ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19పై ప్రజారోగ్య సంసిద్ధత.. జాతీయ కోవిడ్-19 టీకాల కార్య‌క్ర‌మ ప్ర‌గ‌తిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్లు/రాష్ట్రాల/యూటీల పాల‌నాధిప‌తుల‌తో సమగ్ర ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించిన ప్ర‌ధాని


“కఠోర పరిశ్రమే మనకు ఏకైక మార్గం.. అంతిమ విజయమే మన ఏకైక లక్ష్యం”;

“కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు లోగ‌డ ముందస్తు/క్రియాశీల/సామూహిక విధానం అనుస‌రించాయి.. ఇప్పుడు కూడా విజ‌యానికి మ‌న తార‌క‌మంత్రం అదే”;

“జనాభాలోని వయోజనంలో దాదాపు 92 శాతానికి భారత్ తొలి మోతాదు టీకా పూర్తిచేసింది... రెండో మోతాదు కూడా దాదాపు 70 శాతానికి అందింది”;

“ఆర్థిక వ్యవస్థ ఇదే ఊపును కొనసాగించాలి.. కనుక స్థానికంగా
వైరస్ నియంత్రణపై ఎక్కువగా దృష్టి పెట్టడం ఉత్తమం”;

“వైరస్ రకాలు ఎలాంటివైనా మహమ్మారి నియంత్రణకు
అత్యంత శక్తిమంతమైన మార్గం టీకా మాత్రమే”;

“కొత్త రకం వైరస్ రాకముందే కరోనా నిరోధానికి మన సిద్ధంగా ఉండాలి. ఒమిక్రాన్‌ నియంత్రణ సహా భవిష్యత్ రకాలపై పోరుకు మనం ఇప్పటినుంచే సిద్ధం కావాలి”;

కోవిడ్-19 వరుస దశలపై పోరులో ప్రధానమంత్రి
నాయకత్వ పటిమకు ముఖ్యమంత్రుల కృతజ్ఞతలు

Posted On: 13 JAN 2022 7:17PM by PIB Hyderabad

   దేశంలో కోవిడ్-19పై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత, జాతీయ కోవిడ్-19 టీకాల కార్య‌క్ర‌మ పురోగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్‌లు/ రాష్ట్రాలు/యూటీల పాల‌నాధిప‌తుల‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త‌న అధ్య‌క్ష‌త‌న సమగ్ర ఉన్నత స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ, సహాయమంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రస్తుత స్థితిగతుల గురించి అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- శతాబ్ద కాలంలో అతిపెద్ద మహమ్మారిపై యుద్ధంలో భారత్‌ ఇప్పుడు మూడో సంవత్సరంలో ప్రవేశించిందని గుర్తుచేశారు. అదే సమయంలో “కఠోర పరిశ్రమే మన ముందున్న ఏకైక మార్గం... అంతిమ విజయమే మన ఏకైక లక్ష్యం. 130 కోట్లమంది భారతీయులమైన మనం సమష్టి కృషితో కచ్చితంగా విజయం సాధించగలం” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

   మిక్రాన్‌పై ఇంతకుముందున్న గందరగోళం ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతున్నదని ప్రధాని అన్నారు. మునుపటి వైరస్‌ రకాల కన్నా ఒమిక్రాన్‌ చాలారెట్లు వేగంగా సామాన్య ప్రజానీకానికి సోకుతున్నదని ఆయన పేర్కొన్నారు. “మనం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటంతోపాటు ప్రజల్లో భయాందోళనలకు తావులేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ పండుగల వేళ ప్రజల్లోనే కాకుండా పాలన యంత్రాంగంలోనూ అప్రమత్తత స్థాయి ఎక్కడా తగ్గకుండా చూడాలి. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు లోగ‌డ ముందస్తు, క్రియాశీల, సామూహిక విధానం అనుస‌రించిన నేప‌థ్యంలో ఇప్పుడు కూడా విజ‌యానికి మ‌న తార‌క‌మంత్రం అదే కావాలి. మనం కరోనా వ్యాప్తిని ఎంత ఎక్కువగా నియంత్రించగలిగితే సమస్య తీవ్రత అంత తక్కువగా ఉంటుంది” అని ప్రధాని స్పష్టం చేశారు.

   వైరస్ ఏ రకానిదైనా మహమ్మారిని ఎదుర్కొనడానికి అత్యంత శక్తిమంతమైన మార్గం టీకా మాత్రమేనని ఇప్పటికే రుజువైనట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత్‌లో తయారైన టీకాలు ప్రపంచవ్యాప్తంగా తమ శ్రేష్ఠతను నిరూపించుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ నేడు జనాభాలోని దాదాపు 92 శాతం వయోజనులకు తొలి మోతాదు టీకా పూర్తిచేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా 70 శాతం జనాభాకు రెండో మోతాదు టీకా కూడా పూర్తయిందని ఆయన తెలిపారు. భారత్‌ కేవలం 10 రోజుల్లోనే కౌమార దశలోని దాదాపు 3 కోట్లమంది యువజనాభాకు టీకాలు పూర్తిచేసిందని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందువరుస సిబ్బందితోపాటు వృద్ధులకు ఎంత త్వరగా ముందుజాగ్రత్త టీకా ఇస్తే, మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యం అంతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. “దేశంలో 100 శాతం టీకాల పూర్తి దిశగా మనం ‘హర్ ఘర్ దస్తక్’ ప్రచారాన్ని ముమ్మరం చేయాలి” అని సూచించారు. టీకాలతోపాటు మాస్కు ధారణపై తప్పుదోవ పట్టించే ఎలాంటి సమాచారాన్నయినా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.

   దైనా వ్యూహం రూపకల్పనలో సామాన్యుల జీవనోపాధికి నష్టం కనీస స్థాయికి పరిమితం అయ్యేవిధంగా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని ప్రధాని అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థ వేగం కొనసాగించడం వంటి అంశాలను గుర్తుంచుకోవడం అత్యంత ప్రధానమని ఆయన నొక్కిచెప్పారు. కాబట్టి స్థానికంగా వైరస్ నియంత్రణపై ఎక్కువగా దృష్టి సారించడం ఉత్తమమని సూచించారు. ఇందులో భాగంగా ఏకాంత గృహ నిర్బంధం పరిస్థితుల నడుమ గరిష్ఠ స్థాయిలో చికిత్స అందించగల స్థితిలో మనం ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ, వాటిని కచ్చితంగా పాటించేలా చూడాలని ఆయన నొక్కిచెప్పారు. అలాగే చికిత్సలో దూరవైద్య సదుపాయం  ఎంతగానో తోడ్పడగలదని చెప్పారు.

   దేశంలో ఆరోగ్య మౌలిక వసతుల నవీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోగడ ఇచ్చిన రూ.23,000 కోట్ల ప్యాకేజీని రాష్ట్రాలు సద్వినియోగం చేయడంపై ప్రధానమంత్రి ప్రశంసించారు. దీనికింద దేశవ్యాప్తంగా 800కి పైగా పిల్లల చికిత్స యూనిట్లు ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు. అలాగే 1.5 లక్షల కొత్త ఐసీయూ, హెచ్‌డీయూ పడకలు, 5 వేలకుపైగా ప్రత్యేక అంబులెన్సులు, 950కిపైగా ద్రవ ఆక్సిజన్‌ నిల్వ ట్యాంకుల సామర్థ్యం కూడా జోడించబడినట్లు వివరించారు. మౌలిక సదుపాయాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. “కరోనాను తరిమికొట్టాలంటే కొత్తరకం వైరస్ రాకముందే దాని నిరోధానికి మన సంసిద్ధంగా ఉండాలి. ఒమిక్రాన్‌ను నియంత్రించడం సహా భవిష్యత్ రకాలపై పోరుకు మనం ఇప్పటినుంచే సిద్ధం కావాలి” అని ప్రధానమంత్రి అన్నారు.

   కోవిడ్-19 వరుస దశల నియంత్రణలో ప్రధానమంత్రి నాయకత్వ పటిమకు సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులతోపాటు విస్తృత సహాయ, సహకారాలు అందించడం రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక వసతుల మెరుగుకు తోడ్పడిందని వారు పేర్కొన్నారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేసుల పెరుగదల నేపథ్యంలో ఆస్పత్రుల్లో పడకల సంఖ్య  పెంపు, ప్రాణవాయువు లభ్యతవంటి సంసిద్ధత చర్యలు చేపట్టడంపై ముఖ్యమంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతూ- బెంగళూరులో కేసుల సంఖ్య పెరుగుదల, అపార్ట్‌మెంట్లలో వ్యాధి వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మాట్లాడుతూ- రాబోయే పండుగల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాల గురించి, పరిస్థితి నియంత్రణకు రాష్ట్ర పాలన యంత్రాంగం సన్నాహాలు, ఏర్పాట్ల గురించి తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తూ- ప్రస్తుత మూడో దశపై పోరులో కేంద్రంతో అడుగులు కలిపి ముందుకు వెళ్తామని చెప్పారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి మాట్లాడుతూ- రాష్ట్రంలోని కొన్ని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అపోహల వల్ల టీకాల కార్యక్రమం ప్రగతిలో కొంత ఇబ్బంది కలిగిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాట్లాడుతూ- ప్రతి ఒక్కరికీ టీకా అందేవిధంగా టీకాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పంజాబ్‌లో మౌలిక సదుపాయాలకు నిధులు అందించడంతోపాటు.. ముఖ్యంగా ప్రాణవాయువు అవసరాలు తీర్చడంలో కేంద్రం ఇచ్చిన మద్దతుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ముందుజాగ్రత్త టీకాలివ్వడం ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసే చర్యగా అస్సాం ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మణిపూర్‌లో ప్రజలందరికీ టీకా అందేవిధంగా చేపట్టిన చర్యల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించారు.

 

***

DS/AK(Release ID: 1789857) Visitor Counter : 193