మంత్రిమండలి

‘పి.ఎం.శ్రీ స్కూల్స్‌’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం!


జాతీయ విద్యావిధాన అంశాలను పొందుపరిచేందుకు
దేశంలోని14,500పైగా పాఠశాలలు
పి.ఎం.శ్రీ స్కూళ్లుగా అభివృద్ధి..

మౌలిక సదుపాయాల నవీకరణ,
వినూత్న బోధన, సాంకేతిక పరిజ్ఞానంతో
ఆదర్శ పాఠశాలలుగా మారనున్న పి.ఎం.శ్రీ స్కూళ్లు..


21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలతో సంపూర్ణ,
సుసంపన్న వ్యక్తులను సృష్టించనున్న స్కూళ్లు..


సమీప పరిధిలోని ఇతర స్కూళ్లకు
పి.ఎం.శ్రీ స్కూళ్ల మార్గదర్శనం, సారథ్యం..

మొత్తం రూ. 27,360కోట్ల ప్రాజెక్టు వ్యయంతో
పి.ఎం. శ్రీ స్కూళ్ల పథకం అమలు
2022-23నుంచి 2026వరకూ పనుల నిర్వహణ

Posted On: 07 SEP 2022 3:54PM by PIB Hyderabad

  దేశంలోని పాఠశాలలను వినూత్నంగా అభివృద్ధిచేసే లక్ష్యతో రూపొందించిన కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. పి.ఎం.శ్రీ స్కూల్స్ (PM SHRI స్కూల్స్- PM ScHools for Rising India) పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం/వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థల అజమాయిషీలోని పాఠశాలల్లో,  ఎంపిక చేసిన పాఠశాలలను మరింత బలోపేతం చేయడం ద్వారా 14,500పైగా పాఠశాలలను PM SHRI పాఠశాలలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ కొత్త పథకానికి రూపకల్పన చేశారు. జాతీయ విద్యా విధానం 2020లోని అన్ని ప్రధాన అంశాలనూ ఈ స్కూళ్లలో పొందుపరుస్తారు. ఇవి ఆదర్శ పాఠశాలలుగా పనిచేస్తాయి. తమకు సమీపంలోని ఇతర పాఠశాలలకు మార్గదర్శకత్వాన్ని, నాయకత్వాన్ని కూడా ఇవి అందిస్తాయి. విద్యార్థుల విజ్ఞాన వికాసానికి నాణ్యమైన బోధనను ఈ స్కూళ్లు అందజేస్తాయి.  21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలతో కూడిన సంపూర్ణ వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి, వారిని పూర్తిగా అభ్యున్నతి చెందించడానికి ఈ స్కూళ్ల ద్వారా చిత్తశుద్ధితో కృషి జరుగుతుంది.

     రూ. 27,360కోట్ల మొత్తం ప్రాజెక్ట్ వ్యయంతో కేంద్ర ప్రాయోజిత పథకంగా PM SHRI పాఠశాలల పథకం అమలవుతుంది. ఇందులో ఐదేళ్ల కాలానికి కేంద్రప్రభుత్వ వాటా రూ. 18128 కోట్లు. ఈ మొత్తాన్ని  2022-23 నుండి 2026-27 వరకు ఐదేళ్ల కాలానికి కేటాయించారు.

కీలకమైన అంశాలు

• బాలల విభిన్నమైన నేపథ్యం, ​​బహుభాషా అవసరాలు, చదువులో విభిన్నమైన సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇస్తూ,  సమానమైన, సమ్మిళిత, ఆనందమయ స్కూలు వాతావరణంలో ఉన్నతమైన-నాణ్యత గల విద్యను పి.ఎం. శ్రీ పథకం అందిస్తుంది. 2020వ సంవత్సరపు నూతన విద్యావిధానం ఆలోచనా విధానాన్ని అనుసరిస్తూ వారి దృష్టికి అనుగుణంగా, సొంత అభ్యాస ప్రక్రియలో వారు చురుకుగా పాల్గొనేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది.

PM SHRI పాఠశాలలు తమతమ ప్రాంతం పరిధిలో,  మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఇతర పాఠశాలలకు నాయకత్వాన్ని వహిస్తాయి.

• సౌర ఫలకాలు, ఎల్.ఇ.డి. విద్యుద్దీపాలు, సహజ వ్యవసాయం పోషకాహార తోటలు, వ్యర్థాల సక్రమ నిర్వహణ, ప్లాస్టిక్ రహిత, నీటి సంరక్షణ, సాగు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సంప్రదాయాలు/ఆచారాల అధ్యయనం,  పర్యావరణ అనుకూలమైన ఇతర అంశాలను కలుపుకొని హరిత పాఠశాలలుగా PM SHRI పాఠశాలలను తీర్చిదిద్దారు. వాతావరణ మార్పులకు సంబంధించిన హ్యాకథాన్, స్థిరమైన జీవనశైలిని అవలంబించడం తదితర అంశాలపై ఈ స్కూళ్లద్వారా అవగాహన కల్పిస్తారు.

• ఈ పాఠశాలల్లో అవలంబించే బోధనా పద్ధతులు మరింత ప్రయోగాత్మకంగా, అనుభవ ప్రాతిపదికగా, సంపూర్ణంగా, సమగ్రంగా, ఆట/బొమ్మల ఆధారితంగా ఉంటాయి. (ముఖ్యంగా, ప్రారంభ సంవత్సరాల్లో ఈ పద్ధతులు అమలులో ఉంటాయి.) విచారణ-ఆధారితంగా, ఆవిష్కరణ-ఆధారితంగా, అభ్యాసకులపై దృష్టిని కేంద్రీకరించేలా, చర్చ-ఆధారితంగా, సౌకర్యవంతంగా, ఆనందదాయకంగా బోధనా పద్ధతి ఉంటుంది.

• ప్రతి తరగతిలోని పిల్లల్లో ప్రతి ఒక్కరూ ఏమి నేర్చుకున్నారన్న అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు.  అన్ని స్థాయిలలో విషయాల అవగాహనపై, వాస్తవ జీవిత పరిస్థితుల్లో తమ పరిజ్ఞాన వినియోగం ఆధారంగా పిల్లల సామర్థ్యాన్ని మధింపు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా పోటీతత్వం ప్రాతిపదికగా జరుగుతుంది.

• ప్రతి పాఠ్యాంశానికి లభ్యత, సమర్ధత, సముచితత్వం, వినియోగం, పనితీరు సూచికల పరంగా అందుబాటులో ఉన్న వనరులను, వనరుల ప్రభావాన్ని అంచనా వేస్తారు.  ఒక క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ఖాళీలను భర్తీ చేస్తారు.

• ఉపాధిని పెంపొందించడానికి, మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడానికి స్థానిక పరిశ్రమలతో రంగాలవారీగా నైపుణ్య మండలులను అనుసంధానం చేసే విషయమై అన్వేషణ జరుపుతారు. 

• ఈ పథకంకింద పాఠశాల నాణ్యతా మధింపు వ్యవస్థ (ఎస్.క్యు.ఎ.ఎఫ్.)ను అభివృద్ధి చేస్తారు.   ఫలితాలను అంచనా వేయడానికి అవసరమైన కీలకమైన పనితీరు సూచికలను ఈ పథకం సూచిస్తుంది.  కావలసిన ప్రమాణాలను నిర్ధారించడానికి ఈ పాఠశాలల నాణ్యతా మూల్యాంకనాన్ని ఈ పథకం కింద ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా చేపడతారు.

 

పి.ఎం.శ్రీ స్కూళ్ల పథకం వివరణాత్మక అంశాల:

. నాణ్యత, ఆవిష్కరణ (అధ్యయన ప్రక్రియను మెరుగుపరిచే కార్యక్రమం, సంపూర్ణ ప్రగతి నివేదిక - ప్రోగ్రెస్ కార్డు-, సృజనాత్మక బోధనా పద్ధతులు, స్కూలు బ్యాగు బాదరబందీ లేని రోజులు, స్థానిక కళాకారులతో ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు, సామర్థ్యాల నిర్మాణం మొదలైనవి)

బి. విద్యాహక్కు చట్టం కింద లబ్ధిదారుల ఆధారిత అర్హతలు. PM SHRI పాఠశాలల్లోని 100శాతం మంది విద్యార్థులు,.. సైన్స్, గణితశాస్త్ర అధ్యయన కిట్‌లను అందుకుంటారు.

సి. వార్షిక పాఠశాల గ్రాంట్లు (కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లు, గ్రంథాలయ గ్రాంట్, క్రీడల గ్రాంట్)

డి. బాల వాటిక, ఫౌండేషన్ అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రంతో సహా బాల్యంలో అందించే సంరక్షణ, విద్యాబోధన.

ఇ. బాలికలకోసం, ప్రత్యేక అవసరాల బాలల కోసం సురక్షితమైన, తగిన మౌలిక సదుపాయాల సదుపాయంతో సహా ఈక్విటీ మరియు చేరిక.

ఎఫ్. విద్యార్థులకు అందించే సబ్జెక్టుల విషయంలో ఎంపిక అవకాశాన్ని ప్రోత్సహించడం.

జి. భాషా అవరోధాలను అధిగమించడానికి సాంకేతిక చర్యలను ఉపయోగించడం. తద్వారా బోధనా మాధ్యమాలుగా మాతృభాషను/స్థానిక భాషలను ప్రోత్సహించడం.

హెచ్. డిజిటల్ బోధనా శాస్త్రాన్ని ఉపయోగించడం కోసం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని (ఐ.సి.టి.ని), స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ లైబ్రరీలను ప్రోత్సహించడం. PM SHRI పథకం అమలులో ఉండే పాఠశాలల్లో 100శాతం ఐ.సి.టి., స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు వంటి వాటిని డిజిటల్ కార్యక్రమాల కింద వర్తింపజేస్తారు.

. ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం

 జె. వృత్తిపరమైన ప్రమేయం,..ముఖ్యంగా స్థానిక పరిశ్రమలతో ఇంటర్న్‌షిప్/వ్యవస్థాపక అవకాశాలను మెరుగుపరచడం.  నైపుణ్యాలు, అభివృద్ధి ప్రాజెక్టులతో, సమీప పరిశ్రమల ప్రమేయంతో ప్రణాళికలు సిద్ధం చేయడం. కోర్సులు/పాఠ్యాంశాలను అందుకు అనుగుణంగానే అభివృద్ధి చేయడం.

 కె. ఈ పాఠశాలలను అన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు పూర్తి సంతృప్త విధానాన్ని అవలంబిస్తారు. అన్ని పాఠశాలలకు సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీ, ఐ.సి.టి. సౌకర్యం, వొషనల్ ల్యాబ్‌లు తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.

ఎఎక్స్. హరిత పాఠశాల(గ్రీన్ స్కూల్) కార్యక్రమాలు

  ఇప్పటికే ఉన్న పథకాలు/పంచాయతీ రాజ్ సంస్థలు/పట్టణ స్థానిక సంస్థలు, పాఠశాల వ్యవస్థాపన మరియు సౌకర్యాల కల్పన కోసం ఈ పథకం సామాజిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది.

అమలుకోసం వ్యూహం

   (ఎ.) సమగ్ర విద్య, కేంద్రీయ విద్యాలయ సంస్థలు, నవోదయ విద్యాసంస్థల కోసం అందుబాటులోని ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ ద్వారా PM SHRI పాఠశాలలను అమలులోకి తెస్తారు.  అవసరానికి అనుగుణంగా నిర్దిష్ట ప్రాజెక్ట్ ప్రాతిపదికగా ఇతర స్వయంప్రతిపత్తి సంస్థలు పాల్గొంటాయి.

  (బి.) పురోగతిని అంచనా వేయడానికి, జాతీయ విద్యా విధానం అమలులో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి సంబంధించి ఈ పాఠశాలలపై తీవ్ర స్థాయిలో పర్యవేక్షణ జరుగుతుంది.  

 ఎంపిక విధానం:

     PM SHRI పాఠశాలల ఎంపిక ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుంది.  ఆదర్శవంతమైన పాఠశాలలుగా మారడానికి మద్దతు కోసం ఇందులోని పాఠశాలలు పోటీపడతాయి. ఇందుకోసం పాఠశాలలు ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పథకం యొక్క మొదటి రెండు సంవత్సరాలలో ప్రతి త్రైమాసికానికి ఒకసారి, సంవత్సరానికి నాలుగు సార్లు పోర్టల్ తెరిచి ఉంటుంది.

 

   కేంద్రం/రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు, స్థానిక సంస్థల పరిధిలో పనిచేసే -  ఎలిమెంటరీ పాఠశాలలు (1-5/1-8 తరగతులు), సెకండరీ/ సీనియర్ సెకండరీ పాఠశాలలు (1-10/1-12/6-10/6-12 తరగతులు) అది కూడా, ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (UDISE+) కోడ్‌ను కలిగి ఉన్న పాఠశాలలను ఎంపిక కోసం పరిగణిస్తారు. ఖచ్చితమైన కాలవ్యవధిని అనుసరిస్తూ, మూడు-దశల ప్రక్రియ ద్వారా ఎంపికను నిర్వహిస్తారు. ఎంపిక ప్రక్రియ ఈ కింది విధంగా ఉంటుంది: -

 

  ఎ. 1వ దశ: పి.ఎం.శ్రీ (PM SHRI) పాఠశాలలుగా నాణ్యతాపరమైన హామీని సాధించడం కోసం ఈ పాఠశాలలకు మద్దతు ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉన్న నేపథ్యంలో జాతీయ విద్యా విధానాన్ని సంపూర్ణ స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తాయి.

 

   బి. 2వ దశ: UDISE+ డేటా ద్వారా నిర్దేశించిన కనీస ప్రమాణం ఆధారంగా  పి.ఎం.శ్రీ (PM SHRI) పాఠశాలలుగా ఎంపిక చేయడానికి అర్హత కలిగిన పాఠశాలల సమూహాన్ని ఈ  దశలో గుర్తిస్తారు.  

 

  సి. 3వ దశ: నిర్దిష్ట ప్రమాణాలను నెరవేర్చడానికి ఉద్దేశించిన ఈ దశ సవాలు పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. అర్హత కలిగిన పాఠశాలల సమూహానికి చెందిన స్కూళ్లు మాత్రమే తాము సవాలుచేసిన షరతులను నెరవేర్చడానికి పోటీపడతాయి. అవి సవాలు షరతులను నెరవేర్చాయా లేదా అన్న అంశాన్ని ఆయా రాష్ట్రాలు/కేంద్రీయ విద్యాలయ సంస్థలు/జవహర్ లాల్ నవోదయ విద్యా సంస్థలు ధ్రువీకరిస్తాయి.

   ఆయా పాఠశాలలు తమ తరఫున సమర్పించిన క్లెయిమ్‌లను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు/కేంద్రీయ విద్యాలయ సంస్థలు/జవహర్ లాల్ నవోదయ విద్యాసంస్థలు ధ్రువీకరిస్తాయి.  మరియు పాఠశాలల జాబితాను మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తాయి.

  భారతదేశం అంతటా ఉన్న మొత్తం పాఠశాలల గరిష్ట పరిమితితో ఒక బ్లాక్‌కు/పట్టణ స్థానిక పాలనా సంస్థకు  గరిష్టంగా రెండు పాఠశాలల (ఒక ప్రాథమిక & ఒక సెకండరీ/సీనియర్ సెకండరీ) చొప్పున ఎంపిక జరుగుతుంది. PM SHRI పాఠశాలల ఎంపిక మరియు పర్యవేక్షణ కోసం పాఠశాలల జియో-ట్యాగింగ్ ప్రక్రియ జరుగుతుంది. జియో-ట్యాగింగ్,.. ఇతర సంబంధిత పనుల కోసం భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బిశాగ్-ఎన్) సేవలను వినియోగించుకుంటారు. పాఠశాలల తుది ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు.

నాణ్యతపై పి.ఎం.శ్రీ పాఠశాలల హామీ

1. 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం (ఎన్.ఇ.పి.) అంశాలను పొందుపరచడం

2. నమోదు సమాచారాన్ని, విద్యార్థి అభ్యసన పురోగతిని తెలుసుకునేందుకు విద్యార్థి వివరాలతో రిజిస్ట్రీ వ్యవస్థ ఏర్పాటు

3. రాష్ట్ర సగటు, జాతీయ సగటు కంటే ఎక్కువ స్థాయిలను సాధించేందుకు ప్రతి చిన్నారి అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం.

4. ప్రతి మిడిల్ గ్రేడ్ పిల్లవాడు అత్యాధునికమైన, 21వ శతాబ్దపు నైపుణ్యాలను ప్రదర్శించే స్థితిలో ఉంటాడు.

5. ప్రతి సెకండరీ గ్రేడ్ పిల్లవాడు కనీసం ఏదో ఒక నైపుణ్యంతో ఉత్తీర్ణత సాధిస్తాడు

6. ప్రతి చిన్నారికీ క్రీడలు, కళలు, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అధ్యయనం

7. సుస్థిర పాఠశాలలు,  హరిత పాఠశాలలు

8. మార్గదర్శకత్వం కోసం ప్రతి పాఠశాలనూ ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేశారు.  

9.  స్థానిక వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థతో ప్రతి పాఠశాలకు అనుసంధానం కల్పించారు.

10. మానసిక శ్రేయస్సు కోసం, ఉద్యోగ, వృత్తి జీవితం కోసం ప్రతి చిన్నారికీ తగిన సలహా, కౌన్సెలింగ్.

11. భారతదేశం గురించిన విశేష పరిజ్ఞానానికి, దేశ వారసత్వానికి ప్రతి విద్యార్థీ గట్టిగా అనుసంధానమై పోతాడు.  భారతదేశం నాగరికత, విలువలు తనకు గర్వకారణంగా విద్యార్థులు భావిస్తారు.  ప్రపంచానికి భారతదేశం అందించే సేవలను గురించి తెలుసుకుంటారు. సమాజానికి, తోటి జీవులకు, ప్రకృతికి తాము నిర్వర్తించాల్సిన విధులపట్ల అవగాహనను, కర్తవ్య స్పృహను కలిగి ఉంటారు.  భారతీయ భాషల ద్వారా భావవ్యక్తీకరణలో సమర్థులై, కలుపుగోలుతనంతో ఉంటూ, సమానత్వాన్ని గౌరవిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం, సేవాభావం, 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని పెంపొందించడం వంటి లక్షణాలను  కలిగి ఉంటారు.

12. శీల నిర్మాణం, పౌరసత్వ విలువలు, దేశ నిర్మాణం పట్ల తమ ప్రాథమిక విధులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉంటారు.

  పిల్లల సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించే శక్తివంతమైన విద్యాసంస్థలుగా ఈ పాఠశాలలను అభివృద్ధి చేస్తారు.

లబ్ధిదారులు

   పి.ఎం. శ్రీ స్కూళ్ల పథకం ద్వారా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు  ప్రత్యక్ష లబ్ధిదారులుగా  ప్రయోజనం పొందుతారని అంచనా. PM SHRI పాఠశాలల పరిసరాల్లోని పాఠశాలలకు మార్గదర్శకత్వం లభించడం ఈ విషయంలో మరింత ప్రభావవంతమైన ఫలితాలను అందిస్తుంది.

 

****



(Release ID: 1857663) Visitor Counter : 1015