ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌లోని సోమనాథ్‌లో కొత్త సర్క్యూట్ హౌస్‌కు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం


“సోమ్‌నాథ్ ఆలయం ధ్వంసం నాటి పరిస్థితులతోపాటు సర్దార్ పటేల్ కృషితో ఆలయ పునరుద్ధరణ జరిగిన నాటి పరిస్థితులు రెండూ గొప్ప సందేశమిస్తాయి”;

“నేడు దేశంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి ప్రభుత్వ పథకాలలో భాగం కాదు… ప్రజా భాగస్వామ్యంతో సాగే ఉద్యమం… దేశ వారసత్వ ప్రదేశాలుసహా మన సాంస్కృతిక వారసత్వ ప్రగతి ఇందుకు గొప్ప ఉదాహరణలు”;

“దేశం నేడు పర్యాటకాన్ని సమగ్ర దృక్పథంతో చూస్తోంది; పరిశుభ్రత.. సౌకర్యం.. సమయం.. ఆలోచనల వంటివి పర్యాటక ప్రణాళికలో భాగమవుతున్నాయి”;

“మన ఆలోచనలు వినూత్నంగా.. ఆధునికంగా ఉండటం అవసరం.. అలాగే మన ప్రాచీన వారసత్వం గురించి మనమెంతగా గర్విస్తున్నామన్నదీ చాలా ముఖ్యం”

Posted On: 21 JAN 2022 12:48PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సోమనాథ్‌లో కొత్త సర్క్యూట్ హౌస్‌ను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ- సోమ‌నాథ్ స‌ర్క్యూట్ హౌస్ ప్రారంభోత్సవం నిర్వహణపై గుజరాత్ ప్రభుత్వంతోపాటు సోమనాథ్ ఆలయ ట్రస్టుకు అభినందనలు తెలిపారు. కాలగమనంలో ఎన్నో విధ్వంసాలను ఎదుర్కొన్న నేపథ్యంలో సమున్నత ఆలయ శిఖరం, దాని ఔన్నత్యం విషయంలో భారత్‌ సగర్వంగా నిలవడం భక్తుల మనోభావాల్లోనూ ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నెన్నో సవాళ్లను తట్టుకుంటూ సాగిన భారత నాగరికత పయనం, వందల ఏళ్ల బానిసత్వం తదితర పరిస్థితులను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సోమ్‌నాథ్ ఆలయం ధ్వంసం నాటి పరిస్థితులతోపాటు సర్దార్ పటేల్ కృషితో ఆలయ పునరుద్ధరణ జరిగిన నాటి పరిస్థితులు కూడా గొప్ప సందేశమిస్తాయని ఆయన పేర్కొన్నారు. “నేడు స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో మన గతం నుండి నేర్చుకోవాలని మన అభిలషిస్తున్నాం. అందులో సోమనాథ్ వంటి సంస్కృతి-భక్తివిశ్వాసాల ప్రతీకలైన ప్రదేశాలు కేంద్రకాలుగా ఉన్నాయి” అని ప్రధానమంత్రి వివరించారు.

   ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలలో పర్యాటకరంగం ప్రధానపాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు. “మనకు ప్రతి రంగంలోనూ ఇలాంటి అవకాశాలు అపారంగా ఉన్నాయి” అని ప్రధాని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆయన దేశంలోని ఆధ్యాత్మిక గమ్యాల వాస్తవిక సాదృశ భారత దర్శనం చేయించారు. ఈ మేరకు గుజరాత్‌లోని సోమనాథ్‌, ద్వారక, రాన్‌ ఆఫ్‌ కచ్‌, ఐక్యతా విగ్రహం; ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, మథుర, కాశీ, ప్రయాగ, కుషీనగర్‌, వింధ్యాచల్‌; దేవభూమి ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌; హిమాచల్‌ ప్రదేశ్‌లోని జ్వాలాదేవి, నైనా దేవి; ఈశాన్య భారతమంతటా ప్రసరించే ప్రకృతి కాంతులు, సహజ సౌందర్యం; తమిళనాడులోని రామేశ్వరం; ఒడిషాలోని పూరి; ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ; మహారాష్ట్రలోని సిద్ధివినాయకుడు; కేరళలోని శబరిమల వంటి ప్రదేశాల గురించి ఆయన గుర్తుచేశారు. “ఈ ప్రదేశాలన్నీ మన జాతీయ ఐక్యతను, ‘ఒకే భారతం-విశిష్ట భారతం’ ప్రాశస్త్యాని ప్రతినిధులు. ఇవాళ వీటన్నిటినీ సౌభాగ్య వనరులుగానూ దేశం పరిగణిస్తోంది. వాటి అభివృద్ధి ద్వారా ఎంతో విశాలమైన ప్రాంతంలో మనం ప్రగతిని ముందుకు నడిపించవచ్చు” అని ఆయన చెప్పారు.

   దేశంలో పర్యాటక రంగం సామర్థ్యాన్ని సాకారం చేసేందుకు గడచిన ఏడేళ్లుగా ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఆ మేరకు “నేడు దేశంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి ప్రభుత్వ పథకాలలో భాగం మాత్రమే కాదు… ప్రజా భాగస్వామ్యంతో సాగే ఉద్యమం. దేశ వారసత్వ ప్రదేశాలుసహా మన సాంస్కృతిక వారసత్వ ప్రగతి ఇందుకు గొప్ప ఉదాహరణలు” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా 15 ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యూట్లకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ఉదాహరణకు॥ ‘రామాయణ సర్య్యూట్‌’లో దైవం రాముడికి సంబంధించిన ప్రదేశాలన్నటినీ సందర్శించవచ్చు. ఇందుకోసం ఒక ప్రత్యేక రైలు కూడా ప్రారంభించబడింది. అలాగే ఢిల్లీ నుంచి బయల్దేరే ప్రత్యేక రైలులో రేపు దివ్య కాశీయాత్ర చేయవచ్చునని పేర్కొన్నారు. అదేవిధంగా బుద్ధ భగవానుడికి సంబంధించిన ప్రదేశాల పర్యటనను బుద్ధ సర్క్యూట్‌ సులభతరం చేస్తుందని తెలిపారు. మరోవైపు విదేశీ పర్యాటకులు ఈ ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా వీసా నిబంధనలు సరళం చేశామని, పర్యాటక ప్రదేశాల్లో టీకాల కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు.

   దేశం నేడు పర్యాటకాన్ని సమగ్ర దృక్పథంతో చూస్తోంది. నేటి పరిస్థితులలో పర్యాటక రంగ అభివృద్ధి దిశగా నాలుగు అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందులో మొదటిది పరిశుభ్రత... లోగడ మన పర్యాటక ప్రదేశాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఎంతో అనారోగ్యకర వాతావరణ ఉండేది. అయితే, స్వచ్ఛభారత్ అభియాన్‌తో ఇవాళ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పర్యాటకంలో మరొక ముఖ్యాంశం సౌకర్యం… అయితే, సౌకర్యాల పరిధి పర్యాటక ప్రదేశాలకు మాత్రమే పరిమితం కారాదు. రవాణా, ఇంటర్నెట్‌, సరైన సమాచారం, వైద్య ఏర్పాటు వంటి అన్నిరకాల సౌకర్యాలు ఉండాలి. ఈ దిశగా దేశంలో అన్నిరకాల చర్యలూ చేపట్టబడుతున్నాయి. పర్యాటక ప్రగతికి మూడో ముఖ్యాంశం సమయం... ప్రస్తుత యుగంలో కనిష్ఠ సమయంలో గరిష్ఠ దూరం ప్రయాణించడం ప్రజాభీష్టంగా ఉంది. ఇక నాలుగోది, అత్యంత ముఖ్యమైనది పర్యాటకంపై మన ఆలోచనల్లో మార్పు. మన ఆలోచనలు వినూత్నంగా ఆధునికంగా ఉండటం అవసరం. అదే సమయంలో మన ప్రాచీన వారసత్వం గురించి మనమెంతగా గర్విస్తున్నామన్నదీ చాలా ముఖ్యం.

   స్వాతంత్య్రానంతరం ఢిల్లీలోని కొన్ని కుటుంబాలకు మాత్రమే సరికొత్త ప్రగతి పరిమితమైందని ప్రధాని అన్నారు. అయితే, దేశం ఇవాళ అలాంటి సంకుచిత భావనకు తిలోదకాలిచ్చి మనం గర్వించదగిన కొత్త ప్రదేశాలను ఘనంగా నిర్మిస్తూ వాటికి విశేష ప్రాచుర్యం కల్పిస్తోంది. “ఢిల్లీలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్మారకం, రామేశ్వరంలో ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం స్మారకం నిర్మించింది మా ప్రభుత్వమే. అలాగే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, శ్యామ్‌ కృష్ణవర్మల జీవితాలతో ముడిపడిన ప్రదేశాలకు తగిన గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆదివాసీ పురావస్తుశాలల నిర్మాణంద్వారా గిరిజన సమాజం ఉజ్వల చరిత్రను ప్రజల ముందుంచింది” అని ప్రధాని వివరించారు. కొత్తగా అభివృద్ధి చేసిన పర్యాటక ప్రదేశాలకు లభించిన ప్రాచుర్యాన్ని ప్రస్తావిస్తూ- మహమ్మారి సమయంలోనూ దాదాపు 75 లక్షల మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారని ఆయన తెలిపారు. అలాంటి ప్రదేశాలు మన పర్యాటక రంగాన్నే కాకుండా మన ప్రతిష్టను కూడా కొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు.

   ‘స్థానికం కోసం స్వగళం’ అంటూ తానిచ్చిన పిలుపును సంకుచిత అర్థానికి పరిమితం చేయవద్దని, ఇందులో పర్యాటకం కూడా ఒక భాగమని ప్రధానమంత్రి చెప్పారు. విదేశీ పర్యటనకు వెళ్లేముందు స్వదేశంలో కనీసం 15-20 ప్రదేశాలను సందర్శించాల్సిందిగా పర్యాటకులకు తన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు.

 



(Release ID: 1791687) Visitor Counter : 175