ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ విద్యా విధానం (ఎన్.ఈ.పి) 2020 అమలులో పురోగతిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన - ప్రధాన మంత్రి
ప్రవేశం, సమానత్వం, చేరిక, నాణ్యత లక్ష్యాలతో ఎన్అ.ఈ.పి-2020 అమలౌతోంది : ప్రధానమంత్రి
పాఠశాలకు వెళ్లే పిల్లల సాంకేతికతను అతిగా బహిర్గతం చేయడాన్ని నివారించడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలు రెండింటి ద్వారా నేర్చుకునే మిశ్రమ వ్యవస్థను అభివృద్ధి చేయాలి : ప్రధానమంత్రి
సైన్స్ ల్యాబ్ లు ఉన్న మాధ్యమిక పాఠశాలలు భూసార పరీక్షల కోసం తమ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి పనిచేయాలని సూచించిన - ప్రధానమంత్రి
జాతీయ క్రియాశీలక కమిటీ మార్గదర్శకత్వంలో రూపొందుతున్న - జాతీయ పాఠ్య ప్రణాళిక
ఉన్నత విద్యలో బహుళ ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్న - అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ లో నమోదైన దాదాపు 400 ఉన్నత విద్యా సంస్థలు
విద్యార్థులు ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను కొనసాగించేందుకు - యు.జి.సి. మార్గదర్శకాల ప్రకారం అనుమతి
పూర్తి స్థాయి ఆన్‌లైన్ కోర్సులను అమలు చేయడానికి హెచ్.ఈ.ఐ. లను అనుమతించడంతో ఆన్‌లైన్ అభ్యాసానికి పెద్ద ప్రోత్సాహంతో పాటు ఆన్‌లైన్ లో బోధించే పాఠ్యాంశాల అనుమతించదగిన పరిమితి 40 శాతానికి పెంపు
విద్యావిషయక సాధనలో భాషా సంబంధిత అడ్డంకులను తొలగించడానికి అమలవుతున్న - బహు భాషా బోధన
Posted On:
07 MAY 2022 6:05PM by PIB Hyderabad
జాతీయ విద్యా విధానం (ఎన్.ఈ.పి) 2020 అమలును ప్రధానమంత్రి ఈరోజు సమీక్షించారు. ఎన్.ఈ.పి. 2020 ని ప్రారంభించిన రెండు సంవత్సరాల కాలంలో ఈ విధానం కింద నిర్దేశించిన ప్రవేశం, సమానత్వం, చేరిక, నాణ్యత లక్ష్యాలను సాధించడానికి అనేక కార్యక్రమాలను అమలు చేయడాన్ని ఆయన గమనించారు. మనం 'అమృత్ కాల్' లో ప్రవేశించిన ప్రస్తుత సమయంలో, బడి పిల్లలను గుర్తించడం; వారిని తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం కోసం ప్రత్యేక ప్రయత్నాల నుండి, ఉన్నత విద్యలో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలను చేపట్టడం వరకు, దేశ పురోగతిని నిర్వచించే, నడిపించే అనేక పరివర్తనాత్మక సంస్కరణలు ప్రారంభించడం జరిగింది.
పాఠశాల విద్య
జాతీయ క్రియాశీలక కమిటీ మార్గదర్శకత్వంలో జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదాను రూపొందించే పని పురోగతిలో ఉందని ప్రధానమంత్రికి తెలియజేశారు. మెరుగైన అభ్యాస ఫలితాలు మరియు పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం పాఠశాల విద్యలో, బాలవాటికలో నాణ్యమైన ఈ.సి.సి.ఈ., నిపుణ్ భారత్, విద్యా ప్రవేశ్ వంటి కార్యక్రమాలు, పరీక్షల సంస్కరణలు, కళాత్మక విద్య, బొమ్మల ఆధారిత బోధన వంటి వినూత్న బోధనలను అవలంబించడం జరుగుతోంది. పాఠశాలలకు వెళ్లే పిల్లలకు సాంకేతికతను ఎక్కువగా బహిర్గతం చేయకుండా ఉండటానికి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల ద్వారా నేర్చుకునే మిశ్రమ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.
అంగన్ వాడీ ల నుండి పిల్లలు పాఠశాలలకు తరలివెళ్తారు కాబట్టి, అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించే సమాచార వివరాలను పాఠశాల సమాచార వివరాలతో ఎటువంటి తేడా లేకుండా అనుసంధానించాలి. పాఠశాలల్లో పిల్లలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక సహాయం తో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల్లో సహజంగా ఉండే నైపుణ్యాలను పెంపొందించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆట బొమ్మల వినియోగం పై దృష్టి సారించాలి. సైన్స్ ప్రయోగశాలలు ఉన్న మాధ్యమిక పాఠశాలలు తమ పరిధిలోని రైతులకు భూమి ఆరోగ్యంపై అవగాహన కల్పించి, భూసార పరీక్షల కోసం వారితో కలిసి పనిచేయాలని కూడా ఆయన సూచించారు.
ఉన్నత విద్యలో బహుళ అధ్యయన విధానం
డిజిలాకర్ వేదిక పై ప్రారంభించిన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ తో పాటు, ఎన్నిసార్లైనా చేరి, బయటకు వచ్చే అవకాశం, జీవితకాలం విద్యాభ్యాసం కొనసాగించడం కోసం రూపొందించిన మార్గదర్శకాలు ఇప్పుడు విద్యార్థులు వారి సౌలభ్యం, ఎంపిక ప్రకారం చదువుకోవడానికి వీలుకల్పిస్తున్నాయని అధికారులు ప్రధానమంత్రికి తెలియజేశారు. జీవితకాల అభ్యాసానికి కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు, క్లిష్టమైన, బహుళ అంశాలను ఒకే సారి అధ్యయనం చేయాలని ఆలోచించే అభ్యాసకుల సౌకర్యం కోసం యు.జి.సి. నూతన మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం విద్యార్థులు ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను కొనసాగించవచ్చు. జాతీయ ఉన్నత విద్యార్హత ప్రణాళిక (ఎన్.హెచ్.ఈ.క్యూ.ఎఫ్) రూపకల్పన కూడా చివరి దశలో ఉంది. ఎన్.హెచ్.ఈ.క్యూ.ఎఫ్. తో సమన్వయ పరుస్తూ, ప్రస్తుతం ఉన్న “డిగ్రీ కింది స్థాయి విద్యా కార్యక్రమం కోసం పాఠ్యప్రణాళిక మరియు క్రెడిట్ విధానాన్ని” యు.జి.సి. సవరిస్తోంది.
బహుళ నమూనా విద్య
ఆన్‌లైన్, సార్వత్రిక, బహుళ నమూనా విద్యా విధానాలను పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థలు రెండూ తీవ్రంగా ప్రోత్సహిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యాభ్యాసంలో కలిగిన అవాంతరాలను తగ్గించడంలో ఈ విధానం సహాయపడింది. అదేవిధంగా, దేశంలోని మారుమూల ప్రాంతాలతో పాటు, అందుబాటులో లేని ప్రాంతాలకు విద్య ను చేర్చడంలో ఈ విధానం గొప్పగా దోహదపడింది. స్వయం, దీక్ష, స్వయం ప్రభ, వర్చువల్ ల్యాబ్ లు, ఇతర ఆన్‌లైన్ రిసోర్స్ పోర్టల్స్ అన్నీ విద్యార్థులను నమోదు చేసుకోవడంలో విజయవంతమయ్యాయి. దృష్టి లోపం ఉన్న వారి కోసం పలు భారతీయ భాషల్లో సంకేత భాష, శ్రవణ మాధ్యమం తో సహా అధ్యయన సామగ్రి ని ఈ పోర్టల్స్ అందిస్తున్నాయి.
పైన పేర్కొన్న వాటితో పాటు, సార్వత్రిక, దూర విద్యా విధానం (ఓ.డి.ఎల్) మరియు ఆన్‌లైన్ విద్యా విధానాలకు అవసరమైన నిబంధనలను యు.జి.సి. ప్రకటించింది. వీటి కింద 59 ఉన్నత విద్యా సంస్థలు (హెచ్.ఈ.ఐ. లు) 351 పూర్తి స్థాయి ఆన్‌లైన్ ద్వారా విద్యా కార్యక్రమాలను అందించడంతో పాటు, 86 హెచ్.ఏఈ. లు 1081 ఓ.డి.ఎల్. కార్యక్రమాలను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్ లో బోధించే పాఠ్యాంశాల అనుమతించదగిన పరిమితిని కూడా 40 శాతానికి పెంచడం జరిగింది.
ఆవిష్కరణలు, అంకురసంస్థలు
అంకుర సంస్థలు మరియు ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి, 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న హెచ్.ఈ.ఐ. లలో 2,774 సంస్థాగత ఆవిష్కరణ మండళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. పరిశోధన, ఇంక్యుబేషన్, అంకుర సంస్థల సంస్కృతి ని సృష్టించడం కోసం ఎన్.ఈ.పి. తో అనుసంధానమైన అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్ (ఏ.ఆర్.ఐ.ఐ.ఏ) ను 2021, డిసెంబర్ నెలలో ప్రారంభించడం జరిగింది. ఏ.ఆర్.ఐ.ఐ.ఏ. లో 1438 సంస్థలు పాల్గొన్నాయి. ఆలోచనల అభివృద్ధి, మూల్యాంకనం, వినియోగం (ఐ.డి.ఈ.ఏ.) ల్యాబ్ ల కోసం యాంత్రికంగా నేర్చుకోవడం కంటే అనుభవంతో నేర్చుకోవడం కోసం పారిశ్రామిక భాగస్వామ్యంతో 100 సంస్థలకు ఏ.ఐ.సి.టి.ఈ. ద్వారా నిధులు అందజేయడం జరిగింది.
భారతీయ భాషలకు ప్రోత్సాహం
ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఏ విద్యార్థి విద్యార్హతకి ఆటంకం కలగకుండా ఉండేలా విద్య మరియు పరీక్షల్లో బహుభాషా ప్రవృత్తి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు ద్విభాషా / త్రిభాషా పాఠ్యపుస్తకాలను ప్రాధమిక స్థాయిలో ప్రచురించడంతో పాటు, దీక్షా వేదిక లోని విషయాలు 33 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. భారతీయ సంకేత భాష (ఐ.ఎస్.ఎల్) ని సెకండరీ స్థాయిలో ఒక భాషా సబ్జెక్ట్ గా ఎన్.ఐ.ఓ.ఎస్. ప్రవేశపెట్టింది.
ఎన్.టి.ఏ. 13 భాషల్లో జె.ఈ.ఈ. పరీక్ష నిర్వహించింది. ఏ.ఐ. -ఆధారిత అనువాద యాప్ ను ఏ.ఐ.సి.టి.ఈ. అభివృద్ధి చేసింది. స్టడీ మెటీరియల్ భారతీయ భాషల్లోకి అనువదించడం జరుగుతోంది. హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సాంకేతిక పుస్తకాలు రాయడం జరుగుతోంది. 2021-22 నుంచి 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్ కళాశాలల్లో 6 భారతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రాంతీయ భాషల్లో అదనంగా 30/60 సూపర్ న్యూమరీ సీట్లు మరియు ప్రాంతీయ భాషల్లో 50 శాతం వరకు మంజూరైన సీట్లు ఏ.ఐ.సి.టి.ఈ. ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
ఎన్.ఈ.పి. 2020 సిఫార్సుల ప్రకారం భారతీయ జ్ఞాన విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది. ఏ.ఐ.సి.టి.ఈ. లో భారతీయ జ్ఞాన విధానాన్ని స్థాపించడంతో పాటు, దేశవ్యాప్తంగా 13 ఐ.కె.ఎస్.కే. కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.
ఈ సమావేశంలో - కేంద్ర విద్య (ఎం.ఓ.ఈ), నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత (ఎం.ఎస్.డి.ఈ) శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; కేంద్ర ఎం.ఎస్.డి.ఈ. శాఖ సహాయ మంత్రి, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్; ఎం.ఓ.ఎస్., ఎం.ఓ.ఈ. శ్రీ సుభాష్ సర్కార్; ఎం.ఓ.ఎస్., ఎం.ఓ.ఈ. శ్రీమతి అన్నపూర్ణాదేవి; ఎం.ఓ.ఎస్., ఎం.ఓ.ఈ. & ఎం.ఈ.ఏ. శ్రీ రాజ్‌కుమార్ రంజన్ సింగ్; ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి; క్యాబినెట్ కార్యదర్శి; ప్రధానమంత్రి సలహాదారుడు; యు.జి.సి. చైర్మన్; ఏ.ఐ.సి.టి.ఈ. చైర్మన్; ఎన్.సి.వి.ఈ.టి. చైర్మన్; ఎన్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ తో పాటు విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1824282)
Visitor Counter : 279
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam