ప్రధాన మంత్రి కార్యాలయం
గ్లోబల్ సిటిజెన్ లైవ్" కార్యక్రమంలో ప్రధానమంత్రి వీడియో ప్రసంగం
మనం అంతా కలిసికట్టుగా ఉన్నప్పుడు బలంగా, మెరుగ్గా ఉన్నామని బోధించిన కోవిడ్ : ప్రధానమంత్రి
"ప్రతీ ఒక్క అంశంలోనూ మానవ సమాజం చూపిన సంయమనాన్ని తరతరాలు గుర్తుంచుకుంటాయి"
"పేదలు అన్నింటికీ ప్రభుత్వాలపై ఆధారపడేలా ఉంచి పేదరికంపై పోరాటం సాగించలేం. ప్రభుత్వాన్నిపేదలు విశ్వసనీయ భాగస్వాములుగా చూసే పరిస్థితిలో పేదరికంపై పోరాడలేం"
"పేదలను సాధికారం చేసేందుకు అధికారాన్ని ఉపయోగించినట్టయితే పేదరికంపై పోరాడే శక్తి పేదలకు వస్తుంది"
"ప్రకృతికి హానికరం కాని జీవన విధానాలు సాగించడం ఒక్కటే వాతావరణ మార్పుల పరిష్కారానికి తేలికపాటి, విజయవంతమైన మార్గం"
"ప్రపంచంలోని అతి పెద్ద పర్యావరణవేత్త మహాత్మాగాంధీ. మేం కర్బన్ వ్యర్థాలకు తావు లేని జీవనశైలి అనుసరిస్తున్నాం. మన భూమండలం సంక్షేమం మాత్రమే అన్నింటి కన్నా ప్రధానం అని ఆయన భావించే వారు."
"గాంధీజీ ట్రస్టీ సిద్ధాంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించే వారు. మనమంతా భూమండలాన్ని కాపాడే ట్రస్టీలుగా ఉండాలన్నదే దాని ప్రధానాంశం"
&
Posted On:
25 SEP 2021 10:46PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25, 26 తేదీల్లో జరిగే “గ్లోబల్ సిటిజెన్ లైవ్” సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడారు. ఇందులో భాగంగా ముంబై, న్యూయార్క్, పారిస్, రియో డి జనీరో, సిడ్నీ, లాస్ ఏంజెలిస్, లాగోస్, సియోల్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ లైవ్ సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రస్తుత మహమ్మారి విసిరిన సవాలు గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ మనందరం కలిసికట్టుగా ఉంటే బలంగా, మెరుగ్గా ఉంటామని అది నిరూపించిందని అన్నారు. “మహమ్మారిపై పోరాటంలో కోవిడ్-19 పోరాట యోధులు, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది ఉమ్మడి స్ఫూర్తిని మనం వీక్షించాం. మన శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లలో కూడా ఇదే స్ఫూర్తిని చూశాం. రికార్డు సమయంలోనే వారు కొత్త వ్యాక్సిన్లు సృష్టించారు. అన్నింటిలోనూ మానవాళి ప్రదర్శించిన సంయమనాన్ని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి” అని ప్రధానమంత్రి అన్నారు.
పేదరికం కూడా మన ముందున్న దీర్ఘకాలిక సవాలు అన్నారు. పేదలు ప్రభుత్వ సహాయంపై ఆధారపడేలా చేసినంత వరకు మనం దానిపై పోరాటం సాగించలేం, ప్రభుత్వాలను పేదలు విశ్వసనీయ భాగస్వాములుగా భావిస్తూ ఉన్నంత కాలం పేదరికంపై విజయం సాధ్యం కాదు అని శ్రీ మోదీ అన్నారు. “పేదరిక చట్రంలో చిక్కుకుపోయిన వారు ఆ చట్రాన్ని ఛేదించుకుని బయటకు వచ్చేందుకు అవసరమైన మౌలిక వసతులు అందించే వారే విశ్వసనీయ భాగస్వాములు” అని ప్రధానమంత్రి చెప్పారు.
పేదలను సాధికారం చేయడానికి అధికారాన్ని ఉపయోగించినట్టయితే పేదరికంపై పోరాడే శక్తి వారు పొందుతాయని ప్రధానమంత్రి వివరించారు. బ్యాంకులు అందుబాటులో లేని వారికి బ్యాంకింగ్ సదుపాయాల కల్పన, లక్షలాది మందికి సామాజిక భద్రత కల్పన, 50 కోట్ల మందికి పైగా భారతీయులకు ఉచిత, నాణ్యమైన వైద్య సదుపాయాల కల్పన వంటి చర్యలే పేదల సాధికారతకు చక్కని సాధనాలని ఆయన ఉదహరించారు.
నగరాలు, గ్రామాల్లో తల దాచుకునేందుకు నీడ లేని వారి కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మించడం గురించి ప్రస్తావిస్తూ ఇల్లంటే నీడ ఒక్కటే కాదు, “తల దాచుకునేందుకు ఒక ఇల్లుండడం వారికి ఆత్మగౌరవాన్ని అందిస్తుంది” అన్నారు. అలాగే ప్రతీ ఒక్క ఇంటికీ మంచి నీటి కనెక్షన్ ఇచ్చేందుకు ప్రారంభించిన కార్యక్రమం, వేల కోట్ల డాలర్ల వ్యయంతో కొత్త తరం మౌలిక వసతులు నిర్మించడం, 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడం, ఇంకా ఎన్నో చర్యలు పేదరికంపై పోరాడగల బలాన్ని వారికి అందిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
వాతావరణ మార్పుల గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రకృతికి ఎలాంటి హాని కలిగించని జీవన విధానాలు అనుసరించడమే వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి తేలికపాటి, విజయవంతమైన మార్గం అన్నారు. మహాత్మా గాంధీని ప్రపంచంలోనే “అతి పెద్ద పర్యావరణవేత్త”గా వర్ణిస్తూ ఎలాంటి కర్బన వ్యర్థాలకు తావు లేని జీవనశైలి మహాత్ముడు అనుసరించారని వివరించారు. ఆయన ఏ పని చేసినా భూగోళం సంక్షేమమే అన్నింటి కన్నా మిన్న అని భావించేవారన్నారు. “మనందరం భూగోళాన్ని సంరక్షించాల్సిన బాధ్యతతో కూడిన ట్రస్టీలు” అని ప్రబోధించే ట్రస్టీ సిద్ధాంతాన్ని ప్రపంచానికి మహాత్ముడు అందించారని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. పారిస్ కట్టుబాట్ల అమలు దిశగా సరైన బాటలో పురోగమిస్తున్న ఏకైక జి-20 దేశం భారత్ అని ప్రధానమంత్రి తెలియచేశారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల కూటమి వంటి వేదికల కింద ప్రపంచం యావత్తును ఒక ఛత్రం కిందకు తీసుకురావడం భారతదేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు.
***
(Release ID: 1758433)
Visitor Counter : 172
Read this release in:
Bengali
,
Assamese
,
Manipuri
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam