వ్యవసాయ మంత్రిత్వ శాఖ

దేశంలో 11వ వ్యవసాయ గణన ప్రక్రియ ప్రారంభం!


కేంద్ర వ్యవసాయ మంత్రి చేతుల మీదుగా శ్రీకారం..
రైతుల ఆదాయం పెంపు,
సాధికారత సాధనపైనే దృష్టిని
కేంద్రీకరించిన ప్రధానమంత్రి
:నరేంద్ర సింగ్ తోమర్.

తొలిసారిగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లపై
వ్యవసాయ గణన సమాచార సేకరణ

Posted On: 28 JUL 2022 4:49PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పదకొండవ వ్యవసాయ గణన (2021-22)ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, భారత దేశం వంటి సువిశాలమైన, వ్యావసాయక దేశంలో వ్యవసాయ గణన ప్రక్రియ భారీ ప్రయోజనాలను అందించగలదని  అన్నారు. ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ నాయక త్వంలో రైతుల ఆదాయాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించినట్టు తోమర్ తెలిపారు. దీనికి తోడుగా రైతుల జీవన ప్రమాణాలను మార్చివేసి, సాధాకారత లక్ష్యంగా చిన్న చిన్న రైతులను సంఘటితరం చేయాల్సిన అవసరం ఉందని, గిట్టుబాటు కలిగించే పంటలవైపుగా వారి దృష్టిని మళ్లించి, పంటల్లో ప్రపంచ ప్రమాణాలకు దీటైన నాణ్యతను సాధించేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. 


 
    వ్యవసాయ గణన ప్రక్రియ మొదలైన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్దిష్టమైన చర్యలతో వ్యవసాయ రంగం సరైన ఫలితాలను అందిస్తోందని, డిజిటల్ వ్యవసాయం దిశగా దేశం వేగంగా పురోగమిస్తోందని ఆయన అన్నారు. గణన ప్రక్రియలో కంప్యూటర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవలసిన తరణం ఇదేనని అన్నారు. వ్యవసాయ గణన ప్రక్రియ గురించి విశాలదృక్పథంతో ఆలోచించాలన్నారు. పంటల ప్రణాళికా రచనకు కూడా ఇది దోహదపడుతుందని, తద్వారా దేశం తగిన ప్రయోజనాలను అందుకుంటుందని అన్నారు. ఈ ప్రక్రియను పూర్తి అంకిత భావంతో ముందుకు తీసుకెళ్లవలసిందిగా కేంద్ర శాఖలను, రాష్ట్ర ప్రభుత్వాలను, సంబంధిత సంస్థలను కేంద్రమంత్రి తోమర్ కోరారు. 
  ఈ సందర్భంగా వ్యవసాయ గణనపై మార్గదర్శకసూత్రాలతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వినియోగంకోసం  రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను కేంద్రమంత్రి తోమర్ ఆవిష్కరించారు. డాటా కలెక్షన్ పోర్టల్‌ను, యాప్‌ను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే, వ్యవసాయ శాఖ కార్యదర్శి కైలాస్ చౌధరి, అదనపు కార్యదర్శి మనోజ్ ఆహుజా, ఆర్థిక వ్యవహారాల సలహాదారు సంజీవ్ కుమార్, వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
   వ్యవసాయ గణన అనే ప్రక్రియను ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశంలో నిర్వహిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి విసిరిన సవాళ్ల కారణంగా కొంత జాప్యం తర్వాత ఈ ప్రక్రియ ఇపుడు ప్రారంభమైంది. వ్యవసాయ గణనకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు ఆగస్టులో మొదలవుతాయి. సూక్ష్మస్థాయిలో అమలుజరిపే వ్యవసాయ ప్రమాణాల సమాచారాన్ని సేకరించేందుకు వ్యవసాయ గణన ప్రక్రియను ఒక ప్రధాన వనరుగా భావిస్తున్నారు. వ్యవసాయ భూమకమతాల సంఖ్య, వాటి పరిమాణం, తరగతులవారీ వర్గీకరణ, భూమి వినియోగం, కౌలు సాగు, పంటల తీరు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇది దోహదపడుతుంది. ఈ సారి తొలిసారిగా వ్యవసాయ గణన సమాచారాన్ని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌ల ద్వారా సేకరిస్తున్నారు. అందువల్ల సకాలంలో సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు ఇప్పటికే తమ భూమి రికార్డుల, సర్వేల వివరాలను డిజిటల్ పరిజ్ఞానంలో నిక్షిప్తం చేశాయి. వ్యవసాయ గణన ప్రక్రియ సమాచార సేకరణను మరింత వేగవంతం చేసేందుకు ఇది దోహదపడుతుంది. డిజిటల్ పరిజ్ఞానంలోని భూమి రికార్డుల వినియోగం, డాటా సేకరణకోసం మొబైల్ యాప్‌ల వాడకం కారణంగా దేశవ్యాప్తంగా సాగులో ఉన్న భూమి వివరాలతో ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుంది. 
   వ్యవసాయ గణనకు సంబంధించిన సాంకేతిక సదస్సులో వ్యవసాయ గణన ప్రక్రియ అమలు పద్ధతులను, వెబ్ పోర్టల్‌ను, మొబైల్ యాప్‌ను ప్రదర్శించారు. ఇక భూమి టైటిల్ రికార్డులు, సర్వే నివేదికలు స్మార్ట్ ఫోన్, ట్యాబ్‌ల వినియోగంతో మొబైల్ యాప్, సాఫ్ట్‌వేర్ ద్వారా డేటాను సేకరించడం, మొదటి దశలో భూమి రికార్డులలేని  వివిధ రాష్ట్రాల్లోని  గ్రామాలను నమోదు చేయడం, ప్రక్రియ ప్రగతిపై వాస్తవ పరిస్థితిని పర్యవేక్షించడం వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో విపులంగా చర్చించారు.

 

***
 



(Release ID: 1846090) Visitor Counter : 674