ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన - తెలుగు అనువాదం

Posted On: 02 MAY 2022 8:15PM by PIB Hyderabad

ఛాన్సలర్ స్కోల్జ్,

 


స్నేహితులారా !

 

గుటెన్ ట్యాగ్, నమస్కారం !

 

 

 

నన్ను, నా ప్రతినిధి బృందాన్ని సాదరంగా స్వాగతించినందుకు, ముందుగా ఛాన్సలర్ స్కోల్జ్‌ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  ఈ ఏడాది నా తొలి విదేశీ పర్యటన జర్మనీలో జరగడం సంతోషంగా ఉంది.  ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక విదేశీ నాయకుడితో నా మొదటి టెలిఫోన్ సంభాషణ కూడా నా స్నేహితుడు, ఛాన్సలర్ స్కోల్జ్‌ తోనే జరిగింది.  ఛాన్సలర్ స్కోల్జ్ కోసం, ఈ రోజు చేసిన భారత-జర్మనీ ఐ.జి.సి. నే,  ఈ సంవత్సరం ఏ దేశంతోనైనా చేసిన మొదటి ఐ.జి.సి. భారత, జర్మనీ దేశాలు ఈ ముఖ్యమైన భాగస్వామ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో ఈ అనేక మొదటి అంశాలు తెలియజేస్తున్నాయి.  ప్రజాస్వామ్య దేశాలు గా ఉన్న భారత, జర్మనీ దేశాలు అనేక సాధారణ విలువలను పంచుకుంటాయి.  ఈ భాగస్వామ్య విలువలు, భాగస్వామ్య ప్రయోజనాల ఆధారంగా, అనేక సంవత్సరాలుగా మన ద్వైపాక్షిక సంబంధాలలో విశేషమైన పురోగతి ఉంది.

 

 

 

మన చివరి ఐ.జి.సి. 2019 లో జరిగింది.  ఆ తర్వాత ప్రపంచంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది.  ఇటీవలి భౌగోళిక రాజకీయ సంఘటనలు ప్రపంచ శాంతి, సుస్థిరత ఎంత దుర్బలంగా ఉన్నాయో; అన్ని దేశాలు ఎంత పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయో, చూపించాయి.  ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభం నుండి, మేము తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపు నిచ్చాము, వివాదాన్ని పరిష్కరించడానికి చర్చ ఒక్కటే మార్గమని నొక్కి చెప్పాము.  ఈ యుద్ధంలో గెలిచే పక్షం అంటూ ఏదీ ఉండదని, అందరూ బాధపడతారని మేము నమ్ముతున్నాము.  అందుకే మేం ఎప్పుడూ శాంతి కి అండగా ఉంటాం.   ఉక్రెయిన్ సంఘర్షణ వల్ల ఏర్పడిన గందరగోళం కారణంగా, చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి; ప్రపంచంలో ఆహార ధాన్యాలు, ఎరువుల కొరత కూడా ఉంది.  దీనివల్ల ఇది ప్రపంచంలోని ప్రతి కుటుంబం పై భారం పడుతోంది, అయితే అభివృద్ధి చెందుతున్న మరియు పేద దేశాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.  ఈ సంఘర్షణ యొక్క మానవతా ప్రభావం పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది.  మేము మా తరపున ఉక్రెయిన్‌కు మానవతా సహాయాన్ని పంపాము.  ఆహార ఎగుమతులు, చమురు సరఫరా, ఆర్థిక సహాయం ద్వారా ఇతర స్నేహపూర్వక దేశాలకు సహాయం చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాము.

 

 

 

ఈ రోజు, భారత-జర్మనీ భాగస్వామ్యం దాని ఆరవ ఐ.జి.సి. సందర్భంగా నూతన దిశను పొందింది.   ఈ ఐ.జి.సి. శక్తి మరియు పర్యావరణ రంగాల్లో మన సహకారానికి ముఖ్యమైన మార్గదర్శకత్వాన్ని అందించింది.   ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మన ప్రాంతంతో పాటు, ప్రపంచ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతాయని నేను విశ్వసిస్తున్నాను.  ఈరోజు, మనం, హరిత మరియు సుస్థిరమైన అభివృద్ధి కోసం భారత-జర్మనీ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాము.  గ్లాస్గో లో తన వాతావరణ ఆకాంక్షను పెంచడం ద్వారా హరిత మరియు స్థిరమైన వృద్ధి అనేది మన విశ్వాసమని భారతదేశం ప్రపంచానికి తెలియజేసింది.  ఈ కొత్త భాగస్వామ్యం కింద, 2030 నాటికి 10 బిలియన్ యూరోల అదనపు అభివృద్ధి సహాయం తో భారతదేశ హరిత వృద్ధి ప్రణాళికలకు మద్దతు ఇవ్వాలని జర్మనీ నిర్ణయించింది.  దీనికి నేను జర్మనీకి, ఛాన్సలర్ స్కోల్జ్‌ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

 

 

 

మా పరిపూరకరమైన బలాలను పరిగణనలోకి తీసుకుని, మనం హరిత హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్‌ ను రూపొందించాలని కూడా నిర్ణయించుకున్నాము.  రెండు దేశాల్లో హరిత హైడ్రోజన్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  భారత, జర్మనీ దేశాలు రెండూ ఇతర దేశాలతో అభివృద్ధి సహకారం లో సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నాయి.  ఈ రోజు, మనం మన అనుభవాలను కలుపుకోవాలని, త్రైపాక్షిక సహకారం ద్వారా మూడో దేశంలో ఉమ్మడి ప్రాజెక్టులపై పని చేయాలని నిర్ణయించుకున్నాము.  అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి పారదర్శకమైన, స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు మన సహకారం ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

 

 

 

స్నేహితులారా !

 

 

 

కోవిడ్ అనంతర కాలంలో, ఇతర వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశం అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది.  ప్రపంచ పునరుద్ధరణకు భారతదేశం ఒక ముఖ్యమైన భాగం అవుతుందని మేము విశ్వసిస్తున్నాము.  ఇటీవల, మేము యు.ఏ.ఈ., ఆస్ట్రేలియా దేశాలతో చాలా తక్కువ సమయంలో వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసాము.  మేము, ఈ.యు. తో కూడా, ఎఫ్.టి.ఏ. చర్చలలో ముందస్తు పురోగతికి కట్టుబడి ఉన్నాము.  భారతదేశానికి చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులు, వృత్తి నిపుణులు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చారు.  భారత, జర్మనీ దేశాల మధ్య జరిగిన సమగ్ర వలస మరియు మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం రెండు దేశాల మధ్య కదలికలను సులభతరం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

 

 

 

ఈ శిఖరాగ్ర సమావేశానికి మరియు మీ కృషికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

 

 

 

గమనిక:- 

ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు స్వేచ్చానువాదం. 

అసలు వ్యాఖ్యలు హిందీలో చేయడం జరిగింది. 

 

*****


(Release ID: 1822454) Visitor Counter : 228