ఆర్థిక మంత్రిత్వ శాఖ
సహకార సంస్థల ప్రత్యామ్నాయ కనీస పన్ను 15 శాతానికి, సర్-ఛార్జ్ 7 శాతానికి తగ్గించిన - ప్రభుత్వం
పన్ను ప్రోత్సాహకాల కోసం అర్హత పొందేందుకు వీలుగా అంకురసంస్థలు, నూతన ఉత్పాదక సంస్థలకు ఏడాది పెరిగిన - నమోదు తేదీ గడువు
ఐ.ఎఫ్.ఎస్.సి. ని ఆకర్షణీయంగా మార్చడానికి - కొత్త పన్ను ప్రోత్సాహకాలు
తమ ఏజెంట్లకు ఒక సంవత్సరంలో 20,000 రూపాయలకు మించి అందజేసే ప్రయోజనాలపై వ్యాపార సంస్థలు టి.డి.ఎస్. ను తప్పనిసరిగా మినహాయించాలి
అన్ని ఆస్తుల నుంచి వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల పై 15 శాతానికి పరిమితమైన - సర్ ఛార్జ్
ఆదాయంపై, లాభాలపై చెల్లించిన సర్-చార్జ్ మరియు సెస్సులు వ్యాపార వ్యయంగా అనుమతించబడవు
సోదా మరియు సర్వే నిర్వహిస్తున్న సమయంలో బయటపడిన వెల్లడించని ఆదాయంపై పన్ను నివారించడం కోసం, నష్టాలను పరిగణలోకి తీసుకునే విధానం అనుమతించబడదు
Posted On:
01 FEB 2022 1:05PM by PIB Hyderabad
ఈ రోజు పార్లమెంటులో 2022-23 కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, సహకార సంఘాలు మరియు కంపెనీల మధ్య సమాన స్థాయి కల్పించడం కోసం సహకార సంస్థలకు ప్రత్యామ్నాయ కనీస పన్ను రేటును ప్రస్తుతం ఉన్న 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ప్రకటించారు. అదేవిధంగా, మొత్తం ఆదాయం కోటి రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల మధ్య ఉన్న సహకార సంస్థలకు ప్రస్తుతం 12 శాతం ఉన్న సర్ చార్జి ని 7 శాతానికి తగ్గించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఆమె తెలియజేశారు. గ్రామీణ, వ్యవసాయ సమాజం నుంచి ఎక్కువగా ఉన్న సహకార సంఘాలు మరియు వాటి సభ్యుల ఆదాయాన్ని పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.
అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు:
అంకురసంస్థలు మన ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదకాలుగా నిలిచాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో వాటికి చేయూతనందించాలనే ఉద్దేశ్యంతో, నమోదు అయినప్పటి నుంచి పదేళ్లలో వరుసగా మూడు సంవత్సరాలు, పన్ను ప్రోత్సాహకాన్ని అందించడానికి వీలుగా, అర్హత కలిగిన అంకుర సంస్థలు నమోదు చేసుకోడానికి మరో ఏడాది పాటు అంటే, 2023 మార్చి, 31వ తేదీ వరకు గడువు పొడిగించాలని ప్రతిపాదించినట్లు ప్రకటించారు. ఈ ప్రోత్సాహకం ఇంతవరకు 2022 మార్చి, 31వ తేదీ లోపు నమోదు చేసుకున్న అర్హత కలిగిన అంకుర సంస్థలకు అందుబాటులో ఉండేది.
కొత్తగా నెలకొల్పిన తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు:
ప్రపంచవ్యాప్తంగా పోటీ వ్యాపార వాతావరణాన్ని నెలకొల్పాలనే సంకల్పంతో, కొత్తగా ప్రారంభించిన కొన్ని దేశీయ తయారీ కంపెనీల కోసం ప్రభుత్వం 15 శాతం పన్ను రాయితీ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు, శ్రీమతి సీతారామన్ తెలియజేశారు. సెక్షన్ 115 బి.ఏ.బి. కింద తయారీ లేదా ఉత్పత్తి ప్రారంభించడానికి చివరి తేదీని ఒక సంవత్సరం పాటు అంటే 2023 మార్చి, 31వ తేదీ నుంచి 2024 మార్చి, 31వ తేదీ వరకు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఐ.ఎఫ్.ఎస్.సి. కి ప్రోత్సాహకాలు:
ఐ.ఎఫ్.ఎస్.సీ. ని ప్రోత్సహించేందుకు, విదేశాలకు చెందిన సాధనాల నుంచి లేదా విదేశాలలోని బ్యాంకింగ్ యూనిట్ జారీ చేసిన కౌంటర్ డెరివేటివ్‌ల ద్వారా, అదే విధంగా, రాయల్టీ నుంచి వచ్చే ఆదాయం మరియు ఓడ లీజుకు సంబంధించిన వడ్డీ మరియు ఐ.ఎఫ్.ఎస్.సి. లో పోర్ట్-ఫోలియో మేనేజ్‌మెంట్ సేవల నుండి పొందిన ఆదాయం వంటి వాటి నుంచి, ప్రవాసులకు లభించిన ఆదాయానికి, పేర్కొన్న షరతులకు లోబడి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం ప్రతిపాదించినట్లు, కేంద్ర ఆర్ధికమంత్రి తెలియజేశారు.
టి.డి.ఎస్. నిబంధనల హేతుబద్ధీకరణ:
వ్యాపారాభివృద్ధి వ్యూహంలో భాగంగా, ఏజెంట్ల పరిధిలో పన్ను చెల్లించే విధంగా, ప్రయోజనాలను తమ ఏజెంట్లకు అందించే ధోరణి వ్యాపార సంస్థలపై ఉంటుందని, శ్రీమతి సీతారామన్ పేర్కొంటూ, అటువంటి లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు గమనించడానికి వీలుగా, ఒక ఆర్థిక సంవత్సరంలో అటువంటి ప్రయోజనాల మొత్తం విలువ 20,000 రూపాయలు దాటిన పక్షంలో, ప్రయోజనాలు ఇచ్చే వ్యక్తి ద్వారా పన్ను మినహాయించి అందించే విధంగా ప్రభుత్వం ప్రతిపాదించిందని, తెలియజేశారు.
సర్-ఛార్జ్ హేతుబద్ధీకరణ:
అనేక పనుల ఒప్పందాల నిబంధనలు, షరతులకు తప్పనిసరిగా ఒక కన్సార్టియం ఏర్పడవలసిన అవసరం ఉందనీ, దీని సభ్యులుగా సాధారణంగా కంపెనీలు ఉంటాయనీ, శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. అటువంటి సందర్భాలలో, ఈ ఏ.ఓ.పి. ల ఆదాయం 37 శాతం వరకు గ్రేడెడ్ సర్-ఛార్జ్ ను చెల్లించవలసి ఉంటుందనీ, ఇది వ్యక్తిగత కంపెనీలపై సర్-ఛార్జ్ కంటే చాలా ఎక్కువ అనీ ఆమె తెలియజేశారు. అందువల్ల, ఈ ఏ.ఓ.పి. ల సర్-ఛార్జ్ ని 15 శాతానికి పరిమితం చేయాలని ఆమె ప్రతిపాదించారు. అదేవిధంగా, లిస్టెడ్ ఈక్విటీ షేర్ల పై దీర్ఘకాలిక మూలధన లాభాలు, ఇతర యూనిట్లు గరిష్టంగా 15 శాతం సర్-చార్జి చెల్లించవలసి ఉంటుందని, కాగా, ఇతర దీర్ఘకాలిక మూలధన లాభాలు 37 శాతం వరకు గ్రేడెడ్ సర్-ఛార్జ్ కి లోబడి ఉంటాయని, ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఏవిధమైన ఆస్తుల బదిలీపై నైనా ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక మూలధన లాభాలపై సర్-ఛార్జ్ ని 15 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. "ఈ ప్రతిపాదన అంకుర సంస్థల సమాజాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా, తయారీ కంపెనీలు మరియు అంకుర సంస్థలకు పన్ను ప్రయోజనాలను విస్తరించడంపై నా ప్రతిపాదనలతో పాటు ఆత్మ-నిర్భర్-భారత్ పట్ల మా నిబద్ధతను కూడా పునరుద్ఘాటిస్తుంది" అని మంత్రి తెలిపారు.
ఆరోగ్యం మరియు విద్యా సెస్ పై స్పష్టీకరణ:
నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం కోసం పన్ను చెల్లింపుదారులపై "ఆరోగ్యం మరియు విద్య సుంకం" అదనపు సర్-ఛార్జ్ గా విధించాలని ప్రతిపాదించినట్లు కేంద్ర ఆర్ధికమంత్రి తెలిపారు. ఆదాయం మరియు లాభాలపై ఏదైనా సర్-ఛార్జ్ లేదా సుంకాన్ని వ్యాపార వ్యయంగా అనుమతించడం జరగదని స్పష్టం చేస్తూ, శాసనపరమైన ఉద్దేశాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆదాయపు పన్నులో సర్-ఛార్జ్ లు కూడా ఉన్నాయనీ, ఇది "వ్యాపార ఆదాయాన్ని గణించడానికి అనుమతించదగిన వ్యయం కాదని" ఆమె చెప్పారు.
పన్ను ఎగవేతను అరికట్టేందుకు చర్యలు:
సోదా మరియు సర్వే నిర్వహిస్తున్న సమయంలో బయటపడిన వెల్లడించని ఆదాయంపై పన్ను నివారించడానికి నష్టాలను పరిగణలోకి తీసుకునే విధానాన్ని అనుమతించకూడదని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు శ్రీమతి సీతారామన్ ప్రకటించారు. ఆదాయాన్ని బహిర్గతం చేయకపోవడం లేదా అమ్మకాలను తగ్గించడం వంటి అనేక సందర్భాల్లో, నష్టాలను ప్రకటించి, పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నట్లు గమనించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన ఖచ్చితత్వాన్ని తీసుకురావడంతో పాటు, పన్ను ఎగవేతదారుల సంఖ్యను తగ్గిస్తుందని, కేంద్ర ఆర్ధికమంత్రి పేర్కొన్నారు.
*****
(Release ID: 1794602)
Visitor Counter : 353