ప్రధాన మంత్రి కార్యాలయం

2022 జూన్ నెల 26 వ తేదీ నాటి ‘ మన్ కీబాత్ ’ (‘ మనసు లోమాట ’) కార్యక్రమం 90 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 26 JUN 2022 11:49AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ’మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం మీ అందరి నుండి నాకు చాలా లేఖ లు వచ్చాయి. సామాజిక మాధ్యమాల నుండి మరియు , నమోఏప్ (NaMoApp) లోను నాకు చాలా సందేశాలు వచ్చాయి. దీనికి గాను మీకు నేను చాలా కృతజ్ఞుడి గా ఉన్నాను. ఈ కార్యక్రమం లో పరస్పర ప్రేరణదాయకమైన ప్రయాసల ను చర్చించడం, ప్రజల ఆందోళన ద్వారా వచ్చిన మార్పు గాథల ను దేశం అంతటికి తెలియజేయాలనేదే మన అందరి ప్రయత్నంగా ఉంది. దేశం లోని ప్రతి ఒక్కరి జీవనం లో గొప్ప ప్రాముఖ్యం ఉన్న ప్రజాందోళన ను గురించి నేను ఈ రోజు న మీ తో చర్చించాలి అని అనుకొంటున్నాను. కానీ, అంతకు ముందు నేను నేటి తరం యువత ను- 24-25 సంవత్సరాల యువతీయువకుల ను- ఒక ప్రశ్న అడగాలి అని అనుకొంటున్నాను. ప్రశ్న చాలా గంభీరమైంది. నా ప్రశ్న ను గురించి తప్పక ఆలోచించండి. మీ వయస్సు లో ఉన్నప్పుడు మీ తల్లితండ్రుల కు జీవించే హక్కు కూడా ఒకప్పుడు లేదు అనే సంగతి మీకు తెలుసా! అలా ఎలా అవుతుంది?, ఇది అసంభవం అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. కానీ నా యువ మిత్రులారా, ఇది మన దేశం లో ఒకసారి జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట 1975 నాటి సంగతి ఇది. జూన్‌ లో ఇదే సమయం లో అత్యవసర పరిస్థితి - ఎమర్జెన్సీ- ని విధించారు. అప్పుడు దేశ ప్రజలు అన్ని హక్కుల ను కోల్పోయారు. రాజ్యాంగం లోని 21వ అధికరణం ప్రకారం భారతీయులందరికీ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉన్నాయి. ఆ కాలం లో భారత ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగాయి. దేశం లోని న్యాయస్థానాలు, ప్రతి రాజ్యాంగ సంస్థ, పత్రికా రంగాలు అన్నీ నియంత్రణ కు గురయ్యాయి. ఆమోదం లేకుండా ఏదీ ముద్రించకూడదు అని సెన్సార్‌షిప్ షరతు. నాకు గుర్తుంది- అప్పటి ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశంసించేందుకు నిరాకరించడం తో ఆయన పై నిషేధం విధించారు. రేడియో లోకి ఆయన ప్రవేశ అవకాశాన్ని తొలగించారు. అయితే ఎన్నో ప్రయత్నాలు, వేల సంఖ్య లో అరెస్టు లు, లక్షల మంది పై దౌర్జన్యాల తరువాత ప్రజాస్వామ్యం పై భారత ప్రజల విశ్వాసం ఎంతమాత్రం సడలలేదు. భారతదేశ ప్రజల లో శతాబ్దాలు గా కొనసాగుతున్న ప్రజాస్వామ్య విలువ లు, మన హృదయాల లో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి చివరకు విజయం సాధించాయి. భారతదేశం ప్రజలు ఎమర్జెన్సీ ని తొలగించి ప్రజాస్వామ్య పద్ధతి లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించారు. నియంతృత్వ మనస్తత్వాన్ని, నియంతృత్వ ధోరణి ని ప్రజాస్వామ్య పద్ధతి లో ఓడించడం విషయం లో ప్రపంచం మొత్తం లో ఇలాంటి ఉదాహరణ దొరకడం కష్టం. ఎమర్జెన్సీ సమయం లో దేశ ప్రజల పోరాటాని కి సాక్షి గా, భాగస్వామి గా ఉండే అదృష్టం - ప్రజాస్వామ్య సైనికుడి గా నాకు లభించింది. నేడు-దేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం గా- అమృత మహోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భం లో ఆ భయంకరమైన ఎమర్జెన్సీ కాలాన్ని మనం ఎన్నటికీ మరచిపోకూడదు. రాబోయే తరాలు కూడా మరవకూడదు. అమృత మహోత్సవం వందల సంవత్సరాల బానిసత్వం నుండి విముక్తి విజయ గాథ ను మాత్రమే కాకుండా, స్వాతంత్ర్యం తరువాత 75 సంవత్సరాల ప్రయాణాన్ని కూడా ఇముడ్చుకొంటుంది. చరిత్ర లోని ప్రతి ముఖ్యమైన దశ నుంచి నేర్చుకొంటూ ముందుకు సాగుతున్నాం.

 

ప్రియమైన నా దేశవాసులారా, జీవనం లో ఆకాశాని కి సంబంధించిన ఊహ లు లేని వారు అంటూ మనలో ఎవ్వరూ ఉండరు. చిన్నతనం లో ఆకాశం లోని చంద్రుడు, నక్షత్రాల కథ లు అందరి ని ఆకర్షిస్తాయి. యువత కు ఆకాశాన్ని తాకడం కలల ను నిజం చేయడానికి పర్యాయపదం గా ఉంటుంది. నేడు- మన భారతదేశం అనేక రంగాల లో విజయాల ఆకాశాన్ని తాకుతున్నప్పుడు ఆకాశం లేదా అంతరిక్షం దాని నుంచి దూరం గా ఎలా ఉండగలదు! గత కొన్నేళ్లు గా మన దేశం లో అంతరిక్ష రంగాని కి సంబంధించి ఎన్నో పెద్ద పనులు జరిగాయి. దేశం సాధించిన ఈ విజయాల లో ఒకటి ఇన్-స్పేస్ అనే ఏజెన్సీ ఏర్పాటు. భారతదేశ అంతరిక్ష రంగం లో ప్రైవేటు భాగస్వామ్యాని కి కొత్త అవకాశాల ను ప్రోత్సహిస్తున్న ఏజెన్సీ ఇది. ఈ ప్రారంభం మన దేశ యువత ను విశేషంగా ఆకర్షించింది. నాకు చాలా మంది యువకుల నుంచి దీనికి సంబంధించిన సందేశాలు కూడా వచ్చాయి. కొన్ని రోజుల క్రితం నేను ఇన్-స్పేస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్ళినప్పుడు చాలా యువ స్టార్ట్-అప్‌ స్ ఆలోచనల ను, ఉత్సాహాన్ని గమనించాను. నేను వారితో చాలా సేపు మాట్లాడాను. మీరు వారి ని గురించి తెలుసుకొంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఉదాహరణ కు, స్పేస్ స్టార్ట్-అప్‌ స్ సంఖ్య ను, వేగాన్నే తీసుకోండి. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం లో అంతరిక్ష రంగం లో స్టార్ట్-అప్‌ స్ ను గురించి ఎవరూ ఆలోచించలేదు. నేడు వాటి సంఖ్య వంద కు పైగా ఉంది. ఈ స్టార్ట్-అప్‌ స్ అన్నీ ఇంతకు ముందు ఆలోచించని, ప్రైవేట్ రంగాని కి అసాధ్యమని భావించిన ఆలోచనల పై పనిచేస్తున్నాయి. ఉదాహరణ కు చెన్నై, హైదరాబాద్‌ లలోఅగ్నికుల్ , స్కైరూట్ అనే రెండు స్టార్ట్-అప్‌ స్ ఉన్నాయి. ఈ స్టార్ట్-అప్‌ స్ తక్కువ భారాన్ని అంతరిక్షం లోకి తీసుకు పోయే వాహనాల ను అభివృద్ధి చేస్తున్నాయి. దీని కారణంగా స్పేస్ లాంచింగ్ ఖర్చు చాలా తక్కువ అవుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధం గా హైదరాబాద్‌కు చెందిన ధృవ స్పేస్ అనే మరో స్టార్ట్-అప్‌ కృత్రిమ ఉపగ్రహాల వినియోగం విషయం లో అత్యధిక సాంకేతికత ఉన్న సౌర ఫలకాల తో పని చేస్తోంది. అంతరిక్ష వ్యర్థాల ను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న మరో స్పేస్‌ స్టార్ట్-అప్‌ దిగంతరా కు చెందిన తన్ వీర్‌ అహమద్‌ తో కూడా భేటీ అయ్యాను. అంతరిక్ష వ్యర్థాల ను నిర్మూలించే సాంకేతికత పై పని చేయవలసింది గా వారికి నేను ఒక సవాలు ను కూడా ఇచ్చాను. దిగంతరా, ధృవ స్పేస్ లు రెండూ జూన్ 30వ తేదీ న ఇస్రో వాహక నౌక నుంచి వాటి మొదటి ప్రయోగాన్ని చేస్తున్నాయి. అదే విధం గా బెంగళూరు కు చెందిన స్పేస్ స్టార్ట్-అప్‌ స్ సంస్థ ఆస్ట్రోమ్ వ్యవస్థాపకురాలు నేహా గారు కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తో పని చేస్తున్నారు. చిన్నవి గా ఉండి, తక్కువ ఖర్చు తో కూడిన ఫ్లాట్ ఏంటెనా లను ఈ స్టార్ట్-అప్‌ స్ తయారు చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ కి ప్రపంచవ్యాప్తం గా డిమాండ్ ఉంటుంది.

సహచరులారా, ఇన్-స్పేస్ కార్యక్రమం లో నేను మెహసాణా పాఠశాల విద్యార్థిని తన్వీ పటేల్‌ తో కూడా భేటీ అయ్యాను. ఆమె చాలా చిన్న కృత్రిమ ఉపగ్రహం కోసం పని చేస్తున్నారు. దీనిని రాబోయే కొద్ది నెలల్లో అంతరిక్షం లోకి పంపబోతున్నారు. తన్వి తన పని ని గురించి గుజరాతీ లో చాలా సరళం గా చెప్పారు. తన్వి మాదిరి గానే దేశం లోని దాదాపు ఏడున్నర వందల మంది పాఠశాల విద్యార్థులు అమృత మహోత్సవం లో ఇటువంటి 75 ఉపగ్రహాల పై పని చేస్తున్నారు. ఈ విద్యార్థుల లో ఎక్కువ మంది దేశం లోని చిన్న పట్టణాల కు చెందిన వారు కావడం కూడా సంతోషకరమైన విషయమే.

సహచరులారా, ఇదే యువత మది లో కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష రంగం చిత్రం సీక్రెట్ మిశన్ లాగా ఉండేది. కానీ దేశం అంతరిక్ష రంగం లో సంస్కరణల ను చేపట్టింది. అదే యువత ఇప్పుడు వారి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. దేశం లోని యువత ఆకాశాన్ని తాకడాని కి సిద్ధం గా ఉన్నప్పుడు మన దేశం ఎలా వెనుకబడి పోతుంది?

ప్రియమైన నా దేశవాసులారా, ’మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఇప్పుడు మీ మనస్సు ను ఆహ్లాదపరచే, మీకు స్ఫూర్తి ని ఇచ్చే అంశాన్ని గురించి మాట్లాడుదాం. ఒలింపిక్ క్రీడల లో బంగారు పతకాన్ని గెలుచుకొన్న మన నీరజ్ చోప్రా ఇటీవల మళ్ళీ ముఖ్యాంశాల లో నిలచారు. ఒలింపిక్స్‌ ముగిసిన అనంతరం ఒక దాని తరువాత మరొకటి గా సరికొత్త రికార్డుల ను సృష్టిస్తున్నారు. ఫిన్‌లాండ్‌ లో శ్రీ నీరజ్ పావో నుర్మీ గేమ్స్‌ లో రజత పతకాన్ని సాధించారు. ఇది మాత్రమే కాదు- ఆయన తన సొంత జావెలిన్ త్రో రికార్డు ను కూడా బద్దలు కొట్టారు. కుర్టానే గేమ్స్‌ లో స్వర్ణాన్ని సాధించి దేశం గర్వించేటట్టు చేశారు. అక్కడ వాతావరణం చాలా ప్రతికూలం గా ఉన్నప్పటికీ ఆయన ఈ బంగారు పతకాన్ని గెలిచారు. ఈ ధైర్యమే నేటి యువతరాని కి గుర్తింపు. స్టార్ట్-అప్‌ స్ నుంచి క్రీడా ప్రపంచం వ‌ర‌కు భార‌త యువ‌త కొత్త రికార్డుల ను సృష్టిస్తున్నది. ఇటీవ‌ల జ‌రిగిన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలలో సైతం మ‌న క్రీడాకారులు ఎన్నో రికార్డుల ను సృష్టించారు. ఈ గేమ్‌ స్ లో మొత్తం 12 రికార్డు లు బద్దలయ్యాయని తెలుసుకోవడం మీకు సంతోషం గా ఉంటుంది. అంతే కాదు, 11 రికార్డుల ను మహిళా క్రీడాకారులు నమోదు చేశారు. మణిపుర్ కు చెందిన ఎం. మార్టినా దేవి గారు వెయిట్ లిఫ్టింగ్ లో ఎనిమిది రికార్డుల ను సృష్టించారు.

అలాగే సంజన, సోనాక్షి, భావన గారులు కూడా వేరు వేరు రికార్డుల ను సృష్టించారు. ఈ క్రీడాకారిణులు వారి కఠోర శ్రమ తో రానున్న కాలం లో అంతర్జాతీయ క్రీడల లో భారతదేశం యొక్క ఖ్యాతి ఎంతగా పెరుగుతుందనేది నిరూపించారు. ఈ క్రీడాకారులందరినీ నేను అభినందనలను వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్తు లో వారు రాణించాలంటూ వారి కి శుభాకాంక్షల ను కూడా అందిస్తున్నాను.

సహచరులారా, ఖేలో ఇండియా యువజన క్రీడల ది మరొక ప్రత్యేకత. ఈసారి కూడా ఇటువంటి చాలా మంది ప్రతిభావంతులు పెల్లుబుకారు. వీరు అతి సాధారణ కుటుంబాల కు చెందినటువంటి వారు. ఈ క్రీడాకారులు వారి జీవనం లో ఎంతో సంఘర్షణ చేసి మరీ విజయం తాలూకు ఈ స్థానాని కి చేరుకొన్నారు. వారి సాఫల్యం లో, వారి కుటుంబం మరియు తల్లితండ్రుల కు కూడా పెద్ద పాత్ర ఉంది.

డెబ్భై కిలోమీటర్ సైకిలింగ్‌ లో స్వర్ణాన్ని సాధించిన శ్రీనగర్‌ కు చెందిన ఆదిల్ అల్తాఫ్ యొక్క తండ్రి దర్జీ పని చేస్తారు. కానీ, ఆయన తన కుమారుని కలల ను నెరవేర్చడానికి చిక్కిన ఏ అవకాశాన్నీ వదలిపెట్టలేదు. ఇప్పుడు ఆదిల్ వాళ్ల నాన్న తో కలసి సమస్త జమ్ము-కశ్మీర్ గర్వం తో తల ఎత్తుకొనేటట్టు చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్న చెన్నై కి చెందిన ఎల్.ధనుష్ యొక్క తండ్రి కూడా ఓ సాధారణ కార్పెంటర్ గా ఉన్నారు. సాంగ్ లీకి చెందిన అమ్మాయి కాజోల్ సర్ గార్ యొక్క తండ్రి చాయ్ అమ్ముతూ ఉంటారు. కాజోల్ తన తండ్రి పని లో సాయం చేయడంతో పాటు గా వెయిట్ లిఫ్టింగ్ అభ్యాసాన్ని కూడా కొనసాగించే వారు. ఆమె, ఆమె కుటుంబం యొక్క కృషి ఫలించింది. కాజోల్ వెయిట్ లిఫ్టింగ్‌ లో బోలెడన్ని ప్రశంసల కు పాత్రురాలు అయ్యారు. రోహ్‌తక్‌ కు చెందిన తను కూడా ఇదే విధమైన కృషి ని చేశారు. తను తండ్రి శ్రీ రాజ్‌బీర్ సింహ్ రోహ్‌తక్‌ లో ఓ పాఠశాల లో బస్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. తను కుస్తీ లో బంగారు పతకాన్ని గెలుచుకొని, తన కల తో పాటు గా తన కుటుంబం కల ను, తన తండ్రి కల ను నిజం చేసి చూపెట్టారు.

సహచరులారా, క్రీడా జగతి లో, ఇప్పుడు, భారతీయ క్రీడాకారుల ప్రాబల్యం పెరుగుతున్నది. దీనితో పాటు, భారతీయ క్రీడల కు కూడాను కొత్త గుర్తింపు లభిస్తోంది. అదెలాంగంటే, ఈ సారి ఖేలో ఇండియా యువజన క్రీడల లో ఒలింపిక్స్ లో చేర్చే పోటీల తో పాటు అయిదు స్వదేశీ ఆటల ను కూడా చేర్చడమైంది. ఈ ఐదు క్రీడలు ఏవేవి అంటే అవి గత్ కా, థాంగ్ తా, యోగాసనాలు, కలరిపయట్టు, ఇంకా మల్ల్ ఖంబ్ లు.

సహచరులారా, భారతదేశం లో ఒక క్రీడ యొక్క అంతర్జాతీయ టువర్నమెంట్ జరుగనుంది. ఆ ఆట శతాబ్దాల కు పూర్వం మనదేశం లోనే పుట్టింది. ఇది జులై 28వ తేదీ నుంచి మొదలయ్యే చెస్ ఒలింపియాడ్ ఈవెంట్. ఈసారి 180 కి పైగా దేశాలు చెస్ ఒలింపియాడ్‌ లో పాల్గొంటున్నాయి. మన నేటి క్రీడ లు, ఫిట్‌నెస్‌ ల చర్చ ఒక పేరు లేకుండా పూర్తి కాదు. ఆ పేరు – తెలంగాణ కు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ గారి ది. ‘ఏడు శిఖరాగ్రాల సవాలు’ ను పూర్తి చేయడం ద్వారా పూర్ణ మరో పతాకాన్ని రెపరెపలాడించారు. ఏడు శిఖరాగ్రాల సవాలు అంటే ప్రపంచం లో అత్యంత కఠినమైన, ఎత్తయిన పర్వతాల ను అధిరోహించడం అనే సవాలే. పూర్ణ ఉన్నత సాహసం స్ఫూర్తి తో ఉత్తర అమెరికా లో అన్నిటికంటే ఎత్తయినటువంటి శిఖరం ‘మౌంట్ దెనాలి’ యొక్క ఆరోహణ ను పూర్తి చేయడం ద్వారా దేశాని కి గౌరవాన్ని సంపాదించిపెట్టారు. ఆమె - 13 ఏళ్ల వయస్సు లోనే మౌంట్ ఎవరెస్ట్ పై పైచేయి ని సాధించినటువంటి అద్భుత కృత్యాన్ని సాకారం చేసిన భారతదేశం పుత్రిక పూర్ణ.

సహచరులారా, క్రీడల విషయాన్ని ప్రస్తావించుకొంటున్నాం గనక నేను ఈ రోజు న భారతదేశం లోని అత్యంత ప్రతిభాశాలి క్రికెటర్ లలో ఒకరైన మిథాలీ రాజ్ గారిని గురించి కూడా చర్చించదలచుకొన్నాను. ఈ నెల లో ఆమె క్రికెట్‌ కు రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఇది చాలా మంది క్రీడాభిమానుల ను భావోద్వేగానికి గురి చేసింది. మిథాలీ రాజ్ ఓ అసాధారణ క్రీడాకారిణి మాత్రమే కాదు- చాలా మంది క్రీడాకారుల కు ప్రేరణమూర్తి గా కూడా ఉన్నారామె. మిథాలీ రాజ్ గారి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకొంటూ ఆమె కు అనేకానేక శుభాకాంక్షల ను వ్యక్తంచేస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా, వ్యర్థాల నుంచి సంపద ను సృష్టించడానికి సంబంధించిన విజయవంతమైన ప్రయత్నాలను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం చర్చిస్తున్నాం. అలాంటి ఒక ఉదాహరణ మిజోరం రాజధాని ఐజ్ వాల్ ది. ఐజ్ వాల్‌ లో 'చిటే లుయీ' అనే అందమైన నది ఉంది. ఇది సంవత్సరాలు గా నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల మురికి గా, చెత్త కుప్ప గా మారిపోయింది. ఈ నది ని కాపాడేందుకు గత కొన్నేళ్లు గా ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఇందుకోసం స్థానిక సంస్థ లు, స్వచ్ఛంద సంస్థ లు, స్థానిక ప్రజానీకం కలసి సేవ్ చిటే లుయీ కార్యాచరణ ప్రణాళిక ను కూడా అమలు చేయడం జరుగుతున్నది. నది ని శుభ్రపరచే ఈ ఉద్యమం వ్యర్థాల నుండి సంపద సృష్టి కి కూడా అవకాశాన్ని కల్పించింది. వాస్తవానికి ఈ నదిలో, నది తీరాల లో ప్లాస్టిక్, పాలిథిన్ ల వ్యర్థాలు పెద్ద స్థాయి లో నిండి పోయి ఉన్నాయి. నది ని కాపాడేందుకు కృషి చేస్తున్న సంస్థ ఇదే పాలిథిన్‌ తో రోడ్డు వేయాలని నిర్ణయించింది. అంటే నది నుంచి వెలువడే వ్యర్థాల తో మిజోరం లోని ఓ గ్రామం లో రాష్ట్రం లోనే తొలిసారి గా ప్లాస్టిక్‌ రోడ్డు ను నిర్మించడం జరిగింది. అంటే స్వచ్ఛత తో పాటు వికాసం కూడా.

సహచరులారా, పాండిచ్చేరి యువత కూడా తమ స్వచ్ఛంద సంస్థ ల ద్వారా అటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. పాండిచ్చేరి సముద్రం ఒడ్డు న ఉంటుంది. అక్కడి బీచ్‌ల ను, సముద్ర శోభ ను చూసేందుకు పెద్ద సంఖ్య లో ప్రజలు వస్తుంటారు. కానీ, పాండిచ్చేరి సముద్ర తీరం లో కూడా ప్లాస్టిక్ వల్ల కాలుష్యం పెరుగుతోంది. అందుకే ఇక్కడి సముద్రాన్ని, బీచ్‌ల ను, జీవావరణాన్ని కాపాడేందుకు ఇక్కడి ప్రజలు 'రీసైక్లింగ్ ఫార్ లైఫ్' అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. పాండిచ్చేరి లోని కరైకల్‌ లో ఇప్పుడు ప్రతి రోజూ వేల కిలోల చెత్త ను సేకరించి, వేరు చేస్తున్నారు. అందులోని సేంద్రియ వ్యర్థాల ను ఎరువు గా చేసి, మిగిలిన వాటి ని వేరు చేసి రీసైకిల్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమే కాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ కు వ్యతిరేకం గా భారతదేశం చేస్తున్న ఉద్యమానికి జోరు ను అందిస్తాయి.

సహచరులారా, మీతో నేను మాట్లాడుతున్న ఈ సమయం లో హిమాచల్ ప్రదేశ్‌ లో ఒక ప్రత్యేకమైన సైకిలింగ్ ర్యాలీ కూడా జరుగుతోంది. దీని ని గురించి కూడా మీకు నేను చెప్పదలచుకొన్నాను. షిమా లా నుంచి మండీ వరకు సైకిలిస్టు ల బృందం పరిశుభ్రత సందేశాన్ని తీసుకువెళ్ళడం ప్రారంభించింది. పర్వత ప్రాంత రహదారుల పై దాదాపు 175 కిలోమీటర్ల దూరాన్నివారు సైకిలింగ్ ద్వారా మాత్రమే పూర్తి చేస్తారు. ఈ బృందం లో పిల్లల తో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. మన పరిసరాలు పరిశుభ్రం గా ఉంటే - మన పర్వతాలు, నదులు, మన సముద్రాలు శుభ్రంగా ఉంటే - మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అటువంటి ప్రయత్నాల ను గురించి మీరు నాకు రాస్తూ ఉండాలి.

ప్రియమైన నా దేశప్రజలారా, మన దేశం లో రుతుపవనాలు నిరంతరం విస్తరిస్తున్నాయి. పలు రాష్ట్రాల లో వర్షాలు పెరుగుతున్నాయి. 'నీరు', 'జల సంరక్షణ' దిశ లలో విశేష కృషి చేయవలసిన సమయం కూడా ఇదే. మన దేశం లో శతాబ్దాలు గా ఈ బాధ్యత ను సమాజం తీసుకుంటోంది. మీకు గుర్తుండే ఉంటుంది- ’మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం ఒకసారి దిగుడు బావుల వారసత్వ సంపద ను గురించి చర్చించాం. మెట్ల బావులు లేదా దిగుడు బావుల లో మెట్లు దిగడం ద్వారా నీటి ని చేరుకుంటారు. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పుర్‌ లో వందల సంవత్సరాల నాటి ఇటువంటి బావి ఒకటి ఉంది. దానిని 'సుల్తాన్ బావి' అంటారు. దీనిని రావు సుల్తాన్ సింహ్ నిర్మించారు. కానీ నిర్లక్ష్యం కారణం గా ఈ ప్రదేశం క్రమంగా నిర్మానుష్యం అయిపోయి చెత్త కుప్ప గా మారింది. ఒక రోజు అక్కడ తిరుగుతున్న కొందరు యువకులు ఈ మెట్ల బావి వద్దకు వచ్చి దాని పరిస్థితి ని చూసి చాలా బాధపడ్డారు. ఆ యువకులు సుల్తాన్ మెట్ల బావి రూపురేఖల ను, అదృష్టాన్ని మార్చాలని ఆ క్షణం లో సంకల్పించారు. వారు వారి యొక్క ఈ మిశన్‌ కు పెట్టిన పేరు ఏమిటి అంటే అది 'సుల్తాన్ సే సుర్-తాన్' లేదా ‘సుల్తాన్ నుంచి స్వర తాళాల వరకు’ అనేదే. ఈ సుర్-తాన్ లేదా స్వర తాళాలు ఏమిటి అని మీరు ఆలోచిస్తుండవచ్చు. నిజానికి ఈ యువకులు వారి ప్రయాసల తో మెట్ల బావి ని పునరుద్ధరించడమే కాకుండా సంగీత స్వర తాళాల తో దానిని జోడించివేశారు. సుల్తాన్ బావి ని శుభ్రం చేసిన తరువాత, దానిని అలంకరించిన తరువాత, అక్కడ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఈ మార్పు గురించి ఎంతగా చర్చ లు జరుగుతున్నాయంటే దీనిని చూడడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది రావడం ప్రారంభించారు. ఈ విజయవంతమైన ప్రయత్నం లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉద్యమాన్ని ప్రారంభించిన యువత చార్టర్డ్ అకౌంటెంట్ లు గా ఉన్నారు. యాదృచ్ఛికం గా, కొన్ని రోజు ల తరువాత జులై 1 న చార్టర్డ్ అకౌంటెంట్స్ దినం రానుంది. దేశం లోని సీఏలందరి ని ఈ సందర్భం లో ముందుగా అభినందిస్తున్నాను. నీటి వనరుల ను సంగీతం, ఇతర సామాజిక కార్యక్రమాల తో జతపరచడం ద్వారా మనం వాటి ని గురించిన ఈ తరహా జాగరూకత తాలూకు భావన ను అంకురింపచేయవచ్చును. జల సంరక్షణ వాస్తవం లో జీవన సంరక్షణే. మీరు చూసి ఉంటారు, ప్రస్తుతం ఎన్నో 'నదీ మహోత్సవాలు' జరగడం మొదలైంది. మీ పట్టణాల లో కూడాను ఈ తరహా నీటి వనరులు ఎక్కడ అయినా ఉన్నాయి అంటే అక్కడ ఏదో ఒక కార్యక్రమాన్ని తప్పక నిర్వహించాలి.

నా ప్రియమైన దేశప్రజలారా, మన ఉపనిషత్తు ల తాలూకు ఓ జీవన మంత్రం ఉంది – అదే 'చరైవేతి-చరైవేతి-చరైవేతి'. ఈ మంత్రాన్ని మీరు కూడా విని ఉంటారు. ఈ మాటల కు ‘కొనసాగించండి, కొనసాగించండి’ అని అర్థం. ఈ మంత్రం మన దేశం లో ఇంతగా లోకప్రియత్వాన్ని సంతరించుకొంది ఎందుకంటే నిరంతరం నడుస్తూ, గతిశీలం గా ఉండడం అనేది మన స్వభావం లో ఓ భాగంగా ఉంది. ఒక దేశం రూపం లో మనం, వేల సంవత్సరాల పాటు సాగిన అభివృద్ధి ప్రయాణం ద్వారా ఇక్కడి వరకు వచ్చాం. ఒక సమాజం గా మనం ఎప్పుడూ కొత్త ఆలోచనల ను, కొత్త మార్పుల ను స్వీకరిస్తూ ముందుకు సాగుతూవచ్చాం. మన సాంస్కృతిక చలనశీలత, యాత్ర లు దీనికి చాలా దోహదపడ్డాయి. అందుకే మన రుషులు, మునులు తీర్థయాత్ర వంటి ధార్మిక బాధ్యతల ను మనకు అప్పగించారు. మనమందరం వేర్వేరు తీర్థయాత్రల కు వెళ్తాం. ఈసారి చార్ ధామ్ యాత్ర లో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొనడం మీరు చూశారు. మన దేశం లో ఎప్పటికప్పుడు వివిధ దేవ యాత్ర లు కూడా జరుగుతాయి. దేవ యాత్ర లు అంటే భక్తులే కాదు- మన దైవాలు కూడా యాత్ర గా బయలుదేరుతారు. మరికొద్ది రోజుల లో జూలై 1వ తేదీ నుంచి భగవాన్ జగన్నాథు ని ప్రసిద్ధ యాత్ర ప్రారంభం కానుంది. ఒడిసా లో జరిగే పురీ యాత్ర ను గురించి దేశం లోని ప్రతి ఒక్కరి కి పరిచయం ఉంది. ఈ సందర్భం లో పురీ కి వెళ్లే భాగ్యం కలగాలి అన్నది ప్రజల ఆకాంక్షగా ఉంది. ఇతర రాష్ట్రాల లో కూడా జగన్నాథ యాత్ర ను ఘనంగా నిర్వహిస్తారు. జగన్నాథ యాత్ర ఆషాఢ మాసం రెండో రోజు న మొదలవుతుంది. మన గ్రంథాల లో ‘ఆషాఢస్య ద్వితీయ దివసే... రథయాత్ర’ అన్నారు. సంస్కృత శ్లోకాల లో ఈ వర్ణన కనిపిస్తుంది. గుజరాత్‌ లోని అహమదాబాద్‌ లో కూడా ఆషాఢ ద్వితీయ నుంచి ప్రతి సంవత్సరం రథయాత్ర సాగుతుంది. నేను గుజరాత్‌ లో ఉన్నాను కాబట్టి ప్రతి ఏటా ఈ యాత్ర లో సేవ చేసే అవకాశం కూడా నాకు లభించేది. ఆషాఢ ద్వితీయ ను ఆషాఢీ బిజ్ అని కూడా పిలుస్తారు. ఆ రోజు నుండి కచ్ఛ్ లో కొత్త సంవత్సరం కూడా ప్రారంభం అవుతుంది. కచ్ఛ్ లోని నా సోదరులకు, సోదరీమణులకు అందరి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. నాకు గుర్తుంది-ఆషాఢ ద్వితీయ కు ఒక రోజు ముందు - అంటే ఆషాఢ మాసం మొదటి రోజు న గుజరాత్‌ లో సంస్కృత భాష లో పాటలు, సంగీత,సాంస్కృతిక కార్యక్రమాల తో సంస్కృత పండుగ ను జరపడం ప్రారంభించాం. ఈ కార్యక్రమం పేరు – ‘ఆషాఢస్య ప్రథమ దివసే’. ఈ పండుగ కు ఈ ప్రత్యేకమైనటువంటి పేరు ను పెట్టడం వెనుక కూడా ఓ కారణం ఉంది. ఆషాఢ మాసం నుంచి వర్షాల రాక పై సుప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు మేఘదూతం ను రచించారు. మేఘదూతంలో ఒక శ్లోకం ఉంది – ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమ్ ఆశ్లిష్ట సానుమ్- అంటే ఆషాఢ మాసం లో తొలి రోజు పర్వత శిఖరాల తో కప్పబడిన మేఘాలు. ఇదే శ్లోకం, ఈ కార్యక్రమాని కి ఆధారం గా మారింది.

సహచరులారా, అహమదాబాద్ కావచ్చు. లేదా పురీ కావచ్చు.. జగన్నాథ భగవానుడు తన ఈ యాత్ర మాధ్మం ద్వారా మనకు లోతైనటువంటి అనేక మానవీయ సందేశాల ను అందిస్తున్నారు. భగవాన్ జగన్నాథుడు జగత్తు కు యజమానే. అయితే, ఆయన యాత్ర లో పేదలకు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక భాగస్వామ్యం ఉంటుంది. భగవంతుడు కూడా సమాజం లో ప్రతి వర్గంతోనూ, ప్రతి వ్యక్తితోనూ కలసి నడుస్తాడు. అలాగే మన దేశం లో జరిగే అన్ని యాత్రల లో పేద-ధనిక అనే భేదభావం ఉండదు. అన్ని వివక్షల కు అతీతం గా, కేవలం యాత్ర, సర్వోపరి గా ఉంటుంది. మహారాష్ట్ర లోని పంఢర్ పుర్ యాత్ర ను గురించి మీరు తప్పక విని ఉంటారు. పంఢర్ పుర్ యాత్ర లో ఒకరు పెద్ద, మరొకరు చిన్న అన్న భేదం ఉండదు. ప్రతి ఒక్కరు భగవాన్ వార్ కరీ గా మారుతారు, భగవాన్ విఠలుని సేవకులు అవుతారు. మరొక నాలుగు రోజుల లోనే జూన్ 30వ తేదీ న అమర్‌నాథ్ యాత్ర కూడా ప్రారంభం అవుతున్నది. దేశం నలుమూలల నుంచి భక్తులు అమర్‌నాథ్ యాత్ర కోసం జమ్ము- కశ్మీర్‌ కు చేరుకొంటారు. జమ్ము- కశ్మీర్‌ లోని స్థానిక ప్రజలు అంతే శ్రద్ధ తో ఈ యాత్ర యొక్క బాధ్యత ను తీసుకొంటారు, మరి తీర్థ యాత్రికుల కు సహకారాన్ని అందిస్తారు.

సహచరులారా, దక్షిణాది లో శబరిమల యాత్ర కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఈ మార్గం పూర్తి గా అడవులతో ఉన్న కాలం నుండి శబరిమల కొండల పై ఉన్న అయ్యప్ప దర్శనం కోసం ఈ యాత్ర కొనసాగుతోంది. నేటికీ ప్రజలు ఈ యాత్రల కు వెళ్లినప్పుడు ధార్మిక ఆచారాల నిర్వహణ నుంచి బస ఏర్పాటు ల వరకు పేదలకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అంటే ఈ యాత్రలు మనకు నేరు గా పేదలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. అందుకే ఇప్పుడు భక్తుల కు ఆధ్యాత్మిక యాత్ర లో సౌకర్యాల ను పెంచేందుకు దేశం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మీరు కూడా అటువంటి ఏదైనా యాత్ర కు వెళ్తే మీకు ఆధ్యాత్మ తో పాటుగా ‘ఏక్ భారత్-శ్రేష్ట భారత్’ దర్శనం సైతం కలుగుతుంది.

ప్రియమైన నా దేశవాసులారా, ఎప్పటిలాగే ఈసారి కూడా ’మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా మీ అందరి తో భేటీ అయ్యే ఈ అనుభవం చాలా ఆహ్లాదకరంగా ఉండింది. మనం దేశప్రజల సాఫల్యాల గురించి, కార్యసిద్ధుల గురించి చర్చించాం. వీటన్నిటి మధ్య, మనం కరోనా కు వ్యతిరేకం గా జాగ్రత గా ఉండడం పైన ధ్యాస పెట్టాలి. అయితే సంతోషం కలిగించే సంగతి ఏమిటి అంటే అది ప్రస్తుతం దేశం లో టీకామందు తాలూకు విస్తృత రక్షణ కవచం ఉండడమే. మనం సుమారు 200 కోట్ల వేక్సిన్ డోజు ల స్థాయి కి చేరుకొన్నాం. దేశం లో ప్రికాశన్ డోజుల ను కూడా ఇప్పించడం వేగవంతం అవుతోంది. మీ రెండో డోజు అనంతరం ప్రికాశన్ డోజు ను తీసుకొనే సమయం వస్తే మీరు ఈ మూడో డోజు ను తప్పక తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యుల కు-ముఖ్యం గా వృద్ధుల కు- ప్రికాశన్ డోజు ను ఇప్పించండి. చేతుల ను పరిశుభ్రం గా ఉంచుకోవడం, మాస్కుల ను పెట్టుకోవడం వంటి అవసరమైన జాగ్రత చర్యల ను కూడా మనం తీసుకోవలసి ఉంది. మనం వాన కాలం లో చుట్టుపక్కల మురికి వల్ల వచ్చే రోగాల విషయం లోనూ అప్రమత్తం గా ఉండాలి. మీరంతా జాగరూకులై ఉండండి. ఆరోగ్యం గా ఉండండి. మరి ఇటువంటి శక్తి తో ముందుకు సాగిపొండి. వచ్చే నెల లో మనం మరొక్క మారు కలుసుకొందాం. అప్పటి దాకా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

 

***



(Release ID: 1837122) Visitor Counter : 283