ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జైపూర్ లోని పెట్రోకెమికల్స్ సాంకేతిక సంస్థ కు చెందిన సి.ఐ.పి.ఈ.టి. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 30 SEP 2021 2:37PM by PIB Hyderabad

నమస్కారం !

 

రాజస్థాన్ ముద్దు బిడ్డ, భారతదేశంలోని అతిపెద్ద పంచాయితీ అయిన లోక్‌సభ కు సంరక్షకుడు, మన గౌరవనీయులైన స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు;  రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ గారు;  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ గారు; శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు;  శ్రీ భూపేంద్ర యాదవ్ గారు;  అర్జున్ రామ్ మేఘవాల్ గారు;  కైలాష్ చౌదరి గారు;  డాక్టర్ భారతి పవార్ గారు; భగవంత్ ఖుబా గారు; కేంద్ర మంత్రి వర్గంలోని నా ఇతర సహచరులందరూ; రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే గారు;  ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా గారు;  రాజస్థాన్ ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, పార్లమెంటు సభ్యులు; ఎమ్మెల్యేలు;  కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులందరితో పాటు, రాజస్థాన్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా !

 

వంద సంవత్సరాలలో అతిపెద్ద మహమ్మారి ప్రపంచ ఆరోగ్య రంగానికి అనేక సవాళ్లను విసరడంతో పాటు మనకు అనేక కొత్త విషయాలు నేర్పింది.   ప్రతి దేశం తనదైన రీతిలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉంది.  ఈ విపత్తులో భారతదేశం తన సామర్థ్యాన్ని, స్వావలంబనను పెంచుకోవాలని నిర్ణయించుకుంది.  రాజస్థాన్‌లో నాలుగు కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించడం, జైపూర్‌ లో పెట్రోకెమికల్ సాంకేతిక సంస్థను ప్రారంభించడం ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు.  ఈ సందర్భంగా రాజస్థాన్ పౌరులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.   ఈ ప్రత్యేక కార్యక్రమం లో దృశ్య మాధ్యమం ద్వారా మీ అందరినీ కలిసేందుకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని,  ఒలింపిక్స్‌లో భారతదేశం గర్వపడేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన రాజస్థాన్ లోని యువతను అభినందించాలని అనుకున్నాను.   ఈ సందర్భంగా, నేను, ఈ రోజు,  రాజస్థాన్‌ లోని నా కుమారులు, కుమార్తె లను మరోసారి అభినందిస్తున్నాను.   జైపూర్‌ తో సహా దేశంలోని 10 సి.ఐ.పి.ఈ.టి. కేంద్రాల్లో ప్లాస్టిక్ తో పాటు తత్ సంబంధమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలపై అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.  ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దేశంలోని ప్రముఖులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

సోదర సోదరీమణులారా, 

2014 నుంచి ఇప్పటి వరకు రాజస్థాన్‌లో 23 కొత్త వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.   కాగా, వీటిలో ఏడు వైద్య కళాశాలలు ఇప్పటికే,  పని చేయడం ప్రారంభించాయి కూడా.  ఈ రోజున, బన్స్వారా, సిరోహి, హనుమాన్‌ గఢ్, దౌసా లలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభమైంది.  ఈ సందర్భంగా, ఆయా ప్రాంతాల ప్రజలను అభినందిస్తున్నాను.  ఈ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గౌరవ పార్లమెంటు సభ్యులు నన్ను కలిసినప్పుడల్లా, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.   పార్లమెంటు సభ్యుడు, నా స్నేహితుడు 'కనక్-మాల్' కటారా గారు, మన సీనియర్ పార్లమెంటు సభ్యుడు, జస్కౌర్ మీనా గారు, నా తోటి సోదరుడు నిహాల్‌చంద్ చౌహాన్ గారు, అదేవిధంగా సగం గుజరాతీ సగం రాజస్థానీ భైదేవ్‌జీ పటేల్‌ గారితో సహా మీరందరూ రాజస్థాన్‌ లో వైద్య పరమైన మౌలిక సదుపాయాలపై చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కొత్త వైద్య కళాశాలల నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. 

 

స్నేహితులారా,

 

కొన్ని దశాబ్దాల క్రితం దేశంలోని వైద్య వ్యవస్థల పరిస్థితి గురించి మనందరికీ తెలుసు.  20 ఏళ్ల క్రితం 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రి గా నాకు అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఆరోగ్య రంగం పూర్తిగా సవాళ్లతో నిండి ఉంది.  వైద్య మౌలిక సౌకర్యాలు, వైద్య విద్య లేదా వైద్య సదుపాయాలు ఇలా ప్రతి అంశంలోనూ పని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ సవాళ్ళను స్వీకరించి, అందరం కలిసి వాటిని మార్చడానికి ప్రయత్నించాము. ముఖ్యమంత్రి అమృతం పధకం కింద గుజరాత్‌ లో పేద కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందజేసే సదుపాయాన్ని ప్రారంభించడం జరిగింది.  చిరంజీవి యోజన కింద ఆసుపత్రుల్లో ప్రసవాలకు గర్భిణులను ప్రోత్సహిస్తూ, తల్లులు, శిశువుల ప్రాణాలు కాపాడడం లో ఘన విజయం సాధించడం జరిగింది.  ఇక, వైద్య విద్య విషయానికి వస్తే, గత రెండు దశాబ్దాల అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా, గుజరాత్ లో మెడికల్ సీట్ల ను ఆరు రెట్లు పెరిగాయి.

 

స్నేహితులారా, 

 

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య రంగంలో నేను గమనించిన లోటుపాట్లను తొలగించేందుకు గత ఆరేళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  మన రాజ్యాంగం ప్రకారం సమాఖ్య నిర్మాణం యొక్క భావన గురించి మనందరికీ తెలుసు.  దాని ప్రకారం, ఆరోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనము లోని అంశం. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోని బాధ్యత.  నేను చాలా కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆ కష్టాలన్నీ తెలుసుకున్నాను.  అందుకే, ఆరోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వ  బాధ్యత గా ఉన్నప్పటికీ,  భారత ప్రభుత్వం నుంచి కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాము.  దేశం లోని ఆరోగ్య వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే అతిపెద్ద సమస్య.  వ్యక్తిగత రాష్ట్రాల వైద్య వ్యవస్థ ల విషయంలో జాతీయ స్థాయిలో సామూహిక విధానం లేదు.   భారతదేశం వంటి దేశంలో మెరుగైన ఆరోగ్య సదుపాయాలు రాష్ట్ర రాజధానులు లేదా కొన్ని మెట్రో నగరాల కే పరిమితమయ్యాయి.  అటువంటి పరిస్థితుల్లో, పేద కుటుంబాలు ఉపాధి కోసం ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్ళే సందర్భాల్లో, ఆయా రాష్ట్ర సరిహద్దులకే పరిమితమైన ఆరోగ్య పథకాలు ప్రజలకు పెద్దగా ఉపయోగపడవు.  అదేవిధంగా, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మరియు పెద్ద ఆసుపత్రు ల మధ్య అంతరం చాలా ఎక్కువగా  ఉంది.  మన సంప్రదాయ వైద్య విధానానికి, ఆధునిక వైద్య వైద్యానికి మధ్య సమన్వయ లోపం కూడా ఉంది.  పాలనలో ఉన్న ఈ లోపాలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.   దేశంలోని ఆరోగ్య రంగాన్ని మార్చేందుకు, మేము ఒక జాతీయ విధానం మరియు ఒక కొత్త జాతీయ ఆరోగ్య విధానంపై పని చేసాము.  స్వచ్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ పథకాలతో పాటు, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వంటి కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా కొనసాగుతున్నాయి.   ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటివరకు రాజస్థాన్‌లో దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు ఉచిత చికిత్స పొందారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేసే సుమారు 2,500 ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలు ఈ రోజు రాజస్థాన్‌లో పనిచేయడం ప్రారంభించాయి.  నివారణ ఆరోగ్య సంరక్షణ పై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.  మేము కొత్త ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో  పాటు, ఆయుర్వేదం,  మరియు యోగాను ఏకకాలంలో ప్రోత్సహిస్తున్నాము.

 

సోదర సోదరీమణులారా, 

 

మరో ప్రధాన సమస్య వైద్యపరమైన మౌలిక సదుపాయాల కల్పనలో నిదానంగా సాగుతోంది.  ఎయిమ్స్, వైద్య కళాశాలల వంటి  అత్యాధునిక వైద్య సదుపాయాలు గల ఆసుపత్రుల వ్యవస్థను దేశంలోని ప్రతి ప్రాంతానికి విస్తరించడం చాలా ముఖ్యం.  భారతదేశం ఆరు ఎయిమ్స్‌ స్థాయి నుంచి 22 కంటే ఎక్కువ ఎయిమ్స్‌ తో కూడిన బలమైన వ్యవస్థ వైపు పయనిస్తోందని, ఈ రోజు మనం చాలా సంతృప్తితో చెప్పగలం.  గత ఆరేడు సంవత్సరాల్లో, 170 కి పైగా కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి.   మరో వంద కి పైగా కొత్త వైద్య కళాశాలల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.  2014 వరకు దేశంలో మొత్తం వైద్య విద్యలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 82,000 కి దగ్గరగా ఉన్నాయి.  ఈ రోజు ఆ సంఖ్య 1.40 లక్షలకు చేరింది.   అంటే ఈ రోజు ఎక్కువ మంది యువతకు డాక్టర్లు అయ్యే అవకాశం కలిగింది.   వైద్య విద్యా రంగంలో సాధించిన ఈ వేగవంతమైన పురోగతి ద్వారా రాజస్థాన్ కూడా భారీ ప్రయోజనాన్ని పొందింది.  ఈ కాలంలో రాజస్థాన్‌ లో కూడా మెడికల్ సీట్లు రెట్టింపయ్యాయి.   అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు 2,000 నుంచి 4,000కు పెరిగాయి.  రాజస్థాన్‌ లో ప్రస్తుతం వెయ్యి లోపే ఉన్న   పోస్ట్ గ్రాడ్యుయేట్   సీట్లు, త్వరలో 2,100 కు చేరుకోనున్నాయి.

 

సోదర సోదరీమణులారా, 

 

ఈ రోజు, ప్రతి జిల్లాలో తప్పనిసరిగా వైద్య కళాశాల లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను అందించే కనీసం ఒక సంస్థ ఉండాలని మేము ప్రయత్నిస్తున్నాము.  గత కొన్ని సంవత్సరాలుగా, వైద్య విద్యకు సంబంధించిన పాలన నుండి ఇతర విధానాలు, చట్టాలు, సంస్థల వరకు ప్రధాన సంస్కరణలు చేపట్టడం జరిగింది.   మునుపటి భారత వైద్య మండలి-ఎమ్ .సి.ఐ. నిర్ణయాలు ఎలా ప్రశ్నలకు గురయ్యాయో మనం గతంలో చూశాము.  ఆ విషయమై అనేక ఆరోపణలు వచ్చాయి, పార్లమెంటు లో గంటల తరబడి చర్చ జరిగింది.  పారదర్శకతపై కూడా సందేహాలు ఉన్నాయి.  

ఇది దేశంలో వైద్య విద్య నాణ్యత, ఆరోగ్య సేవల పంపిణీపై భారీ ప్రభావాన్ని చూపింది.  ఏళ్ల తరబడి ప్రభుత్వాలు ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని ఆలోచించినా అమలు కాలేదు.  నేను కూడా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను. నా మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, నేను చేద్దామని అనుకున్నాను, కానీ చేయలేకపోయాను.  ఎన్నో బృందాలు, మరెన్నో అడ్డంకులు పెట్టాయి.  దాన్ని సరిచేయడానికి మేము కూడా చాలా భరించవలసి వచ్చింది.  ఇప్పుడు ఈ ఏర్పాట్ల బాధ్యత జాతీయ వైద్య కమిషన్‌ పై ఉంది.  దాని అద్భుతమైన ప్రభావం ఇప్పుడు దేశంలోని ఆరోగ్య సంరక్షణ, మానవ వనరులు, ఆరోగ్య సేవల పై కనిపిస్తోంది.

 

స్నేహితులారా, 

దశాబ్దాల నాటి ఆరోగ్య వ్యవస్థలో నేటి అవసరాలకు అనుగుణంగా మార్పులు అవసరం.  వైద్య విద్య, ఆరోగ్య సేవల పంపిణీ మధ్య అంతరం క్రమంగా నిరంతరం తగ్గుతోంది.  ప్రభుత్వ లేదా ప్రైవేటు అనే తేడా లేకుండా పెద్ద ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి చాలా ప్రాధాన్యత ఉంది. తద్వారా కొత్త వైద్యులు, అనుబంధ వైద్య సిబ్బంది ని తయారు చేయడంలో వారి వనరులు గరిష్టంగా ఉపయోగించుకోవడం జరుగుతోంది.  మూడు-నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్,  దేశంలోని ప్రతి మూలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఎంతో కృషి చేస్తుంది.  మంచి ఆసుపత్రులు, టెస్టింగ్ ల్యాబ్‌ లు, ఫార్మసీలు, వైద్యులతో అపాయింట్‌మెంట్‌లు కేవలం ఒక క్లిక్‌ తో చేయవచ్చు.   రోగులు వారి ఆరోగ్య రికార్డులను నిర్వహించే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది.

 

సోదర సోదరీమణులారా, 

 

ఆరోగ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు సమర్థవంతమైన ఆరోగ్య సేవల పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.   ఈ కరోనా యుగంలో మనం ఈ విషయాన్ని మరింత ఎక్కువగా అనుభవించాము.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఉచిత టీకా - అందరికీ టీకా’ అనే ప్రచారం విజయవంతం కావడం ఈ విషయాన్ని రుజువు చేసింది.  భారతదేశంలో ఇంతవరకు 88 కోట్ల కంటే ఎక్కువ మోతాదుల కరోనా టీకాలు వేయడం జరిగింది.  రాజస్థాన్‌ లో కూడా 5 కోట్లకు పైగా టీకా డోసులు వేయడం జరిగింది.  మన వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ఇప్పటికీ వేలాది కేంద్రాలలో నిరంతరం టీకాలు వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వైద్యరంగంలో ఈ సామర్థ్యాన్ని మనం మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.  వైద్య మరియు సాంకేతిక విద్య ను ఆంగ్ల భాషలో మాత్రమే అధ్యయనం చేయడానికి అవకాశం ఉండటం, గ్రామీణ మరియు పేద కుటుంబాలకు చెందిన యువతకు మరొక అవరోధంగా ఉంది.  ఇప్పుడు కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల లో వైద్య విద్య అభ్యసించడానికి కూడా అవకాశం ఉంది.  రాజస్థాన్‌ లోని గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలలోని తల్లులు తమ పిల్లల కోసం కన్న కలలు ఇక సులువుగా సాకారమవుతాయి.  ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం లేని పేద కుటుంబాల్లోని యువత ఇప్పుడు వైద్యులుగా మారి మానవాళికి సేవ చేయనున్నారు.  వైద్య విద్యకు సంబంధించిన అవకాశాలు సమాజంలోని ప్రతి వర్గానికి సమానంగా అందుబాటులో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.  వైద్య విద్యలో ఓ.బీ.సీ.లు, ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ యువతకు రిజర్వేషన్లు కల్పించడం వెనుక ఉన్న స్ఫూర్తి ఇదే.

 

స్నేహితులారా, 

 

స్వాతంత్య్ర పుణ్య ఫలాలు అనుభవిస్తున్న ఈ స్వర్ణయుగంలో, ఉన్నత స్థాయి నైపుణ్యం భారతదేశాన్ని బలోపేతం చేయడంతో పాటు, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఒకటైన పెట్రో-కెమికల్ పరిశ్రమ కు నైపుణ్యం కలిగిన మానవ శక్తి చాలా అవసరం.  రాజస్థాన్‌ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ పెట్రోకెమికల్ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఈ రంగంలో ప్రతి సంవత్సరం వందలాది మంది యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.  ఈ రోజుల్లో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్ పరిశ్రమ వంటి అనేక రంగాలలో పెట్రోకెమికల్స్ వాడకం క్రమంగా పెరుగుతోంది.  తద్వారా నైపుణ్యం కలిగిన యువతకు భవిష్యత్తులో అనేక ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది.

 

స్నేహితులారా, 

ఈ రోజు మనం ఈ పెట్రోకెమికల్ ఇన్‌స్టిట్యూట్‌ ని ప్రారంభిస్తున్నప్పుడు, 13-14 సంవత్సరాల క్రితం నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము పెట్రోలియం విశ్వవిద్యాలయం గురించి ఆలోచించడం ప్రారంభించిన సమయం నాకు గుర్తుకు వచ్చింది.  అప్పట్లో ఈ ఆలోచనకు కొంతమంది నవ్వుతూ ఈ విశ్వవిద్యాలయం అవసరమేంటని ప్రశ్నించారు.  అది ఏమి చేయగలదు?  విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చి చదువుకుంటారు?  అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు.  అయితే, మేము ఈ ఆలోచనను వదులుకోలేదు.  రాజధాని గాంధీనగర్‌ లో భూమిని కేటాయించడం జరిగింది.  పండిట్ దీనదయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం - పి.డి.పి.యు. ను ప్రారంభించడం జరిగింది.  చాలా తక్కువ వ్యవధిలో,  పి.డి.పి.యు. దాని విలువను ప్రదర్శించింది.  అక్కడ చదువుకునేందుకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు పోటీ పడ్డారు.  ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం పరిధి మరింత విస్తరించింది.  ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం "పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ - పి.డి.ఈ.యు." గా ప్రాచుర్యం పొందింది.  ఇటువంటి సంస్థలు యువతకు స్వచ్ఛమైన శక్తి కోసం వినూత్న పరిష్కారాలకు పునాది వేయడంతో పాటు, వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.

 

స్నేహితులారా, 

 

రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్ట్ బార్మర్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోంది.  ఈ ప్రాజెక్టుపై 70,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ టెక్నాలజీ నుండి గ్రాడ్యుయేట్ అయిన నిపుణుల కోసం ఈ ప్రాజెక్టు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.  రాజస్థాన్‌ లో కొనసాగుతున్న సిటీ గ్యాస్ పంపిణీ పనుల్లో కూడా యువతకు అనేక అవకాశాలు ఉన్నాయి.  2014 వరకు, రాజస్థాన్‌ లోని ఒక నగరానికి మాత్రమే గ్యాస్ పంపిణీకి అనుమతి ఉంది.  ఈ రోజు రాజస్థాన్‌ లోని 17 జిల్లాలు సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు కోసం అనుమతి పొంది ఉన్నాయి.  సమీప భవిష్యత్తులో, రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు పైపుల ద్వారా గ్యాస్ పంపిణీ చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.

 

 

సోదర సోదరీమణులారా, 

 

రాజస్థాన్‌ లో ఎక్కువ భాగం ఎడారి మరియు ఇది సరిహద్దు ప్రాంతంగా కూడా ఉంది.   క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా, మన మాతృమూర్తులు, సోదరీమణులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.  నేను చాలా సంవత్సరాలుగా రాజస్థాన్‌ లోని సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్నాను.  మరుగుదొడ్లు, కరెంటు, గ్యాస్ కనెక్షన్లు లేకపోవడంతో తల్లులు, అక్కాచెల్లెళ్లు పడుతున్న ఇబ్బందులను చూశాను.  నిరుపేదలకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు అందుబాటులో ఉండటం వల్ల నేడు జీవితం చాలా సులభం అయింది.  రాజస్థాన్‌ లో తాగునీరు ఒక విధంగా, ప్రతిరోజూ మాతృమూర్తుల, సోదరీమణులక సహనానికి ఒక పరీక్షగా ఉండేది.  ఇప్పుడు రాజస్థాన్‌ లోని 21 లక్షలకు పైగా కుటుంబాలు "జల్-జీవన్-మిషన్" పధకం కింద పైపుల ద్వారా నీటి సరఫరాను పొందుతున్నారు.  రాజస్థాన్‌లోని మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెల పాదాలపై ఉన్న బొబ్బలను నయం చేయడానికి, "హర్-ఘర్-జల్-అభియాన్" అనే పథకం ఒక చిన్న ప్రయత్నం అయినప్పటికీ, నిజాయితీతో కూడిన ప్రయత్నం.

 

స్నేహితులారా, 

 

రాజస్థాన్ అభివృద్ధి కూడా భారతదేశ అభివృద్ధికి ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది.   రాజస్థాన్‌ లోని పేద, మధ్యతరగతి ప్రజలకు సౌకర్యాలతో పాటు, జీవన సౌలభ్యం పెరిగినప్పుడు, అది నాకు సంతృప్తినిస్తుంది.  గత 6 -7 సంవత్సరాలలో, రాజస్థాన్‌ లో కేంద్ర ప్రభుత్వ గృహ పథకాల ద్వారా 13 లక్షలకు పైగా పక్కా గృహాలను పేదల కోసం నిర్మించడం జరిగింది.  "ప్రధానమంత్రి కిసాన్-సమ్మాన్-నిధి" కింద, రాజస్థాన్‌ లోని 74 లక్షలకు పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు సుమారు 11,000 కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది.   "ప్రధాన మంత్రి ఫసల్-బీమా-యోజన" కింద రాష్ట్ర రైతులకు 15,000 కోట్ల రూపాయల విలువైన దావా లను పరిష్కరించడం జరిగింది.

 

స్నేహితులారా, 

 

సరిహద్దు రాష్ట్రంగా ఉన్నందున, అనుసంధానత మరియు సరిహద్దు ప్రాంత అభివృద్ధికి సంబంధించినంతవరకు రాజస్థాన్‌ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది.  జాతీయ రహదారి నిర్మాణం, కొత్త రైల్వే లైన్లు, సిటీ గ్యాస్ పంపిణీతో సహా డజన్ల కొద్దీ ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయి.  దేశంలోని రైల్వేల స్థాయిని పెంపొందించనున్న, "డెడికేటెడ్-ఫ్రైట్-కారిడార్‌" లో ఎక్కువ భాగం రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాలలో  ఉంది.  ఇది కూడా, అనేక కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.

 

 

 

సోదర సోదరీమణులారా, 

 

 

 

రాజస్థాన్ సామర్థ్యం దేశం మొత్తానికి స్ఫూర్తినిస్తుంది.  మనం కూడా రాజస్థాన్ సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించి, దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకు వెళ్ళాలి.   ఇది మనందరి కృషితోనే సాధ్యమౌతుంది.   స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 75వ సంవత్సరంలో "సబ్‌-కా-ప్రయాస్" అంటే "ప్రతి ఒక్కరి కృషి" అనే మంత్రంతో మనం నూతనోత్సాహంతో ముందుకు సాగాలి.  ఈ స్వాతంత్య్ర యుగం రాజస్థాన్ అభివృద్ధికి స్వర్ణ యుగం కావాలని మనం కోరుకుందాం.   నేను రాజస్థాన్ ముఖ్యమంత్రి చెప్పేది వింటున్నప్పుడు, ఆయన చాలా పనుల జాబితాను చదివారు.   నాపై ఇంత విశ్వాసం ఉంచినందుకు, రాజస్థాన్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  ఇది ప్రజాస్వామ్యానికి గొప్ప బలాన్ని చేకూరుస్తుంది.   ఆయన రాజకీయ సిద్ధాంతం నాకు భిన్నమైనది.  అయినా, అశోక్ గారు నన్ను విశ్వసిస్తున్నారు.  అందువల్లనే, ఆయన  చాలా విషయాలు మనస్ఫూర్తిగా నాతో పంచుకున్నారు.   ఈ స్నేహం, విశ్వాసం ప్రజాస్వామ్యానికి గొప్ప బలం.  ఈ సందర్భంగా, రాజస్థాన్ ప్రజలకు మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.

 

ధన్యవాదములు !

 

 

అస్వీకరణ:  ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్చానువాదం మాత్రమే. ప్రధానమంత్రి చేసిన ప్రసంగ మాతృక హిందీలో ఉంది. 

 

*****


(Release ID: 1774113) Visitor Counter : 182