ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ టీకా కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కోవిడ్-19 వ్యాక్సిన్ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసిన చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ' ప్రజా ఉద్యమ స్ఫూర్తి'తో ప్రపంచంలో అతి పెద్ద టీకా కార్యక్రమం విజయవంతం


ప్రజలంతా కలిసి ఉద్యమిస్తే ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు అన్న ప్రధానమంత్రి నమ్మకానికి నిదర్శనం దేశంలో ప్రజా ఉద్యమంగా అమలు జరిగిన టీకా కార్యక్రమం. -- డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

ఆత్మ నిర్బర్ భారత్ కు అతి పెద్ద నిదర్శనం టీకా కార్యక్రమం

'వసుదైక కుటుంబం' స్ఫూర్తితో దేశంలో అమలు జరిగిన టీకా కార్యక్రమం పరిశోధన నుంచి అభివృద్ధి వరకు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది ... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 16 JAN 2022 5:53PM by PIB Hyderabad

భారతదేశ జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమం 1వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్మారక పోస్టల్ స్టాంప్‌ను  కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్‌, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ చౌహాన్తో కలిసి విడుదల చేశారు.

స్మారక స్టాంపుపై ఒక  ఆరోగ్య సంరక్షణ కార్యకర్త కోవిడ్ -19 వ్యాక్సిన్‌తో సీనియర్ సిటిజన్‌కి టీకా వేస్తున్న చిత్రంతో పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్ సీసాను ముద్రించారు. కోవిడ్ బారి నుంచి దేశ ప్రజలను కాపాడే అంశంలో ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు చేసిన సేవలు గుర్తు చేసే విధంగా స్టాంపును రూపొందించడం జరిగింది. 

స్టాంపును విడుదల చేసిన అనంతరం మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా టీకా కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తైన సందర్భంగా తపాలా బిళ్ళను విడుదల చేయడాన్ని ఒక చారిత్రాత్మక సంఘటనగా వర్ణించారు. ప్రపంచంలో అమలు జరిగిన అతి పెద్ద కార్యక్రమంగా భారతదేశంలో అమలు జరుగుతున్న టీకా కార్యక్రమం గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. టీకా కార్యక్రమాన్ని 2021 జనవరి ఒకటో తేదీన ప్రారంభించి, ప్రారంభించిన ఏడాది కాలంలో 156 కోట్లకు పైగా టీకా డోసులు వేశామని  వివరించారు. భారతదేశ టీకా కార్యక్రమం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని డాక్టర్ మాండవీయ అన్నారు. కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావడంతో దేశం ఈ లక్ష్యాన్ని సాధించగలిగిందని అన్నారు.కోవిడ్ మహమ్మారి కి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొని అండగా నిలిచిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు మంత్రి అభినందనలు తెలిపారు. 

కోవిడ్-19 మహమ్మారి కి వ్యతిరేకంగా దేశం కలిసి కట్టుగా ఉద్యమించి పనిచేసిందని డాక్టర్ మాండవీయ అన్నారు. ' కోవిడ్ సమయంలో మనం కనబరిచిన పోరాట స్ఫూర్తి చూసి  ప్రపంచం  ఆశ్చర్యపోయింది. అధిక జనాభా  సాంద్రత ఉన్న దేశంగా మన దేశం గుర్తింపు పొందింది. అయినప్పటికీ దేశంలో వేసిన టీకా డోసుల సంఖ్య 156 కోట్లు దాటింది. టీకా కార్యక్రమంలో మనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, 135 కోట్ల మంది ప్రజలు కలిసి ఉద్యమించి దృఢ సంకల్పం, అంకిత భావంతో పనిచేసి ప్రతి సవాల్ ను అధిగమించి విజయం సాధించారు. ఈ అంశంలో స్వదేశంలో జరిగిన పరిశోధనలు, అభివృద్ధి కీలక పాత్ర పోషించాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి, రవాణా కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేయగలిగాం. విమర్శలు, అపనమ్మకాల మధ్య దేశం స్ఫూర్తిటి పనిచేసి విమర్శకుల నోర్లు మూయించింది.  స్వదేశంలో తయారైన వ్యాక్సిన్ సామర్థ్యంపై వచ్చిన సందేహాలకు సమాధానం ఇచ్చి  జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడం జరిగింది' అని శ్రీ మాండవీయ అన్నారు.                      

దేశ చరిత్రలో టీకా కార్యక్రమం నూతన చరిత్రకు నాంది పలికిందని  డాక్టర్ మాండవీయ అన్నారు. గతంలో దేశంలో ఇటువంటి కార్యక్రమం అమలు జరగలేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో దేశ ప్రజలు అకుంఠిత దీక్ష, పట్టుదలతో తమలో నిగూఢంగా ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసి టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసారని శ్రీ మాండవీయ అన్నారు. 

'అతి కొద్ది సమయంలో పరీక్షను ఎదుర్కొన్న తీరు గతంలో దేశంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుండడంతో దేశంలో ఆరోగ్య వ్యవస్థను అతి కొద్ది సమయంలో సన్నద్ధం చేయవలసి వచ్చింది. 'అని మంత్రి అన్నారు. ప్రజలకు అవసరమైన చికిత్సను అందించేందుకు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉన్న వైద్య ఆరోగ్య సౌకర్యాలను వ్యూహాత్మకంగా పునర్నిర్మించి  విజయం సాధించిందని డాక్టర్ మాండవీయ అన్నారు. 

చురుకైనముందస్తు, సంపూర్ణ విధానంతో ప్రభుత్వం, ప్రజలు భాగస్వాములుగా దేశంలో  కోవిడ్ ప్రతిస్పందన కార్యక్రమాన్ని అమలు చేశామని  కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టేదని అయితే  ప్రధానమంత్రి  దూరదృష్టితో అందించిన నాయకత్వం వల్ల అది కేవలం తొమ్మిది నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ప్రధాని ఎల్లప్పుడూ మన శాస్త్రవేత్తలను  ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్న డాక్టర్ మాండవీయ వారి సహకారంతో రికార్డు సమయంలో స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసారని అన్నారు. శాస్త్రవేత్తలపై ప్రధాని పెట్టుకున్న నమ్మకం వల్ల ఇది సాధ్యమైందని  ఆయన అన్నారు.

అందరి సమిష్టి కృషితో టీకా కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్న డాక్టర్ మాండవీయ దీనికి కారణమైన వారందరిని అభినందించారు.   ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్లు పౌరులు జన్ భగీదరి స్ఫూర్తితో కలిసి ఉంటే భారతదేశం ఏమైనా సాదించగలదు అని టీకా కార్యక్రమం రుజువు చేసిందని   అన్నారు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ మాట్లాడుతూ  “ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలో భారత ప్రభుత్వం కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి  చర్యలు తీసుకుంది. స్వదేశీ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం ప్రధాన సవాళ్లలో ఒకటి. స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను అతి తక్కువ సమయంలో  అభివృద్ధి చేసి  తయారు చేయడం ద్వారా దేశం సవాల్ ను ఎదుర్కొని విజయం సాధించింది.  అర్హత కలిగిన జనాభాలో దాదాపు 93% మరియు 69.8% మందికి కోవిడ్ -19 టీకా  మొదటి డోస్ మరియు రెండవ డోస్ వరుసగా వేయడం జరిగింది" అని అన్నారు. 

టీకా కార్యక్రమంలో ఐసీఎంఆర్ ప్రధాన పాత్ర పోషించిందని డాక్టర్ పవార్ అన్నారు. రోగనిర్ధారణ కిట్‌లు, మార్గదర్శకాలను అభివృద్ధి చేయడం ద్వారా టీకా డ్రైవ్‌లో ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషించిందని ఆమె తెలిపారు.  తక్కువ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్

, భారత్ బయోటెక్ బృందాన్ని కూడా ఆమె అభినందించారు.  దీనికి ప్రపంచవ్యాప్త ఆమోదం లభించిందని పేర్కొన్నారు. 

కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ మాట్లాడుతూ   కోవాగ్జిన్    పై తపాలా బిళ్ళను  విడుదల చేసిన తపాలా శాఖను   అభినందిస్తున్నాను. భారతదేశ టీకా కార్యక్రమం  నేటితో ఒక  సంవత్సరం పూర్తి చేసుకుంది.  ఇది మనందరికీ చారిత్రాత్మకమైన రోజు. ఆరోగ్య సేవ  కార్మికులందరినీ నేను అభినందిస్తున్నాను"అని అన్నారు. 

ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ మాట్లాడుతూ భారతదేశంలో టీకా కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తపాలా బిళ్ళను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవమని వ్యాఖ్యానించిన డాక్టర్ బలరాం వైద్య పరిశోధనల్లో తమ సంస్థ నూతన అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. స్వదేశంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి దేశ శాస్త్రీయ సామర్థ్యాన్ని రుజువు చేసిందని అన్నారు.   

ఐసీఎంఆర్ డీజీ  డాక్టర్ బలరాం భార్గవ. తపాలా శాఖ అదనపు డీజీ  శ్రీ అశోక్ కుమార్ పొద్దార్భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో  పాల్గొన్నారు.   

***


(Release ID: 1790441) Visitor Counter : 394