మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశంలోని అంగ‌న్‌వాడీ కార్యకర్తలు.. సహాయకులను ఉద్దేశించి కేంద్ర మహిళా- శిశు సంక్షేమ‌ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ప్రసంగం

మ‌హిళ‌లు.. పిల్ల‌ల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా శ్ర‌మిస్తున్న

అంగ‌న్‌వాడీ సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ... ‘పోష‌ణ్ 2.0’
కార్య‌క్ర‌మంపై స‌ల‌హాలు కోరిన కేంద్ర మ‌హిళా-శిశు సంక్షేమశాఖ మంత్రి;

అంగ‌న్‌వాడీల ప‌రిధిలో... ముఖ్యంగా ప్ర‌గ‌తికాముక జిల్లాల్లో ‘పోష‌ణ వాటిక‌లు’
ఏర్పాటు చేయాల‌ని కార్య‌క‌ర్త‌లంద‌రికీ కేంద్ర మంత్రి శ్రీమ‌తి స్మృతి ఇరానీ సూచ‌న‌

Posted On: 03 SEP 2021 6:00PM by PIB Hyderabad

   జాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశ‌మంత‌టా సెప్టెంబ‌రు నెల మొత్తం ‘పోష‌ణ మాసం‌’ వేడుకలు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర మహిళా-శిశు సంక్షేమశాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఇవాళ అంగన్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి ప్రసంగించారు. మహిళల, పిల్లల స‌ర్వ‌తోముఖ శ్రేయస్సుకు, అభివృద్ధికి భ‌రోసా ఇస్తూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారంటూ ముందుగా అంగన్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, స‌హాయ‌కులంద‌రికీ ఇరానీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే ‘పోష‌ణ్ 2.0’ కింద చేప‌ట్టే వివిధ కార్య‌క్ర‌మాల‌పై అభిప్రాయాలు, స‌ల‌హాలు ఇవ్వాల్సిందిగా ఆమె వారిని కోరారు. ఈ నెలంతా సాగే ‘పోషణ మాసోత్సవాల్లో’ భాగంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో... ముఖ్యంగా దేశంలోని ప్రగతి కాముక జిల్లాలన్నిటిలోనూ ‘పోషణ వాటికలు‘ (పౌష్టిక ఉద్యానాలు) ఏర్పాటు చేయాలని కేంద్ర మహిళా-శిశు సంక్షేమశాఖ మంత్రి కార్యకర్తలందరినీ కోరారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. పోషణ వాటికలకు తాజా ఉత్తేజం దిశగా అధికారులతో సమష్టిగా పనిచేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆమె సూచించారు.

 

   సుసంపన్న, ఆరోగ్యవంతమైన జాతి నిర్మాణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని, ఈ దిశగా మహిళలు, పిల్లల సంక్షేమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టడం ప్రధానమని ఆయన నిర్దేశించినట్లు కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు. ఇందుకోసం అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకూ అత్యాధునిక మౌలిక సౌకర్యాలు కల్పించడంసహా అన్నివిధాలా అండదండలు అందించాల్సిందిగా ప్రధాని ఆదేశించారని గుర్తుచేశారు. ఆ మేరకు ‘పోషణ్ 2.0’ కింద మెరుగైన మౌలిక వసతులతో అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్ఠంగా  తీర్చిదిద్దుతామని శ్రీమతి ఇరానీ చెప్పారు. అంతేకాకుండా మహిళలు, పిల్లల పౌష్టికాహార అవసరాలు తీర్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని తెలిపారు.

   దేశంలోని అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు శ్రీమతి ఇరానీ వెల్లడించారు. ఈ బీమా సదుపాయం కల్పనకు వీలుగా సంబంధిత వివరాలు అందజేయాలని అన్ని రాష్ట్రాలనూ కోరినట్లు ఆమె తెలిపారు. అనంతరం తన ప్రసంగం ముగిస్తూ- అంగన్‌వాడీ కార్యకర్తలు వివిధ కార్యక్రమాల ద్వారా చేసిన కృషికి కృతజ్ఞతలు తెలపడంలో పోషణ మాసోత్సవాల కింద చేపట్టే కార్యకలాపాలు ఒక అవకాశం కల్పిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల అవిశ్రాంత కృషిని అభినందించేందుకు ఒక నెల సమయం సరిపోదని, ఏడాది మొత్తం అవసరమని ఆమె అన్నారు.

***

 

***



(Release ID: 1751871) Visitor Counter : 181