సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
చిన్న తేనెటీగలను ఉపయోగించి మానవులపై ఏనుగులు దాడి చేయకుండా నివారించడానికి అస్సాంలో రీ-హాబ్ ప్రాజెక్టును ప్రారంభించిన కేవీఐసి
Posted On:
04 DEC 2021 2:09PM by PIB Hyderabad
కర్ణాటకలో విజయవంతమైన వినూత్న ప్రాజెక్టు రీ-హాబ్ (తేనెటీగలను ఉపయోగించి మానవులపై ఏనుగులు దాడి చేయకుండా చూడడం ) ను ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ( కేవీఐసి ) అస్సాంలో అమలు చేయడం ప్రారంభించింది. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా అస్సాంలోని గోల్‌పరా జిల్లాలోని మోర్నోయ్ గ్రామంలో ప్రాజెక్ట్ రీ-హాబ్‌ను శుక్రవారం ప్రారంభించారు, దీని సహకారంతో మానవులపై ఏనుగులు చేస్తున్న దాడులను తగ్గించడానికి అవకాశం కలుగుతుంది. ప్రాజెక్టును ప్రారంభించిన మోర్నోయ్ లో మానవ నివాస ప్రాంతాలపై ఏనుగులు దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారంతో కేవీఐసి ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. దట్టమైన అడవుల మధ్య ఉన్న అస్సాంలో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏనుగుల దాడుల్లో 2014- 2019 ల మధ్య 332 మంది ప్రాణాలు కోల్పోయారు.
మానవ నివాస ప్రాంతాలపై ఏనుగులు దాడి చేయకుండా చూసే విధంగా రీ-హాబ్ ప్రాజెక్టుకు కేవీఐసి రూపకల్పన చేసింది. ప్రాజెక్టు రీ-హాబ్ కింద ఏనుగులు ప్రజలు నివసించే ప్రవేశించకుండా చూసేందుకు తేనెటీగ పెట్టెలతో “తేనెటీగ కంచెలు” నిర్మిస్తారు. మానవ నివాస ప్రాంతాలలోకి ఏనుగులు నడిచే మార్గాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. పెట్టెలకు తీగలను ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలోకి ఏనుగులు వచ్చినప్పుడు వాటి కాళ్ళకు తీగ తగిలి తేనెటీగలు ఉన్న పెట్టె తెరుచుకుంటుంది. దీనిలో నుంచి వచ్చే తేనెటీగలు ఏనుగులపై దాడి చేసి అవి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. అతి తక్కువ ఖర్చుతో దీనితో ఏనుగుల దాడిని అరికట్టవచ్చు. ఏనుగుల ప్రాణాలకు కూడా ఎలాంటి ప్రమాదం కలగదు. . ఏనుగులకు తేనెటీగలు చిరాకు కలిగిస్తాయని శాస్త్రీయంగా కూడా రుజువయ్యింది. తేనెటీగలు తమ తొండం, కళ్ల లోని సున్నితమైన లోపలి భాగాన్ని కొరుకుతాయని ఏనుగులు భయపడతాయి. ఒకేసారి తమపై తేనెటీగల దండు దాడి చేసినప్పుడు చిరాకుతో ఏనుగులు వెనక్కి తిరిగి వెళ్తాయి.
ఏనుగులను తరిమికొట్టేందుకు మొర్నోయి , దహికత గ్రామాలలో మొత్తం 330 తేనెటీగ పెట్టెలను ఒక వారం రోజుల్లో ఏర్పాటు చేస్తారు. ఈ తేనెటీగల పెట్టెలను ఈ రెండు గ్రామాల్లో ఏనుగుల బారిన పడిన 33 కుటుంబాలకు చెందిన 33 మంది రైతులు మరియు విద్యావంతులైన యువకులకు కేవీఐసి తేనెటీగల పెట్టెలను అందించింది. ఈ గ్రామాలలో ఏనుగులు ఏడాదిలో 9 నుంచి 10 నెలల పాటు దాదాపు ప్రతిరోజూ పంటలపై దాడి చేస్తున్నాయి. ఏనుగుల బెడదతో ఈ గ్రామాల ప్రజలు గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ పనులకు దూరంగా ఉంటున్నారు. ఈ గ్రామాల్లో వరి, లిచ్చి, పనస ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఏనుగుల సంచారాన్ని గుర్తించిన అధికారులు ఈ ప్రాంతాలలో ' తేనెటీగల కంచెలు' ఏర్పాటు చేశారు. ఏనుగులపై తేనెటీగలు దాడి చేయడం ఆ సమయంలో ఏనుగుల ప్రవర్తన తెలుసుకోవడానికి రాత్రి వేళల్లో పనిచేసే హై రిజల్యూషన్, నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అస్సాంలో సర్వసాధారణంగా మారిన ఏనుగుల దాడులను అరికట్టడానికి ప్రాజెక్టు రీ-హాబ్ స్థిరమైన పరిష్కారం దొరుకుతుందని కెవిఐసి చైర్మన్ అన్నారు. “ ప్రాజెక్టు రీ-హాబ్ కర్ణాటకలో విజయవంతంగా అమలు జరుగుతోంది. దీనిని అస్సాంలో ఎక్కువ సామర్థ్యం, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో అమలు చేస్తాం ఈ ప్రాజెక్ట్ రాబోయే నెలల్లో ఏనుగుల దాడులు అరికడుతుందని , స్థానిక గ్రామస్తులు వారి పొలాలకు తిరిగి వెళ్లి వ్వవసాయ కార్యక్రమాలు ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. అదే సమయంలో రైతులకు కెవిఐసి పంపిణీ చేసిన తేనెటీగ పెట్టెలు తేనెటీగల పెంపకం ద్వారా వారి ఆదాయాన్ని పెంచుతాయి, ”అని సక్సేనా చెప్పారు. కార్యక్రమంలో కెవిఐసి ఈశాన్య ప్రాంత సభ్యుడు దుయో తమో కూడా పాల్గొన్నారు.
కెవిఐసి అమలు చేస్తున్న నేషనల్ హనీ మిషన్ లో రీ-హాబ్ ప్రాజెక్టును ఉప-మిషన్ గా అమలు చేస్తారు. తేనెటీగ జనాభా, తేనె ఉత్పత్తి మరియు తేనెటీగల పెంపకందారుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో నేషనల్ హనీ మిషన్ అమలు జరుగుతోంది. ఈ లక్ష్యాలను సాధించడంతో పాటు ప్రాజెక్టు రీ-హాబ్ ఏనుగుల దాడులను నివారించడానికి తేనెటీగ పెట్టెలను కంచెగా అమలు జరుగుతుంది.
కర్ణాటకలోని కొడగు జిల్లాలో ప్రాజెక్టు రీ-హాబ్ 2021 మార్చి 15 న 15 ప్రాంతాలలో ప్రారంభమయింది. ప్రారంభించిన ఆరు నెలల కాలంలోనే ఈ ప్రాంతాల్లో ఏనుగుల దాడులు 70% వరకు తగ్గాయి.
భారతదేశంలో ఏనుగుల దాడి కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 500 మంది మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా పులుల దాడుల్లో మరణిస్తున్న వారి సంఖ్య కంటే ఇది దాదాపు 10 రెట్లు ఎక్కువ. 2015 నుంచి 2020 వరకు ఏనుగుల దాడిలో దాదాపు 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. తమపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ప్రజలు ఏనుగులపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో దాదాపు 500 ఏనుగులు మరణించాయి.
గతంలో ఏనుగులను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి కందకాలు తవ్వి కంచెలు ఏర్పాటు చేశాయి. మానవ ప్రాణ నష్టానికి పరిహారంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ కందకాలు మరియు ముళ్ల కంచెల వల్ల గున్న ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. దీనితో ఈ చర్యల వల్ల ఆశించిన ఫలితాలు కూడా రాలేదు.
***
(Release ID: 1778066)
Visitor Counter : 340