రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ట్రాఫిక్ వ్యవస్థ నియంత్రణకు స్వదేశీ తయారీ ఐ.టి.ఎస్.


ఇన్.ట్రాన్సె-2 కార్యక్రమం కింద ఆవిష్కరణ

Posted On: 13 APR 2022 12:15PM by PIB Hyderabad

           వాహనాల రాకపోకల నియంత్రణకు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధించి అధునాతన ఇంటెలిజెంట్ రవాణా విధానం (ఐ.టి.ఎస్.)లో భాగంగా మూడు రకాల వ్యవస్థల సాఫ్ట్ వేర్.ను ఇటీవల ప్రారంభించారు. ఆన్ బోర్డ్ డ్రైవర్ సహాయక-హెచ్చరికల వ్యవస్థ (ఒ.డి.ఎ.డబ్ల్యు.ఎస్.), బస్ సిగ్నల్ ప్రాధాన్యతా వ్యవస్థ, కామన్ ఎస్.మార్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్  కనెక్టివ్ (కాస్మిక్- సి.ఒ.ఎస్.ఎం.ఐ.సి.) అన్న సాఫ్ట్ వేర్ వ్యవస్థలను భారతీయ నగరాల్లో వాహనాల రద్దీ నియంత్రణకోసం కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చొరవతో ఇన్.ట్రాన్సె కార్యక్రమం 2వ దశలో (ఇన్.ట్రాన్సె-2లో) భాగంగా ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐ.టి.ఎస్.ను కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్ గత వారం ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర ఎలెక్ట్రానిక్స్ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగంలో గ్రూప్ కోఆర్డినేటర్ అరవింద్ కుమార్,  అమెరికా లోని పుర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సతీష్ వి. ఉక్కుసూరి, ఇన్.ట్రాన్సె కార్యక్రమ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్.పి. కించా, ఇ.ఎస్.డి.ఎ. శాఖ అధిపతి, సైంటిస్ట్-జి సునీతా వర్మ, మంత్రిత్వ శాఖకు చెందిన సైంటిట్స్ డి కమలేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ ఫర్ డెవలప్.మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి.డ్యాక్), మద్రాసు ఐ.ఐ.టిలు ఉమ్మడిగా తీసుకున్న చొరవతో ఈ వ్యవస్థకు రూపకల్పన జరిగింది. ఈ ప్రాజెక్టుకు పారిశ్రామిక సహకార భాగస్వామ్య సంస్థగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యవహరించింది.

   

  1. ఆన్ బోర్డ్ డ్రైవర్ సహాయక-హెచ్చరికల వ్యవస్థ (ఒ.డి.ఎ.డబ్ల్యు.ఎస్.): దేశవ్యాప్తంగా రహదారుల వ్యవస్థ గణనీయంగా మెరుగుపడి, రహదారులపై రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, వేగం పెరగడం తదితర పరిణామాలతో రహదారుల్లో భద్రతకు సంబంధించి ఆందోళనలు మరింత పెరిగాయి. రహదారులపై ప్రమాదాలకు 85 శాతం కారణం "డ్రైవర్ పొరపాట్లే" అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అందువల్ల ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరంగా ఎదురయ్యే పొరపాట్లను పర్యవేక్షించి వాటిని తగ్గించే సహాయక, హెచ్చరికల వ్యవస్థ రూపకల్పన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించవలసిన ఆవశ్యకత, ప్రాముఖ్యత పెరిగింది.

 ఒ.డి.ఎ.డబ్ల్యు.ఎస్. అనే వ్యవస్థ వాహనంపైనే అమర్చిన కొన్ని ప్రత్యేక సెన్సార్ల ద్వారా పనిచేస్తుంది. డ్రైవర్ స్వభావాన్ని, వాహనం పరిసరాలను సెన్సార్లతో పర్యవేక్షించి చుట్టుపక్కల పరిస్థితిపై ఎప్పటికప్పుడు డ్రైవర్.ను అప్రమత్తం చేస్తూ సహాయకారిగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నావిగేషనల్ యూనిట్, డ్రైవర్ అసిస్టెన్స్ కన్సోల్, ఎం.ఎం. వేవ్ రాడార్ సెన్సార్ వంటి సబ్-మాడ్యూల్స్.ను రూపొందించవలసి ఉంటుంది. ఎం.ఎం.వేవ్ రాడార్ సెన్సార్ల వినియోగం ద్వారా చుట్టు పక్కల వాహనాల స్థానాన్ని, కదలికలను పసిగట్టడానికి వీలుంటుంది. ఇక నావిగేషనల్ సెన్సార్ ద్వారా పరిసరాల్లోని వాహనం జియో స్పేషియల్. లొకేషన్.ను, డ్రైవర్ నడుపుతున్న తీరును పసిగట్టడానికి వీలుంటుంది. ఈ సెన్సార్లు అందించే సమాచారాన్ని వాస్తవిక సమయంలో డ్రైవర్.కు తెలియజేసి, రహదారిపై భద్రతను మెరుగుపరుచుకునేందుకు ఒ.డి.ఎ.డబ్ల్యు.ఎస్. దోహదపడుతుంది.

  1. బస్ సిగ్నల్ ప్రాధాన్యతా వ్యవస్థ: ప్రజా రవాణా వ్యవస్థ తగిన విశ్వసనీయత లేకపోవడం వల్లనే ప్రజలు సొంత వాహనాలు, వ్యక్తిగత వాహనాల వినియోగానికి  ప్రాధాన్యత ఇస్తున్నారు. మరింత ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ప్రజా రవాణా వైపు ఆకర్షింపజేయాలంటే ఈ వ్యవస్థను మరింత మెరుగుపరచడం చాలా అవసరం. తద్వారా వాహనాల రాకపోకల రద్దీ సమస్యకు మరింత సుస్థిరమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ప్రజా రవాణా విభాగంలోని బస్సులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం, పట్టణ ప్రాంతాల్లోని సిగ్నల్స్ వ్యవస్థ సరిగా లేకపోవడమే.

 ఆయితే, సాధారణ ట్రాఫిక్ సిగ్నల్ కార్యకలాపాలను సవరించేందుకు బస్ సిగ్నల్ ప్రాధాన్యతా వ్యవస్థ వీలు కల్పిస్తుంది. ప్రజా రవాణా బస్సు సర్వీసులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కరించేందుకు, ప్రయాణంలో జాప్యాన్ని తగ్గించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. గ్రీన్ ఎక్స్.టెన్షన్, లేదా రెడ్ ఎక్.టెన్షన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది.

  1. కామన్ ఎస్.మార్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కనెక్టివ్ (కాస్మిక్-సి.ఒ.ఎస్.ఎం.ఐ.సి.): ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారితంగా పనిచేసే వ్యవస్థ. ప్రపంచ ప్రమాణాలతో కూడిన వన్ ఎం. టూ ఎం. వ్యవస్థ ప్రాతిపదికగా ఇది పనిచేస్తుంది. యూజర్లకు, అప్లికేషన్ ప్రొవైడర్లకు పలు రకాల మార్గాల్లో ఇది ఉపయోగపడుతుంది. కాస్మిక్ కామన్ సర్వీసు లేయర్ స్మార్ట్ సిటీ డ్యాష్ బోర్డు పనితీరును సమన్వయం చేసుకుని ఇది పనిచేస్తుంది. విభిన్నమైన పరికరాల, అప్లికేషన్ల మధ్య డాటా ఎక్సేంజీ ప్రక్రియ సాగడానికి కూడా ఇది దోహదపడుతుంది. కాస్మిక్ వ్యవస్థ అనేది 12 ఉమ్మడి సేవా విధులకు అనుగుణంగా పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్, డిస్కవరీ, భద్రత, గ్రూప్ మేనేజ్మెంట్, డాటా మేనేజ్మెంట్-రిపాజిటరీ, సబ్.స్క్రిప్షన్-నోటిఫికేషన్, డైవైస్ మేనెజ్మెంట్, డెలివరీ హ్యాండ్లింగ్, నెట్వర్ సర్వీస్ ఎక్స్పోజర్, లొకేషన్, సర్వీస్ చార్జింగ్, అక్కౌంట్ వంటి సేవలకు ఇది దోహదపడుతుంది.

కాస్మిక్ వేదిక, ఇంటర్ వర్కింగ్ ఎంటిటీ (ఐ.పి.ఇ.), ఎ.పి.ఐ. మధ్య అనుసంధానానికి ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత పరికరాల, అప్లికేషన్ల అనుసంధానానికి కూడా ఈ కాస్మిక్ వ్యవస్థ వీలు కల్పిస్తుంది.

 

****



(Release ID: 1816434) Visitor Counter : 154