ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ మహిళా కమిషన్ 30 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
Posted On:
31 JAN 2022 7:51PM by PIB Hyderabad
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గవర్నర్లకు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేబినెట్లోని నా సహచరులైన స్మృతి ఇరానీ జీకి, డాక్టర్ మహేంద్ర భాయ్కి, దర్శన జర్దోషి జీకి, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి రేఖా శర్మాజీకి, ఆయా రాష్ట్రాల మహిళా కమిషన్ల ఛైర్ పర్సన్లకు, సభ్యులకు, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు, ప్రతినిధులకు, సోదర సోదరీమణులారా అందరికీ నమస్కారాలు..
జాతీయ మహిళా కమిషన్ 30వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. సంస్థకైనా, మనిషికైనా 30 సంవత్సరాల మైలురాయి అనేది చాలా ప్రధానమైనది. నూతన బాధ్యతలను స్వీకరించడానికి, సరికొత్త ఉత్సాహంతో ముందడుగు వేయడానికి ఇది సరైన సమయం. ప్రారంభమై 30 సంవత్సరాలైన సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ కూడా అదేవిధంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నాను. ఈ సంస్థ మరింత సమర్థవంతంగా, మరింత బాధ్యతాయుతంగా, సరికొత్త శక్తితో పనిచేయాలి. మారుతున్న భారతంలో మహిళ పాత్రకూడా నిరంతరం విస్తరిస్తోంది. కాబట్టి మహిళలకోసం నెలకొల్పిన జాతీయ కమిషన్ పాత్ర కూడా విస్తరించాల్సిన సమయమిది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని ఆయా రాష్ట్రాల మహిళా కమిషన్లు కూడా తమ పరిధిని విస్తరించుకొని తమ తమ రాష్ట్రాల మహిళలకు సరికొత్త మార్గదర్శనం చేయాలి.
స్నేహితులారా,
దేశ స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ సమయంలో నూతన భారతదేశ నిర్మాణ తీర్మానం మన ముందుంది. ఈ రోజున మన దేశం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే మంత్రాన్ని జపిస్తోంది. అందరికీ అన్ని అవకాశాలు సమానంగా లభించినప్పుడే మన దేశం అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోగలదు. గతంలో వ్యాపార నిర్వచనమనేది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ మనుషుల చుట్టూ తిరిగేదనే విషయం మనకు తెలుసు. అయితే వాస్తవం ఏదంటే శతాబ్దాల తరబడి భారతదేశ బలం దేశంలో స్థానికంగా వున్న చిన్న పరిశ్రమలు. వాటినే ఈ రోజున ఎంఎస్ ఎంఈలని పిలుస్తున్నాం. ఈ పరిశ్రమల్లో మగవాళ్లతో సమానంగా మహిళల పాత్ర వుంది. ఉదాహరణకు బట్టల తయారీ పరిశ్రమను తీసుకోండి, లేదా కుండల తయారీ పరిశ్రమను లేదా వ్యవసాయ రంగాన్ని లేదా పాల పదార్థాల తయారీని తీసుకోండి...ఇలా అనేక పరిశ్రమల్లో మహిళా శక్తి , మహిళల నైపుణ్యాలే కనిపిస్తాయి. అయితే దురదృష్టం కొద్దీ ఈ పరిశ్రమల బలాన్ని మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. పాతకాలపు ఆలోచనావిధానంతో వున్నవాళ్లు, మహిళల నైపుణ్యాలను ఇంటికే పరిమితం చేసి చూస్తున్నారు.
దేశ ఆర్ధిక రంగాన్ని అభివృద్ది చేసుకోవాలంటే ఈ పాత ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమనేది అవసరం. దేశంలోనే తయారీ విధానం అనేది ఖచ్చితంగా అదే పని చేస్తోంది. ఆత్మనిర్భర్ ఉద్యమంద్వారా మహిళల్లోని సమర్థతను, దేశ అభివృద్ధికి ముడిపెట్టడం జరుగుతోంది. ఆ ఫలితాలు మన ముందు కనిపిస్తున్నాయి. ఈ రోజున ముద్రా యోజనలో 70శాతం మంది లబ్ధిదారులు మహిళలే. ఈ పథకాన్ని ఉపయోగించుకొని కోట్లాది మంది మహిళలు తమ వ్యాపారాలు మొదలుపెట్టారు. ఇతరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
అదే విధంగా స్వయం సహాయక బృందాలద్వారా మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామిక తత్వాన్ని పెంచడానికిగాను దీన్ దయాళ్ అంత్యోదయ పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది. ఈ విషయంలో మహిళల ఉత్సాహం, బలం ఎలా వుందంటే ఈ ఆరు ఏడు సంవత్సరాలలో దేశంలో స్వయం సహాయ బృందాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. భారతదేశంలోని స్టార్టప్ వ్యవస్థలో కూడా అదే ధోరణి కనిపిస్తోంది. 2016నుంచి దేశవ్యాప్తంగా 60 వేల నూతన స్టార్టప్ లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని 56 రంగాల్లో ఏర్పాటు చేశారు. ఈ స్టార్టప్ లకు సంబంధించి 45శాతంవాటిలో కనీసం ఒక మహిళా ఢైరెక్టర్ పని చేయడం జరుగుతోంది.
స్నేహితులారా,
నూతన భారతదేశ వృద్ధి నిరంతరం కొనసాగడంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూనే వుంది. సమాజ పారిశ్రామిక రంగంలో మహిళల పాత్రను ఎంత వీలైతే అంతగా ఆయా మహిళా కమిషన్లు ప్రోత్సహించాల్సి వుంటుంది. గత ఏడు సంవత్సరాలుగా ఈ విషయంపై మన దేశం ప్రత్యేక దృష్టిని పెట్టిన విషయాన్ని మీరంతా చూసే వున్నారు. ప్రతిష్టాత్మక పద్మా అవార్డులను స్వంతం చేసుకోవడంలో మహిళల భాగస్వామ్యం పెరగడమనేది మరొక ఉదాహరణ. మహిళలు చేసిన అద్భుతమైన కృషికిగాను 2015నుంచి 185 మంది మహిళలకు పద్మా అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది కూడా వివిధ రంగాలలో పని చేస్తున్న మహిళలకు 34 పద్మా అవార్డులను ఇవ్వడం జరిగింది. ఇది ఒక రికార్డు. ఇంతవరకూ ఏనాడూ అంతమంది మహిళలు పద్మా అవార్డులను అందుకోలేదు.
అదే విధంగా క్రీడారంగంలో భారతీయ మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధిస్తున్నారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న కీలకమైన పోరాటంలో మహిళా నర్సులు, వైద్యులు, మహిళా శాస్త్రవేత్తలు ప్రధానమైన పాత్ర పోషించారు.
ఎప్పుడు అవకాశం వచ్చినా సరే భారతీయ మహిళా శక్తి తన సమర్థతను నిరూపించుకుంటూ వచ్చింది. మహిళ ఉత్తమ ఉపాధ్యాయురాలు మరియు శిక్షకురాలు అనే విషయాన్ని మీకంటే బాగా మరెవరికి తెలుసు? కాబట్టి దేశంలో ఔత్సాహిక పారిశ్రామికత్వాన్నించి క్రీడలదాకా నూతన మార్గాన్ని ఆవిష్కరించాల్సిన గురుతరమైన బాధ్యత అనేది మన మహిళా కమిషన్లన్నిటి ముందు వుంది.
స్నేహితులారా,
మీ అందరూ గమనిస్తూనే వున్నారు. గత ఏడు సంవత్సరాలలో కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలనేవి దేశంలోని మహిళలపట్ల ఎంత సున్నితంగా వున్నాయనేది. ఈ రోజున అధిక మాతృత్వ సెలవుదినాలిచ్చే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. అలాగే మహిళల వివాహ వయస్సును 21 సంవత్సరాలకంటే ఎక్కువ చేయడానికిగాను ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా మన బిడ్డల విద్యకు, కెరీర్ సాధనకు వయస్సు అనేది అడ్డంకిగా మారదు.
దేశంలో మహిళా సాధికరతను సంకుచిత దృష్టితో చూసిన రోజులను మనం చూశాం. గ్రామీణ ప్రాంతాలనుంచి, పేద కుటుంబాలనుంచి వచ్చిన మహిళలు సాధికారతకు దూరంగా వుండేవారు. ఈ వివక్షను పారద్రోలడానికి మనందరమూ కలిసి పని చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది కోట్ల మంది పేద మహిళలకు మొదటిసారి వంట గ్యాస్ సదుపాయం కల్పించి వారిని పొగబారినుంచి విముక్తి చేయడం జరిగింది. అందులో మహిళా సాధికారతను చూడవచ్చు.ఈ రోజున దేశంలో కోట్లాది మంది మహిళలకోసం వారింట్లో మరుగుదొడ్డి సదుపాయం కల్పించడం జరిగింది. అది కూడా మహిళా సాధికారతే. ఉత్తర్ ప్రదేశ్ లో దాన్ని ఇజ్జత్ ఘర్ అంటారు. ఈ రోజున దేశంలో కోట్లాది మంది మహిళలకోసం మొదటిసారిగా స్వంత నివాస గృహాన్నివ్వడం జరిగింది. అది కూడా మహిళా సాధికారతగానే భావించాలి. అలాగే కోట్లాది మంది మహిళలు గర్భవతులుగా వున్న సమయంలోను, ప్రసవ సమయంలోను సాయం పొందుతున్నారు. అలాగే కోట్లాది మంది మహిళలు జన్ ధన్ బ్యాంకు అకౌంట్ల సదుపాయం పొందారు. వారి అకౌంట్లలోకి నేరుగా ప్రభుత్వ రాయితీల సొమ్ము డిపాజిట్ అవుతోంది. ఈ మహిళలంతా మారుతున్న భారతదేశంలో మహిళా సాధికారతకు చిహ్నంగానిలిచారు.
స్నేహితులారా,
ఈ రోజున దేశ మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకుంటున్నారు. అంతే కాదు దేశ భవిష్యత్తుకు ఒక మార్గం వేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత దేశంలో లింగ నిష్పత్తి మెరుగైంది. చదువులను మధ్యలోనే ఆపేసే బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే భేటీ బచావో, భేటీ పడావో ఉద్యమంలో మన దేశ మహిళలు స్వయంగా భాగమవుతున్నారు కాబట్టి. ఒక మహిళ నిర్ణయం తీసుకుంటే ఆమె మాత్రమే మార్గాన్ని కూడా నిర్ణయిస్తోంది. కాబట్టి దేశంలో మహిళల భద్రతకు, వారి సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వాలను కూలద్రోయడానికి మహిళలు ఎంతమాత్రం సందేహించరు.
నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మహిళా భద్రతా సమస్యను మేం ఎదుర్కొన్నట్టు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని నేను ఆశ్చర్యపోతుండేవాడిని. అందుకే 2014లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో మహిళా భద్రతకోసం అనేక చర్యలు తీసుకున్నాం. మహిళలపట్ల నేరాలను చేసేవారిని శిక్షించడానికిగాను ఈ రోజున దేశంలో అనేక కఠినమైన చట్టాలను తయారు చేసుకున్నాం. అంతే కాదు క్రూరమైన కేసులకు సంబంధించి ఉరిశిక్ష కూడా వేసేలా చట్టాన్ని అమలు చేస్తున్నాం. కేసులను పరిష్కరించడానికిగాను దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రాల సహకారంతో వ్యవస్థలను మెరుగుపరచడం జరిగింది. తద్వారా నూతన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతోంది.
ఆయా పోలీసు స్టేషన్లలో సహాయ కేంద్రాలను ( హెల్ప్ డెస్క్‌లు) పెంచడానికిగాను అనేక చర్యలు చేపట్టడం జరిగింది. తద్వారా అన్ని సమయాల్లోను హెల్ప్ లైన్ పని చేస్తుంది. సైబర్ నేరాలను పరిష్కరించడానికిగాను పోర్టల్ పని చేస్తున్నది. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఈ రోజున మా ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ (శూన్య సహన) విధానాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులన్నిటిలోను జాతీయ మహిళా కమిషన్ మహిళలకు, ప్రభుత్వానికి మధ్యన వంతెనలగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర మహిళా కమిషన్లతో కలిసిపని చేయడంద్వారా ఈ పని చేస్తోంది. మీరు చేస్తున్న ఈ కృషి, సముచితమైన పాత్ర ఇలాగే కొనసాగి సమాజాన్ని బలోపేతం చేస్తుందని నేను భావిస్తున్నాను.
ఈ నమ్మకంతో మీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.....
***
గమనిక : ప్రధాని ఉపన్యాసానికి ఇది దాదాపుగా చేసిన అనువాదం. ఆయన హిందీలో ఉపన్యసించారు.
***
(Release ID: 1796411)
Visitor Counter : 393
Read this release in:
Hindi
,
Odia
,
English
,
Urdu
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam