ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఒమిక్రాన్ ప్రవేశం.. టీకాల పురోగతి నేపథ్యంలో కోవిడ్-19పై రాష్ట్రాలు/యూటీలలో ప్రజారోగ్య ప్రతిస్పందన గురించి కేంద్రం సమీక్ష
జన్యుక్రమ నిర్ధారణ కోసం పరీక్షలు.. నిఘా సమాచారంసహా నమూనాలను ‘ఇన్సాకాగ్’ ప్రయోగశాలలకు తక్షణం పంపాలని రాష్ట్రాలకు సూచన;
కీలక ఆస్పత్రి మౌలిక వసతుల బలోపేతానికి ‘ఈసీఆర్‌పీ-2’ గరిష్ఠ వినియోగం;
‘పీఎస్ఏ’ ప్లాంట్లు.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు.. వెంటిలేటర్ల నిర్వహణకు ప్రాధాన్యం;
అన్ని రాష్ట్రాల్లోనూ తగు పరిమాణంలో కీలక ఔషధ నిల్వల నిర్వహణపై సూచన
Posted On:
09 DEC 2021 2:08PM by PIB Hyderabad
కోవిడ్-19 సమర్థ, సకాల నియంత్రణ-నిర్వహణలో ప్రజారోగ్య ప్రతిస్పందన వ్యూహంలో “పరీక్ష-అన్వేషణ-చికిత్స-టీకా-కోవిడ్ సముచిత ప్రవర్తన (క్యాబ్)కు కట్టుబాటు” అనే ఐదంచెల ప్రణాళికే అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం ఎండీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ ప్రవేశం… టీకాల పురోగతిసహా కోవిడ్-19పై ప్రజారోగ్య వ్యవస్థల సంసిద్ధతను సమీక్షించారు. ‘ఐసీఎంఆర్’ డైరెక్టర్ జనరల్, ఆరోగ్య పరిశోధక విభాగం కార్యదర్శి డాక్టర్ బలరామ్ భార్గవ, బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే కూడా ఇందులో పాల్గొన్నారు.
అనుమానిత కేసుల సత్వర ఏకాంతీకరణసహా తదుపరి వైద్య నిర్వహణ దిశగా సత్వర గుర్తింపు నిమిత్తం పరీక్ష-నిర్ధారణ ప్రక్రియలను మెరుగుపరచాలని, నిఘాపై దృష్టి సారించాలి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఈ సందర్భంగా కోరారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ ‘ఆర్టీ-పీసీఆర్’ పరీక్ష సదుపాయం అందుబాటులో ఉంచాలని సూచించారు. కేసుల సాంద్రత అధికంగా నమోదయ్యే జిల్లాల్లో కేసుల నమోదు వేగాన్ని క్రమ పద్ధతిలో పర్యవేక్షించడమే కాకుండా సంపూర్ణ జన్యుక్రమ నిర్ధారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్-సీవోవీ-2 జెనోమిక్స్ కన్సార్టియం) ప్రయోగశాలలకు నమూనాలను తక్షణం పంపాలని ఆదేశించారు. వైరస్ కొత్త ఆవిర్భావ ప్రాంతాలు/సముదాయాలను నిశితంగా పర్యవేక్షిస్తూ సత్వర ప్రతిస్పందన బృందాల ద్వారా కేసుల పెరుగుదల-తిరిగి వ్యాప్తి తదితరాలను శోధించడ గురించి సమావేశంలో చర్చించారు. నిర్దిష్ట ప్రక్రియలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ అయినవారితో సంబంధాలున్న వారిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు నిర్వహించాలని పునరుద్ఘాటించారు.
‘ముప్పుగల’ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై ‘ఎయిర్ సువిధ’ పోర్టల్ ద్వారా లభించే సమాచారం ఆధారంగా రోగలక్షణాలున్న కేసులపై దృష్టి సారించడంతోపాటు లక్షణాలు లేనివారిపై జిల్లాలవారీగా పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. శీతాకాలం దృష్ట్యా ఇన్‌ఫ్లూయెంజా (ఐఎల్‌ఐ) లాంటి అనారోగ్యం, తీవ్ర శ్వాసకోశ వ్యాధి (ఎస్‌ఏఆర్‌ఐ), శ్వాసకోశ బాధ లక్షణాలను నిశితంగా పర్యవేక్షించాల్సి ఉందని సూచించారు. గృహ ఏకాంతవాసంపై సమర్థ పర్యవేక్షణ యంత్రాంగం ఆవశ్యకతను సమీక్ష సమావేశం నొక్కిచెప్పింది.
కేసులు పెరిగిన పక్షంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి తగిన మౌలిక చికిత్స సదుపాయాలు అన్ని ఆస్పత్రులలోనూ ఉండేవిధంగా ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధతను సమీక్షించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించబడింది. ఈ మేరకు మౌలిక ఆరోగ్య సదుపాయాల కల్పన, బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఈసీఆర్‌పీ-2'’కింద విడుదల చేసే నిధుల సద్వినియోగంతోపాటు రాష్ట్రంలోని ఆరోగ్య సంస్థలకు రాష్ట్రాల నుంచి 100 శాతం జోడింపు నిధి సకాలంలో విడుదలయ్యేలా చూసుకోవాలని సూచించారు. తదనుగుణంగా క్షేత్రస్థాయిలో నిధుల వినియోగాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్షిస్తుంది కాబట్టి, సదరు సమాచారాన్ని దీనికోసం నిర్దేశించిన పోర్టల్‌లో నింపాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని అన్ని ఆస్పత్రులలో వెంటిలేటర్లు పనిచేసే స్థితిలో ఉండాలని, ‘పీఎస్‌ఏ’ ప్లాంట్లతోపాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తదితరాలు సిద్ధంగా ఉంచుకునేలా చూడాలని సూచించారు. కాగా కొన్ని క్షేత్రస్థాయి ఆస్పత్రులలో కేంద్రం సరఫరా చేసిన అనేక వెంటిలేటర్లు వాడకపోవడంతోపాటు ఇంకా సీలు కూడా తీయని స్థితిలో ఉన్నట్లు ఆయా రాష్ట్రాలకు సమాచారం ఇవ్వబడింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అవసరమైన పరికరాలు, వస్తువులు కూడా అందడంలేదని తెలియజేయబడింది. ఈ నేపథ్యంలో ‘పీఎస్‌ఏ’ ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్‌లు తక్షణ వినియోగానికి తగిన రీతిలో అమర్చుకునేలా వెంటనే సమీక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేయబడింది.
కోవిడ్-19 వైద్య చికిత్స నిమిత్తం గుర్తించబడిన ఎనిమిది కీలక ఔషధాలను తగు పరిమాణంలో నిల్వచేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలను కోరారు. దీనికి సంబంధించి 2021 జూలైలోనే మార్గదర్శకాలు పంపినట్లు గుర్తుచేశారు. అలాగే టీకాల కార్యక్రమానికిగల కీలక ప్రాధాన్యాన్ని వివరిస్తూ- జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సంపూర్ణ టీకాల కార్యక్రమం ‘హర్ ఘర్ దస్తక్’పై దృష్టి సారించాలని సూచించారు. ఆ మేరకు దేశవ్యాప్తంగా కోవిడ్-19 టీకాల విస్తృతి, వేగం పెంచాలని రాష్ట్రాలను కోరారు. ఇందులో భాగంగా గ్రామ, జిల్లా స్థాయులలో క్రమబద్ధ పర్యవేక్షణతో అర్హులైన జనాభా మొత్తానికీ టీకాలు అందేవిధంగా చూడాలన్నారు. వదంతుల నిరోధం, టీకాలపై సందేహాల తొలగింపు నిమిత్తం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా సమావేశాల వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమాచారమిస్తూ అవగాహన పెంచాలని సూచించారు.
***
(Release ID: 1779994)
Visitor Counter : 140