ప్రధాన మంత్రి కార్యాలయం

డిసెంబ‌ర్ 30వ తేదీన ఉత్త‌రాఖండ్ సంద‌ర్శించి, 17500 కోట్ల రూపాయల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న - ప్ర‌ధానమంత్రి


ఆరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే లఖ్వార్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు ముందుగా 1976 లో శంకుస్థాపన జరిగినా, ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది

8700 కోట్ల రూపాయల మేర రహదారుల రంగంలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు; మారుమూల, గ్రామీణ మరియు సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానత ను మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి భావుకతను ఈ ప్రాజెక్టులు సాకారం చేయనున్నాయి; మెరుగైన అనుసంధాతను పొందనున్న కైలాశ మానస సరోవర్ యాత్ర

దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను అందించాలనే ప్రధానమంత్రి ప్రయత్నానికి అనుగుణంగా, ఉధమ్ సింగ్ నగర్‌లో ఎయిమ్స్ రిషికేశ్ శాటిలైట్ కేంద్రంతో పాటు, పితోర్‌ ఘర్‌ లో జగ్జీవన్ రామ్ ప్రభుత్వ వైద్య కళాశాల కు శంకుస్థాపన

కాశీపూర్‌లో అరోమా పార్కు, సితార్‌గంజ్ వద్ద ప్లాస్టిక్ పారిశ్రామిక పార్కులతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అనేక ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

Posted On: 28 DEC 2021 8:09PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 30వ తేదీన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా, ఆయన,  17500 కోట్ల రూపాయల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.  23 ప్రాజెక్టుల్లో 14100 కోట్ల రూపాయలకు పైగా విలువైన 17 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి  శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల, రహదారులు, గృహ నిర్మాణం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అనేక రంగాలు / ప్రాంతాలకు చెందినవి ఉన్నాయి.  ఈ కార్యక్రమాల్లో భాగంగా, బహుళ రోడ్ల విస్తరణ ప్రాజెక్టులతో సహా 6 ప్రాజెక్టులు;  పితోర్ఘర్‌లో ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్, నైనిటాల్‌లో మురుగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచే ప్రాజెక్టులు, ప్రారంభం కానున్నాయి.  ఈ సందర్భంగా ప్రారంభం కానున్న ప్రాజెక్టుల మొత్తం వ్యయం 3400 కోట్ల రూపాయలకి పైగా ఉంది.

దాదాపు 5750 కోట్ల రూపాయలతో నిర్మించనున్న లఖ్వార్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.  ఈ ప్రాజెక్టు మొదట 1976 లో నిర్మించ తలపెట్టినప్పటికీ, చాలా సంవత్సరాలుగా పెండింగ్‌ లో ఉండిపోయింది.  దీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికత నేపథ్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది.  జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టు, దాదాపు 34,000 హెక్టార్ల అదనపు భూమికి సాగునీరు అందించడానికి, 300 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వీలు కల్పిస్తుంది.   అదేవిధంగా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, హిమాచలప్రదేశ్, రాజస్థాన్ - ఆరు రాష్ట్రాలకు త్రాగునీటిని సరఫరా చేస్తుంది.

దేశంలోని సుదూర ప్రాంతాల్లో అనుసంధానతను మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి ఆశయానికి అనుగుణంగా,  దాదాపు 8700 కోట్ల రూపాయల విలువైన అనేక రహదారి రంగ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు.

ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల్లో - 4000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 85 కిలోమీటర్ల మొరాదాబాద్-కాశీపూర్ మధ్య నాలుగు వరుసల రహదారి ప్రాజెక్టు;  గదార్‌ పూర్-దినేష్‌ పూర్-మద్కోటా-హల్ద్వానీ (ఎస్.హెచ్-5) మార్గంలో  22 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి ప్రాజెక్టు;  కిచ్చా నుండి పంత్‌ నగర్ (ఎస్.హెచ్-44) మార్గంలో 18 కిలోమీటర్ల మేర రహదారి ప్రాజెక్టు;   ఉధమ్ సింగ్ నగర్‌ లో 8 కిలోమీటర్ల పొడవైన ఖతిమా బైపాస్ రహదారి నిర్మాణం; 175 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి (ఎన్.హెచ్-109-డి) నిర్మాణం ఉన్నాయి.  ఈ రోడ్డు ప్రాజెక్టులు గర్హ్వాల్, కుమావోన్, తేరాయ్ ప్రాంతాల మధ్య అనుసంధానతను, అదేవిధంగా, ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య అనుసంధానతను కూడా మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్టుల వల్ల, జిమ్ కార్బెట్ జాతీయ పార్కు కు వెళ్ళే మార్గం మెరుగుపడ్డంతో పాటు రుద్రాపూర్, లాల్కువాన్‌ లోని పారిశ్రామిక ప్రాంతాలకు కూడా మెరుగైన రహదారి ప్రయోజనం 

చేకూరుతుంది. 

వీటితో పాటు, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రాష్ట్ర వ్యాప్తంగా పలు రహదారి ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.  వీటిలో, 625 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే మొత్తం 1157 కిలోమీటర్ల పొడవునా 133 గ్రామీణ రహదారులను నిర్మించే ప్రాజెక్టులతో పాటు,  450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే, 151 వంతెనల నిర్మాణం కూడా ఉన్నాయి. 

ప్రధానమంత్రి ప్రారంభించే రహదారి ప్రాజెక్టుల్లో - 2500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నగీనా నుండి కాశీపూర్ వరకు (ఎం.హెచ్-74) 99 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ ప్రాజెక్టు తో పాటు;  780 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అన్ని వాతావరణాలకు తట్టుకునే రహదారి ప్రాజెక్ట్ కింద నిర్మించిన వ్యూహాత్మక తనక్‌ పూర్ - పితోర్‌ ఘర్ రహదారి (ఎన్.హెచ్-125) మార్గంలో మూడు చోట్ల -  చురాణి నుండి అంచోలి వరకు (32 కి.మీ.); బిల్ఖెట్ నుండి చంపావత్ వరకు (29 కి.మీ);  టిల్టన్ నుండి చురాణి వరకు (28 కి.మీ.) రహదారిని విస్తరించే ప్రాజెక్టులు ఉన్నాయి.  రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు మారుమూల ప్రాంతాల అనుసంధానతను మెరుగుపరచడం తో పాటు,  ఈ ప్రాంతంలో పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.  వ్యూహాత్మక తనక్‌ పూర్ - పితోర్‌ గఢ్ రహదారి ఇప్పుడు అన్ని వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.  అదే విధంగా, ఇది సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది.  కైలాశ్ మానస సరోవర్ యాత్రకు కూడా మెరుగైన అనుసంధానతను కల్పిస్తుంది. 

రాష్ట్రంలోని వైద్య మౌలిక సదుపాయాలను విస్తరించడంతో పాటు, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను అందించే ప్రయత్నంలో భాగంగా,  ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఎయిమ్స్-రిషికేశ్ శాటిలైట్ కేంద్రానికి, పితోర్‌ ఘర్‌ లో జగ్జీవన్ రామ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.  ఈ రెండు ఆసుపత్రులను వరుసగా దాదాపు 500 కోట్ల రూపాయలు, 450 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు.  ఈ మెరుగైన వైద్య మౌలిక సదుపాయాలు కుమావోన్, తెరాయ్ ప్రాంతాల ప్రజలతో పాటు, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాయి. 

ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని సితార్‌గంజ్ మరియు కాశీపూర్ నగరాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం దాదాపు 2400 గృహాల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.  ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద 170 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో ఈ గృహాలను నిర్మించనున్నారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా  నీటి సరఫరాను మెరుగుపరచడానికి,  జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 73 నీటి సరఫరా పథకాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.  ఈ పథకాలకు దాదాపు 1250 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. తద్వారా రాష్ట్రంలోని 1.3 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా, హరిద్వార్, నైనిటాల్ పట్టణ ప్రాంతాలలో నాణ్యమైన నీటిని క్రమం తప్పకుండా సరఫరా చేయడం కోసం,  ఈ రెండు నగరాల్లో నీటి సరఫరా పథకాలకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.  ఈ పథకాలు హరిద్వార్‌ లో సుమారు 14500 కనెక్షన్‌ లను, హల్ద్వానీలో 2400 కంటే ఎక్కువ కనెక్షన్‌ లను అందిస్తాయి.  తద్వారా, హరిద్వార్‌ లోని సుమారు లక్ష జనాభాకు, హల్ద్వానీలోని దాదాపు 12000 జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది.

ఒక ప్రాంతం యొక్క స్వాభావిక సామర్థ్యాన్ని వెలికితీసేందుకు కొత్త మార్గాలను సృష్టించాలనే ప్రధానమంత్రి దార్శనికత కు అనుగుణంగా,  కాశీపూర్‌ లో 41 ఎకరాల సుగంధ మొక్కల పార్క్‌ కు,  సితార్‌ గంజ్‌లో 40 ఎకరాల విస్తీర్ణంలో ప్లాస్టిక్ పారిశ్రామిక పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.  ఈ రెండు ప్రాజెక్టులను రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ ఉత్తరాఖండ్ లిమిటెడ్ (ఎస్.ఐ.ఐ.డి.సి.యు.ఎల్) సంస్థ సుమారు 100 కోట్ల రూపాయల మొత్తం వ్యయంతో అభివృద్ధి చేస్తుంది. ఉత్తరాఖండ్‌ లో ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా, పూల మొక్కల పెంపకానికి గల అపారమైన సామర్థ్యాన్ని, అరోమా పార్కు ఉపయోగించుకుంటుంది.  కాగా, ప్లాస్టిక్ పారిశ్రామిక పార్కు, రాష్ట్ర పారిశ్రామిక నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, ప్రజలకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. 

నైనిటాల్‌ లోని రామ్‌నగర్‌లో దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 ఎం.ఎల్.డి. మరియు 1.5 ఎం.ఎల్.డి. సామర్థ్యం గల రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  అలాగే, ఉధమ్‌ సింగ్ నగర్‌ లో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే, తొమ్మిది మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్‌.టి.పి) నిర్మాణానికి,  నైనిటాల్‌ లో 78 కోట్ల రూపాయల వ్యయంతో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి చేపడుతున్న ప్రాజెక్టు పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 

ఉత్తరాఖండ్ జల విద్యుత్ సంస్థ (యు.జె.వి.ఎన్) ద్వారా దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియారి వద్ద నిర్మించిన నది జల విద్యుత్ ప్రాజెక్టు కు చెందిన 5 మెగావాట్ల సామర్థ్యం గల సూరింగడ్-II రన్‌ ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

 

 



(Release ID: 1785963) Visitor Counter : 148