ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో ప్రజారోగ్య స్పందన చర్యలు మరియు టీకా పరిస్థితిని సమీక్షించిన - కేంద్ర ప్రభుత్వం


రోజువారీ సమీక్షతో జిల్లాల వారీగా ప్రతి వారం ప్రణాళికల ద్వారా అర్హులైన ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి

కోవిడ్ కేసుల ఆకస్మిక పెరుగుదలను అరికట్టడానికి పరీక్షలను మరింత వేగవంతం చేయాలి

కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చెయ్యాలి

Posted On: 27 DEC 2021 9:20PM by PIB Hyderabad

త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణ కోసం ప్రజారోగ్య ప్రతిస్పందన చర్యలతో పాటు, ఆయా రాష్ట్రాల్లో టీకా పరిస్థితిని సమీక్షించారు. 

ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో మొదటి, రెండవ మోతాదు టీకాలు వేసుకున్న వారి సంఖ్య  జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండగా,  ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్‌ రాష్ట్రాలలో కోవిడ్-19 టీకాలు వేసుకున్న వారి సంఖ్య జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.  దేశం మొత్తం మీద ఈ రోజు వరకు మొత్తం 142.38 కోట్ల మేర కోవిడ్-19 టీకా మోతాదులు ఇవ్వడం జరిగింది.  వీటిలో 83.80 కోట్ల కంటే ఎక్కువ టీకాలు మొదటి మోతాదు కింద వేయగా, 58.58 కోట్ల కంటే ఎక్కువ టీకాలు రెండవ మోతాదు కింద వేయడం జరిగింది.

కోవిడ్-19 టీకా మొదటి, రెండవ మోతాదులను అర్హులైన వారందరికీ త్వరగా వేయడానికి అవసరమైన చర్యలను వేగవంతం  చేయాలని రాష్ట్రాలకు సూచించారు.  ఇందుకోసం జిల్లాల వారీగా వారానికోసారి టీకాలు వేసే కార్యక్రమ అమలు ప్రణాళికలు రూపొందించుకోవలసిన అవసరం ఉంది.  టీకాలు వేసే కార్యక్రమాల అమలు తీరును రోజూ సమీక్షించాలని రాష్ట్ర అధికారులకు సూచించారు.

ముఖ్యంగా ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలు, కోవిడ్-19 సోకిన వ్యక్తులను వెంటనే గుర్తించి, ప్రజారోగ్య ప్రతిస్పందన చర్యలను సకాలంలో ప్రారంభించడం కోసం, అలాగే, తక్కువ పరీక్షల కారణంగా కరోనా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగకుండా నిలువరించేందుకు, ఈ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. 

సిఫార్సు చేసిన కోవిడ్ సముచిత ప్రవర్తన ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూడాలని, వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని గట్టిగా కోరడం జరిగింది. 

"మొత్తం ప్రభుత్వం" అనే విధానం కింద కోవిడ్-19 మహమ్మారి నిర్వహణ కోసం రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టిన కృషికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. 

 

*****


(Release ID: 1785695) Visitor Counter : 170