంద్ మాట్లాడుతూ ఎక్కువ మందికి జీవనోపాధిని అందించాలన్న ఉమ్మడి లక్ష్యంతో పని చేయాలని అన్నారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతదేశం ప్రపంచ పర్యాటక రంగంలో తక్కువ వాటా కలిగి ఉందని అన్నారు.కోవిడ్-19 పర్యాటక రంగంలో అత్యంత దారుణమైన సంక్షోభం కలిగించిందని అన్నారు. ఈ సంవత్సరం పరిస్థితి కుదుటపడుతుందని అన్నారు. మహమ్మారి ప్రభావం నుంచి తేరుకుంటున్న భారతదేశాన్ని రాబోయే సంవత్సరంలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే అవకాశం ఉందని శ్రీ నకుల్ ఆనంద్ తెలిపారు. పురాతన సంస్కృతిని మేళవించి ప్రస్తుత పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పర్యాటక అభివృద్ధి చెందిందని పేర్కొన్న శ్రీ ఆనంద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు అమలు జరగాలని అన్నారు.   

 

పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటకం, హిమాలయ రాష్ట్రాల్లో పర్యాటకం, బాధ్యతాయుతమైన మరియు స్థిరమైన పర్యాటకం, పర్యాటక గమ్యస్థానాల మార్కెటింగ్ మరియు ప్రచారం కోసం డిజిటల్ సాంకేతికత పాత్ర, హోమ్‌స్టేల ప్రాముఖ్యత, భారతీయ ఆతిథ్య రంగం, ఆయుర్వేదం, మరియు వైద్య విలువ ప్రయాణం, అటవీ మరియు వన్యప్రాణుల పర్యాటకం అనే అంశాలపై సదస్సులో విడివిడిగా చర్చలు జరిగాయి. 

 

 

***



(Release ID: 1860645) Visitor Counter : 160