ప్రధాన మంత్రి కార్యాలయం
రోమ్, గ్లాస్గో పర్యటనలకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన
Posted On:
28 OCT 2021 7:27PM by PIB Hyderabad
ప్రధానమంత్రి మారియో డ్రాఘి ఆహ్వానం మేరకు నేను 2021 అక్టోబర్ 29-31 తేదీల మధ్య ఇటలీలోని రోమ్ నగరాన్ని, వాటికన్ నగరాన్ని సందర్శిస్తున్నాను. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు ఆ తర్వాత 2021 నవంబర్ 1-2 తేదీల్లో యునైటెడ్ కింగ్ డమ్ లోని గ్లాస్గో నగరాన్ని సందర్శిస్తాను.
రోమ్ లో నేను జి-20 నాయకుల 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటాను. ప్రస్తుత మహమ్మారి నుంచి ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య రికవరీ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చల్లో జి-20 నాయకులతో కలిసి పాల్గొంటాను. 2020లో కోవిడ్ మహమ్మారి విజృంభణ అనంతరం భౌతికంగా జరుగుతున్న తొలి జి-20 శిఖరాగ్ర సదస్సు ఇదే. మహమ్మారి అనంతర కాలంలో ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేయడంలోను, సమ్మిళితత్వం, సుస్థిరతలు పెంపొందించడంలోను జి-20 ఏ విధంగా చోదకశక్తిగా నిలవగలదనే అంశం కూడా చర్చించేందుకు ఇది చక్కని అవకాశం.
ఇటలీ పర్యటనలో భాగంగా నేను వాటికన్ నగరాన్ని కూడా సందర్శిస్తాను. అక్కడ పోప్ తోను, విదేశాంగ మంత్రి కార్డినల్ పీట్రో పరోలిన్ తోను సమావేశమవుతాను.
జి-20 శిఖరాగ్ర సదస్సు సమయంలో భాగస్వామ్య దేశాల నాయకులతో సమావేశమై ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షిస్తాను.
అక్టోబర్ 31న జి-20 శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల విభాగం (యుఎన్ఎఫ్ సిసిసి) నిర్వహణలోని 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఓపి-26) సమావేశంలో పాల్గొనేందుకు గ్లాస్గో వెళ్తాను. 2021 నవంబర్ 1-2 తేదీల్లో ప్రపంచ నాయకుల సదస్సు పేరిట జరిగే సిఓపి-26 అత్యున్నత స్థాయి సమావేశంలో 120 మంది దేశాధినేతలు/ ప్రభుత్వాధినేతలతో కలిసి పాల్గొంటాను.
ప్రకృతితో సామరస్యపూర్వకంగా జీవించడం అనే సాంప్రదాయం, భూగోళం పట్ల ఎనలేని గౌరవం ఇచ్చే సంస్కృతికి అనుగుణంగా మనం స్వచ్ఛ, పునరుత్పాదక ఇంధనం, ఇంధన సమర్థత, అడవుల పెంపకం, జీవ వైవిధ్యం రంగాల్లో ఆశావహమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. వాతావరణ మైత్రితో కూడిన ఉమ్మడి ప్రయత్నాలు, నివారణ చర్యలు, సంయమనం, బహుముఖీన భాగస్వామ్యాల ఏర్పాటులో భారతదేశం ఇప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. పునరుత్పాక ఇంధనం స్థాపిత శక్తి, పవన, సౌర విద్యుత్తు సామర్థ్యాల్లో భారతదేశం ప్రస్తుతం అగ్రశ్రేణి దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. వాతావరణ కార్యాచరణలో భారతదేశం అద్భుత పురోగతి, విజయాల గురించి నేను డబ్ల్యుఎల్ఎస్ లో వివరిస్తాను.
కార్బన్ విభాగంలో సమాన పంపిణీ; నివారణ చర్యలు, అమలు; సంయమనం, ఆర్థిక వనరుల సమీకరణ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ; హరిత, సమ్మిళిత వృద్ధికి సుస్థిరతతో కూడిన జీవన ప్రమాణాల అమలు ప్రాధాన్యత వంటి అంశాలన్నింటినీ నేను ప్రముఖంగా ప్రస్తావిస్తాను.
వాతావరణ కార్యాచరణలో భాగస్వాములు, భాగస్వామ్య దేశాల నాయకులు, ఇన్నోవేటర్లు, అంతర్ ప్రభుత్వ సంస్థలతో సమావేశమయ్యేందుకు, స్వచ్ఛతతో కూడిన వృద్ధిని మరింతగా పెంపొందించడానికి మార్గాల అన్వేషణకు సిఓపి-26 శిఖరాగ్ర సదస్సు చక్కని అవకాశం.
(Release ID: 1767428)
Visitor Counter : 260
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam