ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా -యుఎఇ వ‌ర్చువ‌ల్ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన ప్రారంభోప‌న్యాసానికి తెలుగు సంక్షిప్త అనువాదం. యువ‌ర్ హై నెస్‌, నా ప్రియ‌మైన సోదరుడికి,

Posted On: 18 FEB 2022 8:20PM by PIB Hyderabad

ఈనాటి వ‌ర్చువ‌ల్ స‌మావేశానికి హృద‌య‌పూర్వ‌క స్వాగ‌తం. ముందుగా నేను మిమ్మ‌ల్ని, యుఎఇని అభినందించాల‌నుకుంటున్నాను. కోవిడ్ స‌వాళ్ళు ఉన్న‌ప్ప‌టికీ ఎక్స్ పో 2020ని అద్భుతంగా నిర్వ‌హించారు. దుర‌దృష్ట వ‌శాత్తు నేను ఈ ఎక్స్ పో ను సంద‌ర్శించ‌డానికి యు.ఎ.ఇ రాలేక‌పోయాను. మ‌నం ముఖా ముఖి మాట్లాడుకుని చాలా కాలం అయింది. అయితే  ఎన్ని స‌వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ మ‌న మ‌ధ్య స్నేహపూర్వ‌క సంబంధాలు కొత్త శిఖ‌రాల‌కు చేర‌కుంటాయ‌ని ఈ నాటి వ‌ర్చువ‌ల్ స‌మావేశం, రుజువుచేస్తోంది.

యువ‌ర్ హైనెస్‌....
మ‌న మ‌ధ్య సంబంధాలు బ‌లోపేతం కావ‌డానికి వ్య‌క్తిగ‌తంగా మీ పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ది. కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో యుఎఇలోని భారతీయుల‌ను జాగ్ర‌త్త‌గా మీరు చూసుకున్న తీరుకు కృత‌జ్ఞ‌త‌లు. యుఎఇలో ఇటీవ‌ల జ‌రిగిన ఉగ్ర‌వాద దాడుల‌ను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ఇండియా, యుఎఇలు ఎల్ల‌ప్పుడూ నిలుస్తాయి.

యువ‌ర్ హైనెస్‌...
ఇరుదేశాల‌కూ ఈ సంవ‌త్స‌రం ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన‌ది. మీరు యుఎఇ వ్య‌వ‌స్థాప‌క 50 వ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటున్నారు. అలాగే మీరు మ‌రో 50 సంవ‌త్స‌రాల‌కు యుఎఇ దార్శ‌నిక‌త‌ను రూపొందించుకున్నారు. మేం ఈ ఏడాది 75 సంవత్స‌రాల స్వాతంత్ర్య ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్నాం. మేం రాగ‌ల 25 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి స‌మున్న‌త ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకున్నాం.  ఉభ‌య దేశాల‌కు సంబంధించి భ‌విష్య‌త్ దార్శ‌నిక‌త‌లో ఎన్నో ఉమ్మ‌డి అంశాలు ఉన్నాయి.

యువ‌ర్ హైనెస్‌,
మ‌న ఉభ‌య దేశాలూ స‌మ‌గ్ర ఆర్ధిక భాగ‌స్వామ్య ఒప్పందంపై ఈరోజు సంత‌కాలు  చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇలాంటి కీల‌క ఒప్పందంపై మ‌నం మూడునెల‌ల క‌న్నా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌న సంప్ర‌దింపులు పూర్తి చేసుకోగ‌ల‌గ‌డం చెప్పుకోద‌గిన‌ది. సాధార‌ణంగా ఇలాంటి త‌ర‌హా ఒప్పందాల‌కు ఎన్నో సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఈ ఒప్పందం,ఉభ‌య దేశాల‌మ‌ధ్య లోతైన స్నేహం, ఉమ్మ‌డి దార్శ‌నిక‌త‌, ప‌ర‌స్ప‌ర విశ్వాసాన్ని ప్ర‌తిబింబిస్తోంది. ఉభ‌య దేశాల‌మ‌ధ్య ఆర్ధిక సంబంధాల‌లో ఇది న‌వ శ‌కానికి నాంది కాల‌ద‌ని నేను త‌ప్ప‌కుండా విశ్వ‌సిస్తున్నాను. అలాగే మ‌న ఉభ‌య‌దేశాల మ‌ధ్య వాణిజ్యం ప్ర‌స్తుతం ఉన్న 60 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి రాగ‌ల 5 సంవ‌త్స‌రాల‌లో 100 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకోగ‌ల‌దు.

యువ‌ర్ హైనెస్‌,

వాణిజ్యం, ఇన్వెస్ట్‌మెంట్‌, ఎన‌ర్జీ,ప్ర‌జ‌ల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌సంబంధాలు అనేవి ఉభ‌య దేశాల మ‌ధ్య స‌హ‌కారానికి స్థంభాల‌వంటివి. అదే స‌మ‌యంలో ఉభ‌య దేశాల‌మ‌ధ్య సంబంధాలు మ‌రెన్నో రంగాల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉంది. ఫుడ్ కారిడార్ల‌మీద ఉభ‌య‌దేశాల మ‌ధ్య కుదిరిన నూత‌న ఎం.ఒ.యు కొత్త చొర‌వ‌గా చెప్పుకోవ‌చ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ , లాజిస్టిక్‌ల రంగంలో యు.ఎ.ఇ పెట్టుబ‌డుల‌ను మేం స్వాగ‌తిస్తున్నాం. ఇది యుఎఇ ఆహార భ‌ద్ర‌త‌లో ఇండియాను ఒక న‌మ్మ‌క‌మైన భాగ‌స్వామిగా చేస్తుంది.

  స్టార్ట‌ప్‌ల రంగంలో ఇండియా మున్నెన్న‌డూ లేనంత‌టి పురోగ‌తి సాధించింది. గ‌త సంవ‌త్స‌రం 44 యూనికార్న్‌లు ఇండియాలో ఆవిర్భ‌వించాయి. మ‌నం ఉభ‌య‌దేశాల‌లో జాయింట్ ఇంక్యుబేష‌న్ ల ద్వారా, జాయింట్ ఫైనాన్సింగ్ ల ద్వారా స్టార్ట‌ప్ ల‌ను ప్రోత్స‌హించ‌వ‌చ్చు. అలాగే మ‌న ప్ర‌జ‌ల నైపుణ్యాభివృద్ధి విష‌యంలో మ‌నం ఆధునిక ఇన్ స్టిట్యూష‌న్స్‌ ఆఫ్ ఎక్స‌లెన్స్‌ల‌తో కొలాబ‌రేట్ చేసుకోవ‌చ్చు.
 
జ‌మ్ము కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్ గ‌త నెఉల‌లో యుఎఇ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతంగా ముగించుకున్న త‌ర్వాత ప‌లు
ఎమిరేట్ కంపెనీలు జ‌మ్ము కాశ్మీర్ లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఆస‌క్తి చూపాయి. అన్ని రంగాల‌లో యుఎఇ పెట్టుబ‌డిని మేం స్వాగ‌తిస్తాం.  జ‌మ్ముకాశ్మీర్ లో లాజిస్టిక్స్‌, ఆరోగ్య రంగం, హాస్పిటాలిటి ఇలా అన్ని రంగాల‌లో యుఎఇ పెట్టుబ‌డుల‌ను స్వాగ‌తిస్తాం. అలాగే మీ కంపెనీల‌కు అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను క‌ల్పిస్తాం.

యువ‌ర్ హైనెస్‌,

వ‌చ్చే సంవ‌త్స‌రం ఇండియా జి-20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం, యుఎఇ, కాప్ 28 కి ఆతిథ్య‌మిస్తుంది. వాతావ‌ర‌ణ అంశం అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్రాధాన్య‌త గ‌ల అంశంగా ఉంటోంది. ఈ అజెండాకు ఒక రూపం ఇచ్చేందుకు ఉభ‌య‌దేశాలు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని పెంచుకోవ‌చ్చు. రెండుదేశాలూ భావ‌సారూప్య‌త క‌లిగిన భాగ‌స్వాముల‌తో క‌ల‌సిప‌నిచేసే సానుకూల దృక్ప‌థం క‌లిగి ఉన్నాయి. ఇండియా -యుఎఇ- ఇజ్రాయిల్‌- యుఎస్ఎ ఈ గ్రూప్ మ‌న ఉమ్మ‌డ‌లి ల‌క్ష్యాల‌ను , ప్ర‌త్యేకించి టెక్నాల‌జి, ఆవిష్క‌ర‌ణ‌లు, ఫైనాన్స్ విష‌యంలో మ‌న ఉమ్మ‌డి ల‌క్ష్యాల‌ను మ‌రింత ముందుకు తీసుకుపోగ‌ల‌వు.
యువ‌ర్ హైనెస్‌...
 ఈ వ‌ర్చువ‌ల్ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నాన్ని విజ‌య‌వంతంగా ఏర్పాటు చేసినందుకు నేను హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను.
(ప్ర‌ధాన‌మంత్రి హిందీలో చేసిన ప్ర‌సంగానికి ఇది సంక్షిప్త తెలుగు అనువాదం)

 

***



(Release ID: 1799713) Visitor Counter : 105