ఆయుష్
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న ఆయుష్ మంత్రి
Posted On:
26 OCT 2021 11:17AM by PIB Hyderabad
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఏర్పాటైన ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఆయుష్ మంత్రి శ్రీ శ్రీ సర్బానంద సోనోవాల్ 2021 అక్టోబర్ 29 తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రారంభిస్తారు.
'ఆయుర్వేద ఫర్ పోషన్' అనే అంశంపై 6వ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయుష్ మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాళూభాయ్ కూడా హాజరవుతారు.
కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 30వ తేదీన ఆయుష్ రంగంలో అంకుర సంస్థల ఏర్పాటు, అభివృద్ధి అవకాశాలు అనే అంశంపై ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి దేశం వివిధ ప్రాంతాలకు చెందిన ఆయుర్వేద రంగంలో పనిచేస్తున్న ఆయుష్ సంస్థలు, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదతో కలసి పనిచేస్తున్న వివిధ సంస్థల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారు.
ఆయుర్వేద రంగంలో పారిశ్రామికవేత్తలు వచ్చేలా చూసి, విద్యా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఆయుర్వేద రంగంలో నూతన సంస్థలు అడుగు పెట్టడానికి అవకాశం కలుగుతుంది. సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ఎంపిక చేసింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అందజేస్తుంది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ నెలకొల్పే ఈ ఇంక్యూబేషన్ సెంటర్ నిర్వహణ భాద్యతను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద చేపడుతుంది. ఆయుర్వేద రంగంలో పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానించడం, విద్యా ప్రమాణాలను మెరుగు పరిచే లక్ష్యాలతో ఈ కేంద్రం పనిచేస్తుంది. దేశ సంపదను పెంపొందించే అంశంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని వివిధ మంత్రిత్వ శాఖలు అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. దేశ అంకుర సంస్థల రంగం ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ అంకుర సంస్థ రంగంగా అభివృద్ధి చెందేలా చూడడానికి ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకంగా జాతీయ ఆయుష్ మిషన్ ను కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో ఆయుష్ వైద్య విధానం అభివృద్ధి, ప్రోత్సాహానికి కార్యక్రమాలను అమలు చేస్తోంది.
ఇంక్యూబేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అభివృద్ధి చేసిన ' బాల్ రక్ష కిట్' ను ప్రారంభించడం జరుగుతుంది. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా 10,000 కిట్లను ఉచితంగా అందిస్తారు. అన్ని సౌకర్యాలతో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును కూడా ఈ సందర్భంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి అవసరమైన లైసెన్స్, ఇతర అనుమతులను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పొందింది.
ఆయుర్వేద ఆహార ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసి వాటిని అభివృద్ధి చేయడానికి కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేద ఫుడ్ ఎక్స్‌పోను నిర్వహించనున్నారు. దీనిలో వివిధ ఆయుర్వేద ఆహార పదార్థాలు, తినడానికి సిద్ధంగా ఉండే ఆహార పదార్ధాలను ప్రదర్శిస్తారు. ఆయుర్వేద రంగంలో పనిచేస్తున్న వారందరిని ఒక వేదిక మీదకు తెచ్చి ఆయుర్వేద రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఏర్పాటైన జాతీయ సదస్సులో ఆయుష్ మంత్రిత్వ శాఖ, వాణిజ్య పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ, ఐఐటీ, ఆహార నిపుణులు పాల్గొని తమ అనుభవాలను వివరిస్తారు. ఆహార రంగంలో ఆయుర్వేదం ప్రాధాన్యతను వివరించే విధంగా ప్రదర్శనను నిర్వహిస్తారు.
ఆయుష్ ఉప రంగానికి హెల్త్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ రూపొందించిన క్వాలిఫికేషన్ ప్యాక్‌లను కూడా కార్యక్రమంలో ప్రారంభించడం జరుగుతుంది. ఆయుష్ రంగంలో నైపుణ్య కార్యక్రమాలను అమలు చేయడానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ఆయుష్ మంత్రిత్వ శాఖ నియమించింది. 2018 నుంచి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఈ కార్యక్రమాలను అమలు చేస్తోంది. నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా కూడా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వ్యవహరిస్తోంది.
***
(Release ID: 1766669)
Visitor Counter : 189