ప్రధాన మంత్రి కార్యాలయం

విద్యుత్ రంగంలో సంస్క‌ర‌ణాత్మక పంపిణీ రంగం ప‌థ‌కానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌కారం


‘ఉజ్వల భారత ఉజ్వల భవిష్యత్తు- పవర్@2047’
ముగింపు మ‌హోత్స‌వంలో పాల్గొన్న ప్రధానమంత్రి;

ఎన్టీపీసీ పరిధిలోని రూ.5200 కోట్ల విలువైన వివిధ హ‌రిత
ఇంధ‌న ప్రాజెక్టుల‌ అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి;

జాతీయ పైకప్పు సౌరశక్తి పోర్టల్‌ను కూడా ప్రారంభించిన ప్రధానమంత్రి;

“వాణిజ్య సౌలభ్యం.. జీవన సౌలభ్యం కోసం బలమైన ఇంధన రంగమూ కీలకమే”;

“భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు.. హామీలు.. హరిత చలనశీలత
ఆకాంక్షలను ఇవాళ ప్రారంభించబడిన ప్రాజెక్టులు బలోపేతం చేస్తాయి”;

“దేశంలో తొలి ఫ్యూయెల్‌ సెల్‌ విద్యుత్‌ వాహన ప్రాంతం కానున్న లద్దాఖ్”;

“గత 8 ఏళ్లలో 1,70,000 మెగావాట్ల మేర విద్యుదుత్పాదక సామర్థ్యం జోడించబడింది”;

“రాజకీయాల్లో వాస్తవాలు చెప్పడానికి ధైర్యం కావాలి… కానీ,
కొన్ని రాష్ట్రాలు మొహం చాటేయడం నేడు మనం చూస్తున్నాం”;

“విద్యుత్‌ ఉత్పాదక-పంపిణీ సంస్థలకు రావాల్సిన
బకాయిలు రూ.2.5 లక్షల కోట్ల మేర పేరుకుపోయాయి”;

“విద్యుత్‌ రంగం శ్రేయస్సు రాజకీయాలతో ముడిపడినది కాదు”

Posted On: 30 JUL 2022 3:04PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘ఉజ్వల భారత ఉజ్వల భవిష్యత్తు– పవర్@2047’ ముగింపు మ‌హోత్స‌వంలో వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘సంస్క‌ర‌ణాత్మ‌క పంపిణీ రంగం’ ప‌థ‌కాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే ఎన్టీపీసీకి చెందిన రూ.5200 కోట్ల విలువైన వివిధ హ‌రిత ఇంధ‌న ప్రాజెక్టులను జాతికి‌ అంకితం చేయడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన కూడా చేశారు. దీంతోపాటు జాతీయ పైకప్పు సౌరశక్తి పోర్టల్‌ను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పథకాల లబ్ధిదారులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘కుసుమ్‌’ పథకం లబ్ధిదారుగా తన అనుభవాన్ని మండీ ప్రాంతానికి చెందిన శ్రీ హన్స్‌ రాజ్‌ ఆయనకు వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఇతర రైతులు ఈ పథకంపై ఏ విధంగా ఆసక్తి చూపుతున్నదీ వాకబు చేశారు. ఈ పథకం ప్రవేశపెట్టడంపై శ్రీ హన్స్‌ రాజ్‌ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ, దీనిద్వారా తాను, తన కుటుంబం ఏవిధంగా ప్రయోజనం పొందిందీ తెలియజేశారు.

   త్రిపుర రాష్ట్రం ఖొవాయ్‌ గ్రామ వాస్తవ్యుడు శ్రీ కలహా రియాంగ్‌ మాట్లాడుతూ- విద్యుత్‌ సౌకర్యం ఏర్పడటం ద్వారా తమ గ్రామంలో వచ్చిన మార్పులను ప్రధానమంత్రికి వివరించారు. సౌరశక్తి రాకతో తాము కిరోసిన్‌ మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గిందని తెలిపారు. ఇది కాకుండా విద్యుత్‌ రాకతో చోటుచేసుకున్న ఇతరత్రా మార్పులేమిటో కూడా తెలపాలని ప్రధాని ఆయనను కోరారు. దీంతో రియాంగ్‌ బదులిస్తూ- దూర ప్రయాణాల్లోనూ తమ మొబైల్‌ ఫోన్లను చార్జి చేసుకునే సౌలభ్యం కలిగిందని తెలిపారు. సౌరశక్తి అందుబాటుతో తమ పిల్లల చదువులు, స్థానిక పరిశ్రమలు మెరుగుపడ్డాయని, రాత్రి జీవితంలో మార్పు వచ్చిందని వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- ప్రభుత్వం టీవీ ద్వారా నడుపుతున్న విద్యా చానెళ్లను సద్వినియోగిం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా విద్యుత్తు పొదుపు పాటించాల్సిందిగా కోరారు.

   దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామజ్యోతి పథకం లబ్ధిదారైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నివాసి శ్రీ కాగు క్రాంతికుమార్‌- విద్యుత్‌ సౌకర్యం తన జీవితంపై చూపిన సానుకూల ప్రభావం గురించి తెలిపారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- ప్రతి పౌరుడి ప్రగతితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని చెప్పారు. దేశంలోని గ్రామాలన్నిటికీ విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

   సమీకృత విద్యుత్‌ అభివృద్ధి పథకం లబ్ధిదారైని వారణాసి నగర వాస్తవ్యురాలు శ్రీమతి ప్రమీలా దేవిని ప్రధానమంత్రి ‘హర్‌ హర్‌ మహదేవ్‌’ అంటూ చిరునవ్వుతో పలకరించారు. కాశీ విశ్వనాథునికి తన తరఫున ప్రణామాలు అర్పించాలని వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని ఆమెను కోరారు. నగరంలో భారీ విద్యుత్‌ లైన్లు క్రమంగా తొలగించబడుతూ భద్రతకు భరోసాతోపాటు పరిసరాలు సుందరంగా రూపొందడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.

   సౌర ఫలకాలు అమర్చడంలో తన అనుభవాన్ని అహ్మదాబాద్‌ నివాసి శ్రీ ధీరేన్‌ సురేష్‌భాయ్‌ పటేల్‌ వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- తన ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాలు అమర్చుకోవడం ద్వారా ధీరేన్‌భాయ్‌ విద్యుత్‌ విక్రేతగా మారారని పేర్కొన్నారు. ఇంధన రంగంలో 2047నాటికి దేశం ఆత్మవిశ్వాసం సంతరించుకునే స్థాయికి చేరేవిధంగా గత సంవత్సర కాలంలో అనేక చర్యలు తీసుకున్నామని ప్రధాని తెలిపారు. ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యమే గొప్ప బలమని ఆయన పేర్కొన్నారు.

   ప్రధానమంత్రి లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ముగింపు సభలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశ ప్రగతిని వేగవంతం చేయడంలో ఇంధన, విద్యుత్‌ రంగాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని అన్నారు. వాణిజ్య సౌలభ్యం.. జీవన సౌలభ్యం కోసం బలమైన ఇంధన రంగం కూడా అత్యంత కీలకమేనని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు దేశంలో హరిత విద్యుత్‌, ఇంధన భద్రత దిశగా ప్రధానమైనవని చెప్పారు. భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, హామీలు, హరిత చలనశీలత ఆకాంక్షలను నేడు ప్రారంభించబడిన ప్రాజెక్టులు మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. లద్దాఖ్‌, గుజరాత్‌లలో రెండు భారీ హరిత ఉదజని ప్రాజెక్టుల పనులు ఈ రోజు ప్రారంభమవుతాయని ప్రధాని ప్రకటించారు. కాగా లద్దాఖ్‌లో ఏర్పాటయ్యే ప్లాంటు దేశంలోని వాహన వినియోగం కోసం హరిత ఉదజనిని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దేశంలో హరిత ఉదజని ఆధారిత రవాణాను వాణిజ్యపరంగా వినియోగంలోకి తెచ్చే తొలి ప్రాజెక్ట్ ఇదే కాగలదని ఆయన అన్నారు. ఆ మేరకు లద్దాఖ్‌ దేశంలోనే తొలి ఫ్యూయెల్‌ సెల్‌ విద్యుత్‌ వాహన సంచార ప్రాంతం కానున్నదని పేర్కొన్నారు. లద్దాఖ్‌ను కర్బనోద్గార రహిత ప్రాంతంగా మార్చడంలో ఇది తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

   పెట్రోలు, విమాన ఇంధనాల్లో ఇథనాల్‌ మిశ్రమం చేస్తున్న నేపథ్యంలో, ఇకపై సహజ వాయువు పైప్‌లైన్ల ద్వారా హరిత ఉదజనిని మిశ్రమం చేసే దిశగా దేశం ముందంజ వేస్తున్నదని ప్రధానమంత్రి వెల్లడించారు. తద్వారా సహజ వాయువు దిగుమతిపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. దేశంలో 2014కి ముందు విద్యుత్‌ రంగం దీనస్థితిలో ఉండటాన్ని గుర్తుచేస్తూ- ఎనిమిదేళ్ల కిందట విద్యుత్ రంగంలోని ప్రతి అంశాన్నీ చక్కదిద్దడానికి ప్రభుత్వం చొరవ తీసుకున్నదని వివరించారు. విద్యుత్ వ్యవస్థ మెరుగుకు ఉత్పాదన, సరఫరా, పంపిణీ, కనెక్షన్లతో కూడిన చతుర్ముఖ వ్యూహంతో కృషి చేసినట్లు తెలిపారు. తద్వారా గడచిన 8 సంవత్సరాల్లో సుమారు 1,70,000 మెగావాట్ల అదనపు ఉత్పాదక సామర్థ్యం జోడించబడిందని ప్రధాని వెల్లడించారు. దీంతో ‘ఒకే దేశం – ఒకే విద్యుత్‌ గ్రిడ్‌’ అన్నది దేశానికి కొత్త బలాన్నిస్తున్నదని చెప్పారు. అలాగే దేశం మొత్తాన్నీ అనుసంధానించేందుకు దాదాపు 1,70,000 సర్క్యూట్ కిలోమీటర్ల ప్రసార మార్గాలు వేయబడ్డాయని తెలిపారు. అలాగే సౌభాగ్య పథకం కింద 3 కోట్ల కనెక్షన్లు ఇవ్వడం ద్వారా మనం సంతృప్త లక్ష్యాన్ని చేరుకోగలిగామని పేర్కొన్నారు.

   స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం నాటికి దేశంలో ‘175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్య సృష్టి’పై సంకల్పం పూనామని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నామని తెలిపారు. ఇక శిలాజేతర వనరుల ద్వారా ఇప్పటిదాకా 170 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం సాధించామన్నారు. మరోవైపు సౌరశక్తి స్థాపిత సామర్థ్యం పరంగా ప్రపంచంలోని తొలి 4-5 అగ్రదేశాల జాబితాలో ఇవాళ భారత్‌ కూడా ఒకటిగా ఉందని ఆయన వివరించారు. ప్రపంచంలోని అనేక భారీ సౌరశక్తి ప్లాంట్లలో అధికశాతం భారతదేశంలో ఉన్నాయని చెప్పారు. వీటికితోడు ఇవాళ మరో రెండు భారీ సౌరశక్తి ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటిలో మొదటి, రెండో అతిపెద్ద తేలియాడే సౌరశక్తి ప్లాంట్లు  తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడ్డాయని వెల్లడించారు. అంతేకాకుండా ఇళ్ల పైకప్పుల మీద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. విద్యుదుత్పాదన పెంపుతోపాటు పొదుపుపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రధాని చెప్పారు. “విద్యుత్తును ఆదా చేయడమంటే భవిష్యత్తును సుసంపన్నం చేయడమే. పీఎం-కుసుమ్‌ పథకం దీనికి గొప్ప ఉదాహరణ. మేము రైతులకు సోలార్ పంపులు సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే పొలం గట్లమీద సౌర ఫలకాల ఏర్పాటుకు సాయం చేస్తున్నాం” అని ఆయన అన్నారు. దేశంలో విద్యుత్ వినియోగం, బిల్లుల తగ్గింపులో ఉజాలా పథకం కూడా కీలక పాత్ర పోషించిందని ప్రధాని తెలిపారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఏటా రూ.50 వేలకోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి.

   కాలక్రమేణా రాజకీయాల్లో తీవ్ర రుగ్మత చోటు చేసుకున్నదని ప్రధాని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాజకీయాల్లో నిజం చెప్పడానికి చాలా ధైర్యం అవసరమన్నారు. అయితే, కొన్ని రాష్ట్రాలు సాధ్యమైనంత వరకూ మొహం చాటేయడానికే ప్రయత్నిస్తుండటం మనకు తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యూహం స్వల్పకాలికంగా మంచి రాజకీయం అనిపించవచ్చు. కానీ, ఇది నేటి వాస్తవాలు, సవాళ్లతోపాటు రేపటి మన పిల్లల, రాబోయే తరాల భవిష్యత్తును కూడా వాయిదా వేయడమే కాగలదని హెచ్చరించారు. సమస్యలకు పరిష్కారాన్ని వాయిదా వేయడం, వాటిని కాలం దయాదాక్షిణ్యాలకు వదిలివేయడమనే యోచన దేశానికి మంచిది కాదన్నారు. అయితే, ఇలాంటి ఆలోచన ధోరణుల వల్లనే అనేక రాష్ట్రాల్లో విద్యుత్ రంగం పెను సమస్యల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు.

   ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్‌ పంపిణీ రంగం నష్టాలు ఒక అంకె స్థాయిలో ఉండగా మన దేశంలో రెండంకెల స్థాయిలో ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు. దీన్నిబట్టి మన దేశంలో విద్యుత్తు వృథా చాలా ఎక్కువగా ఉందన్నది స్పష్టమవుతున్నదని చెప్పారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే అవసరాలకు మించి విద్యుదుత్పాదన చేయాల్సి ఉంటుందన్నారు. మరోవైపు అనేక రాష్ట్రాల్లో ప్రసార-పంపిణీ నష్టాల తగ్గింపు దిశగా పెట్టుబడులు పెట్టడంలేదని ఆయన అన్నారు. ఇక వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పంపిణీ సంస్థలకు రూ.లక్ష కోట్లకు మించి బకాయిపడి ఉన్నాయని తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదని ప్రధాని వ్యాఖ్యానించారు. సదరు పంపిణీ సంస్థలు ఈ సొమ్మును విద్యుదుత్పాదక సంస్థలకు చెల్లించాల్సి ఉందని చెప్పారు. కాగా, అనేక ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.60వేల కోట్లకుపైగా బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు. ఈ కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో విద్యుత్తు సబ్సిడీకి ఉద్దేశించిన సొమ్మును కూడా సకాలంలో, పూర్తిగా పొందలేని దుస్థితి ఉందన్నారు. ఇలాంటి బకాయిలు కూడా రూ.75,000 కోట్లకుపైగా ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యుత్తు ఉత్పాదన నుంచి ఇంటింటికీ సరఫరా వరకు కార్యకలాపాలకు బాధ్యతలుగల సంస్థలకు రావాల్సిన బకాయిలు రూ.2.5 లక్షల కోట్ల మేర పేరుకుపోయాయని వెల్లడించారు.

   ఈ బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాల్సిందిగా ఆయా రాష్ట్రాలను ప్రధాని అభ్యర్థించారు. అదే సమయంలో దేశ పౌరులు తమ విద్యుత్ బిల్లులను నిజాయితీగా చెల్లిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మళ్లీమళ్లీ బకాయిలు ఎలా పేరుకుంటున్నాయో నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఇది ‘రాజకీయాలకు’ సంబంధించినది కాదని, ‘దేశ నైతికత’, నిర్మాణానికి సంబంధించిన అంశమని ఆయన గుర్తుచేశారు. విద్యుత్ రంగ శ్రేయస్సు ప్రతి ఒక్కరి బాధ్యతని, భాగస్వాములందరినీ అప్రమత్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

   ప్రధానమంత్రి నాయకత్వాన ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక వినూత్న చర్యలు చేపట్టింది. ఈ సంస్కరణలు విద్యుత్‌ రంగంలో ఎంతో పరివర్తన తెచ్చాయి. అందరికీ సరసమైన విద్యుత్తును అందుబాటులో ఉంచడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబడింది. ఇంతకుముందు చీకటిలో మగ్గిన సుమారు 18,000 గ్రామాలకు నేడు విద్యుత్‌ సౌకర్యం ఏర్పడిందంటే, చిట్టచివరి దాకా సదుపాయాలు అందరికీ అందాలనే ప్రభుత్వ నిబద్ధతే కారణం.

   దేశంలో విద్యుత్‌ శాఖలు, ‘డిస్కమ్‌’ల కార్యాచరణ సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా ‘సంస్కరణాత్మక పంపిణీ రంగం పథకం’ పేరిట కేంద్ర విద్యుత్‌ శాఖ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం 2021-22 నుంచి 2025-26 వరకు ఐదేళ్ల కాలంలో రూ.3లక్షల కోట్ల వ్యయంకాగల ప్రతిష్టాత్మక ప్రణాళిక రూపొందించింది. ఈ పథకం కింద ఆధునికీకరణ, పంపిణీ మౌలిక వసతు బలోపేతం కోసం డిస్కమ్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. తద్వారా వినియోగదారుల విశ్వసనీయత పొందడంతోపాటు సరఫరా మెరుగుదలపై దృష్టి సారించింది. అలాగే సమీకృత సాంకేతిక-వాణిజ్య నష్టాలను 12 నుంచి 15 శాతంగాగల జాతీయ స్థాయికి తగ్గించాలని నిర్ణయించింది. అలాగే సగటు సరఫరా వ్యయం-సగటు రాబడి వసూళ్ల మధ్య 2024-25 నాటికి అంతరాన్ని సున్నా స్థాయికి తగ్గించాలని నిర్దేశించుకుంది. ఈ దిశగా అన్ని రాష్ట్ర స్థాయి డిస్కమ్‌లు, విద్యుత్‌ శాఖలలో నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది.

   ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఎన్టీపీసీకి చెందిన రూ.5200 కోట్ల విలువైన వివిధ హరిత విద్యుత్‌ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తెలంగాణలో 100 మెగావాట్ల రామగుండం తేలియాడే సౌరశక్తి ప్రాజెక్ట్, కేరళలో 92 మెగావాట్ల కాయంకుళం తేలియాడే సౌరశక్తి ప్రాజెక్టులను ప్రారంభించారు. అదే సమయంలో రాజస్థాన్‌లో 735 మెగావాట్ల ‘నోఖ్’ సౌరశక్తి ప్రాజెక్టు, ‘లేహ్’లోని హరిత ఉదజని రవాణా ప్రాజెక్టు, గుజరాత్‌లో సహజ వాయువుతో కవాస్ హరిత ఉదజని మిశ్రమ ప్రాజెక్టు తదితరాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా, రామగుండం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన 4.5 లక్షల సౌర ఫలకాలు పూర్తిగా ‘భారత్‌ తయారీ’వే కావడం విశేషం. ఇక కాయంకుళంలోని సౌరశక్తి ప్రాజెక్టు తెలంగాణ తర్వాత దేశంలో 3 లక్షల ఫలకాలతో ఏర్పాటైన రెండో అతిపెద్ద తేలియాడే సౌరశక్తి ప్రాజెక్టు కావడం గమనార్హం.

   రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోగల నోఖ్ వద్ద ఏర్పాటు చేసిన 735 మెగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద దేశీయ కంటెంట్ అవసరం ఆధారిత ప్రాజెక్టు. ఇది ఒకే ప్రదేశంలో 1000 ‘ఎండబ్ల్యూపీ’తో రూపొందింది కావడం విశేషం. అలాగే ఇక్కడ ట్రాకర్ వ్యవస్థతో అధిక వాటేజ్గల ద్విముఖ సౌర ఫలకాల మాడ్యూళ్లు పనిచేస్తుంటాయి. లద్దాఖ్‌లోని ‘లేహ్’ వద్ద హరిత ఉదజని రవాణా ప్రయోగాత్మక ప్రాజెక్ట్, ఐదు ఫ్యూయెల్‌ సెల్‌ ఆధారిత విద్యుత్‌ బస్సులు ‘లేహ్’తోపాటు పరిసర ప్రాంతాల్లో నడిపే విధంగా లక్ష్యం నిర్దేశించుకుంది. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ భారతదేశంలో ప్రజోపయోగం కోసం ఏర్పాటు చేసిన తొలి ఇంధన సెల్ ఎలక్ట్రిక్ వాహన  విస్తరణ ప్రాజెక్టు. అలాగే కవాస్ టౌన్‌షిప్‌లోని హరిత ఉదజని మిశ్రమ ప్రయోగాత్మక ప్రాజెక్టు దేశంలోనే మొదటిది కాగా, దీనివల్ల సహజ వాయువు వినియోగం గణనీయంగా తగ్గుతుంది.

   ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సౌరశక్తి రూఫ్‌టాప్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. ఇది నివాసాల పైకప్పుమీద సౌర ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ సంబంధిత ఆన్‌లైన్ పర్యవేక్షణకు తోడ్పడుతుంది. ప్లాంట్ ఏర్పాటు, తనిఖీ తర్వాత దరఖాస్తుల నమోదు చేయడం నుంచి నివాస వినియోగదారుల బ్యాంక్ ఖాతాలలో సబ్సిడీలను జమ చేయడందాకా ఈ పోర్టల్‌ ద్వారా కార్యకలాపాలు సాగుతాయి.

   ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ‘స్వాతంత్ర్య అమృత మహోత్సవం’లో భాగంగా ‘ఉజ్వల భారత ఉజ్వల భవిష్యత్తు- పవర్@2047’ కార్యక్రమం జూలై 25 నుండి 30 వరకు నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గత ఎనిమిదేళ్లుగా విద్యుత్‌ రంగంలో సాధించిన పరివర్తనాత్మక ప్రగతిని వివరించింది. అలాగే వివిధ విద్యుత్-సంబంధిత కార్యక్రమాలు, పథకాలపై పౌరులలో అవగాహన పెంచడంతోపాటు ప్రభుత్వ చర్యలలో భాగస్వామ్యం ద్వారా వారికి సాధికారత కల్పించడం దీని లక్ష్యం.

***
DS/AK

(Release ID: 1846707) Visitor Counter : 231