రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కేంద్రం డాక్టర్ మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలలో డీఏపీ, యూరియా లభ్యత స్థితిని సమీక్షించారు. దేశంలో పుష్కలంగా వీటి ఉత్పత్తి ఉందని, ఎరువుల కొరత లేదని భరోసా ఇచ్చారు.


వ్యవసాయ రంగానికి తగినంతగా ఎరువులు లభ్యమయ్యేలా చేసేందుకు యూరియాను పరిశ్రమలకు, సరిహద్దు ఆవలకు మళ్లించడాన్ని నిరోధించాలని రాష్ట్రాలను కోరారు.

మరింత సమర్థంగా ఎరువుల నిర్వహణ కోసం 'ఎరువుల డ్యాష్‌బోర్డ్'పై రోజువారీ అవసరాలు/సరఫరాను పర్యవేక్షించాలని, వివరాలను ఇవ్వాలని రాష్ట్రాలను కోరాం: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"మట్టిని రక్షించి మరింత ఉత్పాదకతను అందించే నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులను వాడాలి" అని మంత్రి పిలుపునిచ్చారు.

Posted On: 23 NOV 2021 3:20PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఎరువుల లభ్యత బాగుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో వర్చువల్‌గా సమీక్ష సందర్భంగా కేంద్ర రసాయనాలు  ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రకటించారు.  ఈ సమీక్షా సమావేశంలో 18 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొన్నారు.  వ్యవసాయ రంగానికి తగినంత ఎరువులు అందించడం కేంద్రం. రాష్ట్రాల సమిష్టి బాధ్యత అని పేర్కొన్న డాక్టర్ మన్సుఖ్ మాండవియా, డీఏపీ కోసం రైతుల నుండి పెరిగిన డిమాండ్‌ను అధిగమించడానికి గత కొన్ని నెలలుగా తమకు సహకరిస్తున్న రాష్ట్రాలకు కృతజ్ఞతలు తెలిపారు. సమష్టి కృషి ఫలితంగా కేంద్ర రసాయనాలు  ఎరువుల మంత్రిత్వ శాఖ,  రాష్ట్రాల మధ్య  సమన్వయం ఏర్పడిందని ఆయన అన్నారు. గత కొన్ని నెలలుగా అనేక రాష్ట్రాల్లో డీఏపీకి డిమాండ్ పెరిగినప్పుడు తగినంత సరఫరా చేసినందుకు రాష్ట్ర వ్యవసాయ మంత్రులు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

 

గత రెండు నెలలుగా ఎరువుల డ్యాష్‌బోర్డ్‌ను నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల్లో తగినన్ని ఎరువులు అందుబాటులో ఉండేలా రాష్ట్రాలు,  కేంద్రం కలసి పనిచేస్తున్నాయి. ఈ రెండింటి మధ్య సమర్ధవంతమైన సమన్వయం కోసం 22 గంటలూ పని చేస్తున్న కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర మంత్రులకు మాండవియా తెలియజేశారు. మరింత ప్రభావవంతంగా ఎరువుల నిర్వహణ కోసం 'ఎరువుల డ్యాష్‌బోర్డ్'పై రోజువారీ అవసరాలు/సరఫరాను పర్యవేక్షించాలని ఆయన రాష్ట్రాలను కోరారు. “ముందస్తుగా ప్రణాళిక తయారు చేసుకోవడం,  జిల్లాల వారీగా వారానికోసారి అవసరాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యం. వివిధ జిల్లాల్లో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి.  ఉపయోగించని ఎరువులు ఉన్నాయి. రోజువారీ సాధారణ పర్యవేక్షణ జరిగే ఎరువుల గురించి ముందుగానే మాకు తెలుస్తుంది. రాష్ట్రాలు అడిగిన మేరకు కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా ఎరువులు సరఫరా చేస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు.  ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఎరువులపై సబ్సిడీని అందజేయడం ద్వారా రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. రానున్న రబీ సీజన్‌లో దేశంలోని యూరియా అవసరాలను తీర్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు.

వ్యవసాయ రంగానికి తగినంతగా సరఫరాన అందించడానికి యూరియాను పరిశ్రమలకు (వెనీర్, ప్లైవుడ్ మొదలైనవి) మళ్లించడాన్ని ఆపాలని రాష్ట్రాలకు సూచించారు.   సమర్థవంతమైన పర్యవేక్షణ ఫలితంగా, ఉత్తర ప్రదేశ్,  బీహార్ నుండి సరిహద్దుల గుండా ఎరువుల తరలింపు ఆగిపోయిందని ఆయన తెలియజేశారు. "రైతులకు తగినంత సరఫరా ఉండాలి. యూరియాను ఇతర రంగాలకు మళ్లించబడకుండా రాష్ట్రాలు పర్యవేక్షించడం చాలా ముఖ్యం. లేకపోతే కృత్రిమ కొరత ఏర్పడుతుంది" అని ఆయన రాష్ట్రాల మంత్రులకు ఉద్బోధించారు. ఎరువులను న్యాయబద్ధంగా వినియోగించేందుకు, వృధా,  దుర్వినియోగాన్ని తగ్గించేలా రైతులను ప్రోత్సహించాలని, అవగాహన పెంచాలని రాష్ట్రాలను ఆయన కోరారు.

“ నానో యూరియా,  సేంద్రీయ ఎరువులు వంటి ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిద్దాం. ఇవి నేలను రక్షిస్తాయి.  మరింత ఉత్పాదకతను ఇస్తాయి.  ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరిమాణం కంటే తక్కువ మొత్తంలో నానో యూరియాను వాడొచ్చు. అధిక పోషకాలు ఉంటాయి” అని డాక్టర్ మన్సుఖ్ మాండవియా సమీక్షా సమావేశంలో తెలిపారు. పరిమాణం-ఆధారిత లక్షణాలు, అధిక ఉపరితల- పరిమాణాల నిష్పత్తి,  ప్రత్యేక లక్షణాల కారణంగా నానో-ఎరువులు మొక్కల పోషణకు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. ఇఫ్కో ద్వారా నానో యూరియా ఉత్పత్తిని ప్రారంభించామని, నానో డీఏపీ పనులు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి మాండవియా తెలిపారు.

***



(Release ID: 1774735) Visitor Counter : 167