స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు
azadi ka amrit mahotsav

సినిమా పరిశ్రమలో వాణిజ్య సౌలభ్య కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్


‘యానిమేషన్... వీఎఫ్ ఎక్స్‌’ల కోసం అంతర్జాతీయ స్థాయి
విద్యా సంస్థ త్వరలో ఏర్పాటు: మంత్రి ప్రకటన

Posted On: 08 OCT 2021 1:20PM by PIB Hyderabad

   చలనచిత్ర పరిశ్రమలో వాణిజ్య సౌలభ్య కల్పనకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని కేంద్ర సమాచార-ప్రసారశాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తెలిపారు. చెన్నైలో ఇవాళ దక్షిణభారత చలనచిత్ర వాణిజ్య సమాఖ్య (ఎస్‌ఐఎఫ్‌సిసి) అధికారులతో సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. వివిధ శాఖలనుంచి సినిమా చిత్రీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకునే వీలు కల్పించే పోర్టల్‌ను సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీంతో దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్‌కు అనుమతి కోసం నిర్మాతలు ఇకపై ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించవచ్చు. తద్వారా చలనచిత్ర పరిశ్రమకు వాణిజ్య సౌలభ్యం కల్పించినట్లు కాగలదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. అంతేకాకుండా ‘యానిమేషన్‌, విఎఫ్‌ఎక్స్‌’ల కోసం అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ ఏర్పాటుకు ఐఐటీ, ముంబైతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు.

   కార్యక్రమంలో పాల్గొన్న వివిధ చలనచిత్ర వాణిజ్య సంఘాల ప్రతినిధులు చిత్ర పరిశ్రమ రంగానికి సంబంధించిన పలు అభ్యర్థనలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. కోవిడ్‌ వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, జంతు సంక్షేమ బోర్డు ధ్రువీకరణ, సినిమా షూటింగ్‌లకు ఏకగవాక్ష అనుమతి, సినిమాలపై ద్వంద్వ పన్నులు వంటి అంశాలను వినతిపత్రంలో వివరించారు. ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు కార్యాలయాల్లో జంతు సంక్షేమ బోర్డు యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. అలాగే సెన్సార్‌ బోర్డులో చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధుల సంఖ్యను పెంచాలని, సెన్సార్‌ బోర్డు ధర్మాసనం ఏర్పాటు చేయాలని, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు పొందిన చిత్రాలతోపాటు ప్రజాదరణగల సినిమాలను కూడా దూరదర్శన్‌లో ప్రదర్శించేలా చూడాలని కూడా మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.

   లనచిత్ర పరిశ్రమకు చెందిన వివిధ సంఘాలు, నాయకులు సమర్పించిన వినతిపత్రాలు, అభ్యర్థనలను స్వీకరించిన అనంతరం వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమకు తలమానికమైన ‘ఎస్‌ఐఎఫ్‌సిసి’ ప్రతినిధులు, సంఘాలతో సమావేశం కావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలను పంచుకునేందుకు వీలుగా గోవాలో జరిగే చలనచిత్రోత్సవాలకు హాజరు కావాల్సిందిగా మంత్రి వారిని ఆహ్వానించారు.

 

***


(Release ID: 1762440) Visitor Counter : 148