ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఉద్యమ భారతం’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి


‘‘మాకు సంబంధించినంత వరకూ ‘ఎంఎస్ఎంఈ’ అంటే...
సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు గరిష్ఠ మద్దతు’’;

‘‘ఎంఎస్ఎంఈ’ రంగాన్ని బలోపేతం చేయడమంటే-
సమాజం మొత్తాన్నీ బలోపేతం చేయడమే’’;

‘‘ఏదైనా పరిశ్రమ అభివృద్ధిని, విస్తరణను ఆకాంక్షిస్తుంటే-ప్రభుత్వం మద్దతు ఇవ్వడమేగాక విధానాలలో అవసరమైన మార్పులు కూడా చేస్తోంది’’;

‘‘విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల పనితీరు ‘వాణిజ్యం.. సాంకేతికత.. పర్యాటకం’- మూడు పారామితుల మేరకు మూల్యాంకనం చేయబడుతోంది’’;

‘‘ఖాదీ-గ్రామీణ పరిశ్రమల సంస్థ వార్షిక వాణిజ్య
పరిమాణం తొలిసారి రూ.లక్ష కోట్లు దాటింది’’;

‘‘ప్రతి భారతీయుడికీ వ్యవస్థాపన సౌలభ్యం
కల్పనలో ముద్ర యోజన ప్రధాన పాత్ర పోషిస్తోంది’’;

‘‘వ్యవస్థాపనతోపాటు ఆర్థికంగానూ సార్వజనీనత సాధనే
సామాజిక న్యాయ కల్పనకు నిజమైన నిదర్శనాలు’’;

‘‘మీ అవసరాలు తీర్చే విధానాల రూపకల్పన.. మీతో చురుగ్గా అడుగు వేయడంపై ప్రభుత్వం నిబద్ధతతో ఉంటుందని ‘ఎంఎస్ఎంఈ’ రంగానికి హామీ ఇస్తున్నాను’’;

‘‘వ్యవస్థాపన భారతం సాధించే ప్రతి విజయం మనల్ని ‘స్వయం సమృద్ధ భారతం’వైపు నడుపుతుంది; మీతోపాటు మీ సామర్థ్యంపైనా నమ్మకం ఉంది’’

Posted On: 30 JUN 2022 1:03PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘ఉద్యమ భారతం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ‘ఎంఎస్ఎంఈ’ పనితీరు మెరుగు-వేగిరపరచే (ర్యాంప్) పథకం, ‘ఆరంభ ‘ఎంఎస్ఎంఈ’ ఎగుమతిదారుల సామర్థ్యం పెంపు’ (సీబీఎఫ్టీఈ), పథకాలతోపాటు ‘ఎంఎస్ఎంఈ’ రంగం ప్రగతి దిశగా ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం’ (పీఎంఈజీపీ)లో ప్రవేశపెట్టిన కొత్త అంశాలు వగైరా కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు 2022-23కుగాను ‘పీఎంఈజీపీ’ లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్నీ ఆయన డిజిటల్‌ రూపంలో బదిలీ చేశారు. ‘ఎంఎస్ఎంఈ’ ఐడియా హ్యాకథాన్-2022 ఫలితాలు ప్రకటించారు; ‘ఎంఎస్ఎంఈ’ జాతీయ అవార్డులు-2022 ప్రదానం చేశారు; స్వావలంబన భారతం నిధి (ఎస్ఆర్ఐ) పరిధిలోని 75 ‘ఎంఎస్ఎంఈ’లకు డిజిటల్ ఈక్విటీ సర్టిఫికెట్లు అందజేశారు. కేంద్రమంత్రులు శ్రీ నారాయణ్ రాణే, శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మతోపాటు దేశం నలుమూలల నుంచి ‘ఎంఎస్ఎంఈ’ భాగస్వాములసహా వివిధ దేశాల నుంచి దౌత్యవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- స్వయం సమృద్ధ భారతం దిశగా ‘ఎంఎస్ఎంఈ’ రంగం చేస్తున్న కృషి కీలక చోదకమని ప్రకటించారు. ఈ 21వ శతాబ్దంలో భారత్ సాధించే ప్రతి విజయం ‘ఎంఎస్ఎంఈ’ రంగం సఫలీకృతం కావడంపైనే ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్ నుంచి ఎగుమతులు పెంచడానికి, సరికొత్త విపణులను అందుకోవడానికి ‘ఎంఎస్ఎంఈ’ రంగం దృఢంగా ఉండటం ఎంతో అవసరమని ఆయన నొక్కిచెప్పారు. ‘‘ఈ రంగానికిగల అపార సామర్థ్యంతోపాటు మీ అవసరాలకు అనుగుణంగానే మా ప్రభుత్వం విధానాల రూపొందించడమే కాకుండా తగిన నిర్ణయాలు కూడ తీసుకుంటోంది’’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇవాళ ప్రారంభించిన వినూత్న పథకాలు, చేపట్టిన ఇతర చర్యలు ‘ఎంఎస్ఎంఈ’ రంగం నాణ్యత, ప్రోత్సహంతో ముడిపడినవేనని ఆయన వెల్లడించారు.

   నం ‘ఎంఎస్ఎంఈ’ అంటున్న సంక్షిప్త రూపాన్ని విస్తృతం చేస్తే సాంకేతికంగా అది ‘‘సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల’’ సమాహారం అవుతుందని ప్రధానమంత్రి అన్నారు. అయితే- ఈ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగమే భారతదేశ వృద్ధి పయనానికి మూలస్తంభమని గుర్తుచేశారు. మన ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు వాటా ‘ఎంఎస్ఎంఈ’ రంగానిదేనని పేర్కొన్నారు. ‘ఎంఎస్ఎంఈ’ రంగాన్ని రంగాన్ని బలోపేతం చేయడమంటే మొత్తం సమాజాన్ని బలోపేతం చేయడం మాత్రమేగాక ప్రతి ఒక్కరినీ అభివృద్ధి ఫలాల లబ్ధిదారులను చేయడమేనని తెలిపారు. అందుకే ఈ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ఈ మేరకు ‘ఎంఎస్ఎంఈ’ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తదనుగుణంగా బడ్జెట్ కేటాయింపులను 650 శాతానికిపైగా పెంచిందని గుర్తుచేశారు. ‘‘మాకు సంబంధించినంత వరకూ ఎంఎస్ఎంఈఅంటే... సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు గరిష్ఠ మద్దతు’’ అని ప్రధాని నొక్కిచెప్పారు.

   రంగంలో 11 కోట్ల మందికిపైగా ముడిపడి ఉన్నారని పేర్కొంటూ- ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ ఎంతో కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో చిన్న పరిశ్రమలను ఆదుకోవడం ద్వారా వాటికి కొత్త జవసత్వాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ మేరకు ‘అత్యవసర దశలవారీ రుణ హామీ’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రూ.3.5 లక్షల కోట్లు అందజేసిందని వివరించారు. ఒక నివేదిక ప్రకారం- ఈ పథకం అమలు ఫలితంగా సుమారు 1.5 కోట్ల ఉద్యోగాలు రక్షించబడ్డాయని ప్రధనమంత్రి గుర్తుచేశారు. భారత స్వాతంత్య్ర సంబంధిత ‘అమృత్ కాలం’ వాగ్దానాలను నెరవేర్చడంలో ఎంఎస్ఎంఈ రంగమే కీలక మాధ్యమమని ఆయన అన్నారు.

   పూర్వ ప్రభుత్వాలు ఈ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించలేదని శ్రీ మోదీ అన్నారు. అందుకే చిన్న పరిశ్రమలను చిన్నవిగానే ఉంచే విధానాలను అనుసరిస్తూ వాటి ప్రగతికి సంకెళ్లు వేశాయని చెప్పారు. ఈ సంకెళ్లను తెగవేయడంలో భాగంగా ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మార్పు చేశామని చెప్పారు. ఏ పరిశ్రమ అయినా ఎదగాలన్నా, తన పరిధిని విస్తరించాలన్నా ప్రభుత్వం దానికి మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి అన్నారు. అంతేకాకుండా సంబంధిత విధఆనాల్లో అవసరమైన మార్పులు తేవాలని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈరంగం ప్రభుత్వానికి వస్తుసేవలు అందించడంలో ‘జీఈఎం’ ఒక బలమైన వేదికగా ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పారు. అందువల్ల ఎంఎస్ఎంఈ రంగంలోని ప్రతి పరిశ్రమ ‘జీఈఎం’ పోర్టల్ లో నమోదు కావాలని ఆయన సూచించారు. అదేవిధంగా రూ.200 కోట్లకన్నా తక్కువ విలువైన ప్రాజెక్టులకు అంతర్జాతీయ టెండర్లను నిషేధించడం కూడా ఎంఎస్ఎంఈలకు దోహదపడే నిర్ణయమేనని తెలిపారు. ఎగుమతులను పెంచడంలో ఎంఎస్ఎంఈలకు సాయపడే దిశగా  ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని చెప్పారు. ఇందుకు అనుగుణంగా కృషి చేయాల్సిందిగా విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలను ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అవి చేస్తున్న కృషిని వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం అనే మూడు పారామితుల ప్రాతిపదికన మూల్యాంకనం చేస్తున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.

   ప్రధానమంత్రి రోజ్‌గార్ సృజన్ కార్యక్రమం 2008-2012 మధ్య కాలంలో లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైందన్నారు. అందుకే 2014 తర్వాత దీన్ని సరికొత్తగా తీర్చిదిద్దామని ప్రధానమంత్రి తెలిపారు. దీంతో 2014 నుంచి ఈ కార్యక్రమం కింద ఇప్పటిదాకా 40 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయని పేర్కొన్నారు. ఈ కాలంలో ఈ సంస్థలకు రూ.14 వేల కోట్ల విలువైన ఆర్థిక సహాయాన్ని రాయితీ రూపంలో అందించామని తెలిపారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే ఉత్పత్తుల ధర పరిమితిని కూడా పెంచినట్లు ఆయన వెల్లడించారు. సమ్మిళిత అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ- లింగమార్పిడి వర్గంలోని వ్యవస్థాపకులు తమ లక్ష్యాలను సాకారం చేసుకునే దిశగా అన్నిరకాల సహాయాన్ని అందిస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. ఇక నేడు తొలిసారిగా ఖాదీ-గ్రామీణ పరిశ్రమల సంస్థ వార్షిక వాణిజ్య పరిమాణం రూ.లక్ష కోట్లు దాటిందని ప్రధాని వివరించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లోని మన చిన్న పారిశ్రామికవేత్తలు, సోదరీమణులు ఎంతో శ్రమించడం వల్లనే ఇది సాధ్యమైంది... ఆ మేరకు గత 8 ఏళ్లలో ఖాదీ విక్రయాలు 4 రెట్లు పెరిగాయి’’ అన్నారు.

   మాజంలోని బలహీన వర్గాలు వ్యవస్థాపకన మార్గాన్ని అనుసరించడంలో హమీరహిత రుణాలు పొందడానికి ఇబ్బందులు ఉండటం ప్రధాన అవరోధంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో 2014 తర్వాత ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్.. సబ్‌కా ప్రయాస్’ ద్వారా వ్యవస్థాపకన పరిధిని విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి తగినట్లుగా ప్రవేశపెట్టిన ‘ముద్రా యోజన’ ప్రతి భారతీయుడి వ్యవస్థాపన కలను సాకారం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఆయన అన్నారు. ఈ పథకం కింద హామీ లేకుండా బ్యాంకు రుణాలు లభించడంతో దేశవ్యాప్తంగా మహిళా, దళిత, వెనుకబడిన, గిరిజన పారిశ్రామికవేత్తల సంఖ్య భారీగా పెరిగిందని గుర్తుచేశారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా దాదాపు రూ.19 లక్షల కోట్ల మేర రుణాలివ్వగా, రుణ గ్రహీతలలో దాదాపు 7 కోట్ల మంది తొలిసారిగా వ్యవస్థాపకులైన కొత్త పారిశ్రామికవేత్తలు ఉన్నారని ఆయన తెలిపారు. ఇక ‘ఉద్యమ’ పోర్టల్ లో నమోదైనవారిలో 18 శాతం మహిళా పారిశ్రామికవేత్తలేనని చెప్పారు. ‘‘వ్యవస్థాపనతోపాటు ఆర్థికంగానూ సార్వజనీనత సాధనే సామాజిక న్యాయ కల్పనకు నిజమైన నిదర్శనాలు’’ అని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ- ‘‘ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ‘ఎంఎస్ఎంఇ’ రంగంతో ముడిపడి ఉన్న నా సోదర-సోదరీమణులందరికీ నేను హామీ ఇస్తున్నాను. మీ అవసరాలను తీర్చగల విధానాలను రూపొందించడానికి, మీతో చురుగ్గా అడుగు కలపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వ్యవస్థాపక భారతం సాధించే ప్రతి విజయం మనను స్వయం సమృద్ధ భారతదేశం దిశగా నడుపుతుంది. ఆ మేరకు మీతోపాటు మీ సామర్థ్యాన్ని నేను విశ్వసిస్తున్నాను’’ అని భరోసా ఇచ్చారు.

కార్యక్రమ నేపథ్యం

   ‘ఉద్యమ భారతం’ అన్నది ‘ఎంఎస్ఎంఈ’ల సాధికారత దిశగా ప్రభుత్వం తొలిరోజు నుంచీ చూపుతున్న నిబద్ధతకు ప్రతీక. ‘ఎంఎస్ఎంఈ’ రంగానికి కావాల్సిన, సమయానుగుణ మద్దతు కోసం ‘ముద్రా యోజన, అత్యవసర దశలవారీ రుణహామీ పథకం, సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవన నిధుల పథకం (స్ఫూర్తి) తదితర అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రారంభిస్తూ వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాదిగా ప్రజలకు ప్రయోజనం చేకూరింది.

   ‘ఎంఎస్ఎంఈ’ పనితీరు మెరుగు-వేగిరపరచే (ర్యాంప్) పథకం రూ.6,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించబడింది. ప్రస్తుత ‘ఎంఎస్ఎంఈ’ సంబంధిత పథకాల ద్వారా రాష్ట్రాలలో ‘ఎంఎస్ఎంఈ’ రంగం సామర్థ్యం, పరిధి విస్తరించడం ‘ర్యాంప్’ లక్ష్యం. ఇది ‘ఎంఎస్ఎంఈ’లను స్పర్థాత్మకంగా మార్చడం కోసం నవ్యావిష్కరణలను, ఆలోచనలను ప్రోత్సహించడంతోపాటు  నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు దోహదపడుతుంది. అలాగే విధానాలు-ప్రక్రియలుసహా మార్కెట్ లభ్యతను మెరుగుపరుస్తుంది. సాంకేతిక సాధనాలు, పరిశ్రమ 4.0 వినియోగం ద్వారా కొత్త వ్యాపార, వ్యవస్థాపకతలకు ఊతమిస్తూ స్వయం సమృద్ధ భారతం సాధన కృషికి బాసటగా నిలుస్తుంది.

   ‘ఆరంభ ‘ఎంఎస్ఎంఈ’ ఎగుమతిదారుల సామర్థ్యం పెంపు’ (సీబీఎఫ్టీఈ) పథకం అంతర్జాతీయ మార్కెట్ కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాల వస్తుసేవలు అందించేలా ‘ఎంఎస్ఎంఈ’లను ప్రోత్సహిస్తుంది. ప్రపంచ ఉత్పాదక-సరఫరా వ్యవస్థలో భారతీయ ‘ఎంఎస్ఎంఈ’ల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం ద్వారా తమ ఎగుమతి సామర్థ్యాన్ని గ్రహించడంలో వాటికి సహాయపడుతుంది.

   ‘ఎంఎస్ఎంఈ’ రంగం ప్రగతి దిశగా ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం’ (పీఎంఈజీపీ)లో ప్రవేశపెట్టిన కొత్త అంశాల విషయానికొస్తే- తయారీ రంగానికి గరిష్ఠ ప్రాజెక్ట్ వ్యయం (రూ. 25 లక్షల నుంచి) రూ.50 లక్షలకు, సేవా రంగంలో (రూ.10 లక్షల నుంచి) రూ. 20 లక్షలకు పెంచబడింది. అంతేకాకుండా ప్రత్యేక కేటగిరీకింద ప్రగతికాముక జిల్లాలు, లింగమార్పిడి వర్గం నుంచి దరఖాస్తుదారులు అధిక రాయితీలను పొందడానికి వీలుగా ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. బ్యాంకింగ్, సాంకేతిక, మార్కెటింగ్ నిపుణుల సమ్మేళనంతో దరఖాస్తుదారులు/ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు దోహదం చేస్తుంది.

    ‘ఎంఎస్ఎంఈ’ ఐడియా హ్యాకథాన్-2022 అనేది వ్యక్తులలో నిబిడీకృతమైన సృజనాత్మకతను ప్రోత్సహించి, మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ‘ఎంఎస్ఎంఈ’లలో సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణల అనుసరణను ప్రోత్సహిస్తుంది. సంరక్షకత్వంపై ఎంపిక చేసిన వినూత్న ప్రతిపాదనలకు రూ.15 లక్షల మేర ఆర్థిక సహాయం అందించబడుతుంది.

   ‘ఎంఎస్ఎంఈ’ జాతీయ అవార్డులు-2022 అనేది భారతదేశ గతిశీల ‘ఎంఎస్ఎంఈ’ రంగం  వృద్ధి, ప్రగతి దిశగా అత్యుత్తమ పనితీరు కనబరచిన ‘ఎంఎస్ఎంఈ’లు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు ప్రగతికాముక జిల్లాలు, బ్యాంకుల సహకారానికి గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన కార్యక్రమం.


(Release ID: 1838495) Visitor Counter : 214