రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

దేశంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 18 JAN 2022 11:23AM by PIB Hyderabad

దేశంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరమని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితీష్ గడ్కరీ అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు. రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సోమవారం ఏర్పాటు చేసిన " పీఎం -గతి శక్తి" దక్షిణ భారత సదస్సును శ్రీ గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ గడ్కరీ అభివృద్ధి సాధనకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య అవగాహన, సహకారం మరింత పెరగాలని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సలహాలు, సూచనలు అందించాలని శ్రీ గడ్కరీ కోరారు.

సదస్సులో మాట్లాడిన కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్.బొమ్మై ప్రధాన మెగా ప్రాజెక్టులను అమలు చేసే అంశంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకుకేంద్రం త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని సూచించారు. ఆర్థికపరమైన నిబంధనలను సడలించాలని అన్నారు.

సదస్సులో పాల్గొన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందర్ రాజన్ మల్టీ మోడల్ రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ వల్ల ప్రజలు, వస్తువులను వేగంగా రవాణా చేసేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. రంగసామి సూచించారు. పుదుచ్చేరి వచ్చే పర్యాటకులకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్, హెలిప్యాడ్ సేవలు మరియు విమానాశ్రయ సౌకర్యాలను కల్పించాలని ఆయన కోరారు.

దేశంలో మల్టీ-మోడల్ రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో '' పీఎం-గతి శక్తి" ప్రాజెక్టును అమలు చేస్తున్నామని కేంద్ర రహదారి రవాణా, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) డాక్టర్ వి,కే,సింగ్ వివరించారు.

బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో తమ రాష్ట్రం తన వంతు పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి శ్రీ ఎం .గౌతమ్ రెడ్డి అన్నారు. దేశంలో అతి పెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో రవాణా వ్యయం ఎక్కువగా ఉందని అన్నారు. రవాణా వ్యయం జీడీపీ ప్రపంచ సగటు 8 శాతం ఉండగా భారతదేశంలో ఈ వ్యయం జీడీపీ లో 15%వరకు ఉందని ఆయన వివరించారు. రవాణా వ్యయం తగ్గించేందుకు ప్రధానమంత్రి చేస్తున్న ప్రయత్నాలు "పీఎం-గతి శక్తి" ప్రాజెక్ట్ తో ఫలిస్తాయని శ్రీ గౌతమ్ రెడ్డి అన్నారు.  

దేశ ఆర్థికాభివృద్ధిలో మౌలిక వసతుల రంగం ప్రధాన పునాదిగా ఉంటుందని కేరళ ప్రజా పనులు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ పి.ఏ. మహమ్మద్ రియాస్ అన్నారు. మౌలిక రంగం బలంగా ఉన్నప్పుడు ఆర్థిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థ అభివృద్ధికి కేరళ అనువైన ప్రాంతంగా ఉంటుందని శ్రీ మహమ్మద్ రియాస్ అన్నారు.  

జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి తగినంత సహకారం అందిందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీ కే.టి. రామారావు అన్నారు. రైల్వే మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు సహకారం అందించాలని శ్రీ రామారావు కోరారు.  

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్ర స్థాయిలో సంస్థాగత సౌకర్యాల కల్పనకు దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించేందుకు సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల అధికారులకు పథకం లక్ష్యాలపై అవగాహన కల్పించి, పథకం అమలుకు వారిని సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.   

సదస్సులో అండమాన్ నికోబార్దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. పథకం వివిధ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సంబంధిత వర్గాలకు చెందిన ప్రతినిధులు చర్చలు జరిపారు. అధికారులు మరియు వాటాదారులతో కూడిన ఈ కార్యక్రమం యొక్క వివిధ అంశాలపై ప్యానెల్ చర్చలు జరిగాయి. ఇంతవరకు సాధించిన విజయాలు, రవాణా రంగ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు అమలు చేయనున్న కార్యాచరణపై సదస్సులో పాల్గొన్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శన ఇచ్చాయి.

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్ పర్సన్ శ్రీమతి అల్కా ఉపాధ్యాయ అద్యక్షతన ' పీఎం-గతి శక్తి అమలుకు కార్యాచరణ' అనే అంశంపై జరిగిన చర్చలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సభ్యుడు శ్రీ ఆర్.కే.పాండే ప్రసంగించారు. సదస్సులో పాల్గొన్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు సలహాలు సూచనలు అందించి తమ అభిప్రాయాలను వివరించారు. వీటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను శ్రీమతి అల్కా ఉపాధ్యాయ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

సదస్సులో భాగంగా నిర్వహించిన సాంకేతిక సదస్సులో భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ టి,పి. సింగ్ ప్రసంగించారు.

రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అమిత్ కుమార్ ఘోష్ స్వాగత ఉపన్యాసంతో ప్రారంభమైన సదస్సులో పారిశ్రామిక అభివృద్ధి, మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, రవాణా రంగ అభివృద్ధికి గల అవకాశాలను సదస్సులో పాల్గొన్న 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు వివరించారు. రవాణా రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి , వివిధ రవాణా వ్యవస్థలు తదితర అంశాలను సదస్సులో చర్చించారు.

 

****

 



(Release ID: 1790708) Visitor Counter : 266