ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సిల్చార్ లో సి.జి.హెచ్.ఎస్. వెల్ నెస్ కేంద్రాన్ని ప్రారంభించిన - డాక్టర్ మన్సుఖ్ మాండవీయా
"కొత్త సి.జి.హెచ్.ఎస్. కేంద్రం సిల్చార్ మరియు చుట్టుపక్కల పెద్ద సంఖ్ లో జనాభా కు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ను అందిస్తుంది"
సి.జి.హెచ్.ఎస్. వెల్-నెస్ సెంటర్ల సంఖ్య మూడు రేట్లు పెరిగింది; 2014 లో సి.జి.హెచ్.ఎస్. పరిధిలో ఉన్న నగరాలు 25 ఉండగా ఇప్పుడు, 75 కి పెరిగాయి: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
"సి.జి.హెచ్.ఎస్. సేవల నాణ్యత, కవరేజీని పెంచడానికి, సి.జి.హెచ్.ఎస్. ఫిర్యాదుల పరిష్కారం, సకాలంలో బిల్లులు తిరిగి చెల్లింపు వంటి విషయాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది"
Posted On:
07 SEP 2022 1:07PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, ఈ రోజు సిల్చార్ లో సి.జి.హెచ్.ఎస్. వెల్ నెస్ కేంద్రాన్ని, పార్లమెంటు సభ్యుడు (ఎల్.ఎస్) డాక్టర్ రాజ్ దీప్ రాయ్, అస్సాంలోని సిల్చార్ శాసనసభ్యుడు దీపాయన్ చక్రవర్తి సమక్షంలో దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సి.జి.హెచ్.ఎస్. సేవల ప్రాప్యతను బలోపేతం చేయడంలో సాధించిన ఒక ముఖ్యమైన విజయంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సి.జి.హెచ్.ఎస్) వెల్నెస్ సెంటర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. సి.జి.హెచ్.ఎస్. వెల్-నెస్ సెంటర్ల పరిధిలో ఉన్న నగరాల సంఖ్య 2014 లో 25 ఉండగా, ఇప్పుడు 75 కి పెరిగింది. ఇది కమ్యూనిటీలకు చేరువగా సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి దార్శనికత కు అనుగుణంగా ఉంది”. అని పేర్కొన్నారు.
లబ్ధిదారులకు సులువుగా అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాండవీయ పునరుద్ఘాటించారు. సిల్చార్ లోని కొత్త సి.జి.హెచ్.ఎస్. కేంద్రం సిల్చార్ లో మాత్రమే కాకుండా పొరుగు జిల్లాలైన కరీంగంజ్, హైలాకండి, బరాక్ వ్యాలీ లో ప్రస్తుతం పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుందని, ఆయన చెప్పారు. బరాక్ వ్యాలీ లోని ప్రధాన నగరాల్లో సిల్చార్ ఒకటి అయినప్పటికీ, సిజిహెచ్‌ఎస్ సౌకర్యాలను పొందేందుకు లబ్ధిదారులు ఐజ్వాల్ నుండి 180 కంటే ఎక్కువ కి.మీ. లేదా షిల్లాంగ్ నుంచి 208 కి.మీ. ప్రయాణించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కొత్త వెల్-నెస్-సెంటర్ అనేక వేల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలను తీర్చడం తో పాటు వారి కష్టాలను తగ్గిస్తుంది, ఎందుకంటే వారు ఇప్పుడు అంత దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వెల్ నెస్ సెంటర్ ఔషధాలు, పరిశోధనల కోసం రిఫరల్ తో పాటు ప్రభుత్వ, ప్రభుత్వం చేత ఎంపిక చేయబడిన ఆసుపత్రుల్లో, ఇండోర్ చికిత్సతో సహా ఔట్ పేషెంట్ సేవలను కూడా అందిస్తుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో చికిత్స కోసం నగదు రహిత సౌకర్యాలు అందించబడతాయి.
“కొత్త సి.జి.హెచ్.ఎస్. వెల్ నెస్ సెంటర్ ప్రారంభం కావడంతో, గౌహతి, దిబ్రూఘర్ తర్వాత అస్సాంలో సి.జి.హెచ్.ఎస్. సౌకర్యాలు కలిగి ఉన్న మూడవ నగరం సిల్చార్. కవరేజీ ని విస్తరించేందుకు, సి.జి.హెచ్.ఎస్. సేవల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా, దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 16 కొత్త సి.జి.హెచ్.ఎస్. కేంద్రాల్లో ఈ వెల్-నెస్ సెంటర్ ఒకటి." అని డాక్టర్ మాండవీయ వివరించారు. సి.జి.హెచ్.ఎస్. దాని లబ్ధిదారులకు అందిస్తున్న సేవలను మెరుగుపరచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన రోజువారీ పర్యవేక్షణ, బిల్లు రీయింబర్స్‌మెంట్ లను వేగవంతం చేయడం, ప్రైవేట్ ఆసుపత్రి సేవల పరిధిని విస్తరించడం వంటి చర్యలు ఫిర్యాదుల పరిష్కారం తో పాటు త్వరగా రీయింబర్స్‌మెంట్ చేయడానికి దారితీసాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. తద్వారా సంబంధిత పెండింగ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి పి.ఎం-ఏ.బి.హెచ్.ఐ.ఎం. (ప్రధాన మంత్రి- ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్) కింద 64,000 కోట్ల రూపాయలు; ఈ.సి.ఆర్.పి-ఐ. కింద 15,000 కోట్ల రూపాయలు; ఈ.సి.ఆర్.పి.-II కింద 23,000 కోట్ల రూపాయల మేర నిధులు ఆమోదించడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల తో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో, 1954 లో కేంద్ర ప్రభుత్వం, సి.జి.హెచ్.ఎస్. అనే ఈ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 75 నగరాల్లోని 41 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం పరిధిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అలోక్ సక్సేనా, సి.జి.హెచ్.ఎస్., డైరెక్టర్ డాక్టర్ నిఖిలేష్ చంద్ర తో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, సి.జి.హెచ్.ఎస్. లబ్ధిదారులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1857554)
Visitor Counter : 169