ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి (పీఎం-స్వానిధి) 2022 మార్చి తర్వాత 2024 డిసెంబరు వరకూ కొనసాగించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Posted On: 27 APR 2022 4:39PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్య‌వ‌హారాల క‌మిటీ (సీసీఈఏ) “ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి” (పీఎం-స్వానిధి) కింద రుణాల మంజూరును 2022 మార్చి తర్వాత 2024 డిసెంబరు వరకూ కొనసాగించడంపై ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెరుగైనరీతిలో పూచీకత్తులేని సరళ రుణాల మంజూరుకు తగిన మూలనిధికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు డిజిటల్ లావాదేవీల అనుసరణ,  వీధి వ్యాపారులు-వారి కుటుంబాల సమగ్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే నిర్ణయం తీసుకుంది.

   ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు సరళ, పూచీకత్తులేని రుణాలు మంజూరు చేయబడతాయి. దీనికింద మొత్తంమీద రూ.5,000 కోట్లదాకా రుణాలివ్వాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలో పథకం పొడిగింపునకు నేటి ఆమోదంతో రుణాల మొత్తం రూ.8,100 కోట్లకు పెంచబడింది. తదనుగుణంగా వీధి వ్యాపారులు తమ వ్యాపారం విస్తరించుకుని, స్వావలంబన సాధించేందుకు వీలుగా వారికి నిర్వహణ మూలధనం సమకూర్చబడుతుంది. దీంతోపాటు డిజిటల్‌ చెల్లింపులపై వ్యాపారులకు నగదు వాపసు సదుపాయం కోసం కూడా నిధుల కేటాయింపు పెంచబడింది.

   కేంద్ర మంత్రిమండలి తాజా ఆమోదంతో పట్టణ భారతంలోని దాదాపు 1.2 కోట్లమంది పౌరులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా.

   పీఎం-స్వానిధి పథకం ఇప్పటికే గణనీయ విజయం సాధించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్‌ 25నాటికి 31.9 లక్షల రుణాలు మంజూరు కాగా, 29.6 లక్షల రుణాల కింద రూ. 2,931 కోట్ల మేర సొమ్ము పంపిణీ చేయబడింది. ఇక 2వ రుణానికి సంబంధించి 2.3 లక్షల రుణాలు మంజూరు కాగా, 1.9 లక్షల రుణాల కింద రూ.385 కోట్లు పంపిణీ చేయబడింది. ఈ పథకం కింద లబ్ధిపొందిన వీధి వ్యాపారులు 13.5 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించటం ద్వారా నగదు వాపసు కింద రూ.10 కోట్లు, వడ్డీ రాయితీ రూపంలో రూ.51 కోట్లు పొందారు.

   హమ్మారి విజృంభణ వల్ల చిన్నవ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటంతో 2020 జూన్‌లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఆనాటి విపత్కర పరిస్థితులు నేటికీ తొలగిపోని కారణంగా వారిపై వీధి వ్యాపారులపై ఒత్తిడి కొనసాగుతోంది. అందుకే ఈ పథకం పొడిగింపు అవసరమైంది. పథకం అమలును 2024 డిసెంబరు వరకూ పొడిగించడంతో అధికారిక రుణమార్గాల అందుబాటు వ్యవస్థీకృతం అవుతుంది. తదనుగుణంగా వ్యాపారులు తమ వ్యాపార విస్తరణకు ప్రణాళిక రూపొందించుకోగలిగేలా కచ్చితమైన రుణవనరుకు హామీ లభిస్తుంది. అలాగే డిజిటల్‌ లావాదేవీల అనుసరణకు, రుణాలిచ్చే ఆర్థిక సహాయ సంస్థలకు నిరర్ధక ఆస్తుల నివారణకు వీలు కలుగుతుంది. దీంతోపాటు వీధి వర్తకులు, వారి కుటుంబాల సంపూర్ణ సామాజిక-ఆర్థిక అభ్యున్నతి సాధ్యమవుతుంది.

***


(Release ID: 1820834) Visitor Counter : 234