ప్రధాన మంత్రి కార్యాలయం

థానె-దివ రైలు మార్గం ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

Posted On: 18 FEB 2022 6:31PM by PIB Hyderabad

న‌మ‌స్కారం!

   హారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ థాకరే, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు అశ్వనీ వైష్ణవ్, రావుసాహెబ్ దన్వే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సోదరసోదరీమణులందరికీ అభివందనం!

   రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి. ఈ నేపథ్యంలో ముందుగా అసమాన ధీరుడు, భారతీయ సంస్కృతికి గుర్తింపు, రక్షణ కల్పించడం ద్వారా భారతదేశం గర్వంతో తలెత్తుకునేలా చేసిన శివాజీ మహరాజ్ కు సగౌరవంగా పాదాభివందనం చేస్తున్నాను. అలాగే థానె-దివ మధ్య నిర్మించిన 5, 6 నంబరు కొత్త రైలు మార్గాలను శివాజీ మహరాజ్ జయంతి వేడుకలకు ఒకరోజు ముందు ప్రారంభించిన సందర్భంగా ముంబై వాసులందరికీ అభినందనలు. ముంబై మహానగర ప్రజల జీవనంలో ఈ రైలు మార్గాలు కీలక మార్పులు తెచ్చి, వారికి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిరంతర చలనశీలి అయిన ముంబైకి ఈ కొత్త రైలు మార్గాలు సరికొత్త ఊపిరులూదుతాయి. ఈ రెండు రైలు మార్గాల ప్రారంభంతో ముంబైకి నాలుగు ప్రత్యక్ష ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

మొదటిది... స్థానిక, ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఇకపై వేర్వేరు మార్గాలు అందుబాటులోకి వస్తాయి. రెండోది... ముంబై-ఇతర రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు ఇకపై స్థానిక రైళ్లు వెళ్లేదాకా ఎదురుచూసే అవసరం ఉండదు.  

మూడోది... కల్యాణ్-కుర్లా విభాగంలో ప్రయాణించే మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లు పెద్దగా అంతరాయం లేకుండా నడుస్తాయి.

చివరిది-నాలుగోది... ప్రతి ఆదివారం నిలిపివేత ఫలితంగా కల్వా-ముంబ్రా మార్గంలో  ప్రయాణికులు ఇకపై ఇబ్బందులు పడే అవసరం ఉండదు!

మిత్రులారా!

   సెంట్రల్ రైల్వే లైన్లో ఇవాళ్టినుంచి 36 కొత్త స్థానిక రైళ్లు నడవనుండగా, వీటిలో అధికశాతం శీతల వాతావరణానుకూలమైనవే. స్థానిక రైళ్లలో సౌకర్యాల విస్తరణ, ఆధునికీకరణ దిశగా  కేంద్ర ప్రభుత్వ నిబద్ధతలో ఇదొక భాగం మాత్రమే. గడచిన ఏడేళ్లలో ముంబై మెట్రో (రైలు) వ్యవస్థ కూడా గణనీయంగా విస్తరించబడింది. ఈ మేరకు ముంబై పరిసర శివారు కేంద్రాల్లో మెట్రో నెట్ వర్క్ విస్తరణ వేగంగా సాగుతోంది.

సోదరసోదరీమణులారా!

   ముంబైకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న స్థానిక రైళ్ల విస్తరణ, ఆధునికీకరణ డిమాండ్ చాలా కాలం నుంచీ నలుగుతున్నదే. ఈ 5వ, 6వ రైలు మార్గాల నిర్మాణానికి అప్పుడెప్పుడో 2008లో శంకుస్థాపన చేయగా, 2015కల్లా పూర్తి కావాలన్నది లక్ష్యం. కానీ, దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల 2014దాకా ప్రాజెక్టు పనులు సంపూర్ణం కాలేదు. ఆ తర్వాత, మేం దీన్ని పూర్తిచేసేందుకు కృషి ప్రారంభించి సమస్యలన్నిటినీ పరిష్కరించాం. పాతమార్గంతో కొత్త లైన్లను అనుంసంధానించాల్సిన ప్రదేశాలు మరో 34దాకా ఉన్నాయని నాకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మన ఇంజనీర్లు, కార్మికులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాజెక్టు పనులు పూర్తిచేశారు. డజన్లకొద్దీ వంతెనలు, ఫ్లైఓవర్లు, సొరంగాలు నిర్మించారు. దేశ నిర్మాణంలో ఇటువంటి నిబద్ధతను నేను పూర్తిస్థాయిలో గుర్తిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

సోదరసోదరీమణులారా!

   స్వతంత్ర భారత ప్రగతి పయనంలో మహానగరం ముంబై గణనీయ పాత్ర పోషించింది. ఇక

స్వయం సమృద్ధ భారతం నిర్మించడంలో ముంబై సామర్థ్యం బహుళంగా పెంచేందుకు మేం కృషి చేస్తున్నాం.  అందుకే ముంబైకి 21వ శతాబ్దపు మౌలిక సదుపాయాలు సృష్టించడంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారించాం. తదనుగుణంగా ముంబైకి రైలు మార్గాల అనుసంధానం విషయంలో- వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాం. ఇందులో భాగంగా ముంబై శివారు రైళ్ల వ్యవస్థకు అత్యుత్తమ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హంగులు సమకూరుస్తున్నాం. ముంబై శివారు రైల్వే పరిధిలో అదనంగా 400 కిలోమీటర్ల మార్గాలను చేర్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాకుండా 19 స్టేషన్లను ఆధునిక సీబీటీసీసిగ్నల్ వ్యవస్థ తదితర సౌకర్యాలతో నవీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

సోదరసోదరీమణులారా!

   క్క ముంబై పరిధిలో మాత్రమేగాక దేశంలోని ఇతర రాష్ట్రాలతో ముంబై అనుసంధానంలో కూడా వేగం, ఆధునికీకరణ చేపట్టడం అవసరం. కాబట్టి, అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు కూడా ముంబై నగరానికే కాకుండా దేశం మొత్తానికీ నేడు అవసరం. కలల నగరంగా ముంబైకిగల సామర్థ్యాన్ని, గుర్తింపును ఇది మరింత బలోపేతం చేస్తుంది. అందువల్ల ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం మనకెంతో ముఖ్యం. అదేవిధంగా పశ్చిమ ప్రత్యేక రవాణా కారిడార్ కూడా ముంబై నగరానికి కొత్త ఊపునిస్తుంది.

మిత్రులారా!

   భారత రైల్వేల్లో ఒక్కరోజులో ప్రయాణించేవారి సంఖ్య కొన్ని దేశాల జనాభాకన్నా ఎంతో ఎక్కువనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రధానమైనవిగా నిర్దేశించుకున్న ప్రాథమ్యాల్లో భారత రైల్వేలను మరింత సురక్షితం, సౌకర్యవంతం, ఆధునికంగా తీర్చిదిద్దడం కూడా ఒకటిగా ఉంది. ఈ నిబద్ధతను చివరకు అంతర్జాతీయ మహమ్మారి కరోనా అంగుళమైనా కదిలించలేకపోయింది. కాబట్టే గడచిన రెండేళ్లలో రైల్వేశాఖ సరకు రవాణాలో సరికొత్త రికార్డులు సృష్టించింది. అలాగే 8,000 కిలోమీటర్ల రైలు మార్గాల్లో విద్యుదీకరణ పూర్తయింది. మరోవైపు సుమారు 4,500 కిలోమీటర్ల కొత్త లైన్లు లేదా డబులింగ్ ప్రక్రియ కూడా పూర్తిచేయబడింది. ప్రస్తుత కరోనా సమయంలోనే కిసాన్ రైళ్లద్వారా దేశంలోని మార్కెట్లన్నిటితో రైతులకు అనుసంధానం కల్పించగలిగాం.

మిత్రులారా!

   రైల్వేలో సంస్కరణలతో మన దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోగలవని కూడా మనందరికీ తెలిసిందే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా రైల్వేలో అన్ని రకాల సంస్కరణలనూ ప్రోత్సహిస్తోంది. లోగడ ప్రణాళిక నుంచి అమలుదాకా అన్ని దశల్లోనూ  సమన్వయం కొరవడి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏళ్ల తరబడి కొనసాగాయి. ఇటువంటి విధానాలే కొనసాగితే భారతదేశంలో 21వ శతాబ్దపు మౌలిక సదుపాయాల సృష్టి కలగానే మిగిలిపోతుంది. అందుకే జాతీయ బృహత్ ప్రణాళిక పీఎం గతిశక్తికి రూపమిచ్చాం. కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖసహా ప్రైవేటు రంగంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని స్థానిక పాలనమండళ్లను ఇది ఒకే డిజిటల్ వేదికపైకి చేరుస్తుంది. తద్వారా ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు సమాచారాన్ని భాగస్వాములకు సత్వరం చేరవేసే వీలుంటుంది. ఈ విధంగా జరిగినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరూ తమవంతు పనికి సంబంధించి సహేతుక ప్రణాళికతో ముందుకు వెళ్లగలరు. ఆ మేరకు ముంబైతోపాటు దేశంలోని ఇతర రైల్వే ప్రాజెక్టుల కోసం ‘గతిశక్తి’ స్ఫూర్తితో ముందడుగు వేస్తాం.

మిత్రులారా!

   దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వనరుల కోసం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదన్న ఆలోచనా ధోరణి ఒకనాడు రాజ్యమేలుతూండేది. పర్యవసానంగా భారత ప్రజా రవాణా వ్యవస్థ సదా సతమతమవుతూ ప్రతిష్టను కోల్పోవాల్సి వచ్చింది. కానీ, భారత్ నేడు ఈ ఆలోచనా ధోరణికి పాతరవేసి ముందుకు దూసుకుపోతోంది. గాంధీనగర్, భోపాల్ వంటి ఆధునిక స్టేషన్లు ఇవాళ భారతీయ రైల్వేలకు ప్రతీకలుగా మారుతున్నాయి. అలాగే 6000కుపైగా రైల్వే స్టేషన్లు వైఫై సౌకర్యంతో అనుసంధానించబడ్డాయి. ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ రైళ్లు భారత రైల్వేలకు వేగాన్ని, ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ కొత్త ఊపునిస్తున్నాయి. దేశ జనాభాకు సేవలందించేందుకు రాబోయే సంవత్సరాల్లో 400 కొత్త ‘వందే భారత్‌’ రైళ్లు పరుగులు తీయనున్నాయి.

సోదరసోదరీమణులారా!

   మా ప్రభుత్వం మరో విధానాన్ని కూడా ఆశావహ మార్గంలోకి మళ్లించింది... అదే స్వీయ సామర్థ్యంపై రైల్వేలకుగల ఆత్మవిశ్వాసం. దేశంలో 7-8 ఏళ్ల కిందటిదాకా రైలు బోగీల కర్మాగారాల విషయంలో ఉదాసీనత తీవ్రస్థాయిలో ఉండేది. ఆనాడు వాటి దుస్థితిని చూసినవారికి, ఈనాడు ఇవే ఆధునిక రైళ్లను కూడా రూపొందిస్తున్నాయంటే వారెవరూ నమ్మరంటే అతిశయోక్తి కాబోదు. అయితే, నేడు ‘వందే భారత్’ రైళ్లు సహా స్వదేశీ ‘విస్టాడోమ్’ కోచ్‌లను కూడా ఇదే ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నాయి. అదేవిధంగా స్వదేశీ పరిజ్ఞానంతో మన సిగ్నళ్ల వ్యవస్థ ఆధునికీకరణకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. మనకిక స్వదేశీ పరిజ్ఞానం అవశ్యం... అలాగే విదేశాలపై ఆధారపడటంనుంచి విముక్తి కూడా ముఖ్యం.

మిత్రులారా!

   కొత్త సదుపాయాల అభివృద్ధి కృషి ముంబైతోపాటు దాని పరిసర నగరాలకూ ఎనలేని  ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సరికొత్త సౌకర్యాలవల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు సౌలభ్యం కలగడమేగాక కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ముంబై అభివృద్ధికి నిర్విరామ నిబద్ధతను ప్రకటిస్తూ ముంబై వాసులందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు.

అనేకానేక కృతజ్ఞతలు!

బాధ్యత నిరాకరణ ప్రకటన: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగం హిందీలో సాగింది.



(Release ID: 1799628) Visitor Counter : 119