ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబరు 13న ‘పీఎం గతిశక్తి’ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి


కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులలో భాగస్వాముల కోసం సంపూర్ణ ప్రణాళికల వ్యవస్థీకరణసహా ఒంటిస్తంభపు మేడలను బద్దలు చేయనున్న ‘పీఎం గతిశక్తి’;

కేంద్రీకృత పోర్టల్‌ ద్వారా ఇకపై అన్ని శాఖలకూ ప్రాజెక్టుల పరస్పర దృగ్గోచరత;

ప్రజలు.. వస్తువులు-సేవల రవాణా నిమిత్తం
సమీకృత-నిరంతర బహుముఖ సంధానం;

బహుళ ఉపాధి అవకాశాలు.. రవాణా వ్యయం తగ్గింపు.. సరఫరా ప్ర్రక్రియ మెరుగు.. స్థానిక వస్తువులకు ప్రపంచ పోటీస్థాయి కల్పించనున్న ‘పీఎం గతిశక్తి’;

ప్రగతి మైదాన్‌లో కొత్త ఎగ్జిబిషన్‌ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 12 OCT 2021 6:28PM by PIB Hyderabad

   దేశ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఓ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబరు 13న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉదయం 11:00 గంటలకు బహుముఖ రవాణా అనుసంధానం కోసం జాతీయ బృహత్ ప్రణాళిక ‘పీఎం గతిశక్తి’కి ఆవిష్కరిస్తారు.

   భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగం కొన్ని దశాబ్దాలుగా అనేక సమస్యలతో కుంటుపడింది. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రధాన సమస్యగా ఉండేది. ఉదాహరణకు॥ ఒక శాఖ ఓ రోడ్డువేయడం పూర్తిచేయగానే మరో శాఖ భూగర్భ కేబుళ్లు లేదా గ్యాస్‌ పైప్‌లైన్లు వేయడం వంటి పనుల కోసం ఆ రోడ్డును తవ్విపోసేది. దీనివల్ల తీవ్ర అసౌకర్యం కలగడమే కాకుండా వృథా వ్యయానికి కారణమయ్యేది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ముందుగా సమన్వయం పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించబడింది. దీనివల్ల రోడ్డు నిర్మాణ సమయంలోనే కేబుళ్లు, పైప్‌లైన్లు వేయడం పూర్తవుతుంది. అంతేకాకుండా పనులకు ఆమోద ప్రక్రియలో తీవ్ర జాప్యం, పలు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి రావడం వంటి సమస్యల పరిష్కారానికీ చర్యలు చేపట్టబడ్డాయి. తదనుగుణంగా గడచిన ఏడేళ్లలో సంపూర్ణ దృక్పథంతో మౌలిక సదుపాయాలపై ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం శ్రద్ధ చూపింది.

   తకాలపు బహుళ సమస్యల పరిష్కారం దిశగా కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం సంపూర్ణ ప్రణాళికల వ్యవస్థీకరణపై ‘పీఎం గతిశక్తి’ కార్యక్రమం దృష్టి సారించింది. దీనికింద ప్రణాళిక-డిజైన్ల తయారీలోని ఒంటిస్తంభపు మేడలవంటి వేర్వేరు వ్యవస్థల స్థానంలో ఇకపై ఆయా ప్రాజెక్టులు ఉమ్మడి దృష్టితో రూపొందించి, అమలుచేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఆ మేరకు వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని “భారత్‌మాల, సాగరమాల, దేశీయ జల మార్గాలు, డ్రై/ల్యాండ్‌ పోర్టులు, ఉడాన్‌” వగైరా మౌలిక సదుపాయాల పథకాలన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. అదేవిధంగా జౌళి సముదాయాలు, ఔషధ సముదాయాలు, రక్షణ కారిడార్లు, ఎలక్ట్రానిక్ పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, మత్స్య సముదాయాలు, వ్యవసాయ మండళ్లు వంటి ఆర్థిక మండళ్లు కూడా దీని పరిధిలోకి వస్తాయి. తద్వారా అనుసంధాన మెరుగుతోపాటు భారతీయ వ్యాపారాల మధ్య పోటీతత్వం మరింత పెరుగుతుంది. అలాగే “బైశాగ్-ఎన్” (భాస్కరాచార్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్‌ జియో ఇన్ఫర్మేటిక్స్) ద్వారా ‘ఇస్రో’ రూపొందించే చిత్రాల వంటి అంతరిక్ష ప్రణాళిక ఉపకరణాలుసహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటుంది.

ఆరు స్తంభాల పునాదితో ‘పీఎం గతిశక్తి’

  1. సమగ్రత: వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రస్తుత-ప్రణాళికల రూపంలోగల అన్ని ప్రాజెక్టులనూ కేంద్రీకృత పోర్టల్‌లో చేరుస్తుంది. దీనివల్ల ఇకపై అన్ని శాఖలు, విభాగాలకు ప్రాజెక్టుల పరస్పర దృగ్గోచరత సాధ్యమవుతుంది. తద్వారా ఆయా ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు సంబంధిత కీలక సమాచారం ఆధారంగా వాటిని సమగ్రంగా పూర్తిచేసే వీలుంటుంది.
  2. ప్రాధాన్యీకరణ: దీనిద్వారా వివిధ శాఖలు, విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోగల అవకాశం లభిస్తుంది.
  3. గరిష్ఠీకరణ: కీలక అంతరాలను గుర్తించిన తర్వాత వివిధ మంత్రిత్వశాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్‌ ప్రణాళిక తోడ్పాటునిస్తుంది. ఉదాహరణకు ఒకచోట నుంచి మరోచోటికి వస్తువుల రవాణా కోసం సమయం, ఖర్చుపరంగా గరిష్ఠ ప్రయోజనంగల మార్గాన్ని ఎంచుకునే వీలు కల్పిస్తుంది.
  4. కాల సమన్వయం: ఆయా మంత్రిత్వశాఖలు, విభాగాలు వేటికవి ఒంటిస్తంభపు మేడల్లా తమ పని తాము చేసుకుంటూంటాయి. ఫలితంగా ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో సమన్వయం లోపించి, పనులు జాప్యమవుతాయి. ఈ సమస్యకు ‘పీఎం గతిశక్తి’ స్వస్తి పలుకుతుంది.. ఆ మేరకు ప్రతి విభాగం, పాలనపరమైన విభిన్న అంచెలలో కార్యకలాపాలను కాల సమన్వయం చేసుకుందుకు తోడ్పడుతుంది. దీనివల్ల పనిలో సమన్వయం సాధ్యమై సంపూర్ణ స్థాయిలో కొనసాగే వీలుంటుంది.
  5. విశ్లేషణాత్మకత: ‘జీఐఎస్‌’ ఆధారిత అంతర్జాతీయ ప్రణాళిక-200కిపైగా అంచెలుగల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాలన్నిటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తుంది. తద్వారా పనులు నిర్వహించే సంస్థకు సుస్పష్ట దృగ్గోచరత ఉంటుంది.
  6. గతిశీలత: ‘జీఐఎస్‌’ వేదిక సాయంతో అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు ఇతర శాఖలకు చెందిన ప్రాజెక్టులను గమనించడంతోపాటు సమీక్షిస్తూ, ప్రగతిని పర్యవేక్షించే సౌలభ్యం ఉంటుంది. ఆ మేరకు ఉపగ్రహ చిత్రాలద్వారా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అందించడమే కాకుండా ప్రాజెక్టుల ప్రగతి వివరాలు క్రమబద్ధంగా పోర్టల్‌లో నమోదు చేయబడతాయి. బృహత్‌ ప్రణాళికను నవీకరించే, పరిధిని పెంచే కీలక చర్యలేమిటో గుర్తించేందుకూ ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

   జీవన నాణ్యతను, వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచగల భవిష్యత్తరం మౌలిక సదుపాయాల కల్పనదిశగా ప్రధానమంత్రి నిరంతర కృషి ఫలితమే ‘పీఎం గతిశక్తి’ ప్రణాళిక. ప్రజలతోపాటు వస్తుసేవల రవాణాను ఒక సాధనం నుంచి మరోదానికి సంధానం కల్పించడంలో ఈ సమీకృత, నిరంతర బహుముఖ రవాణా అనుసంధాన వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా ప్రజలకు ప్రయాణ సమయం తగ్గించడంసహా మౌలిక సదుపాయాలను చివరిప్రాంతాలతోనూ సంధానిస్తుంది. రాబోయే అనుసంధాన ప్రాజెక్టులు, ఇతర వ్యాపార కూడళ్లు, పారిశ్రామిక వాడలు, పరిసర పర్యావరణం తదితరాలపై ప్రజలకు, వ్యాపార సమాజానికి ‘పీఎం గతిశక్తి’ సమాచారం అందిస్తుంది. పెట్టుబడిదారులు తమకు వ్యాపారాల కోసం తగిన ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంలో తోడ్పడటం వల్ల సమన్వయీకరణ పెరిగే వీలు కూడా ఉంటుంది. ఇది బహుళ ఉపాధి అవకాశాలను సృష్టించి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం ఇస్తుంది. రవాణా వ్యయాల తగ్గింపు, సరఫరా ప్రక్రియల మెరుగుద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ పోటీతత్వాన్నిస్తుంది. అలాగే స్థానిక పరిశ్రమలు-వినియోగదారుల మధ్య సముచిత సంబంధాలు ఏర్పరుస్తుంది.

   ప్రధానమంత్రి ప్రగతి మైదాన్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతోపాటు కొత్త ‘ఎగ్జిబిషన్‌’ (హాళ్లు 2 నుంచి5వరకూ) ప్రాంగణాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ కొత్త ఎగ్జిబిషన్‌ హాళ్లలోనే 2021 నవంబరు 14-27 తేదీల మధ్య ‘భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ’ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన’ (ఐఐటీఎఫ్‌)-2021 నిర్వహించబడుతుంది. కాగా, అక్టోబరు 13నాటి కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, రోడ్డురవాణా-జాతీయ రహదారులు, రైల్వే, పౌర విమానయాన, నౌకా, విద్యుత్‌, పెట్రోలియం-సహజవాయువు తదితర శాఖల మంత్రులు కూడా పాల్గొంటారు.

***


(Release ID: 1763451) Visitor Counter : 594