యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్రీడలు... దృఢత్వంపై తొలి జాతీయస్థాయి క్విజ్‌ను ప్రారంభించిన కేంద్ర క్రీడా-విద్యాశాఖ మంత్రులు శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌.. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌


దేశంలోని విద్యార్థులే విజేతలుగా క్రీడా సంస్కృతి నిర్మాణ కృషిని
‘ఫిట్‌ ఇండియా’ క్విజ్‌ వేగవంతం చేస్తుంది: శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌

విద్యార్థులు దృఢత్వాన్ని జీవితకాల వైఖరి చేసుకునేలా క్రీడా సమన్వయ అభ్యాసంపై ‘ఎన్‌ఇపి-2020’ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌

Posted On: 01 SEP 2021 7:18PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

  • జాతీయ వేదికపై పోటీపడే అవకాశాన్ని ఈ జాతీయ క్విజ్‌ అవకాశమిస్తుంది; దీంతోపాటు తమ పాఠశాలల కోసం రూ.3కోట్ల నగదు బహుమతి గెలుచుకునే అవకాశమిస్తుంది
  • భారత స్వాతంత్ర్య 75 వార్షికోత్సవాల నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో ఈ ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’ ఒక భాగం
  • క్విజ్‌ ప్రారంభ కార్యక్రమంలో వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలు నీరజ్‌ చోప్రా, పి.వి.సింధు

   క్రీడలు, శారీరక దృఢత్వంపై జాతీయస్థాయిలో తొలి ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ఇవాళ కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడాశాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌, విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ సంయుక్తంగా ప్రారంభించారు. యువజన వ్యవహారాలు-క్రీడాశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలు నీరజ్‌ చోప్రా, పి.వి.సింధు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అప్పటికప్పుడు నిర్వహించిన తాత్కాలికి క్విజ్‌లో పాఠశాల విద్యార్థులు కొందరు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

   పాఠశాల విద్యార్థులలో క్రీడలు, శరీర దృఢత్వంపై అవగాహన కల్పించడమే ఈ జాతీయస్థాయి క్విజ్‌ ధ్యేయం. అంతేకాకుండా జాతీయ వేదికపై ఈ పోటీలో పాల్గొనడం ద్వారా తమ పాఠశాల కోసం రూ.3 కోట్లకుపైగా నగదు బహుమతి గెలిగే అవకాశం వారికి లభిస్తుంది. భారత స్వాతంత్ర్య 75 వార్షికోత్సవాల నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో ఈ ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’ ఒక భాగం. అన్ని రాష్ట్రాల విద్యార్థులనూ ఒకే వేదికపైకి తేవడం మాత్రమేగాక శారీరక దృఢత్వం-మేధో నైపుణ్యంతో కూడిన పోటీలో వారిని భాగస్వాములను చేస్తుంది.

 

   ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’ గురించి శ్రీ ఠాకూర్‌ మాట్లాడుతూ- “శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో.. మేధో పటుత్వం కూడా అంతే ముఖ్యం. ఆ దిశగా బాల్యదశలోనే మానసిక అప్రమత్తతను అలవరచుకోవడానికి ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’ దోహదం చేస్తుంది. అదే సమయంలో క్రీడా పరిజ్ఞానం పెంచడంలోనూ ఈ క్విజ్‌ అత్యంత సముచిత మార్గం. ఒలింపిక్స్‌ విజయాలతోపాటు భారతదేశానికి ఎంతో క్రీడా చరిత్ర ఉంది. ఆ మేరకు దేశంలోని పాఠశాల  విద్యార్థులు విజేతలుగా క్రీడా సంస్కృతి నిర్మాణ లక్ష్య సాధనను ఈ క్విజ్‌ మరింత వేగవంతం చేస్తుంది. పోటీతత్వ భావన జట్టు పాత్రతోపాటు జట్టుగా ఒక స్ఫూర్తిని కూడా రగిలిస్తుంది. ఒక సమగ్ర విద్యా విధానంతోపాటు మన జీవితాల్లో క్రీడల ప్రాముఖ్యం గురించి కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. పిల్లలతో ఆయన సంభాషించడం ఒత్తిడిరహిత వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా విద్యార్థులు నేర్చుకోవడానికి, ఎదగడానికి ఎంతగానో తోడ్పడింది. ఈ దిశగా రూపొందినదే ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’ కార్యక్రమం” అని చెప్పారు.

 

   ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రసంగిస్తూ- విద్య-శారీరక దృఢత్వాల మధ్య బలమైన అవినాభావ సంబంధం ఉన్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘సుదృఢ భారతం (ఫిట్‌ ఇండియా) ఉద్యమం’ లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులు దృఢత్వాన్ని జీవితకాలపు అలవాటుగా మార్చుకునేలా క్రీడా సమన్వయంతో కూడిన అభ్యాసంపై ‘జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి)-2020’ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో కోవిడ్‌-19 మహమ్మారి దైనందిన కార్యకలాపాలకు ఇంకా ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నదని శ్రీ ప్రధాన్‌ అన్నారు. ఈ పరిస్థితుల నడుమ ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమ ఔచిత్యం నేడు మరింత ఇనుమడించిందని తెలిపారు. శరీర దృఢత్వం, క్రీడలపై విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’ ఒక జాతీయ వేదికగా నిలుస్తుందని ఆయన చెప్పారు. అలాగే భారత సుసంపన్న క్రీడాచరిత్ర, దేశీయ క్రీడలు, మన క్రీడా దిగ్గజాలు తదితరాలపై అవగాహన పెంచుతుందని చెప్పారు. అందరికీ దృఢమైన జీవితం కోసం భారత సంప్రదాయ జీవనశైలికి తగిన కార్యకలాపాలు ఎంత కీలకమో కూడా అవగతం అవుతందన్నారు.

   యువజన వ్యవహారాలు-క్రీడాశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌ మాట్లాడుతూ- ‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’లో దేశంలోని అన్ని వయోవర్గాల ప్రజలూ పాలుపంచుకున్నట్లు గుర్తుచేశారు. అదే తరహాలో పాఠశాలలన్నీ ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’లో పాల్గొని నవభారతాన్ని దృఢభారతంగా రూపొందించాలని పిలుపునిచ్చారు. నేడు మనమంతా క్రీడల కోసం శాయశక్తులా కృషి చేయడం తనకెంతో సంతోషం కలిగిస్తున్నదని నీరజ్‌ చోప్రా అన్నారు. ఈ క్విజ్‌ కచ్చితంగా విద్యార్థులందరికీ ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు ఇదొక మంచి వేదికని, ప్రతి విద్యార్థీ ‘ఫిట్‌ ఇండియా క్విజ్‌’లో పాల్గొనాలని పి.వి.సింధు సూచించారు.

 

   ఈ క్విజ్‌లో పాల్గొనడానికి ‘ఫిట్‌ ఇండియా’ వెబ్‌సైట్‌లోని లింకుద్వారా పాఠశాలలు 2021 సెప్టెంబరు 1 నుంచి 30వ తేదీలోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రాథమిక దశ క్విజ్‌లో తమ పాఠశాల తరఫున పాల్గొనే విద్యార్థుల పేర్లను అక్టోబరు చివరన ప్రతిపాదించాలి. ఈ ప్రాథమిక దశ క్విజ్‌లో నెగ్గిన విద్యార్థులు డిసెంబరులో నిర్వహించే రాష్ట్రస్థాయి క్విజ్‌లో పాల్గొనే అర్హత పొందుతారు. ఇందులో విజేతలుగా నిలిచేవారు 2020 జనవరి-ఫిబ్రవరి నెలల్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. క్విజ్‌ తుదిదశ పోటీ ‘స్టార్‌ స్పోర్ట్స్‌’ చానెల్‌లో ప్రసారమవుతుంది.

 

***


(Release ID: 1751254) Visitor Counter : 247