రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

దేశ భ‌ద్ర‌త‌ను బ‌లోపేతం చేయ‌డం కోసం మ‌రొక 19 చోట్ల అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ సౌక‌ర్యాల అభివృద్ధి - నితిన్ గ‌డ్క‌రీ

Posted On: 09 SEP 2021 1:35PM by PIB Hyderabad

 దేశ భ‌ద్ర‌త‌ను బ‌లోపేతం చేసేందుకు 19 చోట్ల అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ సౌక‌ర్యాల‌ను అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. రాజస్థాన్‌లోని జాతీయ హైవే 925ఎపై అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ సౌక‌ర్యాన్ని ర‌క్ష‌ణ మంత్రి రాజా్‌నాథ్ సింగ్‌తో క‌లిసి ప్రారంభిస్తూ, వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన స‌రిహ‌ద్దుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ద్వారా దేశ భ‌ద్ర‌త‌ను కాపాడ‌డాన్ని హైవే ర‌న్ వేలు  బ‌లోపేతం చేస్తాయ‌ని అన్నారు. 

దేశంలోని 19 ప్రాంతాల‌లో -రాజ‌స్థాన్‌లోని ఫ‌లోడీ - జైసాల్మేర్ రోడ్డు, బ‌ర్మేర్ - జైసాల్మేర్ రోడ్డు, ప‌శ్చిమ బెంగాల్‌లోని ఖ‌ర‌గ్‌పూర్ - బ‌లాసోర్ రోడ్డు,  ప‌న్‌గ‌ఢ్ /  కెకెడి స‌మీపంలోని ఖ‌ర‌గ్‌పూర్‌- కియోంజిహార్ రోడ్డు, త‌మిళ‌నాడులోని  చెన్నై, పుదుచ్చేరీ రోడ్డు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు - ఒంగోలు రోడ్డు, ఒంగోలు- చిల‌క‌లూరిపేట రోడ్డు, హ‌ర్య‌నాలో మండీ ద‌బ్వాలీ - ఒడిషా రోడ్డు, పంజాబ్‌లో సంగ్రూర్ స‌మీపంలో, గుజ‌రాత్‌లోని భుజ్‌- నాలియా రోడ్డు, సూర‌త్ - బరోడా రోడ్డు, జ‌మ్ము కాశ్మీర్‌లో బ‌నిహాల్‌- శ్రీ‌న‌గ‌ర్ రోడ్డు, అస్సాంలో  లేహ్ /  న్యోమా ప్రాంతంలో, శివ‌సాగ‌ర్ స‌మీపంలోని జోర్హాత్‌- బారాఘాట్ రోడ్డు, బ‌గ్దోగ్రా- హ‌షిమారా రోడ్డు, హ‌షిమారా - తేజ్‌పూర్ మార్గం, హ‌షిమారా- గువాహ‌తి రోడ్డు  అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ సౌక‌ర్యాల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు. 
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలో ప్ర‌పంచ స్థాయి జాతీయ హైవేల నిర్మాణం రికార్డు వేగంతో కొన‌సాగుతోంద‌ని మంత్రి చెప్పారు. మ‌న జాతీయ హైవేలు సైన్యానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని, త‌ద్వారా దేశం మరింత సుర‌క్షితంగా ఉండ‌ట‌మే కాక‌, ఎప్పుడూ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి  సిద్ధంగా ఉంటుంద‌న్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షిఖావ‌త్‌, కేంద్ర ర‌క్ష‌ణ ద‌ళాల అధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, ఎయిర్ చీప్ మార్ష‌ల్ ఆర్ ఎస్ భ‌దూరియా కూడా పాల్గొన్నారు. 

 

***
 



(Release ID: 1753594) Visitor Counter : 208