ప్రధాన మంత్రి కార్యాలయం

పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి


స్మారకం వద్ద మ్యూజియం గ్యాలరీలనూ ప్రారంభించిన ప్రధానమంత్రి;

జలియన్‌వాలా బాగ్‌ గోడల్లో దిగబడిన బుల్లెట్ల ఆనవాళ్లలో
అమాయక బాలల స్వప్నాలు నేటికీ కనిపిస్తాయి: ప్రధానమంత్రి;

మన స్వాతంత్ర్య సమరానికి 1919 ఏప్రిల్‌ 13నాటి 10 నిమిషాలే
శాశ్వత కథనమయ్యాయి... ఆ స్వాతంత్ర్య ఫలం వల్లనే మనం నేడు
అమృత మహోత్సవం నిర్వహించుకోగలుగుతున్నాం: ప్రధానమంత్రి;

భయానక గతానుభవాల విస్మరణ ఏ దేశానికీ సముచితం కాదు..
అందుకే ఏటా ఆగస్టు 14ను ‘భయానక విభజన సంస్మరణ దినం’గా నిర్వహించుకోవాలని భారతదేశం నిర్ణయించుకుంది: ప్రధానమంత్రి;

స్వాతంత్ర్యం కోసం మన గిరిజన సమాజం తనవంతు పాత్ర
పోషణసహా గొప్ప త్యాగాలు చేసింది.. కానీ, చరిత్ర పుస్తకాల్లో
వారి పాత్రకు తగినంత పరిగణన లభించలేదు: ప్రధానమంత్రి;

కరోనా సంక్షోభంలో లేదా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న భారతీయులకు
భారతదేశం సంపూర్ణ మద్దతునిచ్చింది: ప్రధానమంత్రి;

అమృత మహోత్సవాల్లో భాగంగా దేశంలోని ప్రతి గ్రామంలో.. ప్రతి
మూలనా స్వాతంత్ర్య యోధులను స్మరించుకుంటాం: ప్రధానమంత్రి;

స్వాతంత్ర్య సమరంలోని కీలక దశలు.. జాతీయ వీరులతో ముడిపడిన ప్రదేశాల పరిరక్షణసహా వాటికి కొత్త సొబగులు అద

Posted On: 28 AUG 2021 8:21PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్మారకం వద్ద ఏర్పాటుచేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంగణం ఉన్నతీకరణలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యకలాపాలను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా వీరభూమి పంజాబ్‌తోపాటు పవిత్రమైన జలియన్‌వాలా బాగ్‌ ప్రాంగణానికి శిరసాభివందనం చేశారు. స్వేచ్ఛా జ్వాలలను ఆర్పివేయడం కోసం పరాయి పాలకుల అనూహ్య అమానుష హింసాకాండకు గురైన భరతమాత బిడ్డలకు ఆయన సగౌరవ వందనం సమర్పించారు.

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- జలియన్‌వాలా బాగ్‌ గోడల్లో దిగబడిన బుల్లెట్ల ఆనవాళ్లలో అమాయక బాలబాలికలు, సోదరీసోదరుల స్వప్నాలు నేటికీ దర్శనమిస్తాయన్నారు. అమరవీరుల బావిలో లెక్కలేనంత మంది తల్లులు, సోదరీమణులు బలైపోవడాన్ని వారి ప్రేమను మనమంతా ఇవాళ స్మరించుకుంటున్నామని ఆయన చెప్పారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణార్పణకైనా వెనుదీయని సర్దార్‌ ఉధంసింగ్‌, సర్దార్‌ భగత్‌సింగ్‌ వంటి అనేకమంది యోధులు, విప్లవకారులకు ప్రేరణనిచ్చిన ప్రదేశంగా జలియన్‌వాలా బాగ్‌ను ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ మేరకు 1919 ఏప్రిల్‌ 13నాటి ఆ 10 నిమిషాలే మన స్వాతంత్ర్య సమర శాశ్వత కథనంగా మారాయని, ఆ స్వాతంత్ర్య ఫలమే మనం నేడు అమృత మహోత్సవం నిర్వహించుకోవడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సందర్భంలో స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవంలో భాగంగా జలియన్‌వాలా బాగ్‌ స్మారకాన్ని ఆధునిక రూపంలో జాతికి అంకితం చేయడం ముదావహమన్నారు. ఇది మనందరికీ గొప్ప స్ఫూర్తినిచ్చే అవకాశమని ఆయన చెప్పారు.

   జలియన్‌వాలా బాగ్ మారణకాండకు ముందు ఈ ప్రదేశంలో పవిత్ర వైశాఖీ ఉత్సవాల వంటివి నిర్వహించేవారని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘సర్బత్ ద భలా’ స్ఫూర్తితో అదే రోజున శ్రీ గురు గోవింద్ సింగ్  ఖల్సా పంథ్‌ కూడా రూపుదిద్దుకున్నదని చెప్పారు. మన స్వాతంత్ర్య 75వ సంవత్సరంలో ఈ పవిత్ర స్థల చరిత్రను పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్ నవతరానికి గుర్తుచేస్తుందని, అంతేకాకుండా దీని పూర్వచరిత్రను లోతుగా తెలుసుకోగల స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

   ప్రతి దేశం తన చరిత్రను పరిరక్షించుకునే బాధ్యత కలిగి ఉంటుందని, ఏ దేశమైనా  ముందడుగు వేయడానికి మార్గనిర్దేశం చేసేది ఆ చరిత్రేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే ఏ దేశమైనా భయానక గతానుభవాలను విస్మరించడం సముచితం కాదన్నారు. అందుకే అందుకే ఏటా ఆగస్టు 14ను ‘భయానక విభజన సంస్మరణ దినం’గా నిర్వహించుకోవాలని భారతదేశం నిర్ణయించుకున్నదని ఆయన ప్రకటించారు. దేశ విభజన సమయంలో జలియన్‌వాలా బాగ్‌ వంటి దారుణాలను భారత్‌ ప్రత్యక్షంగా చవిచూసిందని చెప్పారు. ముఖ్యంగా విభజనవల్ల తీవ్ర కష్టనష్టాలకు గురైనవారిలో అధికశాతం పంజాబ్‌ ప్రజలేనని ఆయన అన్నారు. నాటి విభజన సమయంలో భారతదేశంలోని ప్రతిమూలనా... ప్రత్యేకించి పంజాబ్‌ కుటుంబాల కష్టనష్టాల వేదనను మనమిప్పటికీ అనుభవిస్తున్నామని ఆయన వివరించారు.

   ప్రపంచంలోని ఏ దేశంలోనైనా భారతీయులు కష్టాల్లో ఉన్నపుడు వారికి మద్దతుగా సాయం అందించేందుకు భారత్‌ శాయశక్తులా కృషిచేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. అది కరోనా సంక్షోభం కావచ్చు... లేదా ఆఫ్ఘనిస్థాన్‌లో విపరీత పరిస్థితులు కావచ్చు... అలాంటి ప్రతి సందర్భంలోనూ భారత్‌ ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నదని పేర్కొన్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుబడిన వందలాది మిత్రులను ‘ఆపరేషన్‌ దేవీశక్తి’ కింద భారతదేశానికి చేర్చడాన్ని ఆయన గుర్తుచేశారు. ఇందులో భాగంగానే ‘గురుకృప’తో పవిత్ర ‘గురుగ్రంథ్‌ సాహిబ్‌’ ‘స్వరూపాన్ని’ బాధితులతోపాటు ప్రభుత్వం స్వదేశానికి తీసుకురాగలిగిందని ప్రధానమంత్రి తెలిపారు. అటువంటి కష్ట సమయాల్లో వేదనను అనుభవిస్తున్న ప్రజలకు చేయూతనిచ్చే విధానాలకు గురువుల ప్రబోధాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన అన్నారు. నేడు ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ నినాద ప్రాముఖ్యాన్ని  ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు ప్రస్ఫుటం చేస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. అదేవిధంగా ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసాల ప్రాధాన్యాన్ని కూడా విశదం చేస్తున్నాయని పేర్కొన్నారు. మన దేశ పునాదులను పటిష్ఠం చేసుకునే విధంగా ఈ పరిణామాలు మనను ముందుకు నెడతాయని ఆయన చెప్పారు.

   అమృత మహోత్సవాల్లో భాగంగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ స్వాతంత్ర్య యోధులను స్మరించుకోవడంసహా వారిని సత్కరిస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. స్వాతంత్ర్య సమరంలోని కీలక దశలు.. జాతీయ వీరులతో ముడిపడిన ప్రదేశాల పరిరక్షణసహా వాటిని వెలుగులోకి తేవడం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జలియన్‌వాలా బాగ్‌ తరహాలోనే అహ్మదాబాద్‌ మ్యూజియంలోని పరస్పర ప్రభావశీల గ్యాలరీ, కోల్‌కతాలోని విప్లవ భారత గ్యాలరీ వంటి దేశంలోని అన్నిప్రాంతాల్లోగల జాతీయ స్మారకాలను నవీకరిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు నేతాజీ తొలిసారి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అండమాన్‌లోని ప్రదేశానికి సరికొత్త గుర్తింపు ఇవ్వడంద్వారా ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ (ఐఎన్‌ఏ) పోషించిన పాత్రను వెలుగులోకి తెచ్చామన్నారు. అంతేకాకుండా అండమాన్‌లోని దీవుల పేర్లను స్వాతంత్ర సమరానికి అంకితం చేసినట్లు తెలిపారు.

   దేశ స్వాతంత్ర్యం కోసం మన గిరిజన సమాజం తనవంతు పాత్రను పోషించడమే కాకుండా అసమాన త్యాగాలు చేసిందని ప్రధానమంత్రి చెప్పారు. కానీ, చరిత్ర పుస్తకాల్లో వారి పాత్రకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోని 9 రాష్ట్రాల్లో గిరిజన స్వాతంత్ర్య యోధులను, వారి పోరాట పటిమను ప్రదర్శించే మ్యూజియంల నిర్మాణం కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు. అదేవిధంగా దేశం కోసం ఎనలేని త్యాగాలు చేసిన మన వీరసైనికుల జాతీయ స్మారకాన్ని దేశం కోరుకుంటున్నదని ప్రధాని చెప్పారు. ఆ మేరకు ‘జాతీయ యుద్ధ స్మారకం’ నేటి యువతలో దేశరక్షణ స్ఫూర్తి నింపడంతోపాటు దేశం కోసం సర్వస్వం త్యాగం చేయగల తెగువనివ్వడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

   ఈ సందర్భంగా పంజాబ్‌ సాహసోపేత సంప్రదాయం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశానికి ఎదురైన అనేక సవాళ్లను ఎదుర్కొనడంలో పంజాబ్‌ నేలపై జన్మించిన పుత్రులు, పుత్రికలు తమ గురువుల అడుగుజాడల్లో నిలిచి మొక్కవోని పోరాటం చేశారని కొనియాడారు. ఈ సుసంపన్న వారసత్వ పరిరక్షణకు అన్నివిధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. గడచిన ఏడేళ్లలో అదృష్టవశాత్తూ శ్రీ గురునానక్‌ దేవ్‌ 550వ, శ్రీ గురు గోవింద్‌ సింగ్‌ 350వ, శ్రీ గురు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి ఉత్సవాల వంటి ప్రత్యేక సందర్భాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఆయా పవిత్ర వేడుకలను పురస్కరించుకుని గురువుల ప్రబోధాల వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం తనవంతు కృషి చేసిందని వివరించారు. ఈ సుసంపన్న వారసత్వాన్ని యువతకు చేర్చడంలో చేపట్టిన చర్యలను వెల్లడించారు. అలాగే సుల్తాన్‌పూర్‌ లోధీన వారసత్వ పట్టణంగా మార్చడం, కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణం, వివిధ దేశాల విమానమార్గాలతో పంజాబ్‌ అనుసంధానం, గురుస్థానాల అనుసంధానంసహా ‘స్వదేశీ దర్శన్‌’ పథకం కింద ఆనందపూర్‌ సాహిబ్‌-ఫతేగఢ్‌ సాహిబ్‌-చామ్‌కౌర్‌ సాహిబ్‌-ఫిరోజ్‌పూర్‌-అమృతసర్‌-ఖట్కర్‌ కలాన్‌-కాలానౌర్‌-పటియాలా వారసత్వ సర్క్యూట్‌ ఏర్పాటు వంటివి ఇందులో భాగంగా ఉన్నాయని తెలిపారు.

   స్వాతంత్ర్యానికి సంబంధించిన ‘అమృత కాలం’ దేశం మొత్తానికీ ఎంతో ప్రాముఖ్యం కలిగినదని ప్రధానమంత్రి చెప్పారు. సదరు ‘అమృత కాలం’లో మన వారసత్వాన్ని, ప్రగతిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పంజాబ్‌ నేల మనకు సదా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని, ఈ నేపథ్యంలో నేడు ప్రతి స్థాయిలో, ప్రతి దిశగా పంజాబ్‌ ముందడుగు వేసేవిధంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం “సర్వజన తోడ్పాటు-సర్వజన ప్రగతి” నినాదం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశం తన లక్ష్యాలను వీలైనంత తర్వగా సాధించడంలో జలియన్‌వాలా బాగ్‌ నేల ఎప్పటిలాగానే నిరంతరం దృఢసంకల్ప శక్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు.

   ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ, గృహ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రులు;  సాంస్కృతిక శాఖ సహాయమంత్రి, పంజాబ్‌ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిసహా హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతోపాటు పంజాబ్ నుంచి పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, జలియన్ వాలా బాగ్ జాతీయ స్మారక ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వివరాల కోసం అధికారిక సమాచార వివరణను ఇక్కడ చూడండి

 

***



(Release ID: 1750131) Visitor Counter : 249