ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ) కింద న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) దేశవ్యాప్త పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు పీసీవీపై కమ్యూనికేషన్ ప్యాకేజీ (ఐఈసీ మెటీరియల్)ని విడుదల చేశారు.
“మొదటిసారిగా, పీసీవీ దేశవ్యాప్తంగా సార్వత్రిక వాడకం కోసం అందుబాటులో ఉంటుంది; పిసివి న్యుమోనియా కారణంగా వచ్చే మరణాలను దాదాపు 60శాతం తగ్గిస్తుంది”అని అన్నారు
పిల్లలు మన దేశ భవిష్యత్తు, వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం మన బాధ్యత: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
Posted On:
29 OCT 2021 2:20PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ) కింద న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) దేశవ్యాప్త విస్తరణ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా శుక్రవారం ప్రారంభించారు. పిసివిపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కమ్యూనికేషన్ అవగాహన ప్యాకేజీలను కూడా విడుదల చేశారు. ఈ కమ్యూనికేషన్ ప్యాకేజీలను తదుపరి వినియోగం కోసం అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిస్తారు.
దేశవ్యాప్త పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సార్వత్రిక ఉపయోగం కోసం పిసివిని అందుబాటులోకి రావడం దేశంలోనే మొదటిసారి అని అన్నారు. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలకు న్యుమోనియా ప్రధాన కారణమని ఆయన తెలిపారు. "పిల్లలలో తీవ్రమైన న్యుమోనియాకు న్యుమోకాకస్ వల్ల కలిగే న్యుమోనియా చాలా సాధారణ కారణం. భారతదేశంలో దాదాపు 16 శాతం మంది చిన్నారుల మరణాలు న్యుమోనియా కారణంగానే సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పిసివి ఇవ్వడం వల్ల శిశు మరణాలు 60 శాతం తగ్గుతాయి” అని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.
ప్రతిదేశ వృద్ధి, ఉత్పాదకత అభివృద్ధిలో ఆరోగ్యవంతమైన పిల్లల పాత్ర ఎంతో కీలకమన్న కేంద్ర మంత్రి, పిల్లలే మన దేశ భవిష్యత్తు అని, వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం మన బాధ్యత అని అన్నారు. ప్రధాన మంత్రి ప్రారంభించిన మిషన్ ఇంద్రధనుష్ ఇందుకోసం చేపట్టిన ప్రయత్నాలలో ఒకటని వివరించారు. ‘‘కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం ప్రధాన మంత్రి చొరవ వల్ల అమల్లోకి వచ్చిన “సబ్కో వ్యాక్సిన్, ముఫ్త్ వ్యాక్సిన్” కార్యక్రమం అర్హులైన జనాభా దేశవ్యాప్తంగా కొవిడ్ 19 వ్యాక్సిన్‌లను పొందేలా చేసింది
పిసివి ప్రారంభించడం వల్ల పిల్లల మరణాలను తగ్గించడమే కాకుండా వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదల అభివృద్ధికి మరింత భరోసా ఇవ్వగలుగుతాం”అని ఆయన అన్నారు.
ఈ ప్రాణరక్షక వ్యాక్సిన్‌ను విడుదల చేయడంలో కృషి చేసినందుకు ఇమ్యునైజేషన్ సిబ్బందిని, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, అధికారులందరినీ కేంద్ర ఆరోగ్య మంత్రి అభినందించారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన కమ్యూనికేషన్ ప్యాకేజీని విడుదల చేస్తూ, టీకాపై అవగాహన కల్పించడం కీలకమని డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఉద్బోధించారు. వ్యాక్సిన్ లక్ష్యం మన పిల్లల ప్రాణాలను కాపాడటమేనని, దేశవ్యాప్తంగా విజయవంతంగా అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
యూఐపీ గురించి:
యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ) ఏటా 2.67 కోట్ల మంది నవజాత శిశువులు, 2.9 కోట్ల మంది గర్భిణుల కోసం నిర్వహిస్తున్న అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాలలో ఒకటి.
యూఐపీ కింద, 12 నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా అందిస్తున్నారు.
జాతీయస్థాయిలో 10 వ్యాధులు.. - డిఫ్తీరియా, పెర్టుసిస్, ధనుర్వాతం, పోలియో, తట్టు, రుబెల్లా, బాల్యంలో క్షయ, రోటావైరస్ డయేరియా, హెపటైటిస్ బి హేమోఫిలస్ ఇన్‌ఫ్లుఎంజా రకం బి వల్ల వచ్చే మెనింజైటిస్ & న్యుమోనియాలకూ టీకాలు ఇస్తున్నారు.
ఉప-జాతీయస్థాయిలో 2 వ్యాధుల నివారణకు - న్యుమోకాకల్ న్యుమోనియా జపనీస్ ఎన్సెఫాలిటిస్ టీకాలు ఇస్తారు; వీటిలో న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ నేడు జాతీయస్థాయిలో పంపిణీ అవుతోంది. అయితే జేఈ వ్యాక్సిన్ స్థానిక జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్, అదనపు కార్యదర్శి వికాస్ షీల్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబుతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాల సీనియర్ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
(Release ID: 1767578)
Visitor Counter : 502