విద్యుత్తు మంత్రిత్వ శాఖ

'వివాద నివారణా వ్యవస్థ' రూపకల్పనకు కేంద్ర విద్యుత్ మంత్రి ఆమోదం!


‘స్వతంత్ర ఇంజినీర్ల’ ప్యానెల్.తో కూడిన
కొత్త ప్రక్రియకు ఆర్.కె. సింగ్ ఓకె...

జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో వివాదాలను
సకాలంలో పరిష్కరించడమే ధ్యేయం..
కాలహరణం, నిధుల వ్యయం నివారించే చర్య!

Posted On: 29 SEP 2021 11:27AM by PIB Hyderabad

   'స్వతంత్ర ఇంజినీర్ల' ప్యానెల్.తో రూపొందించిన "వివాద నివారణా వ్యవస్థ"కు కేంద్ర విద్యుత్, నూతన పునురుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు (సి.పి.ఎస్.ఇ.లకు) చెందిన జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టులకోసం ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ నిర్దేశించిన ప్రకారం ప్యానెల్ కోసం, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విస్తృతంగా పనిచేసిన నిపుణులైన, స్వయం ప్రతిపత్తి గల స్వతంత్ర ఇంజినీర్ల నియామకాన్ని తప్పనిసరిగా చేపట్టవలసి ఉంటుంది. నిపుణుడైన సదరు ఇంజినీర్.కు  సబ్జెక్టు పరిజ్ఞానమే కాక, వాణిజ్య, న్యాయపరమైన అంశాల్లో కూడా ప్రావీణ్యం ఉండి తీరాలని ఈ వ్యవస్థ నిర్దేశిస్తోంది. ఈ ‘స్వతంత్ర ఇంజినీర్’ ప్రాజెక్టులపై పర్యవేక్షణ కలిగి ఉండాలని, వివాదాల నివారణ ప్రక్రియలో ప్రభావవంతంగా పనిచేసే భాగస్వామ్యవర్గాలతో స్వేచ్ఛగా సంప్రదింపులు జరిపేలా ఉండాలని కూడా ఈ వ్యవస్థ పేర్కొంటోంది. ప్రారభ దశలో అంగీకారం కుదరని ఒప్పందాలు పూర్తిస్థాయి వివాదాలుగా పరిణమించకుండా నివారించేదిగా, వివాద పూరిత ఒప్పందాలను న్యాయబద్ధంగా, సమంజసంగా పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించేదిగా ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. వివిధ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడానికి, కాలహరణాన్ని, అంచనాకు మించిన నిధుల వ్యయాన్ని అరికట్టేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది.

   జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థ పనితీరుపై జలవిద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. యజమాని, కాంట్రాక్టర్ మధ్య ప్రారంభ దశలో ఏర్పడే వివాదాన్ని పరిష్కరించేందుకు తగిన యంత్రాగాన్ని ప్రస్తుత వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోతోందని, వివాదాలు పూర్తిగా ముదిరిన తర్వాత మాత్రమే అది రంగంలోకి దిగుతోందని సి.పి.ఎస్.ఇ.లు అభిప్రాయపడుతున్నాయి.  ఇలాంటి క్షేత్రస్థాయి సమస్యలను,  వాటి పరిష్కారంలో ఎదురయ్యే కష్టనష్టాలను అధ్యయనం చేసేందుకు బోర్డు స్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమర్ఫించిన నివేదికపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కూడా విపులంగా చర్చింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సి.ఇ.ఎ.) అధికారులు, జలవిద్యుత్.కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల బోర్డు స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

  కాంట్రాక్టుల అమలుకు సంబంధించి ప్రారంభదశలో ఏర్పడిన వివాదపూరిత ఒప్పందాలను, క్లెయిములను పరిష్కరించడంలో జాప్యం జరిగితే ఆర్థికంగా గణనీయమైన నష్టాలు సంభవిస్తాయని, కాలహరణం జరగడంతోపాటుగా, ప్రాజెక్టుల వ్యయం కూడా అంచనాలను మించి పెరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాలను ప్రారంభ దశలోనే సమంజసంగా, న్యాయబద్ధంగా పరిష్కరించుకున్న పక్షంలో, నిర్దేశిత గడువులోగా నిర్మాణ కాంట్రాక్టులు విజయవంతంగా ముగిసే అవకాశం ఉందని, బడ్జెట్ కేటాయింపును సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, కాలహరణాన్ని, నిధుల వ్యయాన్ని నివారించవచ్చని కూడా కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టుల పరిష్కారంకోసం స్వతంత్ర ఇంజినీర్ల ప్యానెల్.తో రూపొందించిన "వివాద నివారణా వ్యవస్థ"ను తీసుకువచ్చారు. కొత్త వ్యవస్థ కీలక అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. :

 

  1. ఈ వ్యవస్థకోసం తమతమ సబ్జెక్టుల్లో నైపుణ్యం కలిగిన నిజాయతీ కలిగిన ఇంజినీర్లతో ఒక ప్యానెల్.ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది. నిష్పాక్షికమైన, పారదర్శకమైన ఎంపిక  ప్రక్రియ ద్వారా ఈ ప్యానెల్ ఏర్పాటవుతుంది. ఈ ప్యానెల్లో  మార్పులేవైనా అవసరమైతే మంత్రిత్వ శాఖ మాత్రమే సదరు మార్పులు చేస్తుంది. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ప్యానెల్.ను నవీకరిస్తూ ఉంటుంది.
  1. ప్రతి ప్యాకేజీ పనుల కోసం, పై ప్యానెల్.నుంచి ఒక సభ్యుడిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సి.పి.ఎస్.ఇ.), కాంట్రాక్టరు ఉమ్మడిగా ఎంపిక చేసుకోడానికి వీలుంటుంది. ప్రతి పనికి, కాంట్రాక్టుకు సంబంధించిన స్వతంత్ర ఇంజినీర్ గా ఈ  ప్యానెల్ నిపుణుడిని నిర్వచిస్తారు.
  2. దర్యాప్తు సమయంలో స్వతంత్ర ఇంజినీర్.కు అవసరమైన సమాచారాన్ని ఉభయపక్షాలూ కాలబద్ధమైన రీతిలో అందిస్తారు. అలా జరగనిపక్షంలో అది జరిమానాలు తప్పవు. కాంట్రాక్ట్ ప్రాధాన్యతను బట్టి ఈ పెనాల్టీ ఏమిటో సంబంధిత సి.పి.ఎస్.ఇ.లే వివరిస్తాయి.
  3. సంబంధిత పక్షాలు ప్రస్తావించిన సమస్యలపై స్వతంత్ర ఇంజినీర్ పరిశీలన జరుపుతాడు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాడు. మరింత దర్యాప్తు అవసరమైతే క్షేత్రస్థాయి కొలతలను తీసుకుంటారు. ఉభయ పక్షాలతో విచారణను, మధ్యవర్తిత్వాన్ని కూడా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.
  4. సంబంధిత పార్టీలపై జరిగిన ప్రాథమిక విచారణ ప్రాతిపదికగా, వివాద పరిష్కారానికి గడువును కూడా స్వతంత్ర ఇంజనీర్ నిర్దేశించే అవకాశం ఉంది. వివాదాల స్వభావం, వివాదాల సంఖ్యను బట్టి ఈ గడువును నిర్ణయిస్తారు. ఈ గడువు 30 రోజుల గరిష్ట పరిమితికి లేదా, అసాధారణ పరిస్థితుల్లో పొడిగించిన వ్యవధికి లోబడి ఉంటుంది. అయితే,..గడువు పొడిగింపునకు దారితీసిన కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
  5. స్వతంత్ర ఇంజినీర్ల నియామక గడువు తొలుత ఐదేళ్లుగా కానీ లేదా కాంట్రాక్టు వ్యవధికి తగినట్టుగా కానీ (ఏది తక్కువైతే అది) ఉంటుంది. అయితే, సి.పి.ఎస్.ఇ., సంబంధిత కాంట్రాక్టరు మధ్య కుదిరే అంగీకారం మేరకు ఈ నియామక గడువును ఏడాదికి ఒకసారి చొప్పున పొడిగించేందుకు వీలుంటుంది. అయితే స్వతంత్ర ఇంజినీర్ అనుమతి, మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి మాత్రమే గడువు పొడిగింపుపై నిర్ణయం జరుగుతుంది.
  6. ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు సొంతంగా అవగాహన కల్పించుకునేందుకు స్వతంత్ర ఇంజినీర్  ప్రతి రెండు నెలలకు పని ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించవలసి ఉంటుంది. ఉభయపక్షాల మధ్య వివాదానికి దారితీసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయోమో తెలుసుకునేందుకు కూడా ఇంజినీర్ క్షేత్రస్థాయి సందర్శన జరపవలసి ఉంటుంది. వివాదాల పరిష్కారంలో భాగంగా స్వంతంత్ర ఇంజినీర్ అవసరమైతే అదనంగా కూడా పని ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది.
  7. సి.పి.ఎస్.ఇ. గానీ, సంబంధిత కాంట్రాక్టరు గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ స్వతంత్ర ఇంజినీర్.ను మార్చేందుకు వీలు లేదు. స్వతంత్ర ఇంజినీర్ తన విధులను నిర్వర్తించలేదనిగానీ, నిజాయితీగా వ్యవహరించలేదని గానీ ఫిర్యాదులు తలెత్తిన పక్షంలో, సదరు ఇంజినీర్.ను మంత్రిత్వ శాఖే ప్యానెల్.నుంచి తొలగిస్తుంది. ఆ తర్వాత ప్యానెల్.నుంచి మరో ఇంజినీర్.ను సి.పి.ఎస్.ఇ., కాంట్రాక్టరు ఉమ్మడిగా ఎంపిక చేసుకునే వీలుంటుంది.

  స్వతంత్ర ఇంజినీర్ల ద్వారా నిర్వహించే ఈ వివాదాల నివారణ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో అమలు జరిగే అన్ని విద్యుత్ ప్రాజెక్టులకు వర్తింపజేస్తారు.   కాంట్రాక్టర్ స్థానంలో సి.పి.ఎస్.ఇ. ఉన్నా లేక, ప్రైవేట్ సంస్థ ఉన్నా సరే అన్ని సందర్భాల్లోనూ స్వతంత్ర ఇంజినీర్ల యంత్రాగాన్ని అమలు చేస్తారు. వివాద పరిష్కార బోర్డులు (డి.ఆర్.బి.), వివాదాల విచారణా బోర్డులు (డి.ఎ.బి.) ద్వారా ప్రస్తుతం జరుగుతున్న వివాద పరిష్కార ప్రక్రియలన్నీ ఇకపై వివాద నివారణా వ్యవస్థ ద్వారా జరుగుతాయి. స్వతంత్ర ఇంజనీర్ల యంత్రాంగంతో పరస్పర ఆమోదం ప్రాతిపదికగా ఈ ప్రక్రియను చేపడతారు. ఇక భవిష్యత్తు కాంట్రాక్టులకు సంబంధించి డి.ఆర్.బి., డి.ఎ.బి.ల స్థానంలో స్వతంత్ర ఇంజనీర్లతో కూడిన వివాద నివారణ వ్యవస్థ అమలులో ఉంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి.

 

****



(Release ID: 1759276) Visitor Counter : 173