యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్.ఎస్.ఎస్. అవార్డుల ప్రదానం!


2019-20 సంవత్సరానికి పురస్కారాలను
అందించిన రాష్ట్రపతి కోవింద్..

నవభారత నిర్మాణంపై ప్రధాని కలను సాకారం చేయడంలో
యువతదే కీలక పాత్ర : కేంద్రమంత్రి అనురాగ్..

Posted On: 24 SEP 2021 4:13PM by PIB Hyderabad

  జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు (24 డిసెంబరు 2021) వర్చువల్ కార్యక్రమంలో ప్రదానం చేశారు. 2019-20వ సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయమంత్రి నిశీత్ ప్రామాణిక్ ఈ న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉషా శర్మ, కేంద్ర క్రీడల శాఖ  కార్యదర్శి రవి మిత్తల్, కేంద్ర మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

 

 

  2019-20వ సంవత్సరానికి ఎన్.ఎస్.ఎస్. పురస్కారాలను 3 విభాగాల్లో 42మందికి ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం/ +2 కౌన్సిల్స్, ఎన్.ఎస్.యూనిట్లు వారి ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వాలంటీర్లు అన్న 3 విభాగాల్లో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, మానవ జీవితం అనే మహా భవనం,.. తరచుగా విద్యార్థి జీవితం అన్న పునాదిపైనే నిర్మితమవుతుందని అన్నారు. అధ్యయనం అన్నది జీవితకాల ప్రక్రియ అయినప్పటికీ, మౌలికమైన వ్యక్తిత్వ వికాసం మాత్రం విద్యార్థి దశలోనే ప్రారంభమవుతుందన్నారు. అందువల్లనే విద్యార్థులు తాము పాఠశాలలో, కళాశాలలో చదువుతున్నపుడే సమాజానికి సేవచేసే అవకాశం వారికి ఎన్.ఎస్.ఎస్. మాత్రమే కల్పిస్తుందన్నది తన భావన అని రాష్ట్రపతి అన్నారు.

 

   జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్.),.. 1969లోనే జాతిపిత మహాత్మాగాంధీ శతజయంతి సందర్భంగా స్థాపించారని రాష్ట్రపతి ప్రస్తావిస్తూ,..మానవాళి సేవకోసమే గాంధీజీ తన యావత్ జీవితాన్నీ అంకితం చేశారన్నారు. మన యువత బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. గాంధీజీ మాటల్లో చెప్పాలంటే,.. ‘ఇతరుల సేవకోసం నిన్ను నీవు అంకితం చేసుకోవడమే, నిన్ను నీవు తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం’ అని కోవింద్ అన్నారు. మానవాళికి అందించిన సేవలకు గాంధీజీ జీవితమే మనందరికీ ఒక నిదర్శనమని, ఆయన ఆశయాలు, సేవాస్ఫూర్తి ఈ నాటికి అందరికీ అనుసరణనీయం, స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి అన్నారు.

  దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం తలెత్తిన తొలి రోజులనుంచి, దేశంలో భారీ స్థాయిలో మాస్కుల తయారీ వరకూ జరిగిన పరిణామాలను పరిశీలించినపుడు,....కేవలం ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు మాత్రమే 2కోట్ల 30లక్షలవరకూ మాస్కులు తయారు చేసి, దేశంలోని పలు ప్రాంతాలకు పంపిణీ చేసినట్టు రాష్ట్రపతి చెప్పారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి, కట్టడిపై అవగాహన, బాధితులకు సహాయ కార్యకలాపాల నిర్వహణలో ఎన్.ఎస్.ఎస్. విస్తృత పాత్ర పోషించిందన్నారు. కోవిడ్ సమాచారాన్ని ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, హెల్త్ లైన్ ద్వారా, జిల్లా పరిపాలనా యంత్రాగాల ద్వారా ప్రజలకు అందజేశారన్నారు.

   స్వాతంత్ర్య సముపార్జించి 75ఏళ్లయిన సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట ప్రస్తుతం మనం దేశ వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని కోవింద్ తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ స్వరాజ్య ఉద్యమం, స్వాతంత్ర్య సమర యోధుల సేవలపై వెబినార్లు, సెమినార్లు నిర్వహించడం ద్వారా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నిర్వహణలో ఎన్.ఎస్.ఎస్. పాలు పంచుకోవడం తనకు సంతోషం కలిగిస్తోందన్నారు. స్వరాజ్య పోరాటం, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలు, సేవలపై అవగాహన కల్పించడం కూడా దేశసేవగానే పరిగణించాలని రాష్ట్రపతి అన్నారు.

రాష్ట్రపతి హిందీ ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

   కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఎన్.ఎస్.ఎస్. పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు. కోవిడ్ వైరస్ కట్టడిలో ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, అధికారులు అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. వారి స్వార్థరహిత సేవను, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో, వ్యాక్సినేషన్, రక్తదాన శిబిరాల నిర్వహణలో, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో వారందించిన సేవలు ఎంతో గొప్పవని అన్నారు. దేశ భవితవ్యం యువతపైనే ఆధారపడి ఉందని, జాతి నిర్మాణంలో వారు కీలకపాత్ర పోషించాల్సి ఉందని ఠాకూర్ పునరుద్ఘాటించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు మరింత మంది యువజనులు ముందుకు రావాలని, భారతదేశం అంటే ఏమిటో, దేశ సమస్యలు ఏమిటో వారికి అప్పుడే అవగతమవుతుందని కేంద్రమంత్రి అన్నారు. సమాజంలోని పూర్తి స్థాయి ప్రగతివాద వర్గానికి యువత ప్రాతినిద్యం వహిస్తుందని, నవ భారతంపై ప్రధానమంత్రి కలలను సాకారం చేయడంలో వారు ప్రముఖ పాత్ర పోషించవలసి ఉంటుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్, ఏక్ భారత్ శ్రేష్ట భారత్ అన్న లక్ష్యాల సాధన దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నామని ఠాకూర్ అన్నారు. నూతన, అధునాతన భారతదేశం నిర్మాణం లక్ష్యంగా మనం పురోగమిస్తున్నట్టు చెప్పారు.

 

   ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా, నైపుణ్య భారత్, స్టార్టప్ అండ్ స్టాండప్ ఇండియా తదితర కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం వహించడం గర్వకారణమని అనురాగ్ ఠాకూర్ అన్నారు. తద్వారా దేశానికి అంతర్జాతీయ గుర్తింపును సాధించిపెట్టడంలో యువజనులుఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో తర్ఫీదు ఇవ్వడం ద్వారా ఈ ప్రపంచానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించేందుకు మనం యుద్థ ప్రాతిపదికన పనిచేస్తున్నామన్నారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహించే 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాల్లో పాల్గొనడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులకు తగిన నివాళులు అర్పించాలంటూ ఆయన యువతకు పిలుపునిచ్చారు.

  కేంద్ర యువజన  వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి నిశీత్ ప్రామాణిక్ ఒక సందేశం ఇస్తూ, ఎన్.ఎస్.ఎస్. అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. జాతి నిర్మాణంలో వారు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత మాత్రమే నూతన భారతదేశాన్ని సాధించగలరన్న విశ్వాసాన్ని కేంద్రమంత్రి ప్రామాణిక్ వ్యక్తం చేశారు.

ఎన్.ఎస్.ఎస్. అవార్డు గ్రహీతల వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

   జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) అవార్డులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రిత్వ శాఖ 1993-94లో ఏర్పాటు చేసింది. జాతీయ సేవా పథకం రజతోత్సవాల సందర్బంగా ఈ అవార్డులను నెలకొల్పారు. విశ్వవిద్యాలయాలు/ కళాశాలలు, ప్లస్ టూ కౌన్సిల్స్ సీనియర్ సెకండరీ, ఎన్.ఎస్.ఎస్. యూనిట్లు/ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు స్వచ్ఛందంగా అందించిన ప్రతిభావంతమైన సమాజ సేవకు తగిన గుర్తింపును ఇచ్చే లక్ష్యంతో ఎన్.ఎస్.ఎస్. అవార్డులను ఏర్పాటు చేశారు. దేశంలో ప్రతి ఏడాదీ ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతూ వస్తోంది.

  ఎన్.ఎస్.ఎస్. అనేది కేంద్రీయ రంగ ప్రాయోజిత పథకం. స్వచ్ఛంద ప్రజాసేవ ద్వారా విద్యార్థుల, యువజనల వ్యక్తిత్వాన్ని అభివృద్ధిచేసే లక్ష్యంతో ఈ పథకాన్ని 1969లో ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఆశయాల, సిద్ధాంతాల స్ఫూర్తితో ఎన్.ఎస్.ఎస్. రూపుదాల్చింది. “నాకన్నా ముందు మీరు మాత్రమే” (‘स्वयंसेपहलेआप’).అన్న సిద్ధాంతం ఆధారంగా ఎన్.ఎస్.ఎస్. రూపుదిద్దుకుంది. 

  క్లుప్తంగా చెప్పాలంటే, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు సమాజానికి  అనుగుణమైన సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తారు. ప్రజా సమూహం అవసరాలకు అనుగుణంగా ఎన్.ఎస్.ఎస్. కార్యకలాపాలు ఎప్పటికప్పుడు పరిణామం చెందుతూ ఉంటాయి. క్రమ తప్పకుండా నిర్వహించే కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎన్.ఎస్.ఎస్. పలు రకాలుగా తన సేవలందిస్తుంది. (i) అక్షరాస్యత, విద్యాబోధన, (ii) ఆరోగ్య రక్షణ, కుటుంబ సంక్షేమం, పౌష్టికాహారం, (iii) పర్యావరణ రక్షణ, (iv) సామాజిక సేవా కార్యక్రమాలు, (v) మహిళా సాధికారతా కార్యక్రమాలు, (vi) ఆర్థికాభివృద్ధితో అనుసంధానమైన కార్యక్రమాలు, (vii) వైపరీత్యాల సమయంలో బాధితుల రక్షణ, సహాయ కార్యక్రమాలు వంటివి ఎన్.ఎస్.ఎస్. క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది.

 

*****


(Release ID: 1757860) Visitor Counter : 210