ఆయుష్
ఆయుర్వేద దినోత్సవం-2022లో భాగంగా ఆయుర్వేదంపై
6 వారాల కార్యక్రమానికి అఖిలభారత ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్ శ్రీకారం
Posted On:
12 SEP 2022 6:25PM by PIB Hyderabad
ఆయుర్వేద దినోత్సవం-2022 నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని అఖిలభారత ఆయుర్వేద వైద్య సంస్థ (ఏఐఐఏ) ఇవాళ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్దేశం మేరకు ఆయుర్వేద దినోత్సవం నిర్వహణ కోసం ‘ఏఐఐఏ’ మార్గదర్శక సంస్థగా ఎంపికైంది. ఈసారి ‘ప్రతి ఇంటా.. ప్రతి రోజూ ఆయుర్వేదం’ ఇతివృత్తంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆయుర్వేద దినోత్సవాలకు నాందిగా 6 వారాల కార్యక్రమానికి ‘ఏఐఐఏ’ శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శరబానంద సోనావాల్, సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ కాలూభాయ్, ఆ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా, ప్రత్యేక కార్యదర్శి శ్రీ పి.కె.పాథక్, ‘ఎన్‌సీఎస్‌ఐఎం’ చైర్మన్ వైద్య జయంత్ దేవ్‌పూజారి తదితరులు వర్చువల్ మాధ్యమం ద్వారా హాజరయ్యారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి నాడు ఆయుర్వేద దినోత్సవం నిర్వహిస్తుండగా ఈసారి ఇది అక్టోబర్ 23న వస్తుంది. కాగా, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సంయుక్తం ఆయుష్ మంత్రిత్వ శాఖ వేడుకలు నిర్వహిస్తుంది. తద్వారా దేశంలోని ప్రతి వ్యక్తికీ సంప్రదాయ వైద్య విధానంపై అవగాహన కల్పించబడుడుతుంది.
ఈ సందర్భంగా శ్రీ సోనావాల్ మాట్లాడుతూ- “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక దృక్పథాన్ని ముందు తీసుకెళ్లడంలో ఈ ఆరువారాల కార్యక్రమం ఒక గొప్ప ప్రయత్నం. దేశంలోని ప్రతి పౌరుడికీ మనం చేరువ కాగలిగితేనే ఈ కార్యక్రమం విజయవంతం కాగలదు. కాబట్టి రాబోయే వారాల్లో ఆయుర్వేద సందేశం నలుమూలలకూ చేరేవిధంగా ప్రజలతో మమేకమై వారిని చైతన్యపరచడానికి మనం అన్ని స్థాయులలోనూ శాయశక్తులా కృషి చేద్దాం. ఈ మేరకు ‘సంపూర్ణ ఆరోగ్యానికి ఆయుర్వేదం’పై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ‘ప్రతి ఇంటా.. ప్రతి రోజూ ఆయుర్వేదం’ నినాదం నొక్కి చెబుతోంది. మన దేశం ఆరోగ్యంగా-శక్తిమంతంగా రూపొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది” అన్నారు.
డాక్టర్ మహేంద్రభాయ్ తన అభిప్రాయం వెల్లడిస్తూ- “ఇతర దేశాల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటిటీ ఆయుర్వేదాన్ని చేరువ చేయడం ద్వారా ‘ఆరోగ్యకర భారతదేశం నుంచి ఆరోగ్యకర ప్రపంచందాకా..’ అనే దృక్పథాన్ని సాకారం చేయడం లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం” అని వివరించారు. ఆరువారాల కార్యక్రమం, ఇందులోని కీలకాంశాల గురించి ‘ఏఐఐ’ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నేసరి వివరించారు. ఈ మేరకు మూడు ‘జె’లు... “జన సందేశం.. జన భాగస్వామ్యం, జన ఉద్యమం” లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు ఇందులో పాలుపంచుకుంటాయని వెల్లడించారు.
***
(Release ID: 1858838)
Visitor Counter : 197