సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పుదుచ్చేరిలో ఎం.ఎస్.ఎం.ఈ. టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన - ప్రధానమంత్రి
Posted On:
12 JAN 2022 5:12PM by PIB Hyderabad
ఈ రోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా, పుదుచ్చేరిలో నెలకొల్పిన ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నాలజీ సెంటర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 122 కోట్ల రూపాయల పెట్టుబడితో, 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రం 20,000 వేల మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు, 2,000 ఎం.ఎస్.ఎం.ఈ. లకు మద్దతు ఇస్తుంది; 200 అంకుర సంస్థలను ప్రోత్సహిస్తుంది. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ ఎం.ఎస్.ఎం.ఈ. టెక్నాలజీ సెంటర్ ను ప్రధానమంత్రి ప్రారంభించడం వల్ల నైపుణ్యాభివృద్ధికి నూతన ఉత్సాహం లభించడంతో పాటు; స్థానిక యువతలో వ్యవస్థాపక స్ఫూర్తి పెంపొందుతుంది.
ఈ కార్యక్రమంలో - కేంద్ర మంత్రులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్; శ్రీ నారాయణ్ రాణే; శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ; శ్రీ నిషిత్ ప్రమాణిక్; డా. తమిళిసై సౌందరరాజన్ తో పాటు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. రంగస్వామి; పలువురు రాష్ట్ర మంత్రులు; పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.
ఫ్లాగ్ షిప్ టెక్నాలజీ సెంటర్ సిస్టమ్స్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సెంటర్లు ఉత్పత్తి సౌకర్యాలు, మానవ వనరులను అభివృద్ధి చేయడం, సలహాలు, సంప్రదింపులు అందించడం, ఉత్తమ పద్ధతులను అనుసరించడం, పోటీతత్వాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఇప్పటికే ఏర్పాటైన ఎం.ఎస్.ఎం.ఈ. లతో పాటు, భవిష్యత్తులో ఏర్పాటు చేసే ఎం.ఎస్.ఎం.ఈ. లకు కూడా మద్దతు ఇస్తున్నాయి.
ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ, తాను చేపట్టిన వివిధ ప్రయత్నాలు, కార్యక్రమాల ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించడానికి, స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడానికి, తద్వారా ప్రధానమంత్రి కోరుకునే ఆత్మ నిర్భర్ భారత్ ను సాధించే దిశగా ఈ రంగాన్ని పునరుద్ధరిస్తోంది.
***
(Release ID: 1789568)
Visitor Counter : 164