వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వాతావరణ సవాళ్ల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: నరేంద్ర తోమర్


16వ సి.ఐ.ఐ. సుస్థిర శిఖరాగ్ర సమ్మేళనంలో ప్రసంగం

చిన్న, మధ్య తరహా రైతులకోసం పొలాలవద్దనే మౌలిక సదుపాయాల ఏర్పాటు

Posted On: 02 SEP 2021 4:55PM by PIB Hyderabad

  వాతావరణ మార్పులతో సహా, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్ల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ.) ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన 16వ సుస్థిర శిఖరాగ్ర సమ్మేళనం (2021)లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

 

 తీవ్రమైన మార్పులు వాతావరణ సమతుల్యతను దెబ్బతీసిన కారణంగా, కొన్ని ప్రాంతాలు దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండగా, మరి కొన్ని ప్రాంతాలు వరదలను కట్టడి చేయలేక సమతమతమవుతూ ఉన్నాయని కేంద్రమంత్రి అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారంపై ప్రభుత్వం ఎంతో శ్రద్ధ చూపుతోందని, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగలిగిన విత్తనాలను, సరికొత్త వంగడాలను రూపొందించేందుకు మన శాస్త్రవేత్తలు కూడా ఎంతో చురుకుగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

    

https://ci4.googleusercontent.com/proxy/dxX17WZm2Yv3blsgOSohQBaPadkEEajsSlusn1ZeaIHU5NEFAQVAjHOzvb95H_558tOkhiErj8G6VnhzYaAd8aKSFH1fWkHCsFKE73Wer6PEFttJujuNMHKblw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SDE5.jpg

  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని కేంద్రమంత్రి అన్నారు. కోవిడ్-19 సంక్షోభం సందర్భంగా ఇతర దేశాలకు సహాయం అందించేందుకు భారత్ తన శక్తివంచన లేకుండా కృషి చేసిందని అన్నారు.  కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఊపందుకున్నదని, ఇప్పటి వరకూ 66కోట్ల డోసులమేర వ్యాక్సినేషన్ పూర్తయిందని అన్నారు.

  కోవిడ్ మహమ్మారి రూపంలో అవరోధాలు ఎదురైనా, భారతీయ రైతులు ఎంతో శ్రమించి భారీ స్థాయిలో దిగుబడులు సాధించారని కేంద్రమంత్రి అన్నారు. భారతదేశం వ్యవసాయక దేశం అయినందున స్థూల స్వదేశీ ఉత్పాదనలో వ్యవసాయ రంగం పాత్ర కూడా ఎప్పుడూ గణనీయంగానే ఉంటుందని అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశంలోని 11కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు దాదాపు రూ. 1,57,000 కోట్ల మేర సొమ్మును జమ చేసినట్టు నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.

  మరో వైపు ఉత్పాదకతో కూడిన ప్రోత్సాహక పథకాన్ని (పి.ఎల్.ఐ.ని) ప్రధానమంత్రి ప్రారంభించారని, ఫుడ్ ప్రాసెసింగ్.తో సహా పలురకాల ఇతర పరిశ్రమలకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్రమంత్రి చెప్పారు. చిన్నతరహా, మధ్యతరహా రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు పొలాల దగ్గరనే అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి, లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నిధి ద్వారానే పథకాలను మంజూరు చేస్తున్నట్టు, దాదాపు 4వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆమోదించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకంకింద దేశవ్యాప్తంగా పది వేల వరకూ రైతు ఉత్పత్తిదార్ల సంఘాలు (ఎఫ్.పి.ఒ.లు) ఏర్పాటవుతున్నాయని, ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. ఈ పథకం ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, వారు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల జాబితాలో మొదటి 10 అగ్రశ్రేణి దేశాల సరసన మనదేశం చేరడం గర్వకారణమని, ఈ ఎగుమతులను మరింత పెంచాలన్నది తమ అభిమతమని అన్నారు. రైతుల ప్రయోజనాలకోసం వ్యవసాయ రంగాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు దేశంలో 70కి పైగా కిసాన్ రైళ్లు రైతులకు ప్రయోజనం చేకూర్చుతున్నాయని, ఉడాన్ యోజన పథకం కూడా రైతులకు ఉపయోగపడుతోందని అన్నారు.

  రైతుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం,...వ్యవసాయ సంస్కరణలపై చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం వ్యవసాయ రంగంలో పెనుమార్పులను తీసుకు రాగలదని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల ఆగమనంతో దేశం యావత్తూ రైతులకు స్వేచ్ఛాయుత మార్కెట్.గా మారిపోతుందన్నారు. అధునాతన వ్యవసాయ వాణిజ్య వేదికలపై ప్రైవేటు రంగం కూడా పెట్టుబడులు పెట్టవచ్చని, గోదాములు, శీతలీకరణ గిడ్డంగులు వంటి వాటిని ప్రైవేటు రంగం ఏర్పాటు చేయవచ్చని అన్నారు. దీనితో, రైతులకు తక్కువ చార్జీలతోనే మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమని తోమర్ అన్నారు. ఈ సంస్కరణలన్నీ తగినన్ని పెట్టుబడి అవకాశాలు కల్పించాయని, వివిధ స్థాయిల్లో అంతరాలను పూడ్చివేసేందుకు వ్యవసాయ సంస్కరణల ద్వారా ప్రయత్నం జరిగిందని అన్నారు. డెన్మార్క్ దేశంతో భారతదేశానికి సామరస్య సంబంధాలు ఉన్నాయని, ఉభయదేశాలు తమ విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేలా చూసేందుకు ప్రధానమంత్రి మోదీజీ నిరాటంకంగా కృషి చేస్తూవస్తున్నారని అన్నారు.

   ఈ సమ్మేళనంలో డెన్మార్క్ పర్యావరణ శాఖ మంత్రి లియా వెర్మెలిన్, సి.ఐ.సి. డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సుస్థిర అభివృద్ధి ప్రతిభా వనరుల కేంద్రం చైర్మన్ సంజీవ్ పూరి ప్రసంగించారు. పలువురు ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా పాలుపంచుకున్నారు.

 

****



(Release ID: 1751567) Visitor Counter : 161