ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా గేట్‌వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి అనంతరం సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారాల ప్రదానం;


“విపత్తు సంబంధిత చట్టాన్ని 2003లోనే రూపొందించిన తొలి రాష్ట్రం గుజరాత్”;

“విపత్తు నిర్వహణలో సహాయ-రక్షణ-పునరావాసం సహా
సంస్కరణ కార్యక్రమాలకూ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది”;

“విపత్తు నిర్వహణ ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదు…
'సమష్టి కృషి’కి ఇదొక నమూనాగా రూపాంతరం చెందింది”;

“స్వతంత్ర భారతం కలలు నెరవేర్చడం మా లక్ష్యం.. అలాగే స్వాతంత్య్ర
శతాబ్ది సంవత్సరంలోగా నవ భారతాన్ని నిర్మించడమూ మా లక్ష్యం”;

“స్వాతంత్ర్యం తర్వాత దేశ సంస్కృతి.. సంప్రదాయాలతోపాటు ఎందరో మహనీయుల పాత్రను చెరిపివేసే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరం”;

“స్వాతంత్ర్య పోరాటంలో లక్షలాది పౌరుల ‘అకుంఠిత దీక్ష’ ఉంది.. కానీ-
వారి చరిత్రను కూడా పరిమితంచేసే ప్రయత్నాలు జరిగాయి..
అయితే- దేశం ఇవాళ ఆ తప్పులను ధైర్యంగా సరిదిద్దుతోంది”;

“నేతాజీ ప్రబోధిత ‘చేయగలం-చేసి తీరుతాం’
నినాదం స్ఫూర్తితో ముందుకు సాగుదాం”

Posted On: 23 JAN 2022 8:06PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా గేట్‌వద్ద నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహం పనులు పూర్తయ్యేదాకా ఈ హోలోగ్రామ్‌ ఇక్కడ దర్శనమిస్తూంటుంది. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి నేపథ్యంలో ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రదేశంలో అసలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, హోలోగ్రామ్‌ విగ్రహావిష్కరణ అనంతరం 2019, 2020, 2021, 2022 సంవ‌త్స‌రాల‌కుగాను ‘సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారా”లను ప్రధాని ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవలందించిన దేశంలోని వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు, గౌరవం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది.

   నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి నేపథ్యంలో ఆ భరతమాత వీరపుత్రుడికి ప్రధానమంత్రి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- భారతగడ్డపై తొలి స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, బలమైన-సర్వసత్తాక భారత సాధనపై మనలో ఆత్మవిశ్వాసం నింపిన నేతాజీ సుందర విగ్రహాన్ని ఇండియాగేట్‌ వద్ద డిజిటల్‌ రూపంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతి త్వరలోనే దీని స్థానంలో గ్రానైట్‌తో రూపుదిద్దిన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆ స్వాతంత్ర్య పోరాట వీరుడికి కృతజ్ఞతపూర్వకంగా దేశం ఈ విగ్రహం రూపంలో నివాళి అర్పిస్తున్నదని పేర్కొన్నారు. మన వ్యవస్థలకు, రాబోయే తరాలకు జాతీయ కర్తవ్యాన్ని ఈ విగ్రహం సదా స్ఫురణకు తెస్తూంటుందని ఆయన చెప్పారు.

   దేశంలో విపత్తు నిర్వహణ రంగం చారిత్రక పరిణామక్రమాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణ అంశం ఏళ్ల తరబడి వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలో ఉండిపోయిందని ఆయన గుర్తుచేశారు. దేశంలో వరదలు, భారీ వర్షాలు, వడగండ్ల వానలు వంటి పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. అయితే, విపత్తు నిర్వహణ అర్థాన్ని 2001నాటి గుజరాత్‌ భూకంపం పూర్తిగా మార్చేసిందని ప్రధాని అన్నారు. “ఆ సమయంలో మేము అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలను రక్షణ-సహాయ కార్యక్రమాల్లోకి దింపాం. ఆనాటి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల మేరకు ‘గుజరాత్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టం-2003’ను ప్రవేశపెట్టాం. ఆ విధంగా దేశంలో విపత్తుల నిర్వహణకు ప్రత్యేక చట్టం చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. గుజరాత్‌ నేర్పిన ఈ పాఠంతో రెండేళ్ల తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశమంతటికీ వర్తించే ‘విపత్తు నిర్వహణ చట్టం-2005’ను ప్రవేశపెట్టింది” అని ఆయన గుర్తుచేశారు.

   విపత్తుల నిర్వహణలో సహాయ-రక్షణ-పునరావాసం సహా సంస్కరణ కార్యక్రమాలకూ ప్రాధాన్యం ఇవ్వబడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఆ మేరకు దేశవ్యాప్తంగా జాతీయ విపత్తు సహాయక దళాన్ని (ఎన్డీఆర్‌ఎఫ్‌) ఆధునికీకరించడంతోపాటు శక్తిమంతంగా రూపొందించి విస్తరింపజేశామని చెప్పారు. ఈ దిశగా అంతరిక్ష సాంకేతికత నుంచి ప్రణాళిక-నిర్వహణలో అత్యుత్తమ విధానాలను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ‘ఎన్డీఎంఏ’ సంబంధిత ‘ఆపద మిత్ర’ వంటి పథకాలతో ముందుకొస్తున్నారని ప్రధాని చెప్పారు. ఆ మేరకు ఎప్పుడు విపత్తులు సంభవించినా వారు బాధితులుగా మిగిలిపోకుండా, స్వచ్ఛంద కార్యకర్తలుగా వాటిని ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఆ మేరకు విపత్తు నిర్వహణ నేడు ప్రభుత్వ ఉద్యోగంలా కాకుండా 'సమష్టి కృషి’కి నమూనాగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు.

   విపత్తులను ఎదుర్కొనడంలో వ్యవస్థల సామర్థ్యం మెరుగు దిశగా వాటిని బలోపేతం చేయాల్సి ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ప్రజానీకంలో సరికొత్త సంసిద్ధతకు ఒడిషా, పశ్చిమ బెంగాల్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో తుఫానులు ఉదాహరణగా నిలిచాయని ఆయన ఉదాహరించారు. అంతకుముందు రోజులతో పోలిస్తే ఈ విపత్తుల వల్ల వాటిల్లిన నష్టం చాలా తక్కువగా ఉండటాన్ని గుర్తుచేశారు. దేశంలో మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, విపత్తు ప్రమాద విశ్లేషణ-ముప్పు నిర్వహణ ఉపకరణాలతో తుఫాను ప్రతిస్పందన వ్యవస్థ ఆమూలాగ్రం చక్కగా ఉందని ఆయన చెప్పారు.

   దేశంలో నేడు విపత్తు నిర్వహణకు సంబంధించి పాలనలోని ప్రతి అంశంలోనూ సంపూర్ణ విధివిధానాలు, విశిష్ట ఆలోచనా ధోరణి గురించి ప్రధానమంత్రి వివరించారు. విపత్తు నిర్వహణ ఇవాళ సివిల్‌ ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సులలో అంతర్భాగంగా ఉందని, అలాగే ఆనకట్టల భద్రత చట్టం కూడా అమలులో ఉన్నదని గుర్తుచేశారు. అలాగే కొత్త మౌలిక సదుపాయాల భారీ ప్రాజెక్టులలో విపత్తుల ప్రతిరోధకత అంతర్భాగంగా ఉంటోందని పేర్కొన్నారు. భూకంప ముప్పుగల ప్రాంతాల్లో ‘పీఎం ఆవాస్‌ యోజన' ఇళ్ల నిర్మాణం, చార్‌ధామ్‌ పరియోజన, ఉత్తరప్రదేశ్‌లో ఎక్స్‌ ప్రెస్‌ హైవేలు వంటి ప్రాజెక్టులలో విపత్తు సంసిద్ధత అంతర్భాగంగా ఉండటాన్ని నవభారత ఆలోచన ధోరణికి, దార్శనికతకు ఉదాహరణలుగా చూపారు.

   విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశానికిగల అంతర్జాతీయ స్థాయి నాయకత్వాన్ని కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. విపత్తు ప్రతిరోధక మౌలిక సదుపాయాల సంకీర్ణం (సీడీఆర్‌ఐ)ద్వారా భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఒక ప్రధాన ఆలోచనను, బహుమతిని ఇచ్చిందని గుర్తుచేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌సహా 35 దేశాలు ఇప్పటికే ఈ సంకీర్ణంలో భాగస్వాములైనట్లు తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇవాళ సంయుక్త సైనిక కసరత్తులు సర్వసాధారణం కాగా, భారతదేశం తొలిసారిగా విపత్తు నిర్వహణ సంబంధిత ఉమ్మడి కసరత్తు సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

   సందర్భంగా “స్వతంత్ర భారత స్వప్న సాకారంపై ఎన్నడూ విశ్వాసం కోల్పోవద్దు.. భారత్‌ను భయపెట్టగల శక్తి ఏదీ ప్రపంచంలో ఎక్కడా లేదు” అన్న నేతాజీ వ్యాఖ్యను ప్రధాని ప్రస్తావించారు. తదనుగుణంగా ఇవాళ స్వతంత్ర భారతం కలలు నెరవేర్చడం తమ లక్ష్యమని, అదే సమయంలో స్వాతంత్య్ర శతాబ్ది సంవత్సరంలోగా నవ భారత నిర్మాణాన్నీ లక్ష్యంగా నిర్దేశించకున్నామని ప్రధాని ప్రకటించారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నిర్వహణలోని దృఢ సంకల్పం భారతదేశం తన ప్రతిష్టను, స్ఫూర్తిని పునరుజ్జీవింప చేయడమేనని ప్రధాని చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ సంస్కృతి.. సంప్రదాయాలతోపాటు నాటి పోరాటంలో  ఎందరో మహనీయులు పోషించిన ఘనమైన పాత్రను చెరిపివేసే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స్వాతంత్ర్య సాధనలో లక్షలాది పౌరుల ‘అకుంఠిత దీక్ష’ ఉందని, అయినప్పటికీ వారి చరిత్రను కూడా పరిమితంచేసే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయితే, స్వాతంత్ర్యం సిద్ధించిన కొన్ని దశాబ్దాల తర్వాత ఆ తప్పులను దేశం నేడు ధైర్యంగా సరిదిద్దుతున్నదని పేర్కొన్నారు.

   నాటి తప్పిదాలను సరిదిద్దడంలో భాగంగా చేపట్టిన కొన్ని చర్యలను ప్రధాని వివరించారు. ఈ మేరకు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌తో ముడిపడిన పంచతీర్థాలు, సర్దార్‌ పటేల్‌ కృషికి స్మారకమైన ఐక్యతా విగ్రహం, భగవాన్‌ బిర్సాముండా గౌరవార్థం ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’, గిరిజన సమాజం అకుంఠిత కృషిని గుర్తుచేసే గిరిజన ప్రదర్శనశాలలు, అండమాన్‌లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఒక దీనికి ఆయన పేరు పెట్టడం, అలాగే నేతాజీతోపాటు ‘ఐఎన్‌ఏ’ గౌరవార్థం ‘సంకల్ప స్మారకం’ వంటివాటిని ఆయన ఉదాహరించారు. నిరుడు ‘పరాక్రమ దినోత్సవం’ సందర్భంగా తాను నేతాజీ పూర్వికుల నివాసం సందర్శించడాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి భావోద్వేగానికి గురయ్యారు. అదేవిధంగా 2018 అక్టోబరు 21న ‘ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వం' 75 ఏళ్లు పూర్తిచేసుకోవడాన్ని కూడా తాను మరువజాలనని ప్రధాని చెప్పారు. “నేను ఆ రోజున ఎర్రకోటవద్ద ప్రత్యేక వేడుకల్లో భాగంగా ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ టోపీ ధరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాను. అదొక అత్యద్భుత, విస్మరించజాలని మధుర క్షణం” అని ఆయన అభివర్ణించారు. నేతాజీ సుభాస్‌ ఏదైనా సాధించాలని నిశ్చయించుకుంటే ఏ శక్తీ ఆయన ఆపలేదని ప్రధానమంత్రి చెప్పారు. ఆ మేరకు నేతాజీ ప్రబోధించిన ‘చేయగలం-చేసి తీరుతాం’  అనే సంకల్ప స్ఫూర్తితో ముందుకు సాగుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

***

DS/AK



(Release ID: 1792140) Visitor Counter : 181